తేనె తుట్టెను కదిపిన ట్రంప్‌

తేనె తుట్టెను కదిపిన ట్రంప్‌

జెరుసలెంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తించిన యుఎస్‌ను అరబ్‌ దేశాలు విమర్శించాయి. ‘మరల తేనెతుట్టెను కదిపిన ట్రంప్‌’ అంటూ చైనా అధికార గ్లోబల్‌ టైమ్స్‌ విమర్శించింది. ఇజ్రాయెల్‌ గాఢమిత్రుడు, చెక్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడు జెమెన్‌ ఇజ్రాయెల్‌ వ్యతిరేక వైఖరిని పిరికితనంగా పేర్కొన్నారు. జెరుసలెం విషయంలో భారతదేశం తన వైఖరిని స్పష్టం చేసింది.

జెరుసలెంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తిస్తూ అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా అసమ్మతిని పెంచింది. ఎన్నికల వాగ్దానాలను నిలుపుకోవడం పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించిన ట్రంప్‌, ‘ప్రతి ఇతర సార్వభౌమ దేశాల వలె ఇజ్రాయెల్‌ కూడా తన రాజధానిని తానే నిర్ణయించుకొనే హక్కు ఉన్న సార్వభౌమ దేశం. ఈ యదార్థాన్ని ఒప్పుకోవడం శాంతి స్థాపనకు అవసరమైన ముందడుగు. జెరుసలెం ఇజ్రాయెల్‌ రాజధాని. ఇది వాస్తవాన్ని గుర్తించడం కంటే ఎక్కువా కాదు. తక్కువా కాదు. ఇది సరైన పని. చేయవలసిన పని’ అన్నారు. అదే సమయంలో ‘ఇజ్రాయెల్‌, పాలస్తీనాల మధ్య శాంతి ఒప్పందానికి వీలు కల్పించడానికి అమెరికా కట్టుబడి ఉందని, ఏ పక్షం పట్లా అమెరికా పక్షపాతం చూపడం లేదని’ ట్రంప్‌ విస్పష్టమైన వివరణ ఇచ్చారు. జెరుసలెంపై ఇజ్రాయెల్‌ సార్వభౌమాధికార సరిహద్దులను అమెరికా నిర్వచించడం లేదని, సంబంధిత పక్షాలకు వివాదాస్పద సరిహద్దులను పరిష్కరించుకొనే స్వేచ్ఛ ఉందని ఆయన నొక్కి చెప్పారు. అంతేకాక, ప్రశాంతత, సంయమనాలకు పిలుపునిస్తూ, ‘విద్వేష ప్రేరేపకులపై సహనం విజయం సాధించాలని’ కోరారు. రెండు దేశాల సిద్ధాంతానికి అమెరికా అనుకూలంగా ఉందని ట్రంప్‌ నొక్కి చెప్పి, అమెరికా నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ పాలస్తీనా వెళ్తారని ప్రకటించినప్పటికీ, జెరుసలెం గురించి ట్రంప్‌ చేసిన ప్రకటనకు ముస్లిం కౌన్సిల్‌ సభ్యుల నుంచి, ఐరోపా నాయకుల నుంచి సైతం తీవ్ర ఖండనలు వచ్చాయి. ట్రంప్‌ ప్రకటనకు కేవలం కొద్ది గంటల ముందు అమెరికా మిత్ర దేశం యుకె, జెరుసలెంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తించడంతో ఆయన ‘యుద్ధం ప్రకటించినట్లే’ అని హెచ్చరించింది.

జెరుసలెం గురించి వివాదాస్పద చర్చ కొనసాగుతున్నప్పటికీ, ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ (నెస్సెట్‌), సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి, అధ్యక్షుల అధికారిక నివాసాలతో జెరుసలెం ఇజ్రాయెల్‌ రాజధానిగా పనిచేస్తోంది. రాయబార కార్యాలయాన్ని జెరుసలెంకు మార్చాలని, రాజధానిగా జెరుసలెంను గుర్తించాలని ఫెడరల్‌ ప్రభుత్వాన్ని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌ 1995 లోనే జెరుసలెం ఎంబసీ చట్టం చేసినప్పటికీ, గత రెండు దశాబ్దాలుగా అమెరికా అధ్యక్షులు దీని అమలును నిలువరించారు.

అరబ్‌లు కూడా ఈ ప్రదేశాన్ని ఆరాధిస్తారు. ఇది ముస్లింల మూడవ అత్యంత పవిత్ర స్థలంగా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం వరకు జెరుసలెం ఒట్టోమన్‌ సామ్రాజ్యంలో ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత 1948లో ఇజ్రాయెల్‌కు స్వాతంత్య్రం వచ్చేవరకు జెరుసలెంపై బ్రిటిష్‌వారి పాలన సాగింది. ఇజ్రాయెల్‌ స్థాపన తరువాత జెరుసలెం పశ్చిమ ప్రాంతంపై ఇజ్రాయెల్‌ నియంత్రణ సాగింది. ఇజ్రాయెల్‌ స్వాతంత్య్ర పోరాటం సమయంలో జెరుసలెం తూర్పు ప్రాంతాన్ని జోర్డాన్‌ ఆక్రమించింది.

తూర్పు జెరుసలెంలో నున్న మౌంట్‌ ఆలయానికి మూడు నిర్మాణాలున్నాయి. అవి అల్‌ అక్సామసీదు, రాక్‌ గోపురం, గొలుసు గోపురం, మరియు నాలుగు మినార్లు. ప్రస్తుతం మౌంట్‌ ఆలయం ముస్లిం వక్ఫ్‌బోర్డ్‌ నియంత్రణలో ఉండగా, దాని భద్రత ఇజ్రాయెల్‌ చూస్తోంది. మౌంట్‌ ఆలయానికి ఉన్న పదకొండు ద్వారాలలో పది ముస్లింలకు, ఒకటి ముస్లిమేతరులకు ప్రత్యేకించారు. బైబిల్‌ ప్రకారం యూదు దేవాలయాలు మౌంట్‌ ఆలయంపై ఉన్నాయి. నిజానికి, సాలొమన్‌ నిర్మించిన మొదటి ఆలయం మరియు పునర్నిర్మించిన రెండవ యూదు ఆలయం ఒకేచోట నిర్మితమయ్యాయి. మూడవ ఆలయం కూడా అదే స్థలంలో నిర్మాణమవు తుందని యూదులు గట్టిగా నమ్ముతున్నారు.

క్రైస్తవ పాలకులు జెరుసలెంను పాలించిన కాలంలో, కొండ గోపురం వద్ద పవిత్ర సెఫుల్‌కేర్‌ చర్చి నిర్మాణమైంది. చర్చిని ధ్వంసం చేసిన ముస్లింలు దానిపై వెండి గోపురంతో అల్‌-అక్సా మసీదు నిర్మించారు. ప్రపంచ ముగింపు ప్రారంభం అయ్యే నగరాలలో జెరుసలెం ఒకటని ఖురాన్‌ ప్రవ చించింది. మౌంట్‌ ఆలయానికి పశ్చిమాన ఉన్న రెండవ యూదు దేవాలయ శిథిల గోడను ‘పశ్చిమ గోడ లేదా రోధించే గోడ’ గా పిలుస్తారు. ఇది యూదుల అత్యంత పవిత్ర ప్రదేశం. ఇజ్రాయెల్‌కు స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి ఇజ్రాయెలీయులు, పాలస్తీనియున్‌ల మధ్య పోరాటాలకు జెరుసలెం కేంద్రంగా మారింది. 1980లో జెరుసలెంను ఇజ్రాయెల్‌ రాజధానిగా ప్రకటించింది. కాని, అంతర్జాతీయ సమాజం ఈ చర్యను గుర్తించలేదు. లికుడ్‌పార్టీ అధినేత ఏరియల్‌ షెరాన్‌ మౌంట్‌ ఆలయ సందర్శనకు ప్రతిస్పందనగా 2000 సంవత్సరంలో రెండవ పాలస్తీనా తిరుగుబాటు జరిగింది. 2017 మే నెలలో జెరుసలెం రాజధానిగా పాలస్తీనా స్థాపనను హమాస్‌ ప్రతిపాదించింది. ఇజ్రాయెల్‌ దేశాన్ని గుర్తించడానికి హమాస్‌ నిరాకరించినందున ఈ ఆలోచనను ఇజ్రాయెల్‌ తిరస్కరించింది. ఇటీవల జూలైలో, మౌంట్‌ ఆలయాన్ని రక్షిస్తున్న ఇద్దరు ఇజ్రాయెలి పోలీసులను అరబ్బులు చంపడం మసీదు వద్ద ప్రార్థనలు రద్దుకు దారితీసింది. మౌంట్‌ ఆలయానికి ఉన్న చారిత్రాత్మక, మతపరమైన, సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా శాంతి ఒప్పందం కుదరడంలో జెరుసలెం ప్రధాన వివాదాస్పద అంశంగా ఉంటోంది. ఈ విధంగా, ఇజ్రాయెలీయు లకు అనుకూలంగా ట్రంప్‌ చేసిన ప్రకటన అరబ్‌ల ఆగ్రహానికి కారణం అయింది. ట్రంప్‌ గుర్తింపు జెరుసలెంపై ఇజ్రాయ్‌ల్‌ వాదనకు బలం చేకూర్చింది.

1967కు ముందు పశ్చిమ గోడ వద్ద ఆరాధనలకు సైతం యూదులకు ప్రవేశం ఉండేది కాదు. 1948 నుండి 1967 మధ్యకాలంలో యూదుల ఆరాధనా స్మారకాలను నాశనం చేసిన జోర్డాన్‌ ఆక్రమణ దారులను ఐరాస ఖండించలేదు, జోక్యమూ చేసుకోలేదు. ఆ తరువాత 1967లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్‌ తాను కోల్పోయిన భూభాగాలన్నింటిని తిరిగి గెలుచుకుంది. అయితే ఐరాస, అమెరికాలు జెరుసలెంపై ఇజ్రాయెల్‌ న్యాయబద్ధ హక్కులను గుర్తించడానికి నిరాకరించాయి. ప్రస్తుతం జెరుసలెం సరిహద్దుల తుది తీర్మానం గురించి అమెరికా ఏ విధమైన వైఖరి తీసుకోబోదని ట్రంప్‌ చేసిన తాజా విస్పష్ట ప్రకటన ఇజ్రాయెల్‌ స్థానాన్ని బలోపేతం చేసింది.

జెరుసలెంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తిస్తూ ఇజ్రాయెల్‌ పక్షం వహించినందుకు అరబ్‌ దేశాలు అమెరికాను విమర్శించాయి. అరబ్‌ దేశాలు ట్రంప్‌ పక్షపాత వైఖరిని విమర్శించినప్పటికి, అమెరికా ఇజ్రాయెల్‌కు బలమైన మిత్రరాజ్యంగా ఉండడం బహిరంగ రహస్యమే. అమెరికా వైఖరి పట్ల విసుగు చెందిన పాలస్తీనా చిరకాలంగా ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాదంలో అమెరికా పోషిస్తున్న మధ్యవర్తి పాత్రకు శాశ్వతంగా ముగింపు పలుకుతూ మైక్‌ పెన్స్‌తో చర్చలు రద్దుచేసింది.

ట్రంప్‌ ప్రకటన తరువాత ముస్లింల ఆధిక్య దేశాలు నిరసనలు నిర్వహించాయి. దీనిని ‘డై ఆఫ్‌ రేజ్‌’ గా అభివర్ణించిన పాలస్తీనియన్లు నిరసనలను ఉధృతం చేసి ఇజ్రాయెలి భద్రతాదళాలతో గొడవ పడ్డారు. మలేషియా, సోమాలియాలలో నిరసనలు ఎక్కువగా ప్రదర్శితమయ్యాయి. ఐరాస భద్రతా సమితి అత్యవసర సమావేశంలో ట్రంప్‌ చర్యను సభ్యులు ఖండించారు. 22 అరబ్‌ రాజ్యాల అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చిన అరబ్‌ లీగ్‌లో ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరుసలెంను గుర్తిస్తూ అమెరికా తీసుకొన్న నిర్ణయాన్ని నాయకులు ఖండిస్తూ, ‘ఇది ప్రమాద కరమైన, ఆమోదయోగ్యం కాని చర్య. ఇజ్రాయెల్‌- పాలస్తీనా వివాద పరిష్కారంపై స్పష్టమైన రాజకీయ దాడి’ అని ప్రకటించారు. అయితే ఆసక్తికరంగా, అంతర్గత ఉద్రిక్తతలున్న సౌది అరేబియా, బహ్రెయిన్‌లు కాక ఈజిప్టు, టర్కీలు అమెరికాకు వ్యతిరేక దాడిని ప్రారంభించడం గమనార్హం.

ముస్లిం నాయకుల్లో ఐకమత్యం లేక విడిపోయి ఉన్నందున, స్థానిక నిరసనలు, హింసాత్మక సంఘటనలు మినహా ట్రంప్‌ నిర్ణయం పట్ల ఆరబ్‌ దేశాల నుంచి వ్యాపార సంబంధాలను రద్దు చేసుకోవడం వంటి బలమైన దౌత్య ప్రతిస్పందనలు రాకపోవచ్చని నిపుణులు వాదిస్తున్నారు. కల్లోలం, అస్థిరత్వం, సాంప్రదాయ వాదాలకు మధ్య ప్రాచ్యం ఉత్పత్తి కేంద్రంగా ఉంటున్నది. జెరుసలెం అంశం హింసాత్మక ప్రతిస్పందనను వెల్లడించినప్పటికీ, విపత్తు స్థాయికి వెళ్ళే అవకాశం లేదు. తాజా ప్రకటన చేసిన ట్రంప్‌ ఇజ్రాయెల్‌, పాలస్తీనాలు శాంతి ప్రక్రియలో పాల్గొనడానికి కొత్త ప్రేరణ నిచ్చారు. కాని అమెరికా మధ్యవర్తి స్థానం కోల్పోవడం వలన శక్తి శూన్యత ఏర్పడింది.

మధ్య ప్రాచ్యంలో అధికారం నిలబెట్టుకోడానికి ఆసక్తి కనబరచడంలో చైనా వెనుకబడలేదు. ‘మరల తేనెతుట్టెను కదిపిన ట్రంప్‌’ అనే శీర్షికతో చైనా అధికార వార్తాపత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ విమర్శనాత్మక వ్యాసం ప్రచురించింది. ఆందోళన వ్యక్తం చేసిన చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్‌ షువాంగ్‌ ట్రంప్‌ నిర్ణయం ‘ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతుంది’ అన్నారు. ‘మధ్య ప్రాచ్యంలో శాంతి ప్రక్రియ పురోగతికి చైనా గట్టి మద్దతిస్తుంది. తమ చట్టబద్ధమైన జాతీయ హక్కులను పునరుద్ధరించుకొనే పాలస్తీనా ప్రజల ధర్మబద్ధ కోరికను మేము సమర్థిస్తాము. తూర్పు జెరుసలెం రాజధానిగా, 1967 నాటి సరిహద్దుల వెంబడి స్వతంత్ర, సంపూర్ణ సార్వభౌమ రాజ్యాన్ని నిర్మించడానికి మేము పాలస్తీనాను బలపరుస్తాము. సంబంధిత ఐరాస తీర్మానాలను అనుసరించి వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకొంటూ ప్రాంతీయ శాంతి, సుస్థిరతలను ప్రోత్సహించాలని మేము అందరికీ పిలుపునిస్తున్నాము’ అంటూ ఆయన కొనసాగించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాద పరిష్కారానికి చైనా ఐరాసలో ఒక నాలుగు సూత్రాల కార్యక్రమాన్ని సైతం ప్రతిపాదించింది. బీజింగ్‌కు అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌ సందర్శన సందర్భంగా, ‘పాలస్తీనాలో పెట్టుబడులు పెట్టడానికి, పారిశ్రామిక, సౌరశక్తి పార్కులు నిర్మించడానికి, చైనా కంపెనీలకు సహాయపడుతూ పాలస్తీనాకు ఆర్థిక సహాయం అందించగలమని చైనా ముందుకు వచ్చింది. మధ్య ప్రాచ్యంలో ఒక బెల్టు-ఒక రోడ్డు ప్రాజెక్టును విస్తరించే ఆలోచనలో ఉన్న చైనా, ఇజ్రాయెల్‌, పాలస్తీనాలతో కలసి పనిచేయడంపై ఆసక్తి కలిగి ఉంది. చైనా- పాలస్తీనా-ఇజ్రాయెల్‌ త్రైపాక్షిక చర్చలు ప్రారంభించాలని చైనా ప్రతిపాదిస్తోంది.

అమెరికాతోపాటు, ఇజ్రాయెల్‌ గాఢమిత్రుడు చెక్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడు జెమెన్‌ కూడ రాయబార కార్యాలయాలను టెల్‌ అవివ్‌ నుండి జెరుసలెంకు మార్చడాన్ని ప్రోత్సహిస్తూ యూరోపియన్‌ యూనియన్‌ యొక్క ఇజ్రాయెల్‌ వ్యతిరేక వైఖరి పిరికితనంగా పేర్కొన్నారు.

జెరుసలెం విషయంలో భారతదేశ వైఖరిని స్పష్టం చేస్తూ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి, ‘పాలస్తీనాపై భారత వైఖరి స్వతంత్రమైనది మరియు స్థిరమైనది. ఇది మా అభిప్రాయాలు, ప్రయోజనాలపై ఆధారపడి ఉంది. ఏ ఇతర దేశం దీనిపై ప్రభావం చూపజాలదు’ అన్నారు. జాగ్రత్త వహించిన భారతదేశం పాలస్తీనాపై తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.

– తీగెల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *