పిల్లల్లో కఫం తగ్గిద్దాం

పిల్లల్లో కఫం తగ్గిద్దాం

ఇంటికి పిల్లలే వెలుగులు..

నేటి పిల్లలే రేపటి పెద్దలు..

భవిష్య భారత పౌరులు..

మరి వారిని ఆరోగ్యంగా పెంచాలి కదా !

నేడు ఆరోగ్యంగా, బలంగా పెరిగిన బాలలే రేపటి భవ్య భారత నిర్మాతలు అవుతారు. ఆరోగ్యంగా లేని పిల్లలు కనీసం వారి భవిష్యత్తును కూడా దిద్దుకోలేరు. తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకు ఇవ్వాల్సిన వాటిలో ముఖ్యమైనది ఆరోగ్యం.

అయితే నేటి రోజుల్లో ప్రతి ఇంటిలో జలుబు, కఫం, దగ్గు లాంటి అనారోగ్యాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ఈ లక్షణాలు పిల్లల్లో ఎక్కువగా కనపడు తున్నాయి.

కఫం, దగ్గు, జలుబు మొదలైన అనారోగ్య లక్షణాలు, వాటికి విరుగుడు గురించి ప్రముఖ ఆరోగ్యవేత్త స్వర్గీయ రాజీవ్‌ దీక్షిత్‌ ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పారు. మన పిల్లల ఆరోగ్య రక్షణలో అవి కొంతవరకు ఉపయోగ పడొచ్చు. వాటి వివరాలే ఈ వ్యాసం.

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్యమైనవి మూడు. అవి కఫం, పిత్తం, వాతం. శరీరంలో ఈ మూడు సమంగా ఉంటే మనిషి రోగ రహితుడుగా ఉంటాడని వాగ్భటాచార్యులు చెప్పారు. ఇక్కడ ఆరోగ్యం అంటే శరీరం, మనసు, చిత్తము. శరీరంతో పాటు మనసు, చిత్తం కూడా ప్రశాంతంగా ఉండక పోతే మనిషి తనకే కాదు తన సమాజానికి కూడా హానిచేసేవాడవుతాడు. అందుకే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వాత, పిత్త, కఫాలు సమంగా ఉండాలి.

వాగ్భటాచార్యులు మనిషి జీవిత కాలాన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగం పుట్టినది మొదలు 14 సంవత్సరాల వయసు వచ్చేవరకు. రెండవ భాగం 14 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు. 60 సంవత్సరాల పైబడిన వారు మూడవభాగం.

మనిషి పుట్టినది మొదలు 14 సంవత్సరాల వయసు వచ్చేవరకు కఫం ప్రభావానికి లోనై ఉంటాడు. ఇక 14 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు వారిని యవ్వనులుగా చెప్పవచ్చు. ఆ దశలో పిత్తం ప్రభావం అధికంగా ఉంటుంది. 60 వయసు పైబడిన వారికి పూర్తిగా వాత ప్రభావం ఉంటుంది. వీరికి మోకాళ్ళ నొప్పులు సహజం.

మరొక విషయం. మనిషికి హదయ భాగం పై నుండి మెదడు వరకు ఉండే భాగమంతా కఫ ప్రభావ స్థానం. హదయానికి కింద నుండి నాభి వరకు పిత్త క్షేత్రం అంటారు. నాభి నుంచి కింది భాగమంతా వాతం ప్రభావం ఉంటుంది. అందుకే పిల్లలకు ఎప్పుడూ జలుబు, దగ్గు వంటి కఫ సంబంధ రోగాలు పట్టి పీడిస్తే; మధ్యవయసులో గ్యాస్‌, ఎసిడిటి వంటి పిత్త సంబంధ రోగాలు పీడిస్తాయి. వయసు పై బడ్డాక అంటే 60 దాటిన తరువాత కీళ్ళ నొప్పులతో బాధ పడతారు. ఇవి వాతరోగాలు.

బాల్యం – కఫ ప్రభావం

బాల్యంలో (14 సంవత్సరాల లోపు) మనిషి శరీరం మీద కఫ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాతం, పిత్తం తక్కువగా ఉంటాయి. కాబట్టి పిల్లలకు మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పులు రావు; వెంట్రుకలు ఊడవు; నిద్ర బాగా పడుతుంది, ఎక్కువ సమయం పడుతుంది.

14 సంవత్సరాల వయసు లోపు వారికి కఫ ప్రభావం అధికంగా ఉండటం వల్ల వారికి నిద్ర బాగా వస్తుంది. దీనిని తల్లిదండ్రులు గమనించి, ఆ వయసు పిల్లలను నిద్రపోవటానికి సహకరించాలి. కనీసం వీరు 24 గంటల్లో 10 గంటలు పాటు నిద్రపోవాలి. కనుక మనం పిల్లల్ని ఉదయాన్నే నిద్రలేపి ‘¬ం వర్కు చెయ్యండి, ట్యూషన్‌కు వెళ్ళండి’ అంటూ వారిని హింసించొద్దు. అలా మనం మనం వారిని హింసించి సాధించేదేమీ ఉండదు. కనుక వారిని ప్రశాంతంగా 10 గంటల పాటు నిద్రపోయేందుకు సహకరించాలి. అది కూడా రెండు తడవలు నిద్రపోనిస్తే మరీ మంచిది. రాత్రిపూట 8 గంటలు, మధ్యాహ్నం రెండు గంటలు. ఇంకా చిన్నవయసు పిల్లలు అంటే 4 సంవత్సరాల లోపు పిల్లలు కనీసం 16 గంటలు, 4 నుండి 8 సంవత్సరాల లోపు పిల్లలు 12 నుంచి 14 గంటలు, 8 నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లలు 9 నుండి 10 గంటలు నిద్రపోవాలి. కనుక మీ ఇళ్ళల్లో 14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలుంటే, వారు నిద్రపోతుంటే ఆపకండి. ఎందుకంటే వారి శరీరం కఫ ప్రభావంతో నిండి ఉన్నది.

కఫం – లక్షణాలు

కఫ ప్రభావ లక్షణాల్లో ముఖ్యమైనవి జలుబు, ముక్కు కారటం, దగ్గు మొదలైనవి. కఫం అంటే జిగురుగా ఉండే పదార్థం. మనకు దగ్గు వచ్చినప్పడు గొంతులో నుండి కళ్ళె వస్తుంది కదా ! అదే కఫం. ఇది చాలా బరువుగా ఉంటుంది. బరువుగా ఉన్న పదార్థం గురుత్వం కలిగి ఉంటుంది. అంటే కఫం రక్తంలో వత్తిడిని పెంచుతుంది. దీనినే బ్లడ్‌ ప్రెజర్‌ (బి.పి.) అంటారు. అందుకే శరీరం దాన్ని తగ్గించుకోవటానికి నిద్రకు ఉపక్రమిస్తుంది. నిద్రపోయేటప్పడు బ్లడ్‌ ప్రెజర్‌ తక్కువగా ఉంటుంది. మేల్కొని ఉన్నప్పడు బ్లడ్‌ ప్రెజర్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బాల్యంలో కఫం వల్ల శరీరం నిద్రను ఎక్కువగా తీసుకుంటుంది. దానికి వేరే మార్గం లేదు.

మరి పిల్లలు ఎక్కువగా నిద్రపోవాలంటే మనం ఏం చెయ్యాలి ? సూర్యాస్తమయం అయిన రెండు గంటలకల్లా వారిని నిద్రపోయేలా చెయ్యాలి. అలా పిల్లలు పెందలాడే నిద్రపోవాలంటే వారిని టి.వి.లకు దూరంగా పెట్టాలి.

కఫం దోషపూరితం కాకూడదు

కఫం రెండు రకాలు. దోషపూరితం అయినది, దోషపూరితం కానిది. కఫం ఉన్నవారు ఎక్కువ సేపు నిద్రపోకపోతే అటువంటి వారిలో ఉన్న కఫం దోషపూరితం అవుతుంది. అది వారిని అస్తవ్యస్తం చేస్తుంది. దానితో వారిలో చికాకు పెరుగుతుంది. విసుగుకునే స్వభావం కలవారిగా మారతారు. కోపం పెరుగుతుంది. ఇక అటువంటి పిల్లలు తల్లిదండ్రుల మాట ఏదీ వినరు. ఎందుకంటే, శరీరాన్ని నియంత్రించేది మస్తిష్కం. దీని నిండా కఫం పేరుకుపోయి ఉంటుంది. ఆ కఫం దోష పూరితమయి ఉంది. కఫం ఉన్న పిల్లలు నిద్ర సరిగా పోకపోవటం వల్ల ఇటువంటి సమస్యలు వస్తాయి.

‘మా పిల్లలు మా మాట అస్సలు వినటంలేదు’ అనేది చాలామంది తల్లితండ్రుల మాట. ఇటువంటి వారు తమ పిల్లలను ఎక్కువసేపు, అంటే వారి శరీరానికి అవసరమైనంత వరకు నిద్రపోనివ్వాలి. కనీసం 9-10 గంటల పాటు నిద్రపోనివ్వాలి. ఆ తర్వాత చూడండి మీ పిల్లలు మీ మాట ఎంత చక్కగా వింటారో.

పిల్లలైనా, పెద్దలైనా కఫ ప్రభావానికి లోనైతే వారిలో చికాకు, కోపం ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ గొడవలకి సిద్ధంగా ఉంటారు. దేశంలోని నేరస్థులందరూ ఈ కఫ స్వభావానికి లోనై ఉన్నప్పుడే నేరాలు చేస్తూంటారు. అమెరికా వంటి దేశాల్లో గమనిస్తే చిన్నపిల్లలు తమ జేబుల్లో గన్‌లు పెట్టుకుని పాఠశాలలో ఉపాధ్యాయులను, ఇతర విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు కాల్చిన సందర్భాలున్నాయి. అలా అక్కడ జైళ్ళలో మగ్గుతున్న పిల్లలెందరో ఉన్నారు. వీళ్ళందరిలో కఫం చెడిపోయి ఉంటుంది. ఇలా కఫం దోషపూరితం కాకుండా ఉండాలంటే దానికి వాగ్భటాచార్యులు మంచి మందు సూచించారు. అదే ప్రశాంతమైన నిద్ర. గుర్తుంచుకోండి. కఫం ప్రభావానికి లోనైన పిల్లలకైనా పెద్దలకైనా ఖర్చులేని మందు శరీరానికి కావలసినంత నిద్ర.

కఫం బాగా ఎక్కువగా ఉంటే చదువు రాదు, ఏ విద్యా అబ్బదు. పిల్లలకి విద్యార్జన బాగా సాగాలంటే కఫం తగ్గాలి. దానికి మందు నిద్రే. కాబట్టి పిల్లలు ఎప్పుడైనా నిద్రొస్తుంది అంటే వెంటనే వారిని నిద్రపోనివ్వాలి. వారంతట వారే నిద్రలేవాలి. తల్లిదండ్రులు బలవంతంగా నిద్ర లేపొద్దు. అప్పుడే వారికి చదువుకునేది చక్కగా బుర్రకెక్కుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుకే పిల్లలను రాత్రి పెందలాడే పడుకోబెట్టాలి.

పైవన్నీ కఫం దోషపూరితమైతే వచ్చే దోషాలు. అదే కఫం సమతుల్యంగా ఉంటే వారిలో ఎంతో సజనాత్మకతను పెంచుతుంది, వ్యక్తిని వైజ్ఞానికునిగా చేస్తుంది.

పిల్లల్లో కఫం దోషపూరితం కాకుండా ఉండ టానికి వాగ్భటులు సూచించిన మరొక మందు అభ్యంగనం. దీనినే మర్దన లేదా మాలిష్‌ లేదా మసాజ్‌ అంటారు. కఫ ప్రభావం గల పిల్లలకు నూనెతో అభ్యంగనం చెయ్యడం చాలా అవసరం. పిల్లలు ఉదయం నిద్రలేచి, కాలకత్యాలు తీర్చుకున్న తర్వాత వారికి నూనెతో అభ్యంగనం చేస్తే చాలా త్వరగా కఫ ప్రభావం నుండి బయటపడతారు. అలాగే కఫ ప్రభావానికి లోనైనవారు యోగ, ప్రాణాయామాలు చేయరాదు. వారికి సరి పడేది కేవలం అభ్యంగనం మాత్రమే. కాబట్టి పిల్లలకు శరీరమంతా నూనెతో మర్దన చెయ్యాలి. కఫం ఎక్కువగా ఉండే స్థానాలు తల, చెవులు బాగా మర్దన చెయ్యాలి. చెవుల్లో నూనె కూడా వేయవచ్చు. మరొక కఫ ప్రభావ స్థానం కళ్ళు. అయితే కళ్లలో నూనె వెయ్యకూడదు. మంచి కాటుక దొరికితే పెట్టవచ్చు. ఈ రోజుల్లో కాటుక కూడా కల్తీ అవుతుంది కాబట్టి చూసుకొని వాడాలి.

ఇక నూనె విషయానికి వస్తే వేడి ప్రాంతంలో ఉండేవారికి చల్లటినూనెలు (కొబ్బరినూనె) మంచిది. తినటానికి కూడా ఇదే మంచిది. అదే బీహార్‌ లాంటి ప్రాంతాల వారికైతే ఆవాల నూనె మంచిది. ఇలా ప్రాంతాలని బట్టి నూనెను వాడుకోవాలి. అన్ని ప్రాంతాల వారికి నువ్వుల నూనె మర్దనకు శ్రేష్ఠమైనది. అయితే నువ్వుల నూనె స్వచ్ఛమైనది వాడాలి. నిల్వ ఉన్నది, దుర్వాసన వచ్చేది వాడరాదు.

పిల్లలకు చెమట పట్టేవరకు తైల మర్దన చేసిన తర్వాత స్నానం చేయించాలి. స్నానం కూడా కఫాన్ని తగ్గించే విధంగా ఉండాలి. అంటే, శనగ పిండిని ఉపయోగించాలి. ఇంకా గంధపు చెక్క, ముల్తాని పౌడర్‌ ఉపయోగించవచ్చు. ఇవి పూర్తిగా కఫనాశినిలు. అభ్యంగనం తరువాత స్నానానికి ఇటువంటి సున్నిపిండి విధానాన్ని అనుసరించాలి. ఈ రోజుల్లో మనం స్నానానికి వాడే సబ్బుల్ని పిల్లలకు ఉపయోగించరాదు. ఎందుకంటే, సబ్బులో కెమికల్‌ ఉంటుంది. అంటే సోడియం హైడ్రాక్సైడ్‌ (కాస్టిక్‌ సోడా). ఇది కఫాన్ని రెచ్చగొడుతుంది. కాబట్టి పిల్లలకు కెమికల్‌ కలిసిన సబ్బు ఎంత మాత్రమూ మంచిది కాదు. పిల్లలకు స్నానం సున్నిపిండితో చేయిస్తే చాలా మంచిది.

పోషకాహారం, పాలు, వెన్న, నెయ్యి, మజ్జిగ, బెల్లం ఇవన్నీ పిల్లలకు చాలా అవసరం. బెల్లంతో చేసిన పప్పు చెక్క, నువ్వుల చెక్క ఎంతో మంచివి. ఇవి కఫాన్ని తగ్గిస్తాయి. పిల్లలకు తప్పకుండా దూరంగా ఉంచవలసిన మరొక వస్తువు మైదాపిండి. ఇది కఫాన్ని దోషపూరితం చేస్తుంది. మైదాతో చేసిన ఏ వస్తువూ పిల్లలకు మంచిది కాదు. పెద్దలకు కూడా మంచిది కాదు. ముఖ్యంగా నూడుల్స్‌ ఈ రోజుల్లో బాగా వాడుతున్నారు. నూడుల్స్‌ తయారవాలంటే కేవలం మైదా పిండితోనే సాధ్యం. లేకపోతే వాటికి సాగే గుణం రాదు. కాబట్టి తప్పకుండా నూడుల్స్‌ను పిల్లలకు దూరంగా ఉంచండి. పిల్లలకే కాదు, పెద్దలు కూడా నూడుల్స్‌కు దూరంగా ఉండాల్సిందే.

టివి.. దూరం.. దూరం..

పూర్వకాలం టి.వి.లు లేవు కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ పెందలాడే నిద్రపోయేవారు. ఇప్పడు టి.వి.లు రావడంతో పెద్దలతో పాటు పిల్లలు కూడా వాటికి అతుక్కుపోతున్నారు. అందుకే పిల్లలను టి.వి. వంటి వాటికి దూరంగా ఉంచాలి. లేకపోతే వారు రాత్రి తొందరగా నిద్రపోరు. దాంతో కఫం పెరుగుతుంది. మరొక విషయం ఏమిటంటే కఫ ప్రభావానికి లోనైన పిల్లలు కార్టూన్‌ చానెల్స్‌ చూడటానికి ఇష్టపడతారు. ఎందుకంటే కఫానికి లోనైన వారు కల్పితాలకు ఇష్టపడతారు. అలాగే కల్పిత కథలకు, ఆలోచింప చేసే వాటికి ఆకర్షితు లవుతారు. అందుకే వారిని టివికి దూరంగా ఉంచాలి. దానికి చక్కని మార్గం కథలు చెప్పడమే. కల్పితాలు, ఆలోచింపచేసే వాటికి ఆకర్షితులవుతారు కాబట్టి వారికి మనదేశ మహావీరుల, దేశభక్తుల కథలను వినిపించండి. ఇక టి.వి. అవసరం వారికి ఉండదు.

పిల్లలు ఏదైనా ప్రశ్నవేసినా అది వారి కాల్పనికతను పెంచుకోవటానికే అని గుర్తించండి. వారికి చక్కటి సమాధానం చెప్పండి. తెలియకపోతే ‘దీనికి సమాధానం నీకు రేపు చెపుతాను’ అని చెప్పి, మీరు తెలుసుకుని వారికి అర్థమయ్యేలా చెప్పండి. అంతేకానీ, దేవుడు చేశాడు అనో, ఇంకేదో ఒకటి చెప్పకండి. కొద్దిరోజుల తర్వాత వారికి నిజం తెలుస్తుంది. ఇక మిమ్మల్ని ఏమాత్రం గౌరవించరు. అందుకే వాగ్భటులు ‘అన్నింటికన్నా కష్టమైనది పిల్లల్ని పెంచటమే’ అంటారు.

– ఆరోగ్య రహస్యాలు గ్రంథం ఆధారంగా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *