ప్రపంచాన్ని కుదిపేసిన ఆ పదిహేను రోజులు

ప్రపంచాన్ని కుదిపేసిన  ఆ పదిహేను రోజులు

సరిగ్గా ఒక పక్షం…. పదిహేనురోజులే. అవే నేటి ప్రపంచాన్ని కుదిపాయి. స్వతంత్ర భారతాన్ని తొలిసారి గుండె నిండుగా సంతోషపెట్టాయి. రేపటి మన చరిత్రలోనూ శాశ్వతంగా వెలుగులు విరజిమ్మబోతున్నాయి. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత్‌కీ, ఈ పదిహేను రోజుల తరువాతి భారత్‌కీ నడుమ ఎంతో వ్యత్యాసం. ఇంతకాలంగా దాయాది దేశం పాకిస్తాన్‌తో అనుసరిస్తున్న సహనశీల వైఖరిని అనివార్య పరిస్థితులలో నిర్మొహమాటంగా సడలించింది భారత్‌. కశ్మీరీల హక్కులకు మద్దతు పేరుతో మత ఛాందస వాదాన్ని ఎగదోస్తే సహించబోమనీ, కశ్మీరీల స్వతంత్ర ప్రతిపత్తి ఉద్యమానికి అండనిచ్చే మిషతో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తే మౌనం దాల్చడం ఇక సాధ్యం కాదనీ, సహనశీలతలో అసమర్థతను వెతికితే మొదటికే మోసమనీ మొహం మీద గుద్ది చెప్పినట్టయింది. సయోధ్యే ధ్యేయంగా పాకిస్తాన్‌తో కొన్ని రోజుల క్రితం వరకు అనుస రించిన విధానం, చెవిటి ముందు ఊదిన శంఖ నాదమేనని రుజువు చేస్తూ ఆ చారిత్రక క్షణం వచ్చింది. అందుకే ఇక ఆ విధానం, ఆ సహనం చరిత్రగతమేనని తేల్చేసింది. భారత్‌ సరికొత్త అవతారాన్ని చూడవలసిందేనని, పాత పంథాను వీడలేని పాక్‌ విషయంలో కొత్త విదేశాంగ విధానం అనివార్యమని ప్రకటించినట్టయింది. పొరుగు దేశం తెంపరితనానికి విరుగుడుగా కనుగొన్న మందును భారత్‌ తొలిసారి ప్రయో గించింది. సైన్యం చేతిలో కీలుబొమ్మ సర్కార్‌కి సరైన సమయంలో, కీలెరిగి వాత పెట్టింది. కానీ పాక్‌ ఇప్పటికైనా… ప్రపంచం మొత్తం చీదరించు కుంటున్నా తన బుద్ధి మార్చుకుంటుందా? భారత్‌ సహనాన్ని ఇంకా ఇంకా పరీక్షించి ఆఖరి అస్త్రం ఎత్తక తప్పని పరిస్థితి కల్పిస్తుందా?

ఏ పేరైనా పెట్టవచ్చు. హక్కులు, ప్రతిపత్తి, స్వయం నిర్ణయాధికారాలు అంటూ ప్రజాస్వామ్య సిద్ధాంతంలోని తీపిని పై పూతగా పాకిస్తాన్‌ అనే పొరుగు దేశం కశ్మీర్‌ విషయంలో వాగాడంబరం ప్రదర్శించవచ్చు. కానీ ఆ లోయను కబళించడమే పాకిస్తాన్‌ ధ్యేయం. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఆ దేశానికి చోదక శక్తిగా పనిచేస్తున్నది ముమ్మాటికీ మతమే. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్‌ స్వతంత్ర దేశమైనప్పటి నుంచి, ఫిబ్రవరి 14, 2019న కశ్మీర్‌లోని పుల్వామాలో నలభయ్‌ మంది భారత సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల ఉసురు తీయడం వరకు ఆ దేశాన్ని నడిపించినది మత ఛాందసమే. కశ్మీర్‌ వివాదాన్ని ఉపయోగించుకోకుండా, వాస్తవంగా చెప్పాలంటే పచ్చని కశ్మీర్‌లో రక్తపాతం సృష్టించ కుండా ఒక్క పాకిస్తాన్‌ అధ్యక్షుడు, ఒక్క ప్రధానమంత్రి కూడా మనుగడ సాగించలేరు. పాకిస్తాన్‌ ఆవిర్భావం, స్వతంత్ర దేశంగా డెబ్బయ్‌ ఏళ్ల ప్రస్థానం, కశ్మీర్‌ కబళింత కుట్రలు, దానికోసమే కశ్మీర్‌ను నెత్తుటితో తడపడం- ఇవేవీ వేర్వేరు అంశాలు కావు. వీటి అంతస్సూత్రం మతమే. సరిహద్దులలో కొన్ని వందల సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిం చడం, 1947-48 యుద్ధం, 1965 యుద్ధం, 1971 యుద్ధం, 1999 కార్గిల్‌ సహా, శ్రీనగర్‌లోని కశ్మీర్‌ శాసనసభ భవనం మీద దాడి, అది చాలదన్నట్టు నేరుగా భారత పార్లమెంట్‌ మీద దాడి(2001), ముంబయ్‌ దాడులు, గుజరాత్‌ అక్షరధామ్‌పైన దాడి, అమర్‌నాథ్‌ యాత్రికుల మీద కాల్పులు- ఇలాంటివి ఎన్నో! ఇందులో తడి ఆరని గాయమే పుల్వామా దాడి.

ఈ దాడి నేపథ్యంలోనే భారత్‌-పాకిస్తాన్‌ ఘర్షణ ప్రపంచ ప్రజల దృష్టికి వచ్చింది. ఈ ఘర్షణ మౌలిక లక్షణం ఏమిటో కళ్ల ముందుకు వచ్చింది. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్‌ స్వతంత్ర దేశమైంది. ఆగస్టు 15న భారత్‌ స్వతంత్ర దేశంగా ఆవిర్భ వించింది. స్వాతంత్య్రం కాని స్వాతంత్య్రం పొందాయి – 562 స్వదేశీ సంస్థానాలు. తాను సంస్థానాల విషయంలో కలగ చేసుకోనని జిన్నా ముందే ప్రకటించారు. వల్లభ్‌బాయి పటేల్‌, వీపీ మేనన్‌ వ్యూహంతో మూడు తప్ప మిగిలిన సంస్థా నాలు భారత్‌లో విలీనమైనాయి. కశ్మీర్‌, జునాగడ్‌, నిజాం సంస్థానాలు తమ నిర్ణయం తాము తీసుకో దలిచాయి. నిజాం పాకిస్తాన్‌లో కలవాలని అనుకున్నాడు. జునాగఢ్‌ నవాబుదీ అదే దారి. కానీ వాటిని పటేల్‌ భారత్‌ యూనియన్‌లో విలీనం చేయగలిగారు. కశ్మీర్‌ విషయం వచ్చే సరికి నెహ్రూ జోక్యం వల్ల గందరగోళమైంది. ఆగస్టు 14న పాకిస్తాన్‌ తొలి గవర్నర్‌ జనరల్‌ మహమ్మదలీ జిన్నా ఒక ప్రకటన చేశారు. పాకిస్తాన్‌లో ఏ మతం వారైనా స్వేచ్ఛగా తమ మతాన్ని ఆరాధించవచ్చునని అందులో చెప్పారు. అంటే మత స్వేచ్ఛ ఉందని అంగీకరించారు.

జిన్నా తన తొలి ఉపన్యాసంలో అలా చెప్పి ఉండవచ్చు. కానీ అది ఒక్క అక్షరం కూడా వాస్తవ రూపం దాల్చలేదు. దాల్చే అవకాశం లేదు. దానికి జిన్నా కూడా కారణమే. మతావేశం ఆ రాజ్యం మూలాలలోనే ఉంది. 1940 నాటి ముస్లింలీగ్‌ లాహోర్‌ తీర్మానం కోరినదే ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలతో ప్రత్యేక దేశం కావాలని. జిన్నా అదే విధానంతో చివరికంటా పోరాడారు. జాతీయ కాంగ్రెస్‌కు ఈ విషయంలో స్పష్టత లేదు. 80 శాతం ముస్లింలు తన వెంటే ఉన్నారన్న గాంధీజీ ఊహ తల్లకిందులైందని తేలిపోయింది. తన మత ప్రాతిపదిక రాజ్యం కూడా భ్రమేనని జిన్నాకు కూడా అతి తొందరలోనే తెలిసిరావడం ఒక వైచిత్రి. ఆయన పశ్చిమ పాకిస్తాన్‌ నుంచి తూర్పు బెంగాల్‌కు వెళ్లారు. అక్కడ ప్రజలు తమ మీద ఉర్దూను రుద్దడం గురించి నిలదీశారు. తమ మాతృభాష బెంగాలీయేనని చాటారు. అంటే మతం ప్రాతిపదికగా ఏర్పడిన రాజ్యంగా వారు పాక్‌ను గౌరవించలేదు. తాను తప్పు చేసినట్టు జిన్నా భావించారని ఆయన సోదరి ఫాతిమా జిన్నా ‘మై బ్రదర్‌ జిన్నా’లో పేర్కొనడం విశేషం.

సంస్థానాల విషయంలో కలగచేసుకోనని చెప్పిన జిన్నాయే 1947లో కశ్మీర్‌లోకి గిరిజనుల పేరుతో సైనికులను పంపించాడు. ఫలితంగా కశ్మీర్‌ సంస్థానాధీశుడు రాజా హరిసింగ్‌ భారత్‌తో విలీన ఒప్పందానికి వచ్చాడు. కానీ కశ్మీర్‌లో అధిక సంఖ్యా కులు ముస్లింలు కాబట్టి అది పాకిస్తాన్‌కు చెందాలన్న అంశాన్ని పాకిస్తాన్‌ లోలోపలి భావన. దీనికి ప్రాతిపదిక ఏమిటి? సంస్థానాలు తమ ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకోవచ్చునని బ్రిటిష్‌ ప్రభుత్వం స్వేచ్చ ఇచ్చింది. ఇందుకు జిన్నా, లియాఖత్‌ అలీఖాన్‌ అంగీకరించిన మీదటే విభజన చట్టం రూపొందింది. కానీ దేశ విభజన తరువాత మడత పేచీ పెట్టిన దేశం పాకిస్తాన్‌. కాబట్టి కశ్మీర్‌లోయ మీద తమకు హక్కు అక్కడ ముస్లింలు అధికంగా ఉండడం వల్ల సహజంగానే వస్తుందన్నదే పాక్‌ నమ్మకం (పోలెండ్‌లో జర్మన్‌లు ఉన్నారంటూ హిట్లర్‌ దాడిచేశాడు). ఈ విధానానికి మతం తప్ప వేరే అంశాన్ని ప్రాతిపదికగా ఎలా పేర్కొనగలం? కశ్మీర్‌ అంశమే రెండు దేశాల మధ్య వివాదానికి కారణం అంటే, ఇందులో పాక్‌ తన హక్కును మతం ప్రాతిపదికగానే ప్రకటించుకుంది. కాబట్టి కశ్మీర్‌ సమస్యలో, అందుకోసం తుపాకీ పట్టి రక్తపాతం సృష్టించడం ఇవన్నీ మతం కారణంగా జరుగుతున్నవి కావని, ఉగ్రవాదానికి మతం లేదని ఎవరైనా వాదిస్తే, సుద్దులు పలుకుతుంటే వారిని వెర్రివారిగానే పరిగణించాలి. లేదా వారు అజ్ఞానులైనా కావాలి. ఈ రెండూ కాదంటే దేశాన్ని మోసం చేస్తున్న విపరీత బుద్ధి కలవారై ఉండాలి.

ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం తెచ్చుకున్న భారత్‌ అదే సంవత్సరం అక్టోబర్‌ 22న పొరుగు దేశంతో యుద్ధం చేయవలసి వచ్చింది. 5000 మంది పాక్‌ సైనికులు కశ్మీర్‌ లోయలోకి చొరబడ్డారు. వీరంతా కొండ తెగలవారిగా ప్రవేశించారు. అయితే భారత సైన్యం ఈ ముష్కరులని తిప్పి కొట్టింది. జోజిలా కనుమను గెలుచుకుని గిల్గిత్‌ దిశగా మన సైన్యం జనరల్‌ తిమ్మప్ప నాయకత్వంలో సాగుతోంది. అలాంటి కీలక సమయంలో ప్రథమ ప్రధాని నెహ్రూ యుద్ధ విరమణ ప్రకటన చేశారు. దీనికి ముందు మన సైన్యం ఒక్కరోజు ఆగమని గిల్గిత్‌ను గెలుచుకుంటామని నెహ్రూకు విన్నవించింది. దీనిని ఆయన నిరాకరించారు. డిసెంబర్‌ 31న యుద్ధ విరమణ ప్రకటించారు. విషయం ఐక్య రాజ్యసమితి పరిధిలోకి వెళ్లిపోయింది. ఫలితం ఏమిటంటే గిల్గిత్‌ సహా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఏర్పడింది. గిల్గిత్‌ వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది. ఇక్కడ నుంచి ఆప్ఘన్‌, పాకిస్తాన్‌, చైనా, రష్యాల సైనిక కదలికలను గమనించవచ్చు. ఆక్రమిత కశ్మీర్‌ ఏర్పాటుతోనే భారత్‌ కష్టాలు ఆరంభమైనాయి. ఇది ఉగ్రవాదుల స్వర్గం. మొత్తంగా చూస్తే కశ్మీర్‌ లోయను పాకిస్తాన్‌ తనదని భావించడానికి కారణం అక్కడ ముస్లిం మెజారిటీ. కాబట్టి హిందూ రాజును కాదని కశ్మీర్‌ను తమకు దక్కాలని అనుకున్నారు. ఇక్కడ భారత విభజన చట్ట స్పూర్తి కాలగర్భంలో కలిసిందన్న మాట. అయితే ఒక ప్రశ్న. కశ్మీర్‌ వివాదం మొదలైన తరువాత అయినా హిందువులు మెజారిటీగా ఉన్న హైదరాబాద్‌ సంస్థానాన్ని వదిలి వెళ్లవలసిందని నిజాంను నెహ్రూ వంటివారు ఎందుకు కోరలేదు? హిందువులకైనా ఈ ఆలోచన ఎందుకు రాలేదు? అక్కడ హరిసింగ్‌ ఎన్నో సంస్కరణలతో, ప్రగతి శీలంగా సంస్థానాన్ని పాలించాడు. ఇక్కడ నిజాం తరతరాల నాటి బూజులాగే వ్యవహరించాడు.

జిబ్రాల్టర్‌ ఆపరేషన్‌, 1965 యుద్ధం

1947 – 48 యుద్ధానికి కొనసాగింపు 1965 యుద్ధం. 1947లోనే కశ్మీర్‌ను విముక్తం చేయాలని అనుకున్నా పాక్‌కు సాధ్యం కాలేదు. ఆ కుట్రను మళ్లీ ఆరంభించారు. ఈ దుడుకు చర్యకు ఆద్యుడు జుల్ఫికర్‌ ఆలీ భుట్టో. ఇతడు భారత్‌ మీద వేయేళ్ల యుద్ధం ప్రకటించాడు. మరొకమాటలో చెప్పాలంటే వెయ్యేళ్ల జీహాద్‌. అందుకు కేంద్రబిందువు కశ్మీర్‌. జీహాద్‌ అన్న యుద్ధ నాదం ఇస్లాంకు సంబంధిం చినది.

1958లో జనరల్‌ ఆయూబ్‌ ఖాన్‌ దేశ అధ్యక్షు డయ్యాడు. పాక్‌ మొదటి అధ్యక్షుడు ఇస్కందర్‌ మీర్జాను సైనిక కుట్ర ద్వారా తొలగించి అతడు ఆ పదవిలోకి వచ్చాడు. ఆయన దగ్గర విదేశీ వ్యవహారాలు నిర్వహించారు జడ్‌ఎ భుట్టో. నిజానికి కశ్మీర్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మొదట్లో ఆయూబ్‌కు ఇష్టం ఉండేది కాదు. కానీ ఎంతో రాజకీయ చాకచక్యం కలిగిన భుట్టో ఆయనకు నూరి పోశాడని అంటారు. 1962లో చైనాతో భారత్‌ ఓటమి తరువాత ఆయూబ్‌కీ ఆసక్తి పెరిగింది. మతం గురించి పెద్దగా పట్టించుకోని ఆయూబ్‌ కూడా ‘ఒక ముస్లిం సైనికుడు పదిమంది హిందూ సైనికులతో సమాన’మని రెచ్చగొట్టాడు. అలా మొదట భుట్టో ఆపరేషన్‌ జిబ్రాల్టర్‌కు అనుమతి పొందాడు. దీని ప్రకారం పాక్‌ తర్ఫీదు ఇచ్చిన మనుషులను కశ్మీర్‌ పంపించి, అక్కడ తిరుగుబాటు లేవదీసి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆ మేరకు ఏడు వేల మంది గిరిజనులను ఎంపిక చేసి వారికి గెరిల్లా శిక్షణ ఇచ్చారు. కానీ చాలా చిత్రంగా ఈ ప్రయత్నం కూడా విఫలమైంది. కశ్మీర్‌ను కబళించడానికి ఇది సమయమని భుట్టో నచ్చ చెప్పాడు. స్పెయిన్‌ మీద మొరాకొ సైనిక నేత జైదీ ఇదే పేరుతో దాడి చేసి గెలిచాడు. అందుకే భుట్టో కూడా ఈ పేరును ఎంచుకున్నాడు. పారాచ్యూట్ల ద్వారా సైన్యాన్ని, గెరిల్లాలను దింపారు. కానీ పథకం బోల్తా పడింది. భుట్టో భావించినట్టు స్థానికులు భారత్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేదు. పైగా భారత సైన్యానికి అండగా నిలిచారు. గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇచ్చారు కానీ మిగిలిన విషయాలను విస్మరించారు. అందులో మొదటిది చొరబాటుదారుల మాండలికాన్ని మార్చలేకపోవడం. ఇదే పాక్‌ సైనికులను భారత్‌ సేనకు, స్థానికులకు పట్టి ఇచ్చింది. భారత ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఆ సమయంలోనే రాన్‌ ఆఫ్‌ కచ్‌లో (గుజరాత్‌)లో పాక్‌, భారత్‌ సైనికుల మధ్య జరిగిన ఘర్షణ యుద్ధానికి దారి తీసింది. కానీ అమెరికా, రష్యా కలగచేసుకుని ఒప్పందానికి వచ్చేటట్టు చేశాయి. అదే తాష్కెంట్‌ ఒప్పందం. ఈ ఒప్పందం మీద సంతకం చేయడానికి వెళ్లిన రెండవ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి అక్కడే హఠాత్తుగా కన్నుమూశారు.

ఈ యుద్ధంలో కూడా పాక్‌ ఓడిపోయిన తరువాత ప్రఖ్యాత పత్రికా రచయిత కుల్దీప్‌ నయ్యర్‌ జడ్‌ఎ భుట్టోతో భేటీ అయ్యారు. యుద్ధానికి ప్రేరేపించిన అంశాలు ఏమిటని కూడా అడిగారు. చైనాతో ఓటమితో భారత్‌ బలహీనత గురించి తమకు తెలిసిందని భుట్టో చెప్పారు. 1964లో నెహ్రూ మరణంతో భారత్‌ రాజకీయంగా బలహీనంగా ఉందని భావించడం కూడా ఒక కారణమని భుట్టో వెల్లడించారు. పైగా అమెరికా నుంచి యుద్ధ సామగ్రి అందుతోంది. చివరిగా ఆయన చెప్పిన మాట మరీ గుర్తుంచుకోవలసినది. యుద్ధమే కనక ప్రకటించక పోతే కశ్మీర్‌ను పాక్‌ ప్రజలు మరచిపోతారని భుట్టో చెప్పేశారు.

1971 యుద్ధం

ఇది మూడో యుద్ధం. ఇది కశ్మీర్‌ కేంద్ర బిందువుగా జరిగినది కాదు. తూర్పు బెంగాల్‌ లేదా తూర్పు పాకిస్తాన్‌తో పెషావర్‌ వైపు ఉన్న అసలు పాకిస్తాన్‌కు మధ్య అంతర్గత విభేదాల కారణంగా తలెత్తిన వివాదమిది. తూర్పు పాకిస్తాన్‌ మీద ఉర్దూను రుద్దడం స్థానికులకు ఇష్టం లేదు. పైగా షేక్‌ ముజబూర్‌ రెహమాన్‌కు ప్రధాని అవకాశం ఇవ్వడానికి నిరాకరించారు. ముజబూర్‌ రెహమాన్‌ ఎక్కువ సీట్లు గెలిచారు. ఇవతల భుట్టో అవత రించాడు. భుట్టో, యాహ్యాఖాన్‌ ఇద్దరూ బెంగాలీల కోరికను నిరాకరించారు. ఈ తిరుగుబాటులో పాకిస్తాన్‌ కశ్మీర్‌లో మన స్థావరాల మీద దాడికి దిగింది. భారత్‌ తిప్పి కొట్టింది. అంతేకాదు, అటు పశ్చిమ పాకిస్తాన్‌, తూర్పు పాకిస్తాన్‌ల మీద కూడా దాడి చేసింది. భారత్‌ గెలిచింది. 1971లో బంగ్లా దేశ్‌ అవతరించింది.

కార్గిల్‌ ఘర్షణ తరువాత (1999) సంభ వించింది. నియంత్రణ రేఖ దాటి భారత భూభాగం లోకి పాక్‌ సైనికులు ప్రవేశించడమే ఇందుకు కారణం. వీరంతా ఉగ్రవాదుల పేరిట ప్రవేశించారు. ఇందులోను భారత్‌ పైచేయి సాధించింది.

భుట్టోల పాపం

మతం ఆధారంగా కశ్మీర్‌ను కబళించాలన్న యత్నం, కుట్రలు, రక్తపాతంతో భారత్‌లో అల్లకల్లోలం తెచ్చి కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవాలన్న తపన పాకిస్తాన్‌లో నిరంతరం కనిపిస్తూనే ఉన్నాయి. ఆ అంశాలను కూడా పరిశీలించాలి. ఇందుకు దోహదం చేసిన సిద్ధాంతకర్తలెవరో తెలియాలి.

జుల్ఫీకర్‌ భుట్టో, బెనజీర్‌ భుట్టో ఈ ఇద్దరి పాత్ర విధ్వంసకరమైనది. వీరు భారతదేశాన్ని అస్థిరం చేస్తున్నామనుకుంటూ స్వదేశ విధ్వంసానికి కారుకుల య్యారు. భుట్టో ఒక సందర్భంలో భారత్‌ మీద వేయేళ్ల యుద్ధం ప్రకటించాడు. ఆపరేషన్‌ జిబ్రాల్టర్‌తో జడ్‌ఎ భుట్టో ఏ విధంగా విఫలమైనాడో ఇంతకు ముందు గమనించాం. పాకిస్తానీయులు గడ్డితో కడుపు నింపుకుని అయినా అణ్వస్త్రాలను తయారు చేసుకుంటారని ఈయన అన్నారు. ఈ భుట్టో ప్రత్యర్థులను చంపించాడన్న ఆరోపణతో సైనిక కుట్ర ద్వారా అధికారం చేపట్టిన జనరల్‌ జియా ఉల్‌హక్‌ ఏప్రిల్‌ 4, 1979న ఉరి తీయించాడు. అలా జుల్ఫీ అంకం ముగిసింది. 2007లో బెనజీర్‌ భుట్టోను ప్రముఖ ఫ్రెంచ్‌ జర్నలిస్ట్‌ ప్రాంకాయిస్‌ గైయిటర్‌ ఇంటర్వ్యూ చేశారు. కశ్మీర్‌లోయలో ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారిని హిందూ పండిట్లు దోపిడీ చేస్తున్నారు. అక్కడ పండిట్లదే ఆధిపత్యం. కాబట్టే స్థానిక కశ్మీరీల కోరికకు మేం మద్దతు ఇస్తున్నాం అని ప్రాంకాయిస్‌కు చెప్పారు బెనజీర్‌. స్వయం ప్రతిపత్తి కోసం కశ్మీరీలు చేస్తున్న పోరాటానికి పాక్‌ సాయం ఉటుందని అధికారికంగా చెబుతున్నాం అని కూడా అన్నారు. చిత్రం ఏమిటంటే, భారత్‌లో వేర్పాటువాదం అనే సరికి తన తండ్రిని ఉరి తీయించిన జియాను కూడా ఆమె శ్లాఘించారు. నా తండ్రిని ఉరి తీయించినందుకు జియాను ద్వేషిస్తాను. దానికి భగవంతుడే శిక్షించాడు (జియా విమాన ప్రమాదంలో మరణించారు). కానీ కశ్మీర్‌, పంజాబ్‌లలో వేర్పాటువాదులను సమర్ధించి ఆయన మంచి పని చేశారు అని ఆమె (డిసెంబర్‌, 2007, ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన కొన్ని రోజులకే ఆమె హత్యకు గురయ్యారు) అన్నారు. ఇదే కాకుండా, ‘ఆమె జీహాద్‌ విస్తరణకు కారకురాలు. ఇండియాలో ఉగ్రవాదం పెరగడానికి మిలిటెంట్లను సమర్థించారు’ అని ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యుడు అజయ్‌ సాహ్ని కూడా నిర్మొహమాటంగా చెప్పారు. కానీ ఇలాంటి బెనజీర్‌ భుట్టోకు మన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇచ్చిన కితాబును చూసి ఫ్రాంకాయిస్‌ విస్తుపోయారు. ‘ఆమె (బెనజీర్‌) ఆసియాలోనే అసాధారణ నాయకురాలు. పాకిస్తాన్‌-ఇండియా మధ్య సానుకూల వాతావరణం కోసం నిరంతరం పాటు పడ్డారు’ అన్నారు మన్మోహన్‌. ఇలాంటి వ్యాఖ్య భారత ప్రధాని ఎలా చేయగలిగారని ఫ్రాంకాయిస్‌ ప్రశ్నించారు. ఆమె పాలనలోనే భారత్‌ లక్ష్యంగా ఉగ్రవాదం పెరిగింది. ఇదే కశ్మీర్‌ లోయను హిందూ జనాభా వీడడానికి దారి తీసింది. ఇంకొక అంశం- తండ్రిలాగే ఆమె కూడా తమ వద్ద ఉన్న అణుబాంబు సంగతి ఇండియాకు గుర్తు చేస్తూ ఉండేవారు. తండ్రి వలెనే భారత్‌ మీద వేయేళ్ల యుద్ధాన్ని ప్రకటించారు. చివరికి ఆమె భర్త జర్దారీ కూడా జుల్ఫీకర్‌ అలీ భుట్టో 82వ జయంతి సభలో ఆయన వేయేళ్ల యుద్ధం ఆశయాన్ని గుర్తు చేసి, స్థానికుల మన్ననలను పొందారు. బెనజీర్‌ భుట్టో 2007 డిసెంబర్‌ 27న హత్యకు గురయ్యారు. ఆనాడు ఎవరూ ఇందుకు బాధ్యత వహించలేదు. తరువాత తెలిసింది – అది తాలిబన్ల పని అని.

తాలిబన్‌ – పాకిస్తాన్‌

కశ్మీర్‌ను ఏదో విధంగా తమ వశం చేసుకోవ డానికి అందివస్తుందన్న ఏ మార్గాన్ని పాకిస్తాన్‌ విడిచిపెట్టలేదు. అమెరికాతో సావాసం చేసినా, తాలిబన్లను బుజ్జగించినా కారణం ఇదే. కానీ 9/11 తరువాత అమెరికా, తాలిబన్‌ల మధ్య నలిగిపోవలసిన పరిస్థితి పాకిస్తాన్‌కు ఎదురయింది. తన విదేశాంగ విధానాన్ని మరింత గజిబిజిగా తయారు చేసుకుంది. 9/11 తరువాత అమెరికా స్పందన అందరికీ తెలిసిందే. ఉగ్రవాదం మీద అంతర్జాతీయ పోరుకు ఆ దేశం పిలుపునిచ్చింది. ఈ పోరులో తనతో కలసి రానివారంతా ఉగ్రవా దానికి మద్దతుదారులేనని కూడా హెచ్చరించింది. అంతవరకు భారత్‌తో వైరం, భౌగోళిక అవసరాల కారణంగా పాక్‌ తాలిబన్‌లను అంటకాగింది. కాబట్టి అమెరికాతో కలసి పాక్‌ ఆఫ్ఘన్‌లో ఉగ్రవాద వ్యతిరేక పోరాటం చేయడం తాలిబన్లకు ఎలా ఇష్టం ఉంటుంది? వారికి ఉగ్రవాదులుగా జన్మనిచ్చిన నేల అదే. ఈ సమయంలోనే అంతర్గతంగా కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. అంతర్జాతీయ ఉగ్రపోరులో పాక్‌ భాగస్వామి కావడాన్ని వ్యతిరేకిస్తూ దేశమంతటా అలజడులు జరిగాయి. దీని అర్థమేమిటో మన మేధావులు చెప్పాలి. ఉగ్రవాదం మీద పోరాటం వద్దని చెప్పిన ప్రజలు అక్కడ ఉన్నారు. పైగా లష్కర్‌ ఏ తాయిబా, జైష్‌ ఏ మహమ్మద్‌ సంస్థలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చడానికి అమెరికా నిర్ణయించింది. అదే సమయంలో, 2001 జమ్మూ కశ్మీర్‌ శాసనసభ మీద, భారత పార్లమెంటు మీద కూడా పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేశారు. ఇవి చాలవన్నట్టు పాక్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలన్న డిమాండ్‌ ఒకటి బయలుదేరింది. ఇలాంటి సమయంలో ముషార్రఫ్‌ వంటి సైనిక నియంత పాక్‌ను పాలించడం ఒక విశేషం. కశ్మీర్‌ గురించి ముషార్రఫ్‌ అభిప్రాయం ఏమిటి? ”కశ్మీర్‌ మా రక్తగతం. కశ్మీర్‌తో బంధం తెంచుకోవడానికి ఏ ఒక్క పాకిస్తాన్‌ జాతీయుడు అంగీకరించడు. కశ్మీర్‌కు మా తరఫు నుంచి నైతిక, రాజకీయ, దౌత్య మద్దతు అందుతూనే ఉంటుంది’ అన్నారాయన. ఇప్పుడు ఓ సైనిక నియంత ఎవరో నేరుగా పాకిస్తాన్‌ను పాలించకపోవచ్చు. కానీ అధ్యక్ష పదవిలో ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌ సైన్యం నియమించిన వ్యక్తే. ఇతడి హయాంలో కశ్మీర్‌ గురించిన పోరాటం ఇంకాస్త మోటుబారే అవకాశమే ఉండేది. కానీ భారత్‌లో పటిష్టమైన, జాతీయ భావాలు కలిగిన నాయకత్వం ఉండడంతో అది సాగడం లేదు.

పుల్వామా ఘాతుకం, ఫిబ్రవరి 14, 2019

కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా, లెథాపూర్‌ (అవంతిపూర్‌ దగ్గర) గ్రామం వద్ద 44వ జాతీయ రహదారి మీద జరిగిన ఈ ఘోర ఉగ్రదాడి ప్రపంచాన్ని కదిలించింది. 78 వాహనాలలో 2500 మంది సీఆర్‌పీఎఫ్‌ దళాలను తరలిస్తుండగా పేలుడు పదార్థాలు నిండిన వాహనంతో అహ్మద్‌ అదిల్‌ దార్‌ అనే స్థానిక ఆత్మాహుతి దళ సభ్యుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇంత పెద్ద వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నారంటేనే కుట్ర లోతు తెలుస్తుంది. ఇందుకు తామే బాధ్యులమంటూ జైష్‌ ఏ మహమ్మద్‌ ప్రకటించుకుంది. దీనికి ప్రతీకారం ఉంటుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అనుకున్న విధంగానే నియంత్రణ రేఖకు అవతల ఉన్న బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాల మీద (పూర్తి వివరాలు తరువాతి వ్యాసంలో) దాడి జరిగింది.

అభినందన్‌ ఉదంతం, ఫిబ్రవరి 27

పుల్వామా దాడి, బాలాకోట్‌ మీద భారత్‌ ప్రతీకార దాడి, దీనిపై దుస్సాహసంతో పాకిస్తాన్‌ ఫిబ్రవరి 27న ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేసింది. దీనిని భారతీయ వైమానిక దళాలు తిప్పి కొట్టాయి. ఈ దాడిలోనే పాక్‌కు సంబంధించిన ఎఫ్‌ -16 విమానం కూలింది. అదే సమయంలో భారత్‌కు చెందిన మిగ్‌-21 విమానాన్ని పాకిస్తాన్‌ దళాలు కూల్చివేశాయి. ఈ మిగ్‌ వెళ్లి పాక్‌ భూభాగంలో పడింది. స్థానికులు, పాక్‌ సైనికులు కలసి మిగ్‌ చోదకుడు వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను అదుపులోకి తీసుకున్నాయి. కూలి పోతున్న మిగ్‌ నుంచి ఆయన ప్యారాచూట్‌ సాయంతో దిగారు. జెనీవా ఒప్పందం (1921) మేరకు అభినందన్‌ను అప్పగించవలసిందేనని భారత్‌ కోరింది. పాకిస్తాన్‌ ఎట్టకేలకు అంగీకరించింది. ఆ మేరకు ఆయనను వాఘా సరిహద్దులలో మార్చ ఒకటో తేదీన తీసుకొచ్చి అప్పగించారు. నిజానికి పుల్వామా దాడి మొదలు ఈ పదిహేను రోజుల ఉద్రిక్తతలకు అభినందన్‌ అప్పగింతతో విరామం ప్రకటించినట్టయింది. శాంతిని కాంక్షిస్తూ వింగ్‌ కమాండర్‌ను అప్పగిస్తున్నట్టు పాక్‌ అధ్యక్షుడు ప్రకటించారు. రెండు దాయాది దేశాల మధ్య, అణ్వాయుధాలు కలిగి ఉన్న ఇరుగు పొరుగు మధ్య యుద్ధం దాదాపు తథ్యం అనుకుంటున్న సమయంలో పాకిస్తాన్‌ దిగి వచ్చింది. ఇంతకాలం పాక్‌కు అండగా ఉన్న చైనా కూడా నోరు విప్పలేని స్థితి. ఇప్పటికి పాక్‌ తలొగ్గింది. నలభయ్‌ ప్రపంచ దేశాలు పుల్వామా దాడిని ఖండించడం గొప్ప పరిణామం.

ఇప్పటికి కథ సుఖాంతమయింది. ఈ మధ్యలో జైష్‌ ఏ మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ తమ దేశంలోనే ఉన్నాడని పాకిస్తాన్‌ స్వయంగా ప్రకటించింది. అతడు తీవ్ర అస్వస్థతతో ఉన్నాడని, గట్టి సాక్ష్యాధారాలు ఇస్తే అతడి మీద చర్య తీసుకుంటామని పాకిస్తాన్‌ చెబుతోంది. ఇది కాదు అసలు సంగతి. మార్చి ఒకటో తేదీన వాఘా సరిహద్దులలో అభినందన్‌ను అప్పగించే కార్యక్రమం జరుగుతూ ఉండగానే కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు కొనసాగాయి. కాబట్టి ఇప్పటికి యుద్ధం ముప్పు తప్పిందని భావించినా, పాక్‌ వైఖరిని మార్చడానికి ఇంకా గట్టి చర్యలు తీసుకోవలసిన అవసరమే కనిపిస్తుంది.

– జాగృతి డెస్క్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *