ట్రంప్‌ నిర్ణయ ఫలితం ఎలా ఉండబోతోంది?

ట్రంప్‌ నిర్ణయ ఫలితం ఎలా ఉండబోతోంది?

ట్రంప్‌ నిర్ణయం మధ్య ప్రాచ్యంలో శాంతి భద్రతలకు భంగం కలిగించవచ్చు. ఇరాన్‌ దుశ్చర్యలను అడ్డుకోవడానికే తను ఈ నిర్ణయం తీసుకున్నానని ట్రంప్‌ అంటున్నాడు. యూరోపియన్‌ దేశాలు ఈ ఒప్పందాన్ని పూర్తి చేయడంలో విఫలమైతే సౌదీ అరేబియా అణ్వాయుధాలు సమకూర్చడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. రాను రాను మూర్ఖపు దేశాల అణ్వాయుధాలను కలిగి ఉండాలనే కోరికను ఎవరూ లొంగదీయలేరు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తను చేసిన వాగ్దానాలను ట్రంప్‌ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాడు. ఎన్నికల సమయంలోనే ట్రంప్‌ తను గెలిస్తే ‘ఇరాన్‌తో ఉన్న ఒప్పందం ఒక మూర్ఖపు దేశంతో చేసుకున్న ఒప్పందం అని, ఈ ఒప్పందంలో పారదర్శకత లేదని, ఈ ఒప్పందం ఇరాన్‌ అణుపరీక్షలకు ఒక ముసుగులా ఉపయోగపడుతుందని అందుకే ఈ ఒప్పందాన్ని అమెరికా వైపు నుండి రద్దు చేస్తానని ప్రకటించాడు. దాని ప్రకారమే గత జనవరిలో ఇరాన్‌కు అందించే సహాయంపై అయిష్టంగానే అనుమతిస్తూ 120 రోజుల తరువాత ఇచ్చే సహాయానికి అనుమతి లభించకపోవచ్చని జనవరిలోనే తెలియజేశాడు. ఫలితంగా మే 8న జాయింట్‌ కంప్రెన్సివ్‌ ప్లాన్‌ ఆఫ్‌ ఆక్షన్‌ (JCPOA) ఒప్పందం నుండి అమెరికా తప్పుకుంటుందని ప్రకటించాడు.

ఈ సందర్భంలో ట్రంప్‌ మాట్లాడుతూ ఈ ఒప్పందం లోపభూయిష్టమైనదని, ఇరాన్‌కు అణ్వాయుధాల మీద ఉన్న మమకారాన్ని కొంతకాలం వరకే నిరోధిస్తుందని అందుకే అమెరికా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నదని ఏకపక్షంగా ప్రకటించాడు. ట్రంప్‌ వ్యాఖ్యలతో ఏకీభవించని రష్యా అమెరికా చర్యను ఖండిస్తూ UNSC (యునైటెడ్‌ నేషన్స్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌) లో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఈ UNSC లో శాశ్వత సభ్యులు చైనా, ఫ్రాన్స్‌, రష్యా, యుకె, అమెరికా, జర్మనీ. వీటినే PSG1 అని అంటారు. 12 సంవత్సరాల శ్రమఫలం JCPOA ఒప్పందం అని, దాని నుండి తప్పుకోవడం సరికాదని రష్యా వ్యాఖ్యానించింది.

గత ఏప్రిల్‌లో ఫ్రెంచి అధ్యక్షుడు ఎమాన్యుయల్‌ మెక్రాన్‌, ఛాన్స్‌లర్‌ ఎంజెలా మెర్కెల్‌లు వాషింగ్టన్‌ వెళ్ళి ట్రంప్‌ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. యూరోపియన్‌ భాగస్వామ్య దేశాల సలహాను ఒప్పుకోని ట్రంప్‌ మే 12న అమెరికా ఒప్పందం నుండి తప్పుకుంటుందని స్పష్టం చేశాడు.

2015లో ఈ ఒప్పందం కుదిరిన రోజే రాజకీయ విశ్లేషకులు ఈ ఒప్పందంలో ఎన్నో లుకలుకలున్నాయని, ఈ లోపాలను ఇరాన్‌ తనకు అనుకూలంగా మార్చుకుంటుందని తెలియజేశారు. ఆ సమయంలో ఒబామా పరిపాలనా దక్షతకు మంచి పేరు రావాలని ఒప్పందంలో లోపాలున్నా చూసీ చూడటనట్లు ఊరుకున్నారు. ఇరాన్‌ ఈ ఒప్పందంలో భాగస్వామి అయినప్పటికి ఇప్పటి వరకు 20 క్షిపణులను ప్రయోగించి పరీక్షించింది. దీనితో ఇరాన్‌ తన చుట్టు పక్కల దేశాలలో తన ప్రభావాన్ని పెంచుకుంది.

ట్రంప్‌ ప్రకటన వెలువడే కొద్ది రోజుల క్రితమే లెబనాన్‌లో ఇరాన్‌ వ్యూహాత్మక భాగస్వామి హెజ్‌బొల్లా అత్యధిక మెజారిటీతో గెలిచాడు. దీనివల్ల సౌదీ రాజుల ఆధిపత్యానికి గండి కొట్టినట్లయింది. మే 12న ఇరాక్‌లో జరిగిన ఎన్నికలలో ఇరాన్‌కు అను కూలంగా ఉన్న నాయకులు పాశ్చాత్య దేశాలకు అను కూలంగా ఉన్న నాయకులపై విజయం సాధించారు.

‘షియా’లకు పెద్ద దిక్కని తనకు తాను ప్రకటించు కున్న అనతి కాలంలోనే ‘ఇరాక్‌’ అంతర్గత రాజకీయ వ్యవహారాలలో జోక్యం చేసుకోగలిగిన చొరవను ఇరాన్‌ సంపాదించుకుంది. సద్దాం హుస్సేన్‌ కాలం 2003తో ముగిసింది. అమెరికా ఇరాక్‌ దాటి పొరుగు దేశాలకు వెళ్ళకుండా ఇరాక్‌లో ఉన్న ‘షియా’లకు ఇరాన్‌ ఆర్థిక సహాయం అందజేసింది. 2014 వచ్చేసరికి ఇరాక్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ (IS) బలగాలు బలం పుంజుకున్నాయి. దీనితో ఇరాన్‌, సున్నీలతో, కుర్దులతో స్నేహం మొదలుపెట్టింది. వీరిని కలుపుకుని ఇస్లామిక్‌ స్టేట్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించింది. దీనివల్ల ఇరాన్‌ ప్రాదేశి కంగా, మతపరంగా కొంత లాభపడింది. ఇరాక్‌లో ఐఎస్‌ను నిర్మూలించి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని, బాగ్దాద్‌లో ఒక బలహీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇరాన్‌ భావించింది.

నెమ్మదిగా మధ్య ప్రాచ్యదేశాలలో ఇరాన్‌ శక్తివంతంగా తయారవుతోంది. ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు తొలగిన తరువాత మధ్య ప్రాచ్య దేశాలలో తన స్థితిని దృఢపరచుకుంది. లెబనాన్‌లో జరుగు తున్న పోరులో ఇరాన్‌ హిజ్‌బొల్లాకు ఆయుధాల సరఫరాతో పాటు నిధులను సమకూరుస్తోంది. వీళ్ళు సిరియాలో అసద్‌ బలగాలకు సహాయపడుతున్నారు. మరోవైపు యెమెన్‌లో హైతీ తిరుగుబాటుదారులు సౌదీ నాయకత్వంలోని సైన్యంతో పోరాడుతున్నారు. బలం పుంజుకున్న ఇరాన్‌ దాన్ని దృఢపరచుకోవ డానికి ప్రయత్నిస్తోంది. సిరియా సరిహద్దుల వెంట ఇరాన్‌, ఇజ్రాయెల్‌లు పోరాటానికి సిద్ధపడు తున్నాయి. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఇజ్రాయిల్‌, సౌదీ అరేబియా దేశాలు ఖండించలేదు. కానీ మిగతా దేశాలన్ని ట్రంప్‌ నిర్ణయాన్ని తప్పు పట్టాయి.

ట్రంప్‌ నిర్ణయం ఇంతవరకు లేని గందరగోళాన్ని సృష్టించింది. విశేషజ్ఞులు అణుభయం అందరిని ముంచేస్తుందేమోనని భావిస్తున్నారు. అమెరికా, యూరోపియన్‌ భాగస్వామ్య దేశాలు యుకె, జర్మనీ, ఫ్రాన్స్‌ ట్రంప్‌ నిర్ణయం పట్ల తమ నిరసనను తెలియజేశాయి. తాము JCPOA ఒప్పందానికి కట్టుబడి ఉంటామని తెలియజేశాయి. ట్రంప్‌ నిర్ణయం పట్ల రష్యా కూడా తన అసమ్మతిని ప్రకటించింది. అమెరికా తనపై వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించినా చైనా కూడా JCPOA ఒప్పందానికి అనుకూలంగా ఉంటానని ప్రకటించింది. ట్రంప్‌ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని JCPOA ఒప్పందం నుండి తప్పుకోవటం సరికాదని పలు దేశాలు విమర్శిం చాయి. ఈ విధంగా చేయటం అంతర్జాతీయం దౌత్య సంబంధ నియమాలను ఉల్లంఘించినట్లేనని అన్నాయి. మరో విషయమేమంటే ఇంటర్నేషనల్‌ ఆటమిక్‌ ఎనర్జీ ఏజన్సీ ఇచ్చిన నివేదికలలో ఇరాన్‌ తనపై విధించిన ఆంక్షలను అతిక్రమించలేదని ఉంది. కాబట్టి ట్రంప్‌ నిర్ణయంలో న్యాయం లేదు.

ఒప్పందం నుండి ట్రంప్‌ విరమించుకున్న కొద్ది సమయంలోనే ఇరాన్‌కు చెందిన హసన్‌ రహౌని ఒక ప్రకటన చేస్తూ ‘తమ దేశం ఒప్పందానికి కట్టుబడి ఉంటుందని, అమెరికా కాకుండా మిగతా భాగస్వామ్య దేశాలు ఈ విషయంలో కల్పించుకొని సంప్రదింపులకు సమయావధిని నిర్ణయించాలని’ అన్నాడు. కాని ఈ కీలక సమస్యను పరిష్కరించడానికి మిగతా భాగస్వామ్య దేశాలు కల్పించుకుని, ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపిస్తా యనేది అనుమానమే. భాగస్వామ్య దేశాలు చూపించిన పరిష్కారం ఇరాన్‌కు సంతృప్తికరంగా లేకుంటే తాము గతంలో కన్న మరింత శక్తివంతంగా ఎదుగుతామని అన్నారు. మూడు యూరోపియన్‌ దేశాలు తమకు ఖచ్చితమైన పూచీకత్తు ఇవ్వనట్లయితే ఒప్పందం నుండి తమ దేశం వైదొలుగుతుందని ఇరాన్‌ ప్రముఖ నాయకుడు అయాతుల్లా ఖొమైనీ హెచ్చరించాడు.

ఇస్లామిక్‌ అతివాదుల పాలనలో గత నాలుగు దశాబ్దాలుగా నలిగిపోయిన ఇరానీయులు JCPOA ఒప్పందానికి స్వాగతం పలికారు. దీని ఆధారంగా తమ దేశాన్ని ఆర్థికంగా ఎదిగేలా చేస్తామని అనుకున్నారు. అణుఒప్పందం విషయంలో మత గురువులు వ్యతిరేకత తెలియజేసినా వీరి వాదనను కాదని రహౌనీ అణు ఒప్పందం చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. అమెరికా ఇరాన్‌ పట్ల అనుసరిస్తున్న విదేశీ నీతి వల్ల ఇరానీయులు అమెరికా పట్ల క్రమంగా విశ్వాసం కోల్పోతున్నారు.

ఇరాన్‌ 1980లో 50 మంది అమెరికన్లను 444 రోజులు నిర్బంధించింది. ఈ ఘటన ఇరాన్‌, అమెరికాల మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీసింది. ఇరాన్‌లో 1979లో వచ్చిన విప్లవం తర్వాత అధికారం ఇస్లామిక్‌ అతివాదుల చేతులలోకి వెళ్ళిపోయి ఇస్లామిక్‌ అతివాదులు పశ్చిమ దేశాలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దన్నారు. కాని కొంతమంది ఇరాన్‌ నాయకులు తమ దేశాన్ని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడానికి పశ్చిమ దేశాలతో స్నేహం చేయడానికి, అమెరికాతో స్నేహం చేయడానికి పలు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే ఇరాన్‌ JCPOA ఒప్పందానికి సై అంది. ఇంత జరిగినా అమెరికా ఒప్పందం నుండి తప్పుకుంటూ ‘ఇరాన్‌’ని ఒక ధూర్త దేశమని నిందించింది. ఈ విధంగా ఇస్లాం మతాచార్యులు అమెరికా పట్ల వ్యక్తం చేసిన అభిప్రాయం సరైనదే అన్నట్లు ‘ట్రంప్‌’ తన ప్రవర్తన ద్వారా నిరూపించాడు.

రహౌనీ ప్రయత్నాలకు స్పందించిన EU3 కి చెందిన యుకె. ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలు ఎట్టి పరిస్థితులలోనూ ఈ ఒప్పందానికి విఘాతం కలుగనీయమని అన్నాయి. అమెరికా ఆంక్షలను కాదని ఈ మూడు దేశాలు ఇరాన్‌తో సంబంధాలను ఎలా నెట్టుకొస్తాయన్నదే పెద్ద ప్రశ్న.

ట్రంప్‌ నిర్ణయం భౌమ రాజనీతిలో భారీ చిక్కుపేచీలను కలుగజేసింది. తీవ్రమైన ఆర్థిక ఆంక్షల వల్ల ఇరాన్‌ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. ప్రపంచ దేశాల నుండి సరఫరా అవుతున్న చమురులో ఇరాన్‌ 4% చమురు సరఫరా చేస్తోంది. ప్రపంచ దేశాలలో చమురు వాడకం రోజు రోజుకూ పెరుగుతోంది. యూరోపు దేశాలు, ఆసియా దేశాలు ఇరాన్‌ నుండి చమురు దిగుమతి చేసు కుంటున్నాయి. అమెరికా కాంగ్రెసు 2017లో ఒక చట్టం చేసింది. దానిని CAATSA (Countering America’s Adversaries Through Sanctions Act) అంటారు. ఇది భారత్‌, రష్యాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంపై ప్రభావం చూపుతుంది. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు, చమురు వాడుకునే దేశాలు, యూరోపియన్‌ భాగస్వామ్య దేశాలు అన్ని CAATSA పరిధిలోకి వస్తాయి. దీనివల్ల అమెరికా, దాని భాగస్వామ్య యూరోపియన్‌ దేశాల మధ్య విభేదాలు కలుగవచ్చు.

ఒకవేళ అమెరికా ఈ నిబంధన నుండి యూరోపియన్‌ భాగస్వామ్య దేశాలకు మినహాయింపు లిస్తే మిగతా దేశాలు రష్యా, ఉత్తర కొరియాలతో చేసే వ్యాపారంలో కూడా తమకు మినహాయింపులు కావాలని అంటాయి. దానివల్ల అమెరికా ఇరాన్‌పై విధించిన ఆంక్షలు అలంకార ప్రాయంగా మారే అవకాశం ఉంటుంది.

ఇరాన్‌పై ఆంక్షలున్న కాలంలోనూ భారత్‌, చైనాలు ఇరాన్‌ నుండి చమురు దిగుమతి చేసుకు న్నాయి. ఈ రెండు దేశాలలో చమురు వాడకం రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఈ రెండు దేశాలకు ఇరాన్‌ నుండి చమురు రావాలి. అందుకే ఈ రెండు దేశాలు ఇరాన్‌పై ఆంక్షలు విధించకూడదని అంటున్నాయి. ఒకవేళ ఈ ఇద్దరు పెద్ద ఖాతాదారులు అమెరికా ఆంక్షలను మెలితిప్పితే ట్రంప్‌ ఆంక్షలు పూర్తి నిష్ఫలం అవుతాయి.

భారత్‌కు తన అవసరాల దృష్ట్యా ఇరాన్‌తో సంబంధాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. మనకు ఒకటి చమురు దిగుమతి, మరొకటి అంతర్జాతీయ ఉత్తర దక్షిణ కారిడార్‌ను అనుసంధానం చేయడం. అంతేగాకుండా ఇరాన్‌కు చెందిన చాబహార్‌ నౌకాశ్ర యాన్ని భారత్‌ అభివృద్ధి చేస్తోంది. ఈ రేవు ద్వారానే ఆప్ఘనిస్తాన్‌కు అవసరమైన వస్తువులు రవాణా అవుతాయి. కాబట్టి చాబహార్‌ ప్రాముఖ్యతను కాదనలేం. చైనా తలపెట్టిన BRI (Belt Road Initiative)లో కూడా ఇరాన్‌ ‘ఇరుసు’ లాంటిది. ఈ మధ్యనే చైనా, అమెరికాలకు వాణిజ్య పరమైన వివాదాలు తలెత్తాయి. ఇక చైనాEU3 దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవచ్చు. ట్రంప్‌ నిర్ణయాన్ని EU3 దేశాలు వ్యతిరేకించాయి. అందుకే చైనా వీటితో వాణిజ్యం చేయడానికి ఉత్సాహం చూపుతోంది.

ఇది జరిగితే అమెరికా తన ప్రాధాన్యాన్ని కోల్పోయి చైనా ప్రాధాన్యం పెరిగే అవకాశా లున్నాయి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రష్యా కూడా చైనాతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇరాన్‌ కూడా పశ్చిమ దేశాలతో కాకుండా ఆసియా దేశాలతో సంబంధాలు పెంచుకునే దిశలో రష్యా, చైనాలతో పలు ఒప్పందాలు కుదుర్చుకుంది.

ట్రంప్‌ ఏకపక్షంగా, తొందరలో తీసుకున్న నిర్ణయం ఇరాన్‌ను చైనాకు దగ్గర చేసింది. ఇప్పటికే సిరియాలో ఇరాన్‌ రష్యా సేనలతో కలిసి పోరాడు తోంది. ఇక ఇరాన్‌ రష్యాకు మరింత చేరువవుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌ విషయంలో ఇరాన్‌, రష్యా ఒక్కటవచ్చు. ఇక రాబోయే కాలంలో చైనా-రష్యా-ఇరాన్‌ల సంకీర్ణం ఏర్పడవచ్చు. ట్రంప్‌ నిర్ణయంవల్ల చైనా ప్రాముఖ్యం సంతరించుకుంది. దాంతో మధ్య ప్రాచ్య దేశాలలో ప్రాంతీయ సహకారం కుంటుపడవచ్చు.

ట్రంప్‌ నిర్ణయం మధ్య ప్రాచ్యంలో శాంతి భద్రత లకు భంగం కలిగించవచ్చు. ఇరాన్‌ దుశ్చర్యలను అడ్డుకోవడానికే తను ఈ నిర్ణయం తీసుకున్నానని ట్రంప్‌ అంటున్నాడు. యూరోపియన్‌ దేశాలు ఈ ఒప్పందాన్ని పూర్తి చేయడంలో విఫలమైతే సౌదీ అరేబియా అణ్వాయుధాలు సమకూర్చడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అమెరికా చర్యవల్ల మధ్య ప్రాచ్య దేశాలలో అణ్వాయుధాల పోటీ పెరుగుతుంది. ఇక అమెరికా ప్రాధాన్యం తగ్గి పోతుంది. ఇక రాను రాను మూర్ఖపు దేశాల అణ్వాయుధాలను కలిగి ఉండాలనే కోరికను ఎవరూ లొంగదీయలేరు.

– డా|| రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *