పాకిస్తాన్‌ హిందూ శరణార్థుల కోసం పోరాటమే ఏకైక లక్ష్యం

పాకిస్తాన్‌ హిందూ శరణార్థుల కోసం పోరాటమే ఏకైక లక్ష్యం

నిమిత్తేకం సంస్థ అధ్యక్షులు డా|| ఓమేంద్ర రాట్నుతో ప్రత్యేక ముఖాముఖి

పాకిస్తాన్‌లో హిందువులు ఈ రోజు దుర్భర జీవితాలను గడుపుతున్నారు. వారి ధన, ప్రాణ, మానాలకు రక్షణ లేదు. ధార్మిక హక్కులు అసలే లేవు. పశువుల లాగా బతుకులు వెళ్లదీయాల్సిన దుఃస్థితి ఉంది. అక్కడ నుంచి వందల సంఖ్యలో హిందువులు మన దేశానికి శరణార్థులుగా వస్తూంటారు. కేవలం తమ ధార్మిక విశ్వాసాలను కాపాడుకునేందుకు మాత్రమే వారు ఇక్కడకి వస్తున్నారు. ఇలాంటి హిందూ శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు, వారు గౌరవప్రదంగా జీవించేందుకు కావలసిన పరిస్థితులు నిర్మాణం చేసేందుకు రాజస్థాన్‌లో నిమిత్తేకం అనే సంస్థ పనిచేస్తోంది. హిందూ శరణార్థులకు విద్యా, వైద్య సదుపాయాలు కల్పించడం నుంచి వారికి ఉపాధి కల్పించడం వరకూ అన్ని పనులను నిమిత్తేకం చేస్తోంది. ఈ సంస్థ అధ్యక్షులు డా. ఓమేంద్ర రాట్ను ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా జాగతి తరఫున రాకా సుధాకరరావు రాట్నుతో ముఖాముఖి నిర్వహించారు. ఆ ముఖాముఖి సారాంశం జాగతి పాఠకులకు ప్రత్యేకం.

ప్రశ్న : నిమిత్తేకం సంస్థ చేసే పనేమిటి ?

సమాధానం : పాకిస్తాన్‌లో దుర్భర పరిస్థితుల్లో ఉన్న హిందువులకు ఆశ్రయం కల్పించడమే మా పని. పాకిస్తాన్‌ నుంచి వచ్చే హిందూ శరణార్థుల్లో అత్యధిక సంఖ్యాకులు కటిక పేదలే. వారు కట్టుబట్టలతో దేశానికి శరణార్థులుగా వస్తారు. వారికి భారతీయ పౌరసత్వం ఇప్పించడం, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం, జాబ్‌ పర్మిట్‌ ఇప్పించడం, బ్యాంకింగ్‌ సదుపాయం కల్పించడం, వైద్యసాయం అందించడం కోసం మేం ‘నిమిత్తేకం’ అనే సంస్థను స్థాపించి పనిచేస్తున్నాం. వారికి ‘తాము భారత దేశంలో సురక్షితంగా ఉండగలం’ అన్న భరోసా కల్పించడం కోసం మేం పనిచేస్తున్నాం. అదే విధంగా మేము హిందూ శరణార్థుల దీనగాథలను లిపిబద్ధం చేస్తున్నాం. పాకిస్తాన్‌లో వారు ఎలాంటి అత్యాచారాలకు, అణచివేతకు గురవుతున్నారో తెలిపే కథనాలను వీడియో డాక్యుమెంటేషన్‌ కూడా చేస్తున్నాం. దీని ద్వారా అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ను దోషిగా నిలబెట్టడానికి వీలు కలుగుతుంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌పై మనం చేస్తున్న పోరాటానికి బలం కలుగుతుంది.

ప్రశ్న : పాకిస్తాన్‌లో ఉన్న హిందువులతో మీరు ఎలా సంబంధాలు ఏర్పరచుకుంటారు ?

స : మేం ఫోన్‌ ద్వారా సంభాషిస్తూంటాం. మా ఫోన్‌ సంభాషణలను అటు భారత గూఢచారి విభాగాలు, పాకిస్తానీ ఐఎస్‌ఐ వింటూంటాయి. చాలా సందర్భాల్లో పాకిస్తాన్‌ నుంచి వచ్చిన హిందువులను ఐఎస్‌ఐ ఆఫీసర్లు ఫోన్‌ చేసి బెదిరిస్తూంటారు. అంతేకాదు మాలాంటి కార్యకర్తలకు కూడా ఐఎస్‌ఐ ఏజెంట్ల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తూంటాయి. అయితే మేము దీనికి భయపడే ప్రసక్తే లేదు. ఈ పనిని ఆపే ప్రసక్తే లేదు.

ప్రశ్న : పాకిస్తాన్‌ లో హిందువుల పరిస్థితి ఎలా ఉంది ?

స : పాకిస్తాన్‌లో హిందువుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అక్కడ చాలా ఆలయాలు మూత్రశాలలుగా, శౌచాలయాలుగా, కసాయి ఖానాలుగా మారిపోయాయి. రోడ్లను వెడల్పు చేసే పేరుతో చాలా మందిరాలను కూల్చేశారు. ఇక హిందువులు కూడా బయట తిరిగేటప్పుడు తమ పేరు అన్వర్‌ అనో అహ్మద్‌ అనో చెప్పుకుంటారు. గడ్డాలు పెంచుకుని, టోపీలు ధరించి ముస్లింలుగా చెలామణీ కావలసి వస్తుంది. ఇక అక్కడ హిందూ మహిళలను బలవంతంగా వివాహం చేసుకోవడం, మతం మార్చడం సర్వసాధారణం. హిందువులు భయోత్పాతాల మధ్య జీవిస్తారు. నేటికీ ప్రతి రోజూ సగటున ముగ్గురు హిందూ యువతులను అపహరిస్తు న్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమీషన్‌ వెబ్‌ సైట్‌లో అధికారికంగా పేర్కొన్నారు. కమీషన్‌ ఇప్పటి వరకు1541 మంది యువతులు బలాత్కారానికి గురయ్యారని అంగీకరించింది.

ప్రశ్న : భారతదేశంలోకి వారు పాస్‌పోర్టుల సాయంతోనే ప్రవేశిస్తారా ?

స : అవును. నా నలభై ఏళ్ల అనుభవంలో ఒక్క పాకిస్తానీ హిందువు కూడా దొంగచాటుగా వచ్చిన దాఖలాలు లేవు. వీరంతా మతపరమైన కారణాలతో.. అంటే తండ్రి అస్థికలను గంగలో కలిపేందుకో, తల్లిదండ్రులకు చార్‌ధామ్‌ యాత్ర చేయించేందుకో భారతదేశానికి వస్తారు. రాగానే తమ పాస్‌పోర్టును పోలీసులకు సరెండర్‌ చేసి, శరణార్థులవుతారు.

ఇంతకుముందు వారు ఏ జిల్లాలో పాస్‌పోర్ట్‌ సరెండర్‌ చేస్తే ఆ జిల్లాలోనే ఉండిపోవాలి. ఉదాహరణకు జైపూర్‌ జిల్లాలోకి వస్తే ఆ జిల్లాకే పరిమితం కావాలి. దాటి బయటకు వెళ్తే అరెస్టు చేసి జైల్లో పెడతారు. అయితే నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత వారి పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి. ఇప్పుడు వారు మొదటి మూడు నెలలు వారు ఒకే జిల్లాలో ఉంటే సరిపోతుంది. ఆ తరువాత దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు. అయితే వారు తమ కదలికల గురించి పోలీసులకు తెలియచేయాలి.

ప్రశ్న : ఇలా మనదేశంలోకి వచ్చే హిందూ శరణార్ధులు ఎక్కువగా పాకిస్తాన్‌ లోని ఏ రాష్ట్రం నుంచి వస్తారు ?

స : ఎక్కువ మంది సింధ్‌ ప్రాంతం నుంచి వస్తున్నారు. కొందరు దక్షిణ పంజాబ్‌లోని రహీం యార్‌ ఖాన్‌ నుంచి వస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మేఘవాల్‌ వర్గానికి చెందిన వారు. వీరంతా పాకిస్తాన్‌లో బట్టల వ్యాపారం చేసేవారు. మన దేశంలో మేఘవాల్‌లు ఎస్‌.సి.లు. వీరు భారతదేశం లోకి వచ్చిన తరువాత, పౌరసత్వం పొందితే, ఇక్కడి మేఘవాల్‌లకు ఏయే సదుపాయాలున్నాయో అవన్నీ పొందగలుగుతారు.

ప్రశ్న : ఈ శరణార్థులు ఎక్కువగా ఏయే రాష్ట్రాల్లోకి వెళుతున్నారు ?

స : ప్రధానంగా రాజస్థాన్‌లోకి వస్తూంటారు. కొందరు పంజాబ్‌కి కూడా వెళ్తూంటారు. ముఖ్యంగా సిక్కులు పంజాబ్‌కి వెళ్తూంటారు. రాజస్థాన్‌కి వస్తున్న వారిలో పుష్కర్ణా బ్రాహ్మణులు, మేఘవాల్‌లు, రాజపుత్రులు, బోడా రాజపుత్‌లు ఉన్నారు.

ప్రశ్న : ఈ శరణార్థుల కోసం మన ప్రభుత్వం ఏయే చర్యలు చేపడుతోంది ? వారి పునరావాసం దిశగా ఏం చేస్తోంది ?

స : నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకూ పాకిస్తానీ హిందూ శరణార్థుల గురించి మన ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. వారిని పాకిస్తానీలుగానే పరిగణించేవారు. శత్రువులుగానే చూసేవారు. కానీ 2016 నుంచి వీరికి జాబ్‌ పర్మిట్లు, బ్యాంక్‌ అకౌంట్లు, డ్రైవింగ్‌ లైసెన్సులు లభిస్తున్నాయి. వీరి వీసాలను ఏడాదికి ఒకసారికి బదులు, అయిదేళ్లకు ఒకసారి పొడిగించారు. అయితే ఇప్పుడు నెలకు రెండు వందల మందికి మాత్రమే వీసాలను ఇస్తున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచాలని, హిందూ శరణార్థుల విషయంలో సానుభూతితో వ్యవహరించాలని మేం ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

ప్రశ్న : అసలు పాకిస్తాన్‌లో ఉన్న హిందూ మైనారిటీల కోసం పనిచేయాలన్న ఆలోచన మీకెలా కలిగింది ?

స : ఈ భావన చిన్నప్పటి నుంచే నాలో ఉండేది. మన దేశంలో ముస్లింలు చాలా మంది పాకిస్తాన్‌కు వెళ్లకుండా ఉండిపోయినట్టే పాకిస్తాన్‌లోనూ హిందువులు ఉండి ఉంటారని నాకు అనిపించేది. వారి గురించి ఆలోచించేవాడిని. రాజస్థాన్‌ సరిహద్దు రాష్ట్రం. ఇక్కడి రాజపుత్‌, మేఘవాల్‌ వంటి సముదాయాలకు పాకిస్తాన్‌లో చాలా మంది బంధువులున్నారు. వారి నుంచి కూడా అక్కడి హిందువుల దుర్భర జీవన పరిస్థితులు, వారిపై మతోన్మాద దాడుల గురించి నాకు తెలుస్తూ ఉండేది. వీరి కష్టాలు, కన్నీళ్ల గురించి తెలుసుకున్నాను. 1947 నుంచి నేటి వరకూ అక్కడ జరుగుతున్న అత్యాచారాల గురించి తెలుసుకున్నాను. అయితే ఈ పనిలో నేను నిమగ్నం కావడానికి కారణం సీమాంత లోక్‌ సంగఠన్‌ (సరిహద్దు ప్రజల సమితి) అనే సంస్థే! ఆ సంస్థ సరిహద్దు ప్రాంతాల ప్రజల కోసం పనిచేస్తుంది. ఆ సంస్థ నుంచే శరణార్థుల గురించి, వారికి భారత దేశంలోకి వచ్చాక ఎలాంటి సాయం చేయాలనేది తెలుసుకున్నాను. ఆ సంస్థ నేత హిందూ సింగ్‌ సోధా నుంచి నేను చాలా నేర్చుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *