పాక్‌ను కట్టడి చేయాల్సిందే

పాక్‌ను కట్టడి చేయాల్సిందే

– పాక్‌లో జాదవ్‌ కుటుంబానికి తీవ్ర అవమానం

– ఇది హిందువుల పట్ల చేసిన అవమానమే

– భారత ఉదారవాదులు ఎందుకు ఖండించలేదు

– పాక్‌ దుర్మార్గాన్ని కట్టడి చేయాల్సిందే

ఒకవంక పాకిస్తాన్‌ తన దురాగతాల పరంపరను నిర్విఘ్నంగా కొనసాగి స్తూండగా, మరొక పక్క భారతదేశం పాకిస్తాన్‌కు ఇచ్చిన ‘అత్యంత ప్రియమైన దేశం’ హోదాను ఉపసంహరించక పోవడమే కాక, సింధునది జలాల ఒప్పందం విషయంలో సైతం స్వప్రయోజన విధానం అనుసరించలేక పోతోంది. వీటిని కూడా భారత్‌ వెంటనే పరిశీలించాలి. భారతదేశంలోని బాధ్యత గల రాజకీయ నాయకత్వం పాకిస్తాన్‌ దుర్మార్గ కార్యాచరణ ప్రణాళికను ఎదుర్కోవడానికి దృఢమైన ప్రణాళికను సిద్ధం చేయవలసిన సమయం ఆసన్నమైంది.

పాకిస్తాన్‌ దుర్మార్గపు చర్యలకు ముగింపు లేదని స్పష్టమయింది. ‘మానవతా వాదాన్ని గౌరవిస్తున్నాం’ అనే సాకుతో గూఢచర్య ఆరోపణ ఎదుర్కొంటున్న భారత దేశీయుడు కుల్‌భూషణ్‌ జాదవ్‌ యొక్క తల్లిని, భార్యను అవమానించి ఇస్లామాబాద్‌ మరింత దిగజారింది.

నేపథ్యం

2016 మార్చిలో ఇరాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రాంతం నుండి పాకిస్తాన్‌ అధికారులు జాదవ్‌ను అపహరించారు. పాకిస్తాన్‌ ప్రభుత్వం అప్పటి నుంచి అతనిని పాక్‌ చెరసాలలోనే ఉంచింది. బలూచిస్తాన్‌లోని మష్కర్‌ ప్రాంతంలో గూఢచర్య నిరోధక కార్యకలాపాలలో భాగంగా జాదవ్‌ను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్‌ పేర్కొన్నప్పటికీ, వ్యాపార కార్యకలాపాలలో భాగంగా ఇరాన్‌లో ఉన్న జాదవ్‌ను అపహరించారని ఇరాన్‌ విదేశీ అధికారులు ధ్రువీకరించారు. మాజీ నౌకాదళ అధికారి జాదవ్‌ ఒక గూఢచారి అని పాకిస్తాన్‌ వాదిస్తూ వస్తున్నప్పటికీ, గూఢచార కార్యకలాపాల ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపలేకపోయింది. పాకిస్తాన్‌ సైన్యం ఆయనపై ఉగ్రవాద ఆరోపణ చేసింది.

అయితే ఈ విషయంలో దౌత్య కార్యాలయ జోక్యానికి భారతదేశం పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ, జాదవ్‌కు ఆ అవకాశాన్నీ పాకిస్తాన్‌ నిరాకరించింది. ఇదిలా ఉండగా, మూడున్నర నెలల నాటకీయ విచారణ తరువాత 2016 ఏప్రిల్‌ 10 నాడు ఒక సాధారణ న్యాయస్థానం గూఢచర్య ఆరోపణపై జాదవ్‌కు మరణశిక్ష విధించింది. ఆరోపణ, న్యాయ స్థాన తీర్పు పత్రాలను భారత్‌కు అందజేయడంలో పాకిస్తాన్‌ విఫలమవడంతో ఆ తీర్పును వివాదా స్పదంగా భారత్‌ భావించింది. ఆ సందేహాలు బలపడ్డాయి కూడా. వియన్నా ఒప్పందం ప్రకారం జాదవ్‌ కేసు విషయంలో జోక్యం చేసుకోవడానికి దౌత్య కార్యాలయానికి అర్హత ఉంది. అయితే ఈ జోక్యం కోసం భారతదేశం చేసిన అభ్యర్థనను పాకిస్తాన్‌ ఇప్పటి వరకు 13 సార్లు తిరస్కరించింది.

పాకిస్తాన్‌ అనుసరిస్తున్న ఈ మొండి పట్టుదల వలన భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య శతృత్వం మరింత పెరిగింది. అది ద్వైపాక్షిక చర్చల నిలిపివేతకు దారితీసింది. అయితే పాకిస్తాన్‌ ‘వియన్నా దౌత్య సంబంధ ఒప్పందా’న్ని ఉల్లంఘించడాన్ని, వివాదాస్పద విచారణ చేసి నేర నిర్ధారణ చేయడాన్ని భారతదేశం అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) దృష్టికి తీసుకు వెళ్ళింది. భారతదేశం, పాకిస్తాన్‌ ఇరువురూ వియన్నా ఒప్పందంలో సభ్యులు కనుక వియన్నా దౌత్య సంబంధ ఒప్పందం (విసిసిఆర్‌) 36 (1) అధికరణం ప్రకారం నిర్బంధితుడు దౌత్య భేటీకి అర్హుడని భారతదేశం అభ్యర్థించింది. ఈ వివాదాస్పద అంశంలో భారతదేశ విజ్ఞప్తి అంతర్జాతీయ న్యాయస్థాన విచారణ పరిధిలోకి వస్తుందని భారతదేశం తెలిపింది. అయితే గూఢచర్యం, ఉగ్రవాదంకు సంబంధించిన సమస్యలకు వియన్నా ఒప్పందం వర్తించదని పాకిస్తాన్‌ వాదించింది. భారత వాదనను అంగీకరించిన అంతర్జాతీయ న్యాయస్థానం 2016 మే నెలలో జాదవ్‌కు విధించిన మరణశిక్షను నిలిపివేయాలని తీర్పునిచ్చింది. అంతేకాక పాకిస్తాన్‌ నిర్వహించిన వివాదాస్పద విచారణ వియన్నా ఒప్పందాన్ని, అంతర్జాతీయ మానవ హక్కులను అతిక్రమిస్తోందని ప్రకటించింది.

ఒకపక్క కుటుంబ సభ్యులకు అనుమతి

ఆ తరువాత డిసెంబరు 13న పాకిస్తాన్‌ సంబంధిత దస్త్రాలు సమర్పించిన తరువాత విచారణ రెండవ దశలోకి ప్రవేశించింది. ఈ దస్త్రాల సమర్పణకు ముందు భారతదేశం పదే పదే చేసిన విజ్ఞప్తుల మేరకు 2017 డిసెంబరు 25 నాడు కుటుంబ సభ్యుల సమావేశానికి పాకిస్తాన్‌ అంగీక రించింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్‌ సైన్యాధిపతి కమల్‌ రాజ్వావద్ద జాదవ్‌ క్షమాభిక్ష దరఖాస్తు ఇంకా పెండింగులోనే ఉంది.

మరోపక్క భారత సేనలపై కాల్పులు

భారతదేశ అభ్యర్థనల మేరకు జాదవ్‌ కుటుంబ సమావేశానికి అనుమతించిన పాకిస్తాన్‌, దానిని అధిక స్థాయి ప్రచారం కల్పించుకొనే అన్ని ప్రయత్నాలు చేసింది. జాదవ్‌ కుటుంబం జాదవ్‌ను కలిసేందుకు పాకిస్తాన్‌ ఇచ్చిన అనుమతికి విస్మయం చెందిన పాక్‌ సైన్యం భారత సైన్యంపై దాడులకు పాల్పడింది. ద్వంద్వ చర్యలు చేపట్టిన పాకిస్తాన్‌ డిసెంబరు 25 నాటి వేకువ ఝామున భారత సరిహద్దుకు కాల్పులకు తెగబడి ముగ్గురు భారత సైనికులను, ఒక సైన్యాధ్యక్షుడిని హతమార్చింది. అదీ చాలక మరేదోవిధంగా భాతరదేశాన్ని ఇరకాటంలో పెట్టాలనే కోరికతో ఉన్న పాకిస్తాన్‌, జాదవ్‌ కుటుంబాన్నీ ఘోరంగా అవమానించింది.

ఇది ఘోర అవమానం

హిందూ వివాహిత మహిళల అత్యంత ముఖ్యమైన సౌభాగ్య చిహ్నాలైన బొట్టు, గాజులు, మంగళసూత్రాలను తీసివేయాలని; దుస్తులు మార్చుకోవాలని జాదవ్‌ తల్లి, ఆయన భార్యను పాక్‌ అధికారులు బలవంతం చేశారు. వారిని దుస్తులు లేకుండా తనిఖీ చేశారని వార్తలు వచ్చాయి. ఈ సమావేశాన్ని ఒక గ్లాస్‌ షిప్‌ కంటైనర్‌లో నిర్వహించి, ఆ సమావేశాన్ని దృశ్యమాధ్యమం ద్వారా సేకరించి (వీడియోగ్రఫీ) పర్యవేక్షించారు. 22 నెలల తరువాత జాదవ్‌ను కలసిన అతని కుటుంబం జాదవ్‌ను గాజు పలకలలో మాత్రమే చూడగలిగింది. అంతేకాక వారిని మాతృభాషలో మాట్లాడుకొనేందుకు పాక్‌ అధికారులు అనుమతించలేదు. తన కుమారుడితో మనసారా మాట్లాడేందుకు ఎంతో ఆశగా ఎదురు చూసిన వృద్ధురాలు జాదవ్‌ తల్లికి నిరాశే ఎదురైంది. ఆమెకు సౌకర్యంగా ఉండే మరాఠీ భాషలో మాట్లాడకుండా అధికారులు అడ్డుకున్నారు. మానవత్వ ఛాయ లేని పాక్‌ అధికారులు చేసిన అవమానంతో బాధపడుతున్న ఆ కుటుంబం జాదవ్‌తో కేవలం నలభై నిమిషాలు మాత్రమే మాట్లాడగలిగింది. జాదవ్‌ కుటుంబ సభ్యులతో పాటు వెళ్ళిన భారత డిప్యూటి హై కమీషనర్‌ను పాక్‌ అధికారులు కుటుంబం నుంచి వేరుచేశారు. గట్టి పోరాటం చేయగా ఆయనను మరో అదనపు విభజన గ్లాసు ఫలకం వెనుక ఉంచారు.

దురుద్దేశమే

జాదవ్‌ కుటుంబ సమావేశం అనంతరం పాక్‌ అధికారులు శ్రీమతి జాదవ్‌ పాదరక్షలు తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు. పాక్‌ మీడియా కఠిన ప్రశ్నలతో జాదవ్‌ కుటుంబాన్ని వేధించింది. పాకిస్తాన్‌ ప్రభుత్వ అవమానకర చర్యలతో విసిగిన భారతీయులు తాము మోసపోయినట్లు, తమపై దౌర్జన్యం జరిగినట్లు, తాము అవమానానికి గురైనట్లు భావించారు. పాకిస్తాన్‌ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ‘మీడియా తమ పనిని బాగా చేసింది’ అని ధన్యవాద లేఖను సైతం పంపినట్లు వచ్చిన తాజా వార్తలు తెలియచేస్తున్నాయి. ఇది పాకిస్తాన్‌ దురుద్దేశాలను నిర్దారిస్తోంది.

భారతదేశాన్ని తీవ్రంగా అవమానించడానికే పాక్‌ ఈ దౌత్య నాటకం ఆడింది. జాదవ్‌ కుటుంబ మత, సాంస్కృతిక భావాలను ఉద్దేశపూర్వకంగా పలుచన చేసి వారిని అవమానపరచింది. ఇది భారతీయుల పట్ల, ప్రత్యేకించి హిందువుల పట్ల పాకిస్తాన్‌ వెళ్ళగక్కిన ద్వేషం. ఇది పాకిస్తాన్‌ దుర్మార్గానికి ప్రతీక. తన తుచ్ఛమైన ప్రవర్తనతో కోట్లాది భారతీయుల ఆత్మగౌరవాన్ని పాకిస్తాన్‌ దెబ్బతీసింది.

భారత్‌ ఖండన

ఒకవంక అమానవీయంగా ప్రవర్తించిన పాకిస్తాన్‌, తాను ఒక ఇస్లామీయ దేశం అయినందున కారుణ్యంతో వ్యవహరించినట్లు తనను తానే అభినందించుకుంది. అన్ని విధాలుగా తాము నిబద్ధత పాటిస్తున్నామనే పాకిస్తాన్‌ వైఖరిని భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ‘సమావేశ స్ఫూర్తిని ఉల్లంఘించిన పాకిస్తాన్‌ వైఖరి పట్ల మేం చింతిస్తున్నాం. హామీలకు విరుద్ధంగా సమావేశం మొత్తం కుటుంబ సభ్యులను భయపెట్టే వాతావరణంలో నిర్వహించినందుకు కూడా మేము చింతిస్తున్నాం. ఈ మొత్తం కార్యక్రమానికి విశ్వసనీయత లేదు’ అని తూర్పారబట్టింది. హత్యాకాండకు అలవాటు పడిన పాకిస్తాన్‌కు మాటల భాష అర్థం కాదని దీనితో స్పష్టమైంది.

ఉదార వాదులెక్కడ ?

అయితే వీటన్నిటికంటే దారుణమైన విషయం మరొకటి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. అదేమిటంటే – సందర్భం వచ్చిన ప్రతిసారి చిన్న చిన్న వ్యాఖ్యల పట్ల సైతం ధర్నాలు, ఊరేగింపులు, సంతకాల సేకరణ ఉద్యమాలు, కొవ్వొత్తుల పాదయాత్రలు చేసి, సినిమాలపై నిషేధాలు కోరే భారతీయ ఉదారవాద బృందాలు పాకిస్తాన్‌ ధిక్కారం, భారతీయ సంస్కృతి అపహాస్యం చేయడం పట్ల ఏ మాత్రం స్పందించలేదు. ఒక భారతీయ కుటుంబానికి కలిగిన ఈ రకమైన అవమానం పట్ల ఈ ఉన్నతవర్గ నిశ్శబ్ద ప్రవర్తన నిజంగా నిరుత్సాహపరుస్తోంది. పాకిస్తాన్‌ నటులపై భారత ప్రభుత్వం నిషేధం విధించే అంశాన్ని సైతం ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశంగా భావించిన ఇక్కడి అవార్డు వాపసీ బృందాలు జాదవ్‌ విషయంలో ఘోరనిశ్శబ్దం పాటించాయి. రాజకీయ వర్గాలు సైతం ఈ విషయంలో విడిపోయాయి. మన రాజకీయ నాయకుల బాధ్యతా రహిత, నిరాకరణ యోగ్యమైన వ్యాఖ్యలు భారతదేశంలో అంతర్గతంగా దిగి ఉన్న ముప్పును స్పష్టం చేశాయి.

పాక్‌ దుర్మార్గాన్ని కట్టడి చేయాలి

జాదవ్‌ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దేశం ఆయన వెనుక నిలచి ఆయన కుటుంబానికి మద్దతు ఇవ్వాలి. పడమటి పొరుగు వారితో అంటకాగే పాకిస్తాన్‌ అనుకూలురు జాదవ్‌ కుటుంబానికి కలిగిన ఈ అవమానాన్ని ఖండించ లేదు. పాకిస్తాన్‌, భారతదేశం మధ్య సామ్యాలు ఏమీ లేవనేది తేటతెల్లమే అయినప్పటికి, దుష్ట పొరుగు వారితో సంబంధాలు కొనసాగించాలని, అభివృద్ధి పరచాలని పాకిస్తాన్‌ అనుకూలురు వాదిస్తున్నారు. భారతదేశంలోని బాధ్యత గల రాజకీయ నాయకత్వం ఈ పాకిస్తాన్‌ అనుకూల వర్గాల వాదనలను తిరస్కరించి, పాకిస్తాన్‌ దుర్మార్గ కార్యాచరణ ప్రణాళికను (manifesto) ఎదుర్కోవడానికి దృఢమైన ప్రణాళికను సిద్ధం చేయవలసిన సమయం ఆసన్నమైంది.

ఆంక్షలు విధించాలి

ఇదిలా ఉండగా, జాదవ్‌ కేసు విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యాన్నీ సహించబోమని భారతదేశం పాకిస్తాన్‌కు స్పష్టం చేయాల్సి ఉంది. వాణిజ్య, ఆర్థిక, సైనిక ఆంక్షలను పాకిస్తాన్‌పై విధించే అన్ని అవకాశాలనూ భారతదేశం తీవ్రంగా పరిశీలించాలి. ఒకవంక పాకిస్తాన్‌ తన దురాగతాల పరంపరను నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉండగా, మరొక పక్క భారతదేశం పాకిస్తాన్‌కు ఇచ్చిన ‘అత్యంత ప్రియమైన దేశం’ (MFN) హోదాను ఉపసంహరించక పోవడమే కాక, సింధునది జలాల ఒప్పందం విషయంలో సైతం స్వప్రయోజన విధానం అనుసరించలేకపోతోంది. వీటిని కూడా భారత్‌ వెంటనే పరిశీలించాలి. రాజౌరీ సెక్టర్‌లో హతమైన సైనికుల హత్యకు భారత దళాలు ప్రతీకారం తీర్చుకున్నప్పటికీ, మన సైనికుల శరీరాలను ఛిద్రంచేసే అనాగరిక చర్యలను పాకిస్తాన్‌ అడ్డు లేకుండా కొనసాగిస్తూనే ఉంది. ఇది దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్న మన అమరవీరుల కుటుంబాలను వికలం చేస్తున్నది.

పాకిస్తాన్‌ అంతులేని, సిగ్గులేని దురాగతాలు, అసత్యాలు, మభ్యపెట్టడం వంటివి భారతదేశాన్ని ఉలిక్కిపడేట్లు చేస్తున్నాయి. ఇటీవల పాకిస్తాన్‌ను ఒంటరిచేసే ప్రయత్నాలను భారత్‌ తీవ్రం చేసినప్పటికీ, భారత పార్లమెంటు పాకిస్తాన్‌ను ఒక ఉగ్రదేశంగా ప్రకటించే తీర్మానాన్ని చేయనట్లైతే ఆ ప్రయత్నాలు ప్రతికూలంగా, నిష్ఫలంగా మారవచ్చు.

గత సంవత్సరం ఫిబ్రవరి 3న పార్లమెంటు సభ్యుడు రాజీవ్‌ చంద్రశేఖరన్‌ ‘ఉగ్రవాదాన్ని పోషించే దేశాల ప్రకటన బిల్లు 2016’ ను రాజ్యాంగ సభలో ప్రతిపాదించారు. ‘మన దేశానికి వ్యతిరేకంగా తీవ్రవాదానికి సహకరించే, ప్రోత్సహించే, తీవ్రవాదాన్ని పోషించే’ ఏ దేశాన్నైనా ఉగ్రవాద పోషక దేశంగా ప్రకటించడం ఈ బిల్లు ఉద్దేశం. అటువంటి దేశంతో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను ఉపసంహ రించుకోవడానికీ, ఆ దేశ పౌరులపై చట్టపరమైన, ఆర్థిక, ప్రయాణ ఆంక్షలు విధించడానికీ, తత్సంబంధిత ఇతర చర్యలకూ ఈ బిల్లు పిలుపునిస్తుంది. దురదృష్టవశాత్తూ ఈ బిల్లుపై చర్చ ప్రారంభం కాలేదు, కనీసం ఎవరూ ఆసక్తి చూపలేదు.

ప్రస్తుతం తన దుష్కృత్యాల పట్ల పాకిస్తాన్‌ సిగ్గు వదిలేసింది. భారతదేశం శిక్షాత్మక చర్యలు తీసుకోవలసిన సరైన సమయం ఇదే. లేకుంటే పాకిస్తాన్‌ అమానవీయ దుష్కృత్యాలు కొనసాగుతూనే ఉంటాయి.

–  డా.రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *