పెట్రోలు అధిక ధరలకు రాష్ట్రాల బాధ్యత ఎంత ?

పెట్రోలు అధిక ధరలకు రాష్ట్రాల బాధ్యత ఎంత ?

పెట్రోలు, డీజిల్‌ ధరలు గడచిన 2, 3 నెలల్లో అధికంగా పెరిగాయి. ఈ పెరుగుదలకు కేవలం మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలూ, విపక్షాలు అంటున్నాయి. ఇంధన పెరుగుదల విషయంలో వాస్తవం ఏమిటి ? కేవలం కేంద్రానిదే బాధ్యతా ? ఇందులో రాష్ట్రాల పాత్ర ఎంత ? అన్నదే ఈ వ్యాస సారాంశం.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో ఆ భారాన్ని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు వినియోగదారులపై మోపుతున్నాయి. నష్టాల్లో ఉన్న భారతీయ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలను గట్టెక్కించడానికి ఎన్‌డిఎ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ ధరలపై నియంత్రణను ఎత్తేసింది.

గతంలో అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు పెరిగినా ఆ భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వమే సబ్సిడి రూపంలో ఆయిల్‌ కంపెనీలకు చెల్లించేది. అయితే ప్రభుత్వ బడ్జెట్‌లో అధిక మొత్తం ఈ సబ్సిడీలకే సరిపోయేది. దీనికితోడు మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చేది. దీనిని అధిగమించడానికి, దేశాభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ప్రస్తుత ప్రభుత్వం డీజిల్‌, పెట్రోలు ధరలపై నియంత్రణను ఎత్తేసిన నేపథ్యంలో చమురు సంస్థలు రోజువారిగా ధరలను సవరిస్తూవస్తున్నాయి.

యుపిఎ నిర్ణయాలతో దాదాపు దివాళా తీసే స్థితిలో ఉన్న భారత ఆర్ధిక వ్యవస్థను ప్రధాని మోదీ కఠిన నిర్ణయాలతో గాడిలో పెట్టారు. చమురు ఉత్పత్తి దేశాలకు చెల్లించాల్సిన ఋణాలను చెల్లించారు. 2014 నుంచి తగ్గిన చమురు ధరల వల్ల లభించిన ఆదాయాన్ని దేశాభివద్ధికి ఖర్చుచేశారు.

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ?

రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడానికి ఆయిల్‌ ఉత్పత్తి దేశాలతో కలసి అమెరికా ముడిచమురు ధరలను కనిష్ఠ స్థాయికి తీసుకొచ్చింది. అయితే ఇంత తక్కువ ధరకు చమురును అమ్మడం వలన ఆయాదేశాలకు ఉత్పత్తి ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. అందుకోసం చమురు ఉత్పత్తి దేశాలు ఇప్పుడు ఉత్పత్తి తగ్గించి ధరలు మరలా పెరిగేటట్లు చేశాయి. ఒకానొక దశలో చమురు ధర 150 డాలర్లకు పెరిగిన సందర్భాలూ, అలాగే 25 డాలర్లకు పడిపోయిన సందర్భాలూ ఉన్నాయి.

2014లో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి 110 డాలర్లుగా ఉన్న ముడిచమురు ధర క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇది మోదీ ప్రభుత్వానికి బాగా కలసి వచ్చింది. ఆ సమయంలో చమురు ధరల తగ్గుదల వలన కలిగిన ప్రతిఫలాన్ని ప్రభుత్వం చమురు దిగుమతికి, గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చడానికి ఉపయోగించింది.

గత నాలుగేళ్లుగా 50 డాలర్లకు అటుఇటుగా ఉన్న ముడిచమురు ధరలు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. గత 15 నెలల్లో అంతర్జాతీయంగా ముడిచమురు ధర బ్యారెల్‌కు 45 డాలర్ల నుంచి 77 డాలర్లకు పెరిగింది. అయితే ముడి చమురు ధర తక్కువగా ఉన్న సమయంలో విధించిన పన్నులు, సెస్‌లు నేడు మనకు భారంగా మారాయి.

రాష్ట్రాల పాత్ర ఎంత ?

అయితే చమురు ధరల పెరుగుదలలో రాష్ట్రాల పాత్ర కూడా ఎంతో ఉందన్నది నిర్వివాదాంశం. అయితే ప్రతి పక్షాలు, వామ పక్షాలు ధరల పెరుగుదలకు మోదీయే కారణమంటూ విపరీత పోకడలతో దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నాయి.

ముడిచమురు ధర ప్రస్తుతం బ్యారెల్‌కు (159 లీ) 5300 రూపాయలుగా ఉంది. చమురు కంపెనీలకు లీటరుకు సుమారు 34 రూపాయలకు ముడి చమురు లభిస్తుంది. దానికి లీటరుకు రిఫైనింగ్‌ ఖర్చు 2.62 రూపాయలు, రవాణా, ఇతర ఖర్చులు లీటరుకు 3.31 రూపాయలు. కేంద్ర ఎక్సైజ్‌ సుంకం, రోడ్డు సెస్సు కలిపి మరో 19.48 రూపాయలు. ఈ కేంద్ర పన్నుల తర్వాత డీలర్లకు సుమారుగా 60 రూపాయలకు పెట్రోలు, 58 రూపాయలకు డీజిల్‌ అందుతుంది. 60 రూపాయలకు వచ్చే పెట్రోలుపై డీలర్లకు లీటరుకు 3.62 రూపాయలు కమీషన్‌ అందుతుంది. దాంతో పెట్రోలు ధర 64 రూపాయలు అవుతుంది.

ఇక అసలు కథ ఇక్కడే ప్రారంభమవుతుంది.

డీలర్‌ కమిషన్‌తో 64 రూపాయలు అయిన పెట్రోలు ధరపై రాష్ట్రం వ్యాట్‌ విధిస్తుంది. ఇది వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాట్‌ తెలంగాణలో 37 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 31 శాతంగా ఉంది. ఎపి ప్రభుత్వం ఈ వ్యాట్‌కు అదనంగా లీటరుకు మరో నాలుగు రూపాయలను వసూలు చేస్తోంది. 64 రూపాయలుగా ఉన్న పెట్రోలు ధర రాష్ట్ర పన్నుల వలన సుమారు మరో 20 రూపాయలు పెరిగి, మొత్తం మీద 80 రూపాయలు దాటింది.

పెట్రోలుపై అత్యధిక వ్యాట్‌ విధించడంలో రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు కేవలం పెట్రోలు, డీజిల్‌ మీద విధించే వ్యాట్‌ వలనే సుమారు సంవత్సరానికి 10 వేల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది.

మరో విషయం ఏంటంటే, కేంద్ర పన్నుల్లో 42 శాతం వాటాను రాష్ట్రాలు పొందుతాయి. కనుక కేంద్రానికి పెట్రోలుపై లభించే 20 రూపాయల పన్నులో 8 రూపాయలు తిరిగి రాష్ట్రాలకే దక్కుతుంది. మొత్తంగా పెట్రోలుపై కేంద్రానికి లీటరుకు 12 రూపాయలు లభిస్తే, రాష్ట్రాలు 27 రూపాయలకు పైగా పొందుతున్నాయి.

ఆదాయాన్ని తాము అనుభవించి పెట్రోలు రేట్ల పెరుగుదలకు మోదీని బాధ్యుడిని చేయాలని, విపక్షాలు, కొత్త ఫ్రంటు నేతలు తెగ ఆరాటపడు తున్నారు. కాని వాస్తవాలు తెలిసిన ప్రజలు వారి జిమ్మిక్కులను నమ్మే పరిస్థితిలో లేరు.

జిఎస్‌టికి ఒప్పుకోని రాష్ట్రాలు

పెట్రోలు, డీజిల్‌లను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రాలు భారీగా ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉంది. ఒకవేళ జిఎస్‌టి పరిధిలోకి పెట్రోలు డీజిల్‌లను తీసుకువస్తే కేంద్రానికి లభించే ఆదాయంలో పెద్దగా మార్పు లేకపోయినా రాష్ట్రాలు భారీగా నష్టపోతాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌లను జిఎస్‌టి పరిధిలోకి తేవడానికి ఒప్పుకోవడం లేదు. కాని పెట్రోలు ధరల పెరుగు దలకు మోదీ నేతత్వంలోని ఎన్‌డిఎ కారణమని విష ప్రచారం చేస్తున్నాయి. వస్తువులు సేవల పన్ను పరిధిలోకి ఇంధనాలను తీసుకువస్తే పెట్రోలు 55 రూపాయలకు, డీజిల్‌ 50 రూపాయలకే లభించే అవకాశం ఉంది.

అది ప్రమాదకరం

అయితే ఇంధన వినియోగం దేశీయంగా పెరిగితే, ఇంధన దిగుమతి పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందువల్ల మన విదేశీ మారక నిల్వలు క్షీణిస్తాయి. విదేశీ వాణిజ్యంలో లోటు ఏర్పుడుతుంది. అది కరెంట్‌ ఖాతా లోటుకు దారితీసి, వీదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, రూపాయి మారకం విలువపై ప్రభావం చూపుతుంది. అందుకే మనదేశంలో ఇంధన వినియోగం పెరగడం అంటే మన అభివృద్ధికి మనమే అడ్డుకట్ట వేసినట్లవుతుంది. అందువల్ల ప్రస్తుతం ఇంధన వినియోగం పెరగడం మనకు ప్రమాదకరమే.

ఇప్పటికే భారతదేశం రోజుకు 50 లక్షల బ్యారెల్‌ల ముడి చమురును దిగుమతి చేసు కుంటోంది. ముడిచమురు దిగుమతిలో చైనా, అమెరికాల తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది. సౌదీ అరేబియా, ఇరాన్‌, ఇరాక్‌, నైజీరియా, యూఎఇ, వెనెజులా దేశాల నుంచి భారత్‌ చమురును దిగుమతి చేసుకుంటోంది. మోదీ ప్రధానిగా ఎన్నికైన నాటి నుంచి ఇరాన్‌తో సంబంధాలను మెరుగు పరచుకొని చమురు దిగుమతులకు సంబంధించి పలు ఒప్పందాలు చేసుకున్నారు. భారత్‌ మొదటి నుండి సౌదీ అరేబియా నుంచి పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటోంది. ఇటీవల ఆ స్థానంలో ఇరాన్‌ కూడా చేరింది. మధ్య ఆసియా దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న భారత్‌ ఆయా దేశాలకు ఆహారం, ఇంజనీరింగ్‌ వస్తువులు, నగలు, ఆభరణాలను ఎగుమతి చేసి వాణిజ్యలోటు లేకుండా జాగ్రత్త పడుతోంది.

ప్రత్యామ్నాయ మార్గం

భారత్‌లో పెట్రోలు నిక్షేపాలు తక్కువ పరిమాణం లోనే ఉన్నాయి. ఇంధన అవసరాల కోసం ఎక్కువగా దిగుమతులపైనే భారత్‌ ఆధార పడుతోంది. ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు విదేశాల్లో ఆయిల్‌ నిక్షేపాలను దక్కించుకొని చమురు ఉత్పత్తి చేస్తున్నా అవీ తక్కువ పరిమాణం లోనే ఉన్నాయి.

అందుకే భారత్‌ సాంప్రదాయ ఇంధనాలకు బదులు సాంప్రదాయేతర సుస్థిర ఇంధనాల కోసం కషి చేస్తోంది. రానున్న రోజుల్లో చమురుతో నడిచే ఇంధనాలకు బదులుగా విద్యుత్‌ వాహనాలు రోడ్ల పైకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ముంబైలో వచ్చేశాయి కూడా. అప్పుడు చమురు కోసం ఖర్చు చేస్తున్న ధనం ఆదా అయ్యి ఆ నిధులతో మౌలిక సదుపాయాలను మెరుగు పర్చుకోవచ్చు. పెట్రోలు వంటి శిలాజ ఇంధనాల వలన పెద్ద ఎత్తున వాయు కాలుష్యం జరుగుతోంది. ప్రస్తుతం పెట్రో ధరల పెరుగుదల వలన ఇంధన వినియోగం కొంత మేర తగ్గి కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది.

2017 నుంచి భారత్‌లో 10 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోలును అమ్ముతున్నారు. ఇథనాల్‌ రేటు 48 రూపాయలుగా ఉంది. ప్రభుత్వం దీనిపై దష్టి సారిస్తే పెట్రోలు ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది.

ఆచితూచి అడుగులు..

ఒకపక్క విపక్షాలు ఎన్నో ప్రజాకర్షక పథకాలతో 2019 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం అవుతుంటే, మరోపక్క దేశ శ్రేయస్సే ముఖ్య లక్ష్యంగా ఎలాంటి ప్రజాకర్షక పథకాలు లేకుండా, ఎక్కడా అవినీతి మరక అంటకుండా నాలుగేళ్ల పాలన విజయ వంతంగా పూర్తిచేశారు మోదీ. నాలుగేళ్లుగా ఇబ్బంది పెట్టని ఇంధన ధరలు ప్రస్తుతం ఇబ్బంది పెడుతున్నా మోదీ ప్రజాశ్రేయస్సును, దేశ ఆర్థిక వ్యవస్థను దష్టిలో ఉంచుకొని ధరల తగ్గింపు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాలు అంగీకరిస్తే ఇంధనాలను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. కాని కేంద్రంపై బురద జల్లడమే లక్ష ్యంగా పెట్టుకున్న విపక్షాలు దీనికి అంగీకరిస్తాయని ఆశించడం అత్యాశ కాగలదేమో ! కాని ఎక్కువ రాష్ట్రాలు భాజపా పాలనలోనే ఉన్నాయి కాబట్టి ఇది అంత కష్టం కాబోదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ద్రవ్యలోటును, ద్రవ్యోల్బణాన్ని, ఆర్ధికవద్ధిని సమతౌల్యం చేస్తూ సాగుతున్న మోదీ పాలనలో ఇలాంటి చిన్న చిన్న అవరోధాలు సహజమే. కేంద్ర ప్రభుత్వం ఈ అవరోధాలను అధిగమించి, భారత వద్ధి రేటు పెరుగుదలను నిరంతరం కొనసాగేలా చేయాలని ఆశిద్దాం.

పెట్రో ధరల తగ్గింపునకు వ్యూహం

పెట్రోలు, డీజిల్‌ ధరల అదుపునకు దీర్ఘకాలిక పరిష్కారం కావాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం సమగ్ర వ్యూహాన్ని అమలుచేయనుందని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. అయితే అందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదు. మే 28న ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెట్రోలు ధరల పెరుగుదలకు మూడు కారణాలు ఉన్నాయని, వాటిని తగ్గించేందుకు దీర్ఘకాలిక పరిష్కారం కోసం ప్రభుత్వం సమగ్ర వ్యూహాన్ని అమలు చేయనుందన్నారు. పెట్రో ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావడం అందులో ఒకటన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోలుపై రూ.19.48, డీజిల్‌పై రూ.15.33 ఎక్సైజ్‌ సుంకాన్ని వసూలు చేస్తోంది. రాష్ట్రాలు దీనికి అదనంగా 20 రూపాయల వరకు వ్యాట్‌ విధిస్తాయి.

– ఆర్‌.సి.రెడ్డి ఉప్పల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *