జి విజయం ప్రపంచానికి మరో సవాల్‌ !

జి విజయం ప్రపంచానికి మరో సవాల్‌ !

– మరోసారి అధ్యక్షుడైన జి

– పార్టీ సంప్రయదానికి తూట్లు

– చేసిందొకటి, చెప్పిందొకటి

భారత్‌ తన భద్రత దృష్ట్యా వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నది. చైనా పలురకాలుగా ప్రయత్నించి భారత్‌పై ఒత్తిడిని పెంచుతున్నది. ఈ మధ్య జరిగిన డోక్లామ్‌ ఉదంతం కూడా అందులో భాగమే. అయినా భారత్‌ సంయమనంతో సమస్యను అధిగమించింది. ఏది ఏమైనా చైనా ప్రపంచ ఆర్థిక సూపర్‌ పవర్‌గా ఎదగడానికి తీవ్రంగా కృషి చేస్తున్నది. మరోసారి జీ అధ్యక్షుడవడంతో రాబోయే కాలంలో చైనా అనుసరించే విదేశాంగ విధానం ప్రపంచ దేశాలకు సవాలుగా మారవచ్చు.
చైనా కమ్యూనిస్టు పార్టీ తన పంచవర్షీయ సభలను ఆరు రోజుల పాటు ఘనంగా నిర్వహించు కుంది. ఆ సమావేశాలలో ఊహించని మార్పులేమీ జరుగలేదు. అధ్యక్షుడు జి అనుకున్న విధంగానే సమావేశాలు జరిగాయి. దేశమంతటి నుండి వచ్చి సమావేశంలో పాల్గొన్న సభ్యులు మరోమారు అధ్యక్షుడు జి కి దేశ పగ్గాలు అప్పజెప్పారు. అంటే జి కి ఇది రెండో పదవీకాలం. అధ్యక్షుడితో పాటు పార్టీ కేంద్ర కమిటీ, 25 మంది సభ్యుల పొలిట్‌ బ్యూరో, 11 మంది సభ్యులతో సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌, మరో 7 గురు సభ్యులతో ఎపెక్స్‌ పోలిట్‌ బ్యూరో స్టాండింగ్‌ కమిటీలను ఎన్నుకున్నారు.
సామాన్యంగా ఈ సమావేశాలలో దేశ అధ్యక్షుడి వారసులను పోలిట్‌ బ్యూరో కమిటీలో సభ్యులుగా ఎన్నుకొంటారు. అధ్యక్షుడు జి, ప్రధాని లీ కెకియాంగ్‌ కాగా పిఎస్‌సిలో ఇపుడున్న సభ్యులెవరూ తరువాతి అధ్యక్షుడు కావడానికి వయసురీత్యా అర్హులు కారు. ఇపుడు పిఎస్‌సిలో ఉన్న సభ్యుల వయస్సు 60 నుండి 67 మధ్య ఉంది. అధ్యక్షుడి రిటైర్మెంట్‌ వయసు 68 సంవత్సరాలు. కావున పిఎస్‌సిలో ఉన్న కమిటీ సభ్యులెవ్వరూ రాబోయే పదవీ కాలానికి అర్హులు కారు. పిఎస్‌సిలో ఉన్న లీ ఝన్షు (67), ఉప ప్రధాని వాంగ్‌ యాంగ్‌ (62), వాంగ్‌ హూనింగ్‌ (62), ఝూహాలేజీ (60), హన్‌ ఝెంగ్‌ (63).
ప్రస్తుత అధ్యక్షుడి పదవీకాలం 2022 తో ముగుస్తుంది. ఆ సమయానికి పై వారందరూ వయసురీత్యా అధ్యక్ష పదవికి అనర్హులు అవుతారు. పిఎస్‌సిలో సభ్యుల ఎన్నికను పరిశీలిస్తే అధ్యక్షుడు జి పాత సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చినట్టు స్పష్టమౌతోంది. పిఎస్‌సిలో సభ్యుల నియామకం గోప్యంగా జరుగుతుంది. పార్టీ సమావేశాలలో వేదిక మీదకు పిలచే వరకు పిఎస్‌సిలో సభ్యులెవరో ఎవరికీ తెలియకుండా ఉంచుతారు. ఇపుడు జి కమ్యూనిస్టు పార్టీకి, దేశానికి, సైన్యానికీ అధ్యక్షుడు.
పంచవర్షీయ సమావేశం ప్రారంభం రోజున 2300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అధ్యక్షుడు జి తమ ప్రభుత్వం సాధించిన విజయాలను, తాము అనుసరిస్తున్న విదేశాంగ విధానాలు, దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి అనుసరిస్తున్న విధి, విధానాలను ప్రతినిధులందరికీ వివరంగా 205 నిమిషాల పాటు వివరించాడు. ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేయడమే కాకుండా నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహమిస్తున్నామని అన్నాడు. అలాగే ప్రైవేటు రంగంలో ఉన్న వ్యాపారానికి చేయూతనిస్తామని అన్నాడు. కాని కొంతకాలం క్రిందట జి వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకున్నాడు. దాని ప్రభావంతో చైనాలోని వ్యాపార దిగ్గజాలు పార్టీకి సవాలు విసిరాయి.
ధనవంతులైన పారిశ్రామికవేత్తల నియంత్రణలోకి జాతీయ సంపదలు వెళ్లిపోవచ్చు. సోవియట్‌ రష్యా విచ్ఛిన్నమైన తర్వాత అక్కడ జాతీయ సంపదలో అధిక భాగం బడా పారిశ్రామికవేత్తల చేతులలోకి వెళ్ళిపోయింది. చైనాలో కూడా అలా జరుగవచ్చేమోనని జీ భావించి వారిని కట్టడిలో ఉంచడానికి తీసుకోవలసిన చర్యలను అమలులో పెట్టాడు. దానితో అక్కడ బడా పారిశ్రామిక వేత్తలు అకస్మాత్తుగా కనిపించకుండా అదృశ్యమవడం ప్రారంభమైంది. అధ్యక్షుడు జి తన పదవీకాలంలో తనకు వ్యతిరేకం అనుకున్న వారందరిని మట్టు పెట్టించాడు. లంచగొండులనే ముద్రవేసి శిక్షలకు గురిచేశాడు. అవినీతికి వ్యతిరేకంగా చర్యలంటూ సుమారు 1.4 మిలియన్ల పార్టీ కార్యకర్తలపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాడు. పార్టీపై తన పట్టును మరింత దృఢపరచుకున్నాడు. మానవ హక్కుల సంఘాల కార్యకర్తలను జైళ్ళలో బంధించాడు. అసమ్మతి వాదులను అణగదొక్కాడు. ఇక సైన్యంలో కూడా తనకు నమ్మకస్తులనుకున్న వారినే ముఖ్యమైన పదవులలో నియమించాడు. ఈ విధంగా జి దేశంలోని అన్ని రంగాలలో, పరిపాలనలో తన పట్టును మరింత పెంచుకున్నాడు.
వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ ప్రాజెక్టు ద్వారా ప్రపంచాన్ని అనుసంధానం చేసే విషయం గురించి మాట్లాడుతూ జి చైనా అభివృద్ధి మరే దేశానికి బెదరింపు కాదని, మేమెంతగా అభివృద్ధి చెందినా మాకు ప్రపంచ నాయకత్వం అవసరం లేదని, మా దేశాన్ని విస్తరించుకోవాలన్న ఆలోచన కూడా మాకు లేదని అన్నాడు. కాని జరుగుతున్న విషయాలు మరోవిధంగా ఉన్నాయి.
చైనా హిందూ మహా సముద్రంలో ప్రవేశించడానికి శ్రీలంకను ఉపయోగించుకుంది. శ్రీలంకకు ఆర్థిక సహాయమందించి ఆ దేశాన్ని ఋణగ్రస్తురాలిని చేసింది. తర్వాత ఆ జాబితాలో కాంబోడియా, లావోస్‌లు చేరాయి. వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ ప్రాజెక్టు క్రింద కలిసివస్తున్న దేశాలకు చైనా అధిక మొత్తంలో ధనసహాయం అందిస్తోంది. పైపెచ్చు జి వివరిస్తూ ఇతర దేశాల ప్రయోజనాలను పణంగా పెట్టి చైనా ఎన్నడూ తన అభివృద్ధి పథకాలను అమలు చెయ్యదని అంటూనే మా దేశానికి చెందిన న్యాయపరమైన హక్కులను, ప్రయోజనాలను ప్రక్కన పెట్టేది లేదని అన్నాడు. ఈ దృష్టితో గమనిస్తే చైనా తలపెట్టిన సిపిఇసి (చైనా పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌) భారదేశ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేయగలదు. భారత్‌ ఈ ప్రాజెక్టుపై పలు మార్లు అభ్యంతరాలను తెలియజేసింది. చైనా వాటన్నింటిని పక్కనపెట్టింది. కనీసం చైనా ప్రాజెక్టు పేరును మార్చడానికి కూడా ఒప్పుకోలేదు.
ఇరుగు పొరుగు దేశాలను శాంతింప చేయడానికి జి వాగ్దానం చేస్తూ ‘దేశాల మధ్య ఏవైనా విబేధాలుంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించు కుందాం అంతే గాకుండా మన దేశాలలో తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా, దానిని అందరం వ్యతిరేకిద్దాం’ అన్నాడు. దక్షిణ చైనా సముద్రంలో 90% ప్రదేశం తనదేనని చైనా పేర్కొంటున్నది. దీని వల్ల పొరుగు దేశాలు అల్లాడిపోతున్నాయి. చైనా స్కార్‌బరో ద్వీపాన్ని ఆక్రమించుకుంది. ఈ విషయంలో ఫిలిప్ఫైన్స్‌ చైనాను పర్మినెంట్‌ కోర్ట్‌ ఆఫ్‌ అరిబిట్రేషన్‌కు లాగింది. ఆ కోర్టు ఫిలిప్ఫైన్స్‌ దేశానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. చైనా ఆ తీర్పు నొప్పుకోవడానికి నిరాకరించింది. దానికి బదులుగా ఫిలిప్ఫైన్స్‌ దేశానికి ఆర్థిక సహాయం అందిస్తానని, ఆ దేశంలో పెట్టుబడులు పెడతామని దానిని లాలూచీకి గురి చేస్తున్నది.
అధ్యక్షుడు జీ పార్టీ సమావేశాలలో తన హయాంలో జరిగిన భూ ఆక్రమణలను గొప్ప విజయాలుగా ప్రకటించుకున్నాడు. ఉగ్రవాదాన్ని అందరం కలిసి సహకరించుకొని ఎదుర్కోవాలని చెపుతున్న చైనా భారత్‌ విషయంలో మాత్రం సహకరించటం లేదు. మసూద్‌ అజహర్‌పై నిషేధం విధించాలని యుఎన్‌ఒ లో ప్రతిపాదించిన ప్రతిసారి చైనా తన వీటో పవర్‌ ఉపయోగించి తిరస్క రించింది. గత మూడున్నర సంవత్సరాలుగా వ్యతిరేకిస్తూనే ఉంది. దీన్ని బట్టి చైనా చెప్పేదొకటి చేసేదొకటి అని అర్థమౌతోంది.
చైనా పూర్వ అధ్యక్షులు బహుళ ధృవాల పాలసీని అవలంబించగా జీ మాత్రం చైనీయుల ప్రయోజనాలే ముఖ్యంగా అడుగులు వేస్తున్నాడు. జీ ఒక ప్రకటన చేస్తూ చైనా తన న్యాయబద్ధ మైన హక్కులను, ప్రయోజ నాలను ఎన్నడూ వదలుకో దని, అలాగే తమ ప్రయోజ నాలకు భంగం కలిగించే ఎలాంటి చేదు ఫలాలను తినబోదని స్పష్టం చేశాడు. చైనా దేశానికి సరిహద్దుల్లో 14 దేశాలే ఉండగా దానికి 23 దేశాలతో ప్రాదేశిక తగాదాలున్నాయి.
చైనా యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని కోరుకుంటున్న అధ్యక్షుడు జీ సైన్యాన్ని ఆధునీకరించాడు. హాంకాంగ్‌, మకావు దేశాలు వాటికవే పాలించుకోవచ్చు కాని దేశభక్తులు మాత్రమే ప్రధాన పాత్ర పోషించాలని ఆదేశించాడు. తైవాన్‌ చైనాకు వ్యతిరేకంగా తలెత్తే సరికి దానికి గట్టి హెచ్చరికలు పంపాడు. దేశంలో తలెత్తిన ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేశాడు. అంతర్జాలం, మీడియాను జాతీయ భద్రత కమిషన్‌ నియంత్రణలో ఉంచాడు. ఈ విధంగా జి దేశంలో అన్ని రంగాలలో తన అధిపత్యాన్ని నెలకొల్పుకున్నాడు.
జీ విదేశాల ఉదారవాద విధానాలు తన దేశానికి సరిపోవన్నాడు. మరో ప్రకటనలో జి 2049 వరకు చైనాను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తానని అన్నాడు. నేడు ప్రపంచ దేశాల స్థితులు, అమెరికా పరిస్థితిని గమనిస్తే రాబోయే రోజుల్లో చైనా అమెరికా స్థానాన్ని ఆక్రమించొచ్చు. జీ పరిపాలనలో తనదైన ముద్ర వేశాడు. రాజ్యాంగంలో మార్పులు చేశాడు. ఆ విధంగా జీ పూర్వ అధ్యక్షుల కన్న ప్రభావశీలిగా అవతరించాడనటంలో సందేహం లేదు.
ఆధునిక చైనా చరిత్రను మూడు శకాలుగా విభజించవచ్చు. మొదటి శకంలో మావో ఆధిపత్యం చెలాయించాడు. ఇతడు చైనాను కమ్యూనిస్టు దేశంగా నిలదొక్కుకోవడానికి కృషి చేశాడు. ఆ తర్వాత వచ్చిన డెంగ్‌ జియావోపింగ్‌ ఆర్థిక సంస్కరణలతో చైనా రెండవ శకం సాగింది. ఇక ప్రస్తుత అధ్యక్షుడు జి చైనాకు ప్రపంచదేశాలలో గుర్తింపు తీసుకొచ్చాడు.
మావో తాను మరణించే వరకు అధికారం చెలాయించాడు. ప్రస్తుతం జీ కూడా అదే బాటలో పయనిస్తాడేమో? ఎందుకంటే తన తర్వాత అధ్యక్షుడు ఎవరనే విషయం తెలియజెయ్యాలి. కాని పార్టీ సమావేశంలో అలా జరగలేదు. జీ ఆ సంప్రదాయాన్ని దాటవేశాడు. ఇతనికన్న ముందు ఉన్న అధ్యక్షుడు సమష్టి పాలనకు ప్రాధాన్యమిచ్చాడు. కాని జీ దానిని పాటిస్తాడన్న నమ్మకం లేదు. జీ తర్వాత అధ్యక్షులుగా కాగలవారుగా ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయి. వారు గాంగ్‌డాంగ్‌ పార్టీ ముఖ్యుడు చున్‌హుహా (54), చెన్‌ మినెర్‌ (57). కాని జీ వీరిద్దరినీ ఎపెక్స్‌ పిఎస్‌సిలో కాకుండా పార్టీ పోలిట్‌ బ్యూరోలో సభ్యులుగా నియమించాడు. కాబట్టి రాబోయే పదవీకాలానికి వీరికి అధ్యక్షులయ్యే అవకాశం లేకుండా పోయింది. ఇవన్నీ పరిశీలిస్తే ప్రస్తుత అధ్యక్షుడు జీ మరోమారు అధ్యక్ష పదవిని అలంకరించే అవకాశాలే ముమ్మరంగా కనిపిస్తున్నాయి.
వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ విషయంలో భారత్‌కు చైనాకు మధ్య విభేదాలున్నాయి. భారత్‌ తన భద్రత దృష్ట్యా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నది. చైనా పలురకాలుగా ప్రయత్నించి భారత్‌పై ఒత్తిడిని పెంచుతున్నది. ఈ మధ్య జరిగిన డోక్లామ్‌ ఉదంతం కూడా అందులో భాగమే. అయినా భారత్‌ సంయమనంతో సమస్యను అధిగమించింది. ఏది ఏమైనా చైనా ప్రపంచ ఆర్థిక సూపర్‌ పవర్‌గా ఎదగడానికి తీవ్రంగా కృషి చేస్తున్నది. మరోసారి జీ అధ్యక్షుడవడంతో రాబోయే కాలంలో చైనా అనుసరించే విదేశాంగ విధానం ప్రపంచ దేశాలకు సవాలుగా మారవచ్చు.
– హెచ్‌.పూసర్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *