దేశాన్ని అగ్నిగుండం చేయబోతున్నారా !

దేశాన్ని అగ్నిగుండం చేయబోతున్నారా !

– రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్‌ వ్యూహరచన !

– అడుగడుగునా వివాదాల సృష్టికి రూపకల్పన !

– ఓటర్లపై కేంబ్రిడ్జి ఎనలిటికా తరహా యోజన !

బ్రాడ్వేలో కాంచనమాలా..

రాకీలో నార్మాషేరర్‌..

ఈ ఇద్దరు హీరోయిన్లలో ఎవరి సినిమా ఎంచుకోవాలి ? అనేది ఒక కాలేజి విద్యార్థికి ఒక గొప్ప సమస్యగా ఉందని ఎప్పుడో 80 ఏళ్ళ క్రితం రాసిన కవితలో శ్రీశ్రీ విలాసవంతుల జీవనశైలిని వివరిస్తారు. అలాగే అటు చూస్తే బాదం హల్వా, ఇటు చూస్తే మైసూర్‌ పాకూ – ఈ రెండింటిలో దేనిని తినాలి ? అనేది కూడా ఒక సమస్యేనట అలాంటివారికి అప్పట్లో.

70 ఏళ్ళ క్రిందట మన దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పరుచుకొనే ఎన్నికలు వచ్చాయి. అప్పట్లో గుర్తుల ఆధారంగా పార్టీల గొప్పదనాన్ని వివరించేవారట. ఏ గుర్తు గొప్పదని తోస్తుందో, దానికి ఓటు వేయండి అని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ పోటీలుపడేవారన్న మాట.

ఒక ఊళ్ళో పంచాయితీ ఎన్నికలలో అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తున్నారట. ఒక అభ్యర్థి కొంచెం ఆలస్యంగా వెళ్ళాడు. అప్పటికే తన ప్రత్యర్థికి సింహం గుర్తు కేటాయించినట్లు తెలిసింది. ‘అయితే మరి నాకు బందూక్‌ ఇవ్వండి. ఆ సింహాన్ని కాల్చి చంపేస్తాను’ అంటూ తుపాకీ గుర్తు తీసుకొన్నాడట. పాతవారిని కదిలిస్తే ఇలాంటి ముచ్చట్లు చాలా చెపుతారు. కాంగ్రెసుపార్టీ గుర్తుగా కాడి-జోడెడ్లు ఉన్న రోజుల్లో ‘వద్దుర బాబోయ్‌ ఎద్దుల రాజ్యం’ అన్నది చాలా బాగా మార్మోగిన నినాదం.

ఆ తర్వాత నోట్లు వెదజల్లే ఎన్నికలు, రకరకాల కానుకలు అందజేసే ఎన్నికలూ చాలామంది చూసి ఉంటారు. కాగా రాబోయే 2019లో వీటన్నింటికీ పూర్తిగా భిన్నమైన తీరులో ఎన్నికలు జరిగేటట్లుగా ఉన్నాయి. అటువంటి మార్పు తీసుకొస్తే తప్ప, మీ అదృష్టం మలుపు తిరిగి, విజయలక్ష్మి మిమ్ములను వరించే అవకాశం లేదని అంతర్జాతీయంగా ఎన్నికల విషయంలో వ్యూహరచన చేసి నడిపించే ఏజెన్సీలు 133 సంవత్సరాల చరిత్ర ఉన్న భారత జాతీయ కాంగ్రెసుకు సలహా యిస్తున్నవి.

‘ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ – డేటా డ్రివెన్‌ కేంపెయిన్‌ – ది పాత్‌ టు ది 2019 లోకసభ’ అన్న శీర్షిక గల ఒక డాక్యుమెంటు ఒకటి ఇటీవల బహిర్గతమైంది. దీనిని ‘కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా’ అనే సంస్థ రూపొందించింది. వినూత్న పద్ధతులలో ప్రచారం చేయించి, అమెరికా అధ్యక్షునిగా ట్రంప్‌ను గెలిపించింది తామేనని ఆ సంస్థ చెప్పుకొంటున్నది. ఈ ‘కేంబ్రిడ్జి ఎనలిటికా’ వారే తన కొంప ముంచారని అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పరాజయం పాలైన హిల్లరీ క్లింటన్‌ వాపోతున్నది.

ఇంతకీ వారు తీసుకురావాలని సూచిస్తున్న మార్పులు ఎలాంటివి ? దేశము, సమస్యలు, ప్రణాళికలు మొదలైనవాటిని ఆధారం చేసుకొని పాతకాలపు పద్ధతులలో ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ప్రయోజనం ఉండదని చెప్పటమే కాక, డేటా డ్రివెన్‌ కేంపెయిన్‌ చేయాలని, పర్సనలైజ్‌డ్‌ మెసేజింగ్‌ ఉండాలని, తద్వారా ఓటర్లలో బిహేవియర్‌ చేంజ్‌ తీసుకురావటం ద్వారా విజయాన్ని కైవసం చేసుకోవాలని సూచిస్తున్నారు. కాంగ్రెసు అందుకు అంగీకారం తెలిపి ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తున్నది.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు భిన్నమైన వర్గాలుగా చీలిపోయే విధంగా, ఆవేశ పూరితులను చేసే అంశాలను ముందుకు తీసికొస్

తారు. ప్రజానీకంలో కొందరైనా ఆవేశంతో రగిలిపోయే పరిస్థితిని సృష్టిస్తారు. దీనికై వీధులలోకి వచ్చేవారు కొద్దిమంది ఉంటే ఉండవచ్చు. కాగా వీధులలోకి గాని, తెరముందుకు గాని రాకుండా చాటుగా ఉండి అంటించే బృందాలు కొన్ని ఏర్పడతాయి. ఓటర్లలోని ప్రతి వ్యక్తిలోని వ్యక్తిత్వంలో, మనస్తత్వంలో, ఇష్టాయిష్టాలలో ప్రత్యేకతను గుర్తించి, దానిని రెచ్చగొట్టే రీతిలో వాట్సప్‌ ద్వారానో, ఫేస్‌బుక్‌ ద్వారానో మెసేజ్‌లు పంపిస్తారు. అంటే ఒటర్లను అందరినీ ఉద్దేశించి ఒకే విషయాన్ని రూఢిగా చెప్పటం ఉండదు. ఎవరికి ఏ పద్ధతిలో చెప్తే రెచ్చిపోతారో, వారికి ఆ పద్ధతిలోనే చెప్పి, ఏ సమస్య పట్ల వారు స్పందిస్తారో, ఆ సమస్యలనే భూతద్దంలో ప్రదర్శించి, ఒక పార్టీ పట్ల అభిమానంతోనో, విశ్వాసంతోనో ఓటువేయడం కాకుండా; ఒక వ్యక్తినో, పార్టీనో ఓడగొట్టటమే ప్రధానంగా ఒక విధమైన ప్రతీకార భావనతో ఓటు వేయించే ప్రయత్నం జరుగుతుంది.

తాము అధికారంలోకి వస్తే ఏం చేయ బోతున్నామో చెప్పవలసిన అవసరం ఉండదు. ఎవరు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కానున్నారనేది కూడా చెప్పవలసిన అవసరం ఉండదు. అంతా వ్యతిరేక భావనే. 2019లో కాంగ్రెసు లోక్‌సభ ఎన్నికలలో తన పరిస్థితిని మెరుగుపరుచుకొని అధికారంలోకి

రావాలంటే, ఈ లోగా జరిగే కర్ణాటక, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ల శాసనసభ ఎన్నికలలో కాంగ్రెసు గెలవాలని, అందుకోసం ఎక్కడ ఏది లాభదాయక మౌతుందో, అక్కడ అలాంటి సమస్యలను లేవనెత్తాలని కాంగ్రెసు తరఫున వ్యూహం రూపొందిస్తున్నారు.

కర్ణాటక ఎన్నికలలో కావేరీ జలాల పంపిణీ, కర్ణాటక ప్రాంతంలో హిందీని బలవంతంగా రుద్దటం (మెట్రో స్టేషన్లలో కన్నడం, ఆంగ్లంతోపాటు హిందీలో కూడా సూచనలు ఉండటం పెద్ద తప్పుగా ఎత్తి చూపి, వాటిని చెరిపించేశారు), మైనారిటీ వర్గాలపై, మైనారిటీల పట్ల సానుభూతి కల్గిన మేధావులపై దాడులు, హత్యలు, అల్పసంఖ్యాక వర్గాల సమస్యలు వంటివాటిని ప్రధానాంశాలు చేయగా, మధ్యప్రదేశ్‌ ఎన్నికల సమయంలో రైతుల ఆత్మహత్యలు, ఇతర తెలుగు సమస్యలు ప్రధానాంశాలు అవుతాయి.

కర్ణాటకలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య చాలా ఎక్కువ. కాని ఆ ఆంశాన్ని స్పృశించరు. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెసు అధికారంలో ఉంది గదా! బిజెపి అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో దానిని పదునైన ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు.

ఈ విధంగా ఎంపిక చేసిన సమస్యలపై పత్రికలలోనూ, టి.వి.ఛానళ్ళలోనూ ‘మేధావుల’ మధ్య చర్చలు నిర్వహింపజేసి ¬రెత్తించేస్తారు. ఎన్నికల రోజున ఇంట్లో కూర్చోకుండా తప్పనిసరిగా బయటకు వచ్చి ఓటు వేసేవరకు ఓటర్లు స్థిమితంగా ఉండలేని స్థితిని కల్పిస్తారు. ఓటర్ల వ్యక్తిగత సెల్‌ఫోన్ల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా, ఆ ఓటరు ఎవరికి అనుకూలంగా ఉన్నాడో, లేక ఎవరికి ప్రతికూలంగా ఉన్నాడో పసిగట్టగల్గుతారు. అవసరమనుకుంటే, ఆ వ్యక్తి బయటకు వచ్చి ఓటు వేయకుండా ఉండే స్థితినీ కల్పించగలరు.

ఇటీవల మన దేశంలో ప్రముఖంగా చర్చకు వస్తున్న అనేక అంశాలు – అసమ్మతిని అణచివేయ చూస్తున్న అసహన ధోరణులు, మోరల్‌ పోలిసింగ్‌, పద్మావతీ సినిమా విడుదల గురించిన వివాదం, కఠువాలో బాలిక హత్య ఉదంతం, న్యాయమూర్తుల నియామకం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించే ప్రయత్నం- ఇటువంటి అనేక విషయాల వెనుక బిజెపిని ఇరుకున పడవేయాలన్న దృష్టి ఉంది. ఇప్పటివరకు బిజెపి వాటికి ఒక మేరకు గట్టిగా సమాధానం చెపుతున్నట్లుగా కనబడుతున్నా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో జరిగిన ఉప ఎన్నికలలో భాజపా అభ్యర్థులు పరాజయం పాలై, కాంగ్రెసు అభ్యర్థులు కొందరు గెలవటం గమనార్హం.

ఇది ఇప్పటిదే కాదు

ఈ రకమైన ప్రయత్నం ‘కేంబ్రిడ్జి ఎనలిటికా’ అనే వ్యాపార సంస్థ రంగంలోకి రావటంతోనే మొదలైందని అనుకోరాదు. 2004 ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకత్వాన వామపక్ష పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలూ ఈ పద్ధతిని అమలుచేశాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అంతవరకూ ఏ కాంగ్రెసు పార్టీని గట్టిగా తిట్టి పోశారో, ఆ కాంగ్రెసు అధ్యక్షురాలిని పల్లకీలో కూర్చోబెట్టి ప్రధానమంత్రిగా చేయడానికి ఏకమయ్యాయి. ఇప్పుడు కూడా సిపి(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి- ఇదేవిధమైన వ్యూహరచనలో ఉన్నారు. నరేంద్రమోదీని గద్దె దించితే కాబోయే ప్రధానమంత్రి ఎవరో ఇప్పుడే చెప్పవలసిన అవసరం లేదని, అసలు నిర్ణయించ వలసిన అవసరమూ లేదని, ఎక్కడికక్కడ భాజపా వ్యతిరేక శక్తులు ఏవో నాటకాలాడి ప్రజలను మెప్పించి కొన్నిసీట్లు గెలుచుకోగల్గుతారో, అలా గెలుచుకొని వచ్చేవారితో ఎన్నికల అనంతరం ఒక మహా ఐక్య సంఘటనను నిర్మించి, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల కబంధ హస్తాలలో నలిగిపోతున్న దేశాన్ని రక్షించగల మని అడిగినవారికి ఉపదేశిస్తున్నారు.

‘ఎద్దు పుండు కాకికి ముద్దు’ అని సామెత. తనకెంత ప్రయోజనకరమైనా, కాకపోయినా, బాధపడేది ఎద్దేగాని, తాను కాదు గదా ! అటువంటి మనస్తత్వంతో దేశాన్ని అగ్నిగుండంగా మార్చేసే ప్రయత్నాలు వ్యతిరేకాత్మక దృక్పథమూ, లెక్కకు రాని నల్లధనమూ పుష్కలంగా ఉన్న పార్టీల ముందు ప్రథమ కర్తవ్యంగా నిలిచి ఉంటున్నవి.

ఈ విధమైన ప్రయత్నాల నుండి దేశాన్ని రక్షించుకోవటం గురించి సగటు పౌరుల నుండి మొదలుకొని అందరూ ఆలోచించవలసి ఉంది. ‘సతత జాగరణమె స్వాతంత్య్ర మూలమ్ము’, ‘బానిసకు బాధలెక్కువ, స్వతంత్రునికి బాధ్యతలెక్కువ’ అన్న రెండు సూక్తుల అర్థాన్ని గ్రహించుకొని వ్యవహరించ వలసి ఉంది.

– వైనతేయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *