తొందరపడితే ఉత్తర కొరియా మరో పాక్‌ కాగలదు

తొందరపడితే ఉత్తర కొరియా మరో పాక్‌ కాగలదు

2018, జూన్‌ 12న సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌ల మధ్య జరగవలసిన సమావేశం జరుగబోదని ట్రంప్‌ స్వయంగా ప్రకటించారు. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను రద్దు చేసుకోవడం, ద్వైపాక్షిక ఒప్పందాల నుండి ఏకపక్షంగా విరమించుకోవడం ట్రంప్‌కు అలవాటే. మే 24న ట్రంప్‌ సామాజిక మాధ్యమాల్లో ‘ట్వీట్‌’ చేస్తూ, ‘సింగపూర్‌లో జూన్‌ 12న జరుగబోయే సమావేశాన్ని రద్దు చేస్తున్నాను, దీనివల్ల ఉత్తర కొరియాకే కాదు ప్రపంచానికి కూడా అసఫలత చేకూరనుంది’ అన్నారు. ట్రంప్‌ వ్యక్తిత్వం తెలిసిన వారికిది ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే చేసుకున్న ఒప్పందాల నుండి తప్పుకోవడం ట్రంప్‌కు అలవాటే. ఉత్తర కొరియాతో సమావేశం రద్దు కావటం ప్రపంచ దేశాలకు ఆశ్చర్యం కలిగించలేదు.

దీనికి ముందే అమెరికా ఇరాన్‌తో జరిగిన ఒప్పందం నుండి ఏకపక్షంగా వైదొలిగింది. ఈ సంఘటన తర్వాతే సింగపూర్‌లో ఉత్తరకొరియాతో సమావేశం జరగవలసి ఉంది. కాని ఈ సమావేశాన్ని కూడా ట్రంప్‌ రద్దు చేసుకున్నారు. ఇరాన్‌ ఒప్పందం నుండి వైదొలగడమే మూర్ఖపు చర్య. లిబియా, ఇరాక్‌లతో అమెరికా ప్రతికూల ప్రవర్తన చూసిన ‘కిమ్‌’ ట్రంప్‌తో సమావేశవ్వడానికి ఒప్పుకున్నారు. సమావేశం రద్దయినట్టు ప్రకటించిన 24 గంటలలోనే కొరియా ద్వీపకల్పంలో శాంతిని నెలకొల్పడానికి తన నిర్ణయాన్ని మార్చుకొని సమావేశం ముందుగా నిర్ణయించిన రోజునైనా లేదా మరో తేదీనైనా జరుగవచ్చని ‘ట్రంప్‌’ ప్రకటించారు. ఈ రకంగా అస్థిరత్వంగా నిర్ణయాలు తీసుకోవడం, సమావేశాలు రద్దు చేసుకోవడం లాంటి పనులు అమెరికా మాజీ అధ్యక్షులు చేయలేదు.

ట్రంప్‌, కిమ్‌ ఇద్దరూ చంచల స్వభావులే. ఏ రోజు ఏ ప్రకటన చేస్తారో రాజకీయ పరిశీలకులు ఎవరూ ఊహించలేరు. వ్యూహ నిపుణులు వీరిద్దరిని ‘ఒకరికి సరిపడ మరొకరు’ అని పోలుస్తూ ఉంటారు. సింగపూర్‌ సమావేశం రద్దయినట్టు ట్రంప్‌ ప్రకటించినా ఉత్తరకొరియా సంయమనం కోల్పో కుండా తమదేశం అణ్వస్త్రాల నిర్వీర్యానికి కట్టుబడి ఉందని, కొరియా ద్వీపకల్పంలో శాంతి సౌభాగ్యాల ఉద్ధరణే తమ లక్ష్యం అని ప్రకటించారు. ఇరు దేశాల మధ్య జరుగవలసిన సమావేశం రద్దుకావటం దురదృష్టకరమని అన్నారు. ట్రంప్‌ కిమ్‌కు రాసిన ఉత్తరంలో ‘ఈ మధ్య మీరు చేసిన ప్రకటనలు, ఇచ్చిన ఇంటర్వ్యూలు చూసిన తర్వాత సింగపూర్‌ సమావేశం రద్దు చేసుకోవడమే సరైన మార్గమని నేను భావిస్తున్నాను’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

ఉత్తర కొరియా విదేశీ వ్యవహారాల ఉపాధ్యక్షుడు కిమ్‌కౌగ్వాన్‌ ట్రంప్‌ ఉత్తరానికి జవాబు వ్రాస్తూ, ‘ఉత్తర కొరియా, అమెరికాల మధ్య జరుగవలసిన సమావేశ నిర్ణయం ట్రంప్‌ ధైర్యంతో తీసుకున్న నిర్ణయం. ఇంతకుముందటి అమెరికా అధ్యక్షులెవరూ కూడా ఇంతటి గొప్ప నిర్ణయాన్ని తీసుకోలేక పోయారు. ఈ విషయంలో మేము అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. కాని ఊహించని విధంగా సమావేశం రద్దు కావడం బాధాకరం. ట్రంప్‌ రద్దు చేసుకున్నా మేం మా ప్రస్తావనను వెనక్కి తీసుకోం. మేము ఇప్పటికీ సమావేశం జరపడానికి సుముఖంగా ఉన్నాం’ అని ప్రకటించారు. మేము మా భూభాగంలో శాంతి సౌభాగ్యాలు విలసిల్లాలని కోరుకుంటున్నాం. అని ఉత్తర కొరియా ప్రకటించింది. ఇక ఇప్పుడు బంతి అమెరికా కోర్టులో ఉంది. ఇంత చేసినా అమెరికాకు ఉత్తర కొరియాపై నమ్మకం కుదరటం లేదు.

అమెరికా, ఉత్తర కొరియాలు తమ మధ్య ఉన్న విభేదాలను ఇలా బయట పెట్టగానే అటు దక్షిణ కొరియా తీవ్ర నిరాశకు లోనైంది. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య సమావేశం జరగడానికి దక్షిణ కొరియా తీవ్రమైన పరిశ్రమ చేసింది. సమావేశం రద్దయిందని ట్రంప్‌ ప్రకటించగానే దక్షిణ కొరియా తీవ్ర నిరాశకు లోనైంది. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య సమావేశం రద్దు చేస్తున్నట్లుగా ముందు దక్షిణ కొరియా అధ్యక్షుడు ‘మూన్‌’కు తెలియనే తెలియదు. ఏది ఏమైనా జూన్‌ 12న జరగవలసిన సమావేశం రద్దు కావడం దురదృష్టకరమని మూన్‌ పేర్కొన్నాడు.

ఇరు దేశాల మధ్య సమావేశం జరిగినట్లయితే, కనీసం ఏదో ఒక సమస్య పరిష్కారానికి నోచుకునేది. తరచుగా కలుసుకోవడం వలన ఇరు దేశాల మధ్య నెలకొని ఉన్న వైరభావం సమసిపోయి స్నేహ బంధాలు మెరుగయ్యే అవకాశాలుంటాయి. అసలు సమావేశాలే జరుగకపోతే ఇరుదేశాల మధ్య దూరం తగ్గే అవకాశముండదని దక్షిణ కొరియా పేర్కొంది. జపాన్‌, దక్షిణ కొరియాల ప్రోద్బలం వలన ఉత్తర కొరియాతో సంభాషణలకు సిద్ధమేనని, ఆ సమావేశం ముందు అనుకున్న తేదీన కాని, లేదా ఇరుదేశాలకు అనుకూలమైన మరో రోజు జరుగవచ్చని ట్రంప్‌ అన్నారు.

ఇరు దేశాల మధ్య సమావేశం రద్దయినట్లు అమెరికా ప్రకటించిన వెంటనే కిమ్‌ దక్షిణ కొరియా అధ్యక్షుడు ‘మూన్‌’తో కలిసి ఉత్తర కొరియాలోని పన్‌ముంజోమ్‌ గ్రామంలో రెండు గంటలు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. పన్‌ముంజోమ్‌లో తీసు కున్న నిర్ణయాలు అమలు చేయాలని, అంతేగా ఉత్తరకొరియా-అమెరికాల మధ్య సమావేశం జరిగేలా కృషి చేయాలని నిర్ణయించాయి. ‘కిమ్‌’ దక్షిణ కొరియా అధ్యక్షుడు ‘మూన్‌’ను ఒప్పించడమే కాకుండా ఇక అమెరికా కూడా తన ఆలోచనలను మార్చుకునేలా చేశారు.

సమావేశం సజావుగా జరగడానికి, ఇరుదేశాల మధ్య విశ్వాసం నెలకొల్పడానికి ఉత్తర కొరియా నిర్బంధించిన ముగ్గురు అమెరికన్లను విడుదల చేసి అమెరికాకు పంపించింది. దానికి కొనసాగింపుగా తమ దేశం అణ్వస్త్రాలను నాశనం చేయాలన్న నిర్ణయం తీసుకుందని, ఈ విషయాన్ని పరిశీలించ డానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విలేకరులు రావాలని అభ్యర్థించారు. అలాగే మాకున్న ఒకే ఒక అణుక్షేత్రం పున్‌గ్విరిని నేలమట్టం చేయనున్నామని ప్రక టించింది. కాని రాజకీయ వ్యూహకర్తలు ‘కిమ్‌’ చెప్పే మాటలు నమ్మదగినవిగా లేవని వ్యాఖ్యానం చేశారు.

ట్రంప్‌ను గట్టిగా సమర్థించేవారు ట్రంప్‌కు నోబెల్‌ శాంతి పురస్కారం ఇవ్వాలని సిఫారసు చేశారు. అంతేగాకుండా ట్రంప్‌ పరిపాలనా విభాగం ఇద్దరు అధ్యక్షుల జ్ఞాపకార్థం ఒక నాణెంను విడుదల చేసింది. ఈ నాణెంపై ట్రంప్‌ మరియు ‘కిమ్‌’లు, వారి దేశాల పతాకాలున్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఇంత జరుగుతున్నా దక్షిణ కొరియా, అమెరికాల సంయుక్త వాయుసేనల విన్యాసం ఆగిపోలేదు. మే 16న విన్యాసాలు జరిగాయి. ఇది తెలుసుకున్న ‘కిమ్‌’ దక్షిణ కొరియాతో జరగవలసిన చర్చలను రద్దు చేసుకున్నారు.

లిబియాలో అణ్వస్త్రాల నిర్వీర్యం ఎలా జరిగిందో అలాగే ఉత్తర కొరియాలోనూ జరగాలని అమెరికా భావిస్తోంది. లిబియా తనకు తానుగా అణ్వస్త్రాలను తయారు చేసుకోలేదు. కాని ఉత్తర కొరియా అలా కాదు. ఉత్తరకొరియాలో బోలెడన్ని అణ్వాయుధాలు ఉన్నాయి. ఇవన్నీ ఆ దేశమే తయారు చేసుకుంది. 2003 నుండి ఎన్నో క్షిపణులను ప్రయోగించింది. ఎన్నో అణు పరీక్షలను నిర్వహించింది. ధర్మో న్యూక్లియర్‌ బాంబును తయారు చేసింది. దానిని విజయవంతంగా పరీక్షించింది. ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని కూడా రూపొందించింది. ఈ క్షిపణి అమెరికా ముఖ్య భూభాగం వరకు చేరుకుంటుంది. పలు రకాల అణ్వస్త్రాలను తయారు చేసి ఉంచుకున్న ‘కిమ్‌’ ఇప్పుడు అణ్వస్త్రాలపై ‘విరామాన్ని’ ప్రకటించారు. ఉత్తర కొరియాపై ప్రపంచ దేశాలు కొన్ని ఆంక్షలు విధించాయి. ‘కిమ్‌’ తన ప్రయత్నం వలన, దౌత్యనీతి వలన కొన్ని ఆంక్షలను తొలగింపచేసుకోగలిగారు.

అణ్వస్త్రాల నిర్వీర్యం గురించి తన దృక్పథాన్ని పునరుద్ఘాటిస్తూ చైనా అధ్యక్షుడు ‘జీ’ని రెండు మార్లు లుసుకున్నారు. కాని ప్రతి సమావేశంలో ఇరు కొరియాలలో నిర్వీర్యం జరగాలని కోరారు. దక్షిణ కొరియాలో ఉన్న అమెరికా ఆస్తులను, అమెరికా సైన్యాన్ని అమెరికా ఉపసంహరించుకోవాలని అన్నారు.

లిబియా అధ్యక్షుడు గఢాఫీ జీవితం అమానుషంగా ముగిసింది. తనకు, తన రక్షణ గురించి అమెరికా హామీ ఇవ్వాలని ‘కిమ్‌’ డిమాండ్‌ చేస్తున్నారు. తన రక్షణకు, ఉత్తర కొరియా దేశ అభివృద్ధికి అమెరికా హామీ ఇస్తేనే తమదేశంలో ఉన్న అణ్వాయుధాలను నాశనం చేస్తానని ‘కిమ్‌’ అన్నారు.

ఉత్తర కొరియాపై ‘కిమ్‌’ తన అధికారాన్ని కొనసాగాలని కోరుకుంటున్నారు. ‘లిబియా’ తరహా చర్చలు అనగానే ‘కిమ్‌’కు అనుమానాలు పెరిగాయి. ఉత్తర కొరియా గూర్చి ట్రంప్‌ మాట్లాడుతూ ‘కిమ్‌’కు బలమైన రక్షణ కల్పిస్తాం. ఇది అనివార్యం. ఒకవేళ కిమ్‌కి మాకు మధ్య ఒప్పందం కుదరినట్లు ‘లిబియా తరహా’లో చర్చలు జరుగవచ్చు అని అన్నారు.

ఉత్తర కొరియా ఉపాధ్యక్షుడు కింక్వే-గ్వాన్‌ మాట్లాడుతూ ‘మా దేశానికి ఇరాక్‌, లిబియాలతో పోలిక లేనేలేదు. మా వద్ద బోలెడన్ని అణ్వాయు ధాలు ఉన్నాయి. ఇరాక్‌, లిబియాలలో లేవు. కాబట్టి వాటితో మా దేశానికి పోలిక లేనేలేదన్నారు.ఒకవేళ అమెరికా మా దేశాన్ని బలవంతంగా ఒక మూలకు నెట్టాలని చూస్తే మేం సహించబోం. అలాంటి స్థితి వస్తుందంటే మేము అమెరికాతో జరుగబోయే సమావేశం గురించి పునరాలోచించుకోవలసి వస్తుందని తేల్చి చెప్పారు.

అమెరికా సుదూర లక్ష్యాలను చెధించే క్షిపణులను ధ్వంసం చేయగలదు. దీని ఆధారంగానే జపాన్‌, దక్షిణకొరియా అమెరికాకు భాగస్వామ్య దేశాలయ్యాయి. కాని ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు భాగస్వామ్య దేశాలకు అమెరికాపై విశ్వాసాన్ని సడలింపజేస్తున్నాయి. ఆయా దేశాలు చైనా మరియు రష్యాల వైపు చూసేలా చేస్తున్నాయి. ట్రంప్‌ చంచల స్వభావం వలన ఆయన దృఢమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఏ దేశంతో చర్చలు జరిగినా సరైన దిశలో చర్చలు జరగడం లేదు. అమెరికా, ఉత్తర కొరియా మధ్య సమావేశం జరగాలని జపాన్‌ కూడా కోరుకుంటోంది. ఈ సమావేశంలో దక్షిణ కొరియా కూడా పాల్గొని దీనిని త్రైపాక్షిక సమావేశంగా విజయవంతం చేయాలని భావిస్తోంది. ‘మూన్‌’ ప్రయత్నాలు ఫలిస్తే 1953 నుండి వస్తున్న విబేధాలు తొలిగి ఇరు కొరియాల మధ్య శాంతి సౌభాగ్యాలు విలసిల్లగలవని భావిస్తున్నారు. ‘మూన్‌’ ఇంతగా ప్రయత్నిస్తున్నా కొరియన్‌ శాంతి ఒప్పందంపై ట్రంప్‌ సంకతం చేయకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కొరియా ద్వీపకల్పంలో శాంతి సౌభాగ్యాలు నెలకొనాలంటే ఇరు కొరియా దేశాలతో పాటు ఇరుగు పొరుగు దేశాలు కూడా సహకరించవలసి ఉంటుంది. శాంతి నెలకొనే దిశలో అమెరికా తన సైన్యాన్ని దక్షిణ కొరియా నుండి ఉప సంహరించు కొనవలసి ఉంటుంది. జపాన్‌ కూడా దీనిని పాటించ వలసి వస్తుంది. దీనివలన ఆసియా పసిఫిక్‌లో అమెరికా ప్రాబల్యం తగ్గుతుంది. ఇది చైనా ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి సహకరిస్తుంది. ట్రంప్‌ విధానాలు ఉత్తర కొరియాతో సంబంధాలు పునరాలోచించుకోవలసిన సమయమిది.

ప్రస్తుతానికి అమెరికా డెలిగేషన్‌ ప్యోన్‌గ్యాంగ్‌ చేరుకుని సమావేశపు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు అమెరికా భారత్‌కు ఎలాంటి మినహా యింపులు ఇస్తుందో తమకు అవి ఇవ్వాలని ఉత్తర కొరియా అంటోంది. ట్రంప్‌ సరిగా లేని దౌత్యవి ధానాల వల్ల ఉత్తర కొరియా మరో పాకిస్తాన్‌గా మారే అవకాశముంది.

ట్రంప్‌ ఉత్తర కొరియా లోని అణ్వాయుధాలను నాశనం చేయాలని అనుకుంటున్నారు. ఈ విషయంలో విశేషజ్ఞుల ప్రకారం ఈ చర్యలు ముగియడానికి కనీసం 10 సంవత్సరాల కాలం పడుతుందని అరచనా. కాబట్టి అనుచిత సోదాలు, ఆర్థిక ఆంక్షలు విధించకుండా దశల వారీగా పరస్పర రాయితీలు ఇస్తూ కార్యం సఫలం చేయాలి. కేవలం కాగితాల మీద భరోసా ఇస్తే సరిపోదు. గణనీయమైన కాలాంశంలో సహజీవనానికి, అన్యోన్యతకు ప్రాధాన్య మిచ్చినప్పుడే అణ్వస్త్ర రహిత స్థితి ఏర్పడడానికి దారితీయవచ్చు.

– తీగెల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *