పొత్తుల విషయంలో భాజపాది వివేకవంతమైన శైలి

పొత్తుల విషయంలో భాజపాది వివేకవంతమైన శైలి

తెలుగుదేశం పార్టీ నేషనల్‌ డెమోక్రాటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డిఎ) ను వదిలి బయటకు వెళ్ళి పోయింది. ఎన్‌డిఎలోని ఇతర భాగస్వామ్య పక్షాల అసంతృప్తికి దీనినొక ఉదాహరణగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

శివసేన, శిరోమణి అకాలీదళ్‌లు కొంతకాలంగా భాజపా నుండి తమకు తగినంత గౌరవం లభించని కారణాన అసంతృప్తితో ఉన్నాయని, భాజపా తన మిత్రపక్షాలతో సరైన తీరులో వ్యవహరించక పోవటమే ఇందుకు కారణమని రాజకీయ వ్యాఖ్యాతలు వివరిస్తున్నారు. ఈ వ్యాఖ్యానాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉంది.

లోకసభ ఎన్నికలలో తాముగా ఆధిక్యాన్ని సాధించుకొన్నప్పటికీ, ఎన్నికలలో తాము ఎవరితో కలసి పోటీ చేశారో, ఆ పార్టీల ప్రతినిధులకు కీలకమైన మంత్రి పదవులను భాజపా ఇచ్చింది. తేదేపాకు చెందిన అశోక గజపతిరాజు పౌర విమానయాన శాఖామంత్రిగా, శివసేనకు చెందిన అనంతగీతే భారీ పరిశ్రమల శాఖామంత్రిగా, లోక్‌జనశక్తి పార్టీ నాయకుడు రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ఆహార, పౌర సరఫరాల శాఖామంత్రిగా, అలాగే శిరోమణి అకాలీదళ్‌కి చెందిన హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖామంత్రిగా నియమితు లయ్యారు. కాబట్టి వారిని నిర్లక్ష్యం చేశారనే వాదన నిలబడదు.

ఒకవేళ భాగస్వామ్యపక్షాల వారు ఎవరైనా గాని తమ మంత్రిత్వశాఖలపైన సర్వం సహ ఆధిపత్యం తమకే ఉండాలని, యుపిఎ ప్రభుత్వం నడిచిన పది సంవత్సరాలలో ద్రావిడ మున్నేట్ర కజగం వారు సాగించినట్లుగా అవినీతి కార్యకలాపాలు సాగించ డానికి స్వేచ్ఛ ఉండాలని, ఎవరైనా అనుకొంటున్నట్ల యితే, నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగా ఉన్న ప్రభుత్వంలో అందుకు అవకాశం లేదు.

తెలుగుదేశం

ఇటీవల ఎన్‌డిఎ నుండి బయటకుపోయిన తెదేపా విషయమే తీసుకొందాం. 2019లో ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకోడానికి ¬రా¬రీ పోరాటం చేయవలసి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలిసి వస్తున్నది. 2014 ఎన్నికలలో శాసనసభ లోని 175 స్థానాలకుగాను 102 స్థానాలతో పూర్తి ఆధిక్యాన్ని సాధించినా, ఆ ఎన్నికలలో ఆ పార్టీకి లభించిన ఓట్లు 46.3 శాతం మాత్రమే. 44.47 శాతం ఓట్లు సాధించిన వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెసు పార్టీ తెదేపాను తరుముకొంటూ వస్తున్నది.

ఒకవైపు నుండి వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ, మరొక వైపు నుండి పవన్‌ కళ్యాణ్‌ జనసేన, ఇంకొకవైపు నుండి దట్టమైన ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం క్రమ్ముకొని వస్తూండటంతో 2019 ఎన్నికలలో తాము అధికారం నిలబెట్టుకోవటం సాధ్యమవు తుందా అన్న విషయంలో తెదేపాను భయసందేహాలు చుట్టుముడుతున్నాయి. ప్రత్యర్థుల మధ్య పెరిగి పోతున్న మాటల యుద్ధాలు తెచ్చిపెడుతున్న ఉద్రిక్తతలకూ ఒత్తిడులకూ లోనైన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతు ఉపసంహరించారు. ఇప్పుడు మోదీని, భాజపాను తమ శత్రువులుగా చూపిస్తూ నడిపిస్తున్న రాజకీయం 2019లో ఎంతమేరకు లబ్ది చేకూరుస్తుందో, వేచి చూడాల్సిందే.

శివసేన

శివసేన విషయానికి వస్తే, మహారాష్ట్ర రాజకీయాలలో తమది ప్రధాన పాత్ర అని, భాజపాది సహాయక పాత్ర అన్నట్లుగా శివసేన వ్యవహ రిస్తుండేది. ఇలా మూడు దశాబ్దాలుగా నడవగా, 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో భాజపా ముందుకు దూసుకుపోయి అగ్రప్రాధాన్యం సంపాదించింది. ఈ వాస్తవాన్ని భరించటం శివసేనకు కష్టంగా ఉంది. భాజపాకు మిగిలిన భాగస్వామ్య పక్షాలకంటే, సైద్ధాంతికంగా బాగా సన్నిహితమైన పక్షంగా శివసేన ఉంటోంది. అయితే గత మూడున్నర సంవత్స రాలుగా, ఏ ఇతర పక్షం గుప్పించని తీరులో శివసేన విమర్శలు, వ్యంగ్యాస్త్రాలూ గుప్పిస్తోంది. తమ మనుగడ సందేహాస్పదమవుతున్నదని, గతంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షోభంలో చిక్కుకున్నామని, శివసేన నాయకత్వానికి తెలిసివస్తున్నది. శివసేన, భాజపా – ఈ రెండు పార్టీలు ‘హిందుత్వ’ గురించి మాట్లాడే పార్టీలే అయినా, ప్రాంతీయ సంకుచిత వాదంతో వ్యవహరించే శివసేనకంటే, అందరినీ కలుపుకొని పోయే భాజపానే ప్రజలు ఎక్కువగా అభిమానిస్తున్నారని 2014 ఎన్నికలలో స్పష్టమై పోయింది.

మహారాష్ట్ర శాసనసభకు నాలుగు ప్రధాన రాజకీయ పక్షాలు పోటీపడ్డాయి. 27.8 శాతం ఓట్లతో భాజపా ప్రథమస్థానం సాధించింది. 19.3 శాతం ఓట్లతో శివసేన, 18 శాతం ఓట్లతో కాంగ్రెసు, 17.2 శాతం ఓట్లతో నేషనలిస్టు కాంగ్రెసు పార్టీలు వరుసగా ద్వితీయ, తృతీయ, చతుర్ధ స్థానాలు దక్కించుకున్నాయి. మంచి పరిపాలన అందిస్తూ భాజపా తన పరిస్థితిని మరింతగా మెరుగుపరుచు కొంటున్నది. శివసేన ఏ వైఖరిని అనుసరించినా, బలం తగ్గే పరిస్థితే గాని, బలపడే పరిస్థితులు కనిపించని ఇరకాటంలో పడిపోయింది.

భాజపాతో అవగాహన, సీట్ల సర్దుబాట్లకు యత్నించేటట్లయితే, 2014 శాసనసభ ఎన్నికలలో పొందిన ఓట్ల, సీట్ల ప్రాతిపదికన తమకు కేటాయించే స్థానాలు బాగా తగ్గిపోతాయి. మరోవైపున కాంగ్రెసు, నేషనలిస్టు కాంగ్రెసులు ఉమ్మడిగా కలిసిపోటీ చేయబోతున్నట్లుగా కనబడుతున్నవి. అటువంటి స్థితిలో పోరు ఒకవైపున భాజపా-మరోవైపున ఉభయ కాంగ్రెసుల మధ్య కేంద్రీకృతమౌతుంది. శివసేన గనుక స్వతంత్రంగా పోటీ చేస్తే ఈ రెండింటి మధ్య నలిగిపోయే స్థితి ఏర్పడుతుంది. తన అస్తిత్వం నిలబెట్టుకోవటం కోసమని కాంగ్రెసు, నేషనలిస్టు కాంగ్రెసులతో చేతులు కలుపుదామా అంటే, హిందుత్వ సమర్థకులుగా తమకున్న ఖ్యాతి కొట్టుకు పోతుంది. తమ సమర్థకులుగా ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున భాజపాలో చేరిపోయే ప్రమాదం ఏర్పడగలదు. ఇలా దిక్కుతోచని స్థితిలో శివసేన కూరుకుపోయి ఉంది.

ఒక పార్టీ జాతీయ స్థాయి పార్టీగా ఎప్పుడు చెప్పుకోగల్గుతుంది ? ఇతరుల మీద ఆధారపడ కుండా తన సొంత బలంతో ప్రతి రాష్ట్రంలోనూ తన ముద్రను వేయగలిగినప్పుడే గదా! శక్తి, ఉత్సాహం, కార్యకర్తల సమర్ధన పుష్కలంగా ఉన్న భాజపా తనకు లభిస్తున్న ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకుండా వివిధ రాష్ట్రాలలోకి విస్తరించడానికి ప్రయత్నిస్తూ ఉంది. పైన పేర్కొన్న లక్షణాలకు ప్రధాని మోదీ వ్యక్తిత్వం, ఆయన పట్ల ప్రజలలో ఉన్న ఆకర్షణ మరింత తోడ్పడుతున్నాయి.

లోకసభ ఎన్నికలు జరిగిన కొద్ది నెలల్లోనే, మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నప్పుడు మారిన స్థితిగతులకు, బలాబలాలకు అనుగుణంగా సర్దుకుపోవడానికి శివసేన నిరాకరించింది. భాజపా స్వతంత్రంగా పోటీచేసి అందరికంటే ఎక్కువ సంఖ్యాబలం కలిగిన పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పరచడానికి కావలసిన ఆధిక్యం సాధించ లేకపోయిన మాట నిజమే. అయినా శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పరుస్తూ, మొదటి సారిగా ముఖ్య మంత్రి పదవిని సంపాదించుకో గల్గింది.

బిహారు

ఇక బిహారులో గతకొన్ని దశాబ్దాలుగా సంస్థా గతంగా భాజపా పటిష్టంగా ఉంది. అయినప్పటికీ కొన్ని సంవత్సరాలపాటు నీతీశ్‌కుమార్‌కి ముఖ్య మంత్రి పదవినిచ్చి, జూనియర్‌ భాగస్వామిగా వ్యవహరించడానికి భాజపా వెనుకాడలేదు. 1997 నుండి సమతాపార్టీ పేరుతోనో, జనతాదళ్‌ (యునైటెడ్‌) పేరుతోనో ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉన్న నితీశ్‌కుమార్‌ 2014 ఎన్నికలకు ముందు తమ బంధాన్ని తెంచుకోగా, భాజపా తనంతట తానుగా ముందుకు దూసుకుపోవడానికి ఏమాత్రం తటపటాయించలేదు. ఫలితం ఏమైందో తెలుసు గదా! ఆర్‌జెడి, జె.డి.యు.లను పక్కకు నెట్టి భాజపా లోకసభ ఎన్నికలలో ఘనవిజయాలు సాధించింది.

ఒడిశా

ఇక ఒడిశాలో చూస్తే.. 1997లో ఎన్‌డిఎలో చేరడానికి జనతాదళ్‌ సిద్ధపడకపోవటం గమనించిన ఒడిశా ప్రాంత ప్రముఖుడు నవీన్‌పట్నాయక్‌ బిజూ జనతాదళ్‌ ఏర్పరచి, ఎన్‌డిఎలో భాగస్వామి అయ్యాడు. 1998 ఎన్నికలతో ఆరంభించి 2009 వరకు బిజూ జనతాదళ్‌ ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉంది. 2009 ఎన్నికలలో సీట్ల పంపకం వద్ద అభిప్రాయ భేదాలు ఏర్పడటంతో బిజూజనతా దళ్‌ బయటకు పోయింది. పది సంవత్సరాలు తిరక్కుం డానే ఎలాంటి స్థితి ఏర్పడిందంటే, కాంగ్రెసును పక్కకు నెట్టేసి ప్రధాన పోటీదారుగా భాజపా రంగంలో నిలబడి సవాలు చేస్తున్నది.

ఇవన్నీ ఏమి తెలియ జేస్తున్నవి ? అప్పటివరకు భాజపాకు మిత్రపక్షంగా ఉన్నవారు విరోధులుగా మారినట్లయితే, ఆ రాష్ట్రంలో స్వంతంగా బలపడ డానికి భాజపా, ఆ స్థితిని ఒక సువర్ణావ కాశంగా మలుచుకొంటున్నది. 2007 వరకు ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉండిన తృణమూల్‌ కాంగ్రెస్‌, అప్పుడు ఎన్‌డిఎను విడిచి బయటకు పోకపోయినట్లయితే, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం తామేనని ప్రకటించగల స్థితికి ఎదగటం భాజపాకు సాధ్యమయ్యేదా?

భాజపా తన మిత్రపక్షాలతో వ్యవహరించే తీరులో ఒక స్పష్టమైన శైలి ఉంది. ఆ భాగస్వామ్య పక్షాలు చిన్నవిగాని, పెద్దవిగాని, అరుపులు, కేకలు పెట్టనంత వరకు వారితో కలిసి సుహృద్భావంతో వ్యవహరించడానికి ఏమాత్రం సంశయం లేదు, ఎలాంటి సమస్య లేదు. కాని, ఆ భాగస్వామ్య పక్షాలు పెద్దగా అరుస్తూ, గొడవలకు దిగితే, వారిముందు తలవంచటం ఉండదు. తమకు లభించేది విజయమా, పరాజయమా అనేది లెక్కజేయకుండా, తనంత తానుగా ముందుకుపోతుంది. ఇది తమిళనాడు తదితర రాష్ట్రాలలో కాంగ్రెసు అవలంబించిన శైలికి పూర్తిగా భిన్నమైనది. 1970 వరకు కాంగ్రెసుకు తమిళనాడులో 40% ఓటర్ల సమర్థన ఉండేది. అయితే ఎన్నికలలో డి.ఎం.కె. లేదా ఏఐఏడిఎంకెలలో ఏదో ఒకపార్టీకి జూనియర్‌ భాగస్వామిగా సర్దుకుపోవడానికి సిద్ధపడిన కాంగ్రెసు అనతికాలంలో తన బలమంతా పోగొట్టుకున్నది.

భాజపా ఒక జాతీయ స్థాయి పార్టీగా స్థిరపడటం కోసం వివిధ ప్రాంతాలకు విస్తరించడానికి యత్నిస్తున్నది. నలుగురిని కూడగట్టుకొంటూ కొత్త ప్రయోగాలు చేస్తూ విజయాలు నమోదు చేస్తున్నది. ఈ విషయంలో ప్రస్తుతం భాజపాకు ఎవరూ సాటి రాలేరేమో !

– టి.ఎస్‌.రామకృష్ణన్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, (అహ్మదాబాద్‌)లో పరిశోధకుడు.

ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ నుండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *