నీరవ్‌ స్కాం యుపిఎ పాపమే

నీరవ్‌ స్కాం యుపిఎ పాపమే

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 2011 నుంచి జరుగుతున్న నీరవ్‌ స్కాం వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ పాత్ర లేనిదే నీరవ్‌ ఇంత సాఫీగా 17 వేల కోట్లు కొట్టేయలేడన్నది ఎవరైనా సులభంగా గ్రహించగలరు. అప్పటి ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌ కూడా ఈ వ్యవహారాన్ని పసిగట్టలేకపోయారు. దొంగలకు తాళం చెవి ఇచ్చినట్లుగా అప్పటి యువరాజు రాహుల్‌ వారి నగల ప్రదర్శనలను ప్రారంభించి, వారికి మరింత పరపతి అందేలా చేశారు. కాంగ్రెస్‌ ముఖ్య నేతల భార్యల నగల జాబితాలో నీరవ్‌ తయారు చేసిన వజ్రాభరణాలు వరుసగా చేరాయి.

‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంట్‌’ అన్నట్లుగా తమ పదేళ్ల పాలనలో అనుయాయులకు ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వ బ్యాంకుల నుంచి లక్షల కోట్ల అప్పులను అందించి, తద్వారా వెలుగు చూసిన స్కాంలను ప్రధాని నరేంద్రమోదీ నేతత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి అంటగట్టాలని కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు, వామపక్షాలు చూస్తున్నాయి. అసలు వాస్తవాలను దాచి నరేంద్రమోదీ పరిపాలనపై బురద జల్లడం ప్రారంభించారు.

యుపిఎ హయాంలోనే..

బ్యాంకుల నుంచి ఇబ్బడి ముబ్బడిగా ధనాన్ని నీరవ్‌ కొల్లగొట్టడం ప్రారంభించింది సంయుక్త ప్రగతి శీల కూటమి (యుపిఎ) పరిపాలనలోనే. వజ్రాల వ్యాపారిగా భారత్‌లో అడుగు పెట్టిన నీరవ్‌ కాంగ్రెస్‌ నేతలతో సత్సంబంధాలను కొనసాగించి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో ధనాన్ని కొల్లగొట్టాడు. 2008 నుంచి నీరవ్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి ఋణాలు పొందుతున్నాడు. 2011లో ముంబాయిలోని బ్యాంకు అధికారులు నీరవ్‌కు నకిలీ ‘లెటర్‌ ఆఫ్‌ అండర్‌ టేకింగ్‌ (ఎల్‌ఒయు)’ లను అందించారు. దశల వారిగా బ్యాంకు నుంచి అందిన ఈ ‘ఎల్‌ఒయు’ లతో నీరవ్‌ విదేశాల్లో పెద్ద ఎత్తున వజ్రాలను కొనుగోలు చేసి బ్యాంకులకు ఆ మేర ధనాన్ని నష్టపరిచాడు. గత పదేళ్లుగా కొనసాగుతున్న ఈ తంతును బ్యాంకు ఆడిటర్లు గానీ, నియంత్రణ సంస్థగా ఉన్న ఆర్‌బిఐ గాని గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై ప్రస్తుతం సిబిఐ దర్యాప్తు జరుపుతోంది.

కాంగ్రెస్‌ పెద్దల అండదండలతోనే..

కాంగ్రెస్‌ పెద్దల అండదండలు నీరవ్‌కు ఉన్నాయనడానికి బలమైన ఆధారాలున్నాయి. 2013 సెప్టెంబర్‌ 13 న ఢిల్లీలోని ఇంపీరియల్‌ ¬టల్‌లో నీరవ్‌ వజ్రాభరణాల ప్రదర్శనను యువరాజు రాహుల్‌ గాంధి ప్రారంభించారు. ఇది జరిగిన తెల్లారే నీరవ్‌కి 14 సెప్టెంబరు 2013న అలహాబాదు బ్యాంకు 1500 కోట్ల రూపాయలు ఋణాన్ని మంజూరు చేసింది. ఈ ఋణ మంజూరుపై జరిగిన భేటీలో బ్యాంకు డైరెక్టరు దినేష్‌ దుబే, నీరవ్‌కి ఋణాన్ని మంజూరు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎట్టకేలకు కాంగ్రెస్‌ పెద్దల అండదండలతో నీరవ్‌ 1500 కోట్ల ఋణాన్ని అలహాబాదు బ్యాంకు నుంచి సులభంగా పొందారు. నీరవ్‌కు ఋణం మంజూరు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అలహాబాదు బ్యాంకు డైరెక్టరు దినేష్‌ దుబే, తన నిజాయితీకి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 2014 ఫిబ్రవరిలో అప్పటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం దినేష్‌ను అలహాబాదు బ్యాంకు డైరెక్టర్‌ పదవి నుంచి తొలగించారు. ఈ మొత్తం వ్యవహా రాన్ని పరిశీలిస్తే ‘నీరవ్‌ అనే అవినీతి పామును పెంచి పోషించింది ఎవరు ?’ అనే విషయం అందరికీ అవగతం అవుతుంది.

నీరవ్‌కి గురువుగా ఉన్న అతని మామ మెహుల్‌ ఛోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్‌ను సెబి 2013 జూలైలోనే నిషేధించింది. ఈ గీతాంజలి జెమ్స్‌ గొలుసు దుకాణాల ఆర్ధిక వ్యవహారాలు అనుమానాస్పదంగా ఉండటంతో స్టాక్‌మార్కెట్‌లను నియంత్రించే భారతీయ సెక్యూరిటీస్‌ ఎక్స్చేంజీ బోర్డు స్టాక్‌ మార్కెట్‌లో గీతాంజలి కార్యకలాపాలను సస్పెండ్‌ చేసింది.

గంటల్లోనే స్పందించిన ప్రభుత్వం

ఐపిఎల్‌ స్కాం, విజయ్‌ మాల్యా స్కాం, తాజాగా నీరవ్‌ స్కాంలు కాంగ్రెస్‌ హయాంలోనే జరిగాయి. ప్రస్తుత నీరవ్‌ స్కాం వెలుగులోకి రాక మునుపే, అంటే 2016లోనే సుమారు 12 వేల కోట్ల రూపాయలతో ఫోర్బ్స్‌ ధనవంతుల జాబితాలో నీరవ్‌ స్థానం సంపాదించాడు. అయితే తమ అవినీతి ప్రజలకు చేరేలోపే ప్రధానిని ఈ రొంపిలోకి లాగాలని భావించిన కాంగ్రెస్‌ ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో భారతీయ వ్యాపారవేత్తలతో కలసి ప్రధాని మోదీ దిగిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో ఉంచి ప్రధానిపై దుష్ప్రచారం చేశారు. అయితే మచ్చ లేని నాయకుడైన ప్రధాని మోదీ స్కాం వెలుగు చూసిన కొద్ది గంటల్లోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డెరెక్టరేట్‌ను రంగంలో దించి సుమారు 5 వేల కోట్ల రూపాయల విలువైన నీరవ్‌ ఆస్తులను జప్తు చేయించారు. సదరు స్కాం కూడా ప్రధాని నరేంద్ర మోది నోట్ల రద్దు చేసిన తర్వాత వివిధ బ్యాంకులకు చేరిన పాత నోట్లు, వారి వారి అప్పుల పట్టికలను సరిచూసుకుంటున్న క్రమంలో వెలుగు చూసింది. విదేశాలలో ఉన్న నీరవ్‌ని రప్పించి అతను తిన్న ధనాన్ని అంతా కక్కించే పనిలో ఉంది నరేంద్రమోది ప్రభుత్వం. విజయ్‌ మాల్యా తనకు ఉన్న బ్రిటీష్‌ పౌరసత్వంతో రక్షణ పొందుతున్నాడు. అతని పాపం కూడా పండే రోజు దగ్గరలోనే ఉంది.

ఏమిటీ నీరవ్‌ స్కాం ?

బ్యాంకులు తమ నమ్మకమైన ఖాతాదారులు విదేశాల్లో గానీ, దేశంలోగానీ వ్యాపార లావాదేవీలు చేసేటపుడు, అతను తమ నమ్మకమైన ఖాతాదారేనని, తమ ఖాతాదారునికి తాము సూచించిన మొత్తం చెల్లించాలని, అలా చెల్లించిన మొత్తానికి తాము పూచీకత్తు అని విదేశాల్లోని బ్యాంకులకు తెలియచేస్తూ ‘లెటర్‌ ఆఫ్‌ అండర్‌ టేకింగ్‌ (ఎల్‌ఒయు)’ లను జారీచేస్తాయి. ముంబాయిలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు చెందిన డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ స్థాయి అధికారి నీరవ్‌కి ఇలాంటి పత్రాలను వందల సంఖ్యలో అందించారు. ఈ లెటర్లను చూపించి నీరవ్‌ విదేశాల్లో వేలంలో వజ్రాలను కొని అక్కడి భారతీయ బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిపారు. దేశీయంగా యాక్సిస్‌ బ్యాంకు, అలహాబాదు బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాల నుంచి కూడా పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిపారు. నీరవ్‌కు ఎల్‌ఒయులు జారీ చేసిన అధికారి అదే స్థానంలో ఏడు సంవత్సరాలు పనిచేశారు. ఈ విషయాలు బ్యాంకు దష్టికి రాకుండా పకడ్బందీగా వ్యవహరించారు.

అయితే సదరు అధికారి స్థానంలో కొత్తగా వచ్చిన అధికారి ఈ నకిలీ ఎల్‌ఒయులను పసిగట్టి పై అధికారులకు తెలియపరిచారు. 2011 నుంచి జరుగుతున్న ఈ వ్యవహారంలో కొత్త అధికారి ఇచ్చిన సమాచారంతో మొదట 240 కోట్ల రూపాయల నకిలీ ఎల్‌ఒయుల విషయంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సిబిఐకి ఫిర్యాదు చేసింది. అయితే విషయాన్ని ముందే పసిగట్టిన నీరవ్‌ విదేశాలకు పారిపోయాడు. అనంతరం జరిగిన సిబిఐ దర్యాప్తులో ఈ స్కాం విలువ 17,600 కోట్లని తేలింది. వెంటనే రంగంలోకి దిగి నీరవ్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న దుకాణాలు, ఆస్తులను ఇడి అధికారులు జప్తు చేశారు.

కాంగ్రెసే కర్త, కర్మ, క్రియ

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 2011 నుంచి జరుగుతున్న ఈ స్కాం వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ పాత్ర లేనిదే నీరవ్‌ ఇంత సాఫీగా 17 వేల కోట్లు కొట్టేయలేడన్నది ఎవరైనా సులభంగా గ్రహించగలరు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఆర్‌బిఐ గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్‌రాజన్‌ హయాంలోనే తన నియంత్రణలో ఉన్న ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో ధనం ఇలా దొంగల పాలు అయ్యింది. 2008లో వచ్చిన ప్రపంచ ఆర్ధిక మాంద్యాన్ని ముందే ఊహించిన రాజన్‌ తన కాళ్ల కింద, ఆర్‌బిఐ కేంద్ర కార్యాలయం ఉన్న ముంబైలోని పిఎన్‌బి బ్యాంకులో జరుగుతున్న ఈ దోపిడీని కనిపెట్టలేకపోయారు. అప్పటి ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌ కూడా ఈ వ్యవహారాన్ని పసిగట్టలేకపోయారు. దొంగలకు తాళం చెవి ఇచ్చినట్లుగా అప్పటి యువరాజు రాహుల్‌ వారి నగల ప్రదర్శనలను ప్రారంభించి, వారికి మరింత పరపతి అందేలా చేశారు. కాంగ్రెస్‌ ముఖ్య నేతల భార్యల నగల జాబితాలో నీరవ్‌ తయారు చేసిన వజ్రాభరణాలు వరుసగా చేరాయి. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు అభిషేక్‌ సింఘ్వీ భార్య నీరవ్‌ నుండి పెద్ద ఎత్తున విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది.

ఈ స్కాం ఇంకా వెలుగు చూడకముందే, జనవరి 2018, మొదటి వారంలోనే నీరవ్‌ విదేశాలకు వెళ్ళిపోయాడు. 29 జనవరి 2018న తమ ముంబై శాఖలో కోట్ల అవినీతి జరిగినట్లు పిఎన్‌బి అధికారులు సిబిఐకి ఫిర్యాదు చేశారు. అప్పటికే అమెరికా పౌరురాలైన నీరవ్‌ భార్య, బెల్జియం పౌరుడైన నీరవ్‌ సోదరుడు నిశాల్‌, నీరజ్‌ మామ గీతాంజలి జెమ్స్‌ భాగస్వామి మెహుల్‌ ఛోక్సీ జనవరి మొదటి వారంలోనే దేశం దాటారు.

ఇది ఆడిట్‌ వైఫల్యమే

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో జరిగిన ఈ భారీ స్కాం బ్యాంకుల ఆర్ధిక వ్యవహారాల్లోని లొసుగులను బయటపెట్టింది. సాధారణంగా బ్యాంకుల్లో స్టాట్యుటరీ ఆడిట్‌, కాంకరెంట్‌ ఆడిట్‌, అంతర్గత ఆడిట్‌, ఆర్‌బిఐ ఆడిట్‌ ఉంటాయి. ఇన్ని రకాల ఆడిట్‌లను నీరవ్‌ తప్పించుకున్నాడు. అధికారులు అంటీ ముట్టనట్టు ఉన్నారు.

విజయ్‌ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా వివిధ బ్యాంకుల నుంచి 9 వేల కోట్ల రూపాయలను ఋణాలుగా పొందింది. 2012లో బ్యాంకులు నిరర్ధక ఆస్తులుగా గుర్తించినా సిబిఐకి ఫిర్యాదు చేయలేదు. 2016లో సిబిఐ తనంత తానుగా రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది.

2011 నుంచి జరుగుతున్న ఈ వ్యవహారంలో పిఎన్‌బి మాజీ డిజిఎం గోకుల్‌నాథ్‌ శెట్టి 150కి పైగా ఎల్‌ఒయులు జారీ చేశాడు. రిటైర్‌మెంట్‌కు దగ్గర పడుతున్న వేళ 2017లో కేవలం 63 రోజుల్లో 143 ఎల్‌ఓయూలు జారీచేశాడు. మొదటి 150 ఎల్‌ఒయులతో నీరవ్‌ 6500 కోట్లు పిండుకోగా, తర్వాతి 143 ఎల్‌ఒయుతో 3000 కోట్లకు పైగా బ్యాంకులను మోసం చేశాడు.

నీరవ్‌ విదేశాల్లో వజ్రాలు కొని, దానికి పదిరెట్లు విలువైన ఎల్‌ఒయులను పొంది; వాటిలో మిగిలిన 90 శాతం నల్లధనాన్ని, విదేశాలకు ఎగుమతి చేసిన అభరణాల విలువను 10 రెట్లుగా చూపించి, తిరిగి ఇక్కడికి రప్పించేవాడు. నీరవ్‌ విక్రయించే వజ్రాభరణాలు కూడా తక్కువ నాణ్యత కలవి అనే విషయం కూడా బయటపడింది. ఒక దుకాణంలో ఇది జప్తు చేసిన ఆభరణాల విలువ 10 కోట్లు ఉంటే, నీరవ్‌ కంపెనీలో మాత్రం వాటి విలువ మరో 10 రెట్లు ఎక్కువగా చూపించినట్లు బయటపడింది. ఇలా లెక్కలను తారుమారు చేసి ఎక్కువ మొత్తంలో ఆభరణాలను ఎగుమతి చేస్తున్నట్లు బ్యాంకులను నమ్మించి నీరవ్‌ పెద్ద మొత్తంలో ఋణాలు, ఎల్‌ఒయులు పొందాడు.

ప్రభుత్వ చర్యలతో బ్యాంకులను మోసగించిన మరో బడా పారిశ్రామిక వేత్త రోటోమాక్‌ అధినేత విక్రమ్‌ కొఠారి స్కాం కూడా బయట పడింది. కొఠారి బ్యాంకుల నుండి 3695 కోట్ల మేర ఋణాలను పొంది, వాటిని ఏమాత్రం చెల్లించలేదు.

ఆర్ధిక నేరగాళ్ల విషయంలో ప్రధాని మోది ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. దేశాన్ని, ప్రజల సొమ్మును దొచుకున్న వీరికి కఠిన శిక్షలు పడితే మరోమారు ఇలాంటి నేరాలను చేయడానికి ఎవరూ సాహసించరు. ఇప్పటికే నిరర్ధక ఆస్తులతో నిండా మునిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు తాజా స్కాంతో కోలుకోలేని స్థితికి చేరే ప్రమాదం ఉంది. ప్రభుత్వం దర్యాప్తును వేగవంతం చేసి విదేశాల్లో రక్షణ పొందుతున్న ఈ ఆర్ధిక నేరగాళ్లను వెంటనే భారత్‌కు రప్పించి, తగిన శిక్షను విధించాలి.

– ఆర్‌.సి.రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *