పట్టణాల్లో మావోయిస్టులు..?

పట్టణాల్లో మావోయిస్టులు..?

మహాత్మాగాంధీ హత్య జరిగిన సమయంలో భారతదేశంలో అంతర్యుద్ధ నిర్మాణానికి అప్పటి రష్యా అధినేత ఇక్కడి కమ్యూనిస్టులకు పిలుపునిచ్చాడు. అది సాధ్యం కాలేదు. రష్యా విప్లవం కమ్యూనిస్టులను నడిపిస్తూంటే; చైనా విప్లవం నక్సల్స్‌ను నడిపిస్తున్నది. రష్యాలో కమ్యూనిజం విఫలమైన తరువాత కూడా ఇక్కడి కమ్యూనిస్టులు తమ పంథాను మార్చుకోలేదు. చైనా విప్లవం సృష్టించిన మారణహోమం; ఆ తదుపరి జరిగిన పరిణామాలతో మేల్కొన్న చైనా మావో సిద్ధాంతాలను పక్కన పెట్టింది. అయినప్పటికీ ఇక్కడి మావోయిస్టులు మావోయిజాన్నే పట్టుకుని వేలాడుతున్నారు.

భారతదేశం వేల సంవత్సరాల నుండి ఒకే జాతి. కాని మావోయిస్టులు భారతదేశం గురించి చెబుతూ ‘ఇది ఒక జాతి కాదు, ఇక్కడ 17 జాతులున్నాయి’ అని గతంలో చెప్పేవారు. అదే విషయాన్ని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నారు. అందుకే జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ వామపక్షీయ విద్యార్థులు దేశాన్ని ముక్కలు చేస్తామని నినాదాలిస్తుంటారు. కమ్యూనిష్టులు లేదా మావోయిస్టులకు ఈ దేశంలో రాజ్యాధికారం చేజిక్కించుకోవటమే లక్ష్యం. కమ్యూనిస్టులు దానికి అనుకూలంగా ఎన్నికలలో పాల్గొంటుంటే, నక్సల్స్‌ తుపాకి ద్వారానే రాజ్యాధి కారం సిద్ధిస్తుందని నేటికీ నినాదామిస్తూ ఉంటారు. ఈ దేశంలో అంతర్యుద్ధం నిర్మాణం చేసి, తద్వారా ఈ దేశ పాలనను తమ చేతులలోకి తీసుకోవాలనే లక్ష్యంతో ప్రారంభమైన నక్సల్‌ ఉద్యమం ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొంది.

2004లో ఆంధ్రప్రదేశ్‌ (ప్రస్తుత ఆంధ్ర, తెలంగాణా) లో ఉన్న పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ వాళ్ళు మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనమయ్యారు. అప్పటి నుండి మన ప్రాంతంలో; దేశంలో వాళ్ళను మావోయిస్టులుగా పిలుస్తున్నారు. వాళ్ళకు ప్రేరణ మార్క్సిజం, లెనినిజం, మావోయిజం.

ఎప్పుడూ అడవులు, కొండ ప్రాంతాలలోనే ఉండే మావోయిస్టులు ఇప్పుడు తమ నెలవులను పట్టణాలలో విస్తరింపజేసి ఉద్యమాలకు నాయకత్వం నిర్మాణం చేసుకోవాలని నిర్ణయించారు. వారు దీనిని ఫోర్త్‌ జనరేషన్‌ వార్‌గా అభివర్ణించుకుంటున్నారు. ఈ ఫోర్త్‌ జనరేషన్‌ వార్‌ సంక్లిష్టమైనది. దీర్ఘకాలికమైనది. మేధోపరమైన యుద్ధం ద్వారా ఈ దేశంలోని అనేక వ్యవస్థలపైన, సంస్కృతిపైన తీవ్ర వత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. రాజకీ యంగా, ఆర్థికంగా, సామాజికంగా సైన్యంపై ఒత్తిడి తేవడానికి ఈ దేశంలోని చట్టాన్ని దానిలోని లొసుగులను ఎట్లా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నారు. ఈ పనికి న్యాయ నిపుణులు, కొత్త ఆవిష్కరణలు, పథకాలు రచించగలిగే మేధావులు, విశ్వవిద్యాలయాలలో పనిచేసే ప్రొఫెసర్లు, ఈ పనులకు నాయకత్వం వహించేవారు కావాలి. సమాజంపై దాడులు చేయటానికి అనేక వేదికలు కూడా కావాలి. ఆ దిశలో నగరాలలో తమ పని విస్తరించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

2009లో ఢిల్లీలో అదుపులోకి తీసుకొనబడిన కోబడ్‌ గాండి (+aఅసవ) నగరాలలో పనికి ఒక డాక్యుమెంట్‌ తయారుచేసాడు. ఆ డాక్యుమెంట్‌లో ఒక వాక్యం ఉంది. నగరాలలో మన శత్రువులు చాలా బలమైనవాళ్ళు. పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా మలచుకొనేవరకు వేచి ఉండాలి. శత్రువులను మనకు అనుకూలంగా మలచుకోవ టానికి ఉన్న అన్ని అవకాశాలు ఉపయోగించుకో వాలి. మన శత్రువులపై దాడి చేసేందుకు, వత్తిడి పెంచే వివిధ వర్గాలను ఎంపిక చేసుకోవాలి. ఉదా|| మైనార్టీలు, మహిళలు, దళితులు, కార్మికులు, విద్యార్థులను ప్రభావితం చేసేవారు. వీరంతా దీర్ఘకాలం పనిచేయాలి అని ఉంది. వారే మన విప్లవంలో ప్రధాన భూమిక పోషించగలుగుతారు. వారి నుండి సంస్థకు అవసరమైన ఆర్థిక వనరులు, ఆయుధాలు, న్యాయనిపుణులు, వైద్య సౌకర్యానికి వసతులు, పత్రికారంగం, మేధావుల సహకారం లభిస్తుంది. నగరాలలో పట్టణాలలో ఉద్యమాన్ని శక్తివంతం చేస్తే ఆ నాయకత్వము గ్రామ క్షేత్రంలో రైతు ఉద్యమాలకు, వ్యవసాయ విప్లవాలకు కావలసిన నాయకులను అందించగలుగుతుంది. అదే ప్రజా విప్లవమవుతుంది. ఈ విధంగా అనేక నగరాలలో నెట్‌వర్కు వ్యవస్థ ఏర్పాటు చేసుకొన్నారు. ప్రభుత్వంలో కీలక స్థానాలలో ఉండేవారిని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి కృషి చేస్తున్నారు.

2006లో పాలమూరు జిల్లాలో రాకెట్‌ సెల్స్‌, రాకెట్‌ లాంచర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అట్లాగే చెన్నై సమీపంలో ఉన్న కొన్ని స్థావరాలలో రాకెట్‌ లాంచర్‌ విడిభాగాలను నిర్మాణం చేయటం, వాటిని దేశంలోని అనేక స్థావరాలకు రవాణా చేయటం కొనసాగిస్తున్నారనే సమాచారం బయటపడింది. దేశంలో ప్రధానంగా ఆరు రాష్ట్రాలలో వాళ్ళ వ్యవస్థ విస్తరించింది. 1) తమిళనాడు, 2) ఆంధ్రప్రదేశ్‌, 3) తెలంగాణ, 4) మధ్యప్రదేశ్‌, 5) చత్తీస్‌ఘడ్‌, 6) ఒరిస్సా. ఈ ప్రాంతాలలో తమకు అనుకూలమైన మేధావి వర్గాన్ని, మీడియా వర్గాన్ని నిర్మాణం చేసుకొంటున్నారు. వారి అంతిమ లక్ష్యమైన అధికారం చేజిక్కించుకోవటానికి కొన్ని ప్రధాన ద్వారాలు ఎంపిక చేసుకొన్నట్లు తెలుస్తున్నది. పూనా, ముంబాయి, అహ్మదాబాద్‌లను గోల్డెన్‌ కారిడార్‌గా; ఢిల్లీ, కాన్పూర్‌, పాట్నాలను కలకత్తా గంగా కారిడార్‌గా; చెన్నై, కోయంబత్తూర్‌, బెంగుళూరులను ట్రైజంక్షన్‌గా గుర్తించారు. వీటికోసం కొన్ని విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకొన్నారు. అందులో జెఎన్‌యు-ఢిల్లీ, ఉస్మానియా, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌, రీసర్చ్‌ & డెవలప్‌మెంట్‌ సెంటర్స్‌ను తమ ఉద్యమ (అర్బన్‌ నక్సలిజం) విస్తరణకు ఎంపిక చేసుకొన్నారు. మావోయిస్టులు నగరాలలో మూడు రకాల సంస్థలు నిర్మాణం చేసుకున్నారు. 1) రహస్య కార్యక లాపాలకు ఉపయోగపడే సంస్థలు, 2) కొంతమేరకు బహిరంగంగా పనిచేసే సంస్థలు, 3) న్యాయ పోరాటానికి అవసరమైన సంస్థలు ఏర్పాటు చేసుకొంటున్నారు.

ఈ న్యాయపోరాట సంస్థలు దేశ ఆంతరంగిక భద్రతకు పెనుసవాళ్ళుగా మారుతున్నాయి. రాజ్యాంగబద్ధ పోరాటం పేరుతో ప్రజల సమర్థనను పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రహస్య కార్యకలాపాలు సాగించే సంస్థలను నిషేధించవచ్చు. కాని చట్టబద్ధంగా ఉంటున్నట్లు కనపడుతున్న సంస్థలను నిషేధించటం అంత సులభం కాదు. ఉదా|| మానవహక్కుల సంఘం. ఇవి న్యాయ పోరాటం చేస్తున్న సంస్థలుగా గుర్తింపు పొందటానికి సమాజంలో కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు, కులాలను కూల్చేయాలని పనిచేసే వాళ్ళకు న్యాయ సహకారం అందిస్తున్నారు. దీనికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అట్లాగే రచయితల సంఘాలు, న్యాయవాద సంఘాలు, కళాకారుల సంఘాలూ ఉన్నాయి. వీటిని నడిపించ టానికి ఎన్‌.జి.ఓ.లు ప్రారంభించారు.

ఈ మధ్య సుప్రీంకోర్టులో కేంద్ర గృహ మంత్రిత్వశాఖ ఒక అఫిడవిట్‌ సమర్పించింది. దాని సారాంశం ఏమిటంటే, మావోయిస్టులకు అనుకూ లంగా, మావోయిస్టుల ప్రత్యక్ష ప్రమేయం లేకుండా వివిధ ఎన్‌జిఓల ద్వారా ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతను, ప్రజల అసంతృప్తిని తమ ఆయుధంగా మార్చుకొంటూ నగరాలలో మావోయిస్టులు ఉద్య మిస్తున్నారు. ఈ ఉద్యమాల సమయంలో నగరాలలో ఉండే మావోయిస్టు నాయకులు బయటపడుతూ అరెస్టు అవుతున్నారు లేదా లొంగిపోతున్నారు. దానికి మంచి ఉదాహరణగా సూరత్‌ను చెప్పుకోవచ్చు. సూరత్‌, హరియాణా, కురుక్షేత్ర, పానిపట్టు, సోనిపట్టు మొదలైనవి. ఢిల్లీ నగరంలో పారిశుద్ధ్య కార్మిక సంఘాలు ఏర్పాటుచేసి పనిచేస్తున్నారు. పారిశ్రామిక పట్టణాలైన భిలాయ్‌, రాంచి, ధన్‌బార్‌, కోల్‌కత్తా, ముంబాయి, పూనా, అహ్మదాబాద్‌ మొదలైన చోట్ల కార్మికులలో వాళ్ళ కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ప్రభుత్వ వ్యవస్థలు, రవాణా, కమ్యూనికేషన్‌ వ్యవస్థలపై తీవ్రమైన దాడులు చేస్తూ వందల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తున్నారు.

పట్టణ ప్రాంతాలలో విస్తరించటానికి ఇంకొక మౌలిక కారణం రహస్య ఉద్యమాలు అటవీ ప్రాంతాలకే పరిమితమవడం. కొత్తవారు తమ ఉద్యమంలో చేరటం లేదు. అందుకే పట్టణాలలో చొరబడాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి అనేక దారులు ఎంపిక చేసుకున్నారు. సాంకేతిక, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు, నెట్‌వర్క్‌లో చొరబడి శత్రువుల వివరాలు, రహస్యాలు సేకరించేవాళ్లు కావాలి. అటువంటి వారికి ఉద్యోగాలిచ్చి పనిచేయించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు.

‘కాబర్‌ కళామంచ్‌’ వంటి సంస్థలు ఏర్పాటు చేసి, ఈ దేశ సంస్కృతిపై దాడులు చేస్తున్నారు. ఈ ‘కాబర్‌ కళామంచ్‌’ 2002లో గోద్రా సంఘటన తరువాత ప్రారంభమైంది. మత సామరస్య కార్యక్రమాలూ, ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ కవితలు, రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆ సంస్థ సభ్యులకు మావోయిస్టు సంస్థలతో సంబంధాలున్నాయని తెలిసి, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కాబర్‌ కళామంచ్‌ వాళ్ళు మేము దళితులకోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటారు. అటువంటివారు మావోయిస్టులు మహారాష్ట్రలో 23 మంది దళితులను చంపినప్పుడు నోరు తెరచి ఒక్కమాట మాట్లాడలేదు. మావోయిస్టులు ఒకపక్క ఎస్‌.సి, ఎస్‌.టి.లను తమలో కలుపుకొనేందుకు ప్రయత్నాలు చేస్తూనే, మరోపక్క ఇన్ఫార్‌మర్లు పేరుతో వారిపై దాడులు చేస్తున్నారు. ఎస్‌.సి, ఎస్‌.టి. సంస్థలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎస్‌.సి, ఎస్‌.టి. సంస్థలు అంబేడ్కర్‌ ఆలోచనలతో పనిచేస్తుంటాయి. మావోయిస్టు ఆలోచనలకు అంబేడ్కర్‌ ఆలోచనలకు అసలు సంబంధం లేదు. కాని రాజ్యాధికారం ఇరువురినీ దగ్గర చేర్చే సాధనమౌతోందా?

ఎందుకంటే 2015 సంవత్సరంలో మావోయిస్టు కేంద్ర కమిటి సభ్యుడు శ్రీధర్‌ శ్రీనివాసన్‌ చనిపోయి సంవత్సరం అయిన సందర్భంగా ముంబాయిలో పెద్ద కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ముంబాయి లోని రిపబ్లిక్‌ పాంథర్‌ సంస్థ నిర్వహించింది. శ్రీధర్‌ శ్రీనివాసన్‌ ఎస్‌.సి, ఎస్‌.టి.ల హక్కుల కోసం పనిచేసినవాడుగా పాటలు, ఉపన్యాసాలు సాగి పోయాయి. ప్రజాస్వామ్యంపై, అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగంపై విశ్వాసం ఉన్నవాళ్ళు ఎవరూ మావోయిస్టులను సమర్థించరు. కాని ఆయా సంస్థల సభ్యులను మావోలు తమ జాలంలోకి లాగుతున్నారు. ఈ దేశంలో ఉన్న కులవ్యవస్థ బలం, బలహీనతలు, మావోయిస్టులకు బాగా తెలుసు. అందుకే కులం కూడా వారికి ఒక ఆయుధంగా మారింది. మావోయిస్టులకు చర్చ్‌, జిహాదీ ఉగ్రవాదులతో పటిష్ట సంబంధాలున్నాయని కూడా తెలుస్తున్నది. అంతేకాదు, విదేశాలలో పనిచేసే మావోయిస్టు సంస్థలతో కూడా సంబంధాలున్నాయి.

ఇటీవల గృహమంత్రిత్వశాఖకు సంబంధించిన మంత్రి కిరణ్‌ రిజిజు పార్లమెంట్‌లో ఒక ప్రస్తావన చేశారు. అందులో ‘మన దేశంలోని మావోయిస్టులకు ఫిలిప్ఫైన్స్‌, టర్కీ, ఐరోపా ఖండంలో ఉన్న అనేక సంస్థలతో సంబంధాలున్నాయి. జర్మని, బెల్జియం మొదలైన చోట్ల నిర్వహించే సెమినార్‌లలో కూడా మావోయిస్టులు పాల్గొంటున్నారు’ అన్నారు. మావోయిస్టులు కేవలం అరణ్యాలకు, రెడ్‌ కారిడార్‌కు మాత్రమే పరిమితం కాక విదేశీ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారంటే నగరాలలో వాళ్ళకు ఏర్పడుతున్న పటిష్ట వ్యవస్థలే కారణం. దీనినే అర్బన్‌ మావోయిజం అంటున్నారు. ఇది అంతర్గత భద్రతకు పెనుసవాలుగా మారుతున్నది. వీళ్ళు క్రమంగా రాజకీయ పార్టీలపై తమకు సహకరించేట్లుగా వత్తిడి తెచ్చే పమాదం ఉంది.

ఈ దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న ఇటువంటి హిరసోన్మాద, జాతి వ్యతిరేక శక్తులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వమే కాదు, ప్రజలూ ముందుకు రావాలి. ఈ శక్తులు చేసే విద్వేషపూరిత ప్రచారాన్ని త్రిప్పికొట్టాలి. అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్న వాళ్ళ కార్యకలాపాలను గుర్తించి ఎదుర్కోవాలి. రాబోయే రోజులలో ఒకపక్క జిహాదీ నెట్‌వర్క్‌, చర్చి నెట్‌వర్క్‌, అర్బన్‌-మావోయిజం నెట్‌వర్క్‌లు మూడూ కలిసి జాతీయ సంస్థలే లక్ష్యంగా దాడులకు ప్రయత్నించవచ్చు. ఈ విషయంలో జాతీయ శక్తులు బలంగా నిలబడాలి. దేశాన్ని బలహీనపరిచే పై శక్తుల భేదతంత్రాన్ని వమ్ముచేసి, దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడుకోవాలి. అదే నేడు మన ముందున్న సవాల్‌.

– రాంపల్లి మల్లికార్జునరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *