జిన్‌పింగ్‌కు జీవితకాల అధికారం-భారత్‌కు తలనొప్పే

జిన్‌పింగ్‌కు జీవితకాల అధికారం-భారత్‌కు తలనొప్పే

అపరిమితమైన అధికారం చేజిక్కడంతో ఇక జిన్‌పింగ్‌ భారత సార్వభౌమత్వానికి సవాలుగా నిలిచే పాకిస్తాన్‌, చైనా ఆర్ధిక నడవాను పూర్తిచేయడానికి అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా తొత్తుగా మారిన పాకిస్తాన్‌ ఇప్పుడు మరింతగా ఆ దేశానికి దగ్గర కావచ్చు. భారత వ్యతిరేక వైఖరికి పేరుపడిన ఈ రెండు దేశాలు రాగల రోజుల్లో భారత్‌ను ఇరుకున పెట్టడానికి తమ దాడిని మరింత ఉధతం చేయవచ్చు.

దేశ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు రెండుసార్లకు మించి పదవిలో కొనసాగడానికి వీలులేదనే నిబంధనను తొలగిస్తున్నామంటూ చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ (సిసిపి) చేసిన ప్రకటన అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకుల భయాలను నిజం చేసింది. ఎలాంటి పోటీ లేకుండా రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన షి జిన్‌పింగ్‌ 2023లో పదవీకాలం అయిపోయిన తరువాత కూడా ఆ పదవిలోనే కొనసాగుతారన్నమాట. ఇలా పదవీకాల పరిమితిని ఎత్తివేస్తూ జనవరిలోనే రాజ్యాంగ సవరణపై కమ్యూనిస్ట్‌ పార్టీ కేంద్ర కమిటీ ఆమోదముద్ర వేసింది. కానీ ప్రకటన మాత్రం ఇప్పుడు వెలువడింది. దీనిపై మార్చ్‌ 5న జాతీయ ప్రజా కాంగ్రెస్‌ (ఎన్‌పిసి) తన ఆమోదాన్ని తెలిపింది. దీనితో జిన్‌పింగ్‌కు జీవితకాలం దేశాధ్యక్షుడిగా కొనసాగే అవకాశం వస్తుంది. అంతేకాదు కేంద్ర మిలటరీ కమిషన్‌, చైనా కమ్యూనిస్టు పార్టీపై జిన్‌పింగ్‌కు అపరిమితమైన అధికారాలు వస్తాయి. సైనిక బలగాల (పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ) ప్రధాన అధికారి అవుతారు. చైనా కమ్యూనిస్టు పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంచిదన్న గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక కీలకమైన కాలంలో (2020-2035) దేశానికి సుస్థిరమైన, బలమైన నాయకత్వం అవసరముందని, అప్పుడే దేశం అభివద్ధి చెందుతుందని రాసింది. కానీ అందుకు విరుద్ధంగా జిన్‌పింగ్‌ అపరిమితమైన అధికారం వల్ల దేశంలో అంతర్గత ఘర్షణ పెరిగిపోయి అరాచ కత్వానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. అంతేకాదు అధికారం ఒక వ్యక్తి చేతిలోనే కేంద్రీకతమవడం వల్ల దేశం ఒకనాడు చవిచూసిన నిరంకుశ పాలన చీకటిరోజులు మళ్ళీ దాపురించే ప్రమాదం కూడా ఉంది.

అధ్యక్షుడు మావో హయాంలో అనుసరించిన ‘గొప్ప ముందడుగు’, ‘సాంస్కతిక విప్లవం’ విధానాల వల్ల కలిగిన అల్లకల్లోలం, నాలుగున్నర కోట్లమంది ప్రాణాలు కోల్పోవడాన్ని దష్టిలో పెట్టుకుని అప్పట్లో విధాన నిర్ణేతలు ఈ రెండు పర్యాయాల పదవీకాల పరిమితిని అమలులోకి తెచ్చారు. నిరంకుశ పాలన చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దేందుకు మావో వారసుడు డెంగ్‌ జియావో పింగ్‌ ఈ నిరంకుశ వాదాన్ని కట్టడి చేసేందుకు సంస్థాగతమైన పద్దతిని ఏర్పాటు చేయాలని ఈ పదవీకాల పరిమితిని రాజ్యాంగబద్ధం చేశాడు. ‘అధికార కేంద్రీకరణ వల్ల కొందరు వ్యక్తుల చేతిలోనే అధికార పగ్గాలు చిక్కుకుని సమష్టి నాయకత్వ పద్ధతికి దెబ్బ తగులుతుంది’ అని జియావోపింగ్‌ ఆ సందర్భంగా అన్నారు.

ఈ ఏర్పాటు వల్ల నిరంకుశత్వం ప్రబలకుండా ఉండడమే కాక, రాజకీయ నాయకత్వాన్ని నియంత్రించడానికి, అధికార బదిలీ సజావుగా, శాంతియుతంగా జరగడానికి, ఇతర కమ్యూనిస్టు దేశాల్లో ఎదురైన సమస్యల్ని పరిహరించడానికి వీలైంది. శాంతియుతమైన, సజావైన అధికార బదలాయింపు ఆండ్రూ జె. నాథన్‌ చెప్పినట్లు ‘అధికారిక వెసులుబాటు లేదా లాఘవానికి’ వీలు కల్పించింది. చాలా కమ్యూనిస్టు దేశాల్లో అధికార మార్పు హింస, వేర్పాటువాదం, అరాచక పరిస్థితులకు దారితీసేది. కానీ జియాంగ్‌ జెమిన్‌, హు జింటావో వంటి వారి హయాంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అధికార మార్పు ఎలాంటి సమస్యలకు దారితీయలేదు. ఇది నిరంకుశాధికార చరిత్రలో చాలా అరుదైన విషయం. ఇలా సాధించిన రాజకీయ స్థిరత్వమే చైనాలో అద్భుతమైన ఆర్ధికాభివద్ధికి బాటలు వేసింది. కానీ చైనాను ఎప్పటికీ పరిపాలించాలనుకున్న జిన్‌ పింగ్‌ ఆశలకు ఈ పదవీకాల పరిమితి అడ్డంకిగా కనిపించింది.

చైనా రాజకీయ వ్యవస్థలో కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు, సైన్యాధ్యక్షుడికి ఉండే అధికారాలతో పోలిస్తే దేశాధ్యక్షుడికి నామమాత్రపు అధికారాలు మాత్రమే ఉండేవి. కానీ 1989 తియాన్మన్‌ స్క్వేర్‌ నిరసన ప్రదర్శనల తరువాత ఈ పదవులన్నింటిని కలిపేశారు. డెంగ్‌ ఏర్పరచిన బలహీన వ్యవస్థను ఆధారం చేసుకుని జిన్‌పింగ్‌ పరిమితి లేని అధికారాలను చేజిక్కించుకున్నారు. దురదష్టకరమైన విషయం ఏమిటంటే మావో నిరంకుశ పాలనలో ఎన్నో కష్టనష్టాలను చూసిన చైనా వాటి నుంచి గుణపాఠం నేర్చుకుని బలమైన, ప్రత్యేకమైన వ్యవస్థను రూపొందించుకోలేక పోయింది. సామూహిక నాయకత్వ సూత్రాలను పూర్తిగా పక్కన పెట్టి ఇప్పుడు జిన్‌ పింగ్‌ చైనాలో ఇంతకుముందు ఎప్పుడూ లేని అవధులు లేని నిరంకుశత్వానికి తెరతీశారు. అయితే ఇలాంటి నిరంకుశత్వం ఇతర కమ్యూనిస్టు, ఫాసిస్ట్‌ దేశాల్లో సర్వసాధారణం.

అక్టోబర్‌లో జిన్‌పింగ్‌ తన ప్రభుత్వం అనుసరించే విదేశాంగ విధానం గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం తన అధికారాన్ని బలపరుచు కునేందుకు జిన్‌ పింగ్‌ ప్రయత్నిస్తున్నారనే ఊహలకు తావిచ్చింది. కానీ 19వ చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ సమావేశాలలో ఈ ఊహలు నిజమయ్యాయి. మావో జెడాంగ్‌, అతని వారసుడైన డెంగ్‌ల రాజకీయ విధానాలను అనుసరిస్తూ, జిన్‌ పింగ్‌కు అపరిమిత అధికారాలు కట్టబెట్టే తీర్మానాన్ని ఆమోదించారు. దీనితో ‘చైనా లక్షణాలు కలిగిన సామ్యవాదంపై జిన్‌ పింగ్‌ ఆలోచనలు’ దేశపు అధికారిక, ఏకైక విధానమయ్యాయి.

జిన్‌పింగ్‌ ఎప్పుడూ రాజ్యాంగ నిబంధనల వ్యాఖ్య, అమలుపై నియత్రణ గురించి ఎక్కువగా మాట్లాడుతుండేవారని నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు అపరిమితమైన అధికారం చేజిక్కిన తరువాత జిన్‌పింగ్‌ చైనా రాజ్యాంగంలోని కీలకమైన నిబంధన లను పక్కన పెట్టడానికి, వాటిని నిర్వీర్యం చేయడానికి ఏమాత్రం వెనుకాడకపోవచ్చు. ముఖ్యంగా వాక్‌ స్వాతంత్రం, మత స్వేచ్ఛ మొదలైనవి ప్రజాజీవనం నుండి మాయమైపోవచ్చు. షాంఘై గవర్నర్‌గా ఉన్నప్పుడూ అవినీతికి వ్యతిరేకంగా జిన్‌పింగ్‌ తీసుకున్న కఠినమైన చర్యలను దష్టిలో పెట్టుకుని పాశ్చాత్య దేశాలు ఆయన దేశాధ్యక్షుడు అయితే చైనా ఆర్ధిక, రాజకీయ రంగాలలో పెనుమార్పులు వస్తాయని ఆశించాయి. కానీ ఆ ఆశలపై నీళ్ళు జల్లుతూ జిన్‌పింగ్‌ చైనాను స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య, పారదర్శక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశలో చర్యలు తీసుకోకుండా అపరిమిత నిరంకుశాధికారం వైపు అడుగులు వేశారు. ప్రతిపక్షానికి ఎలాంటి అధికారాలు లేకుండా చేసి, విపక్ష నేతలపై అవినీతి నిరోధక దాడులు చేయించి, మీడియా, ఇంటర్‌నెట్‌పై నిషేధాలు విధించి, ప్రజాస్వామ్యవాదుల గొంతు నొక్కి, వందలాది మంది మానవహక్కుల ఉద్యమ కారులను జైళ్ళలో కుక్కి దేశం మొత్తాన్ని నిఘా గుప్పిటిలోకి తెచ్చారు. ఉల్ఘర్‌ ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచివేసిన జిన్‌ పింగ్‌ ఆ వర్గపు మత పద్ధతులు, ఆచారాలపై కఠినమైన నిబంధనలు విధించారు. వారి కదలికలను తెలుసుకునేందుకు ఏకంగా ముఖాన్ని గుర్తించే పరికరాల వాడకానికి కూడా వెనుదీయలేదు. టిబెటన్‌ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో జనాభా సంతులనాన్ని దెబ్బతీసి తద్వారా అక్కడి నిరసనలను బలహీనపరచడానికి జిన్‌ పింగ్‌ చేయని ప్రయత్నం లేదు. ‘ఒక దేశం, రెండు వ్యవస్థలు’ అనే ఒకప్పటి తన హామీని పక్కకు పెట్టిన జిన్‌పింగ్‌ ప్రజాస్వామ్య విలువలను సమూలంగా నాశనం చేయడానికి చురుకుగా చర్యలు చేపట్టారు. ఒకప్పుడు స్వేచ్ఛా, సమానత్వాలకు కేంద్రంగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు తన స్వయంప్రతిపత్తిని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.

చైనా ఆర్ధికాభివద్ధి సూచీ కిందిచూపులు చూస్తూ రెండంకెల కంటే తక్కువకు రావడంతో దేశప్రజల్లో విశ్వాసాన్ని నింపడానికి జిన్‌ పింగ్‌ కొన్ని చర్యలు తీసుకోక తప్పలేదు. అయితే తనకంటే ముందున్న వారిలా కాకుండా ఆయన జాతీయ వాదాన్ని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. విదేశీ సంబంధాలకు ప్రాధాన్యమిస్తున్నారు. చైనా ప్రాబల్యాన్ని పెంచడానికి బెల్ట్‌ రోడ్‌ వంటి ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యమిస్తూ విదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.

అపరిమితమైన అధికారం చేజిక్కడంతో ఇక జిన్‌పింగ్‌ ఇండో-పసిఫిక్‌, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో చైనా ప్రాబల్యాన్ని పెంచే తన విదేశాంగ విధానానికి పదును పెడతారు. భారత సార్వభౌమ త్వానికి సవాలుగా నిలిచే పాకిస్తాన్‌, చైనా ఆర్ధిక నడవాను పూర్తిచేయడానికి అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా తొత్తుగా మారిన పాకిస్తాన్‌ ఇప్పుడు మరింతగా ఆ దేశానికి దగ్గర కావచ్చు. అమెరికాతో తెగతెంపులు చేసుకున్న పాకిస్తాన్‌ బీజింగ్‌కు దగ్గరకావడంలో ఆశ్చర్యమేమి లేదు. భారత వ్యతిరేక వైఖరికి పేరుపడిన ఈ రెండు దేశాలు రాగల రోజుల్లో తమ దాడిని మరింత ఉధతం చేయవచ్చు. దీనివల్ల సరిహద్దుల్లో అనిశ్చితి, చొరబాట్లు వంటి సమస్యలు భారత్‌కు ఎక్కువ కావచ్చు. దక్షిణాసియాలో ప్రాబల్యం కోసం చైనా మరింత బలంగా భారత్‌తో పోటీపడేందుకు సిద్ధం కావచ్చు. భారత్‌ను ఇరుకున పెట్టడానికి, భయ పెట్టడానికి చైనా మన పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకునేందుకు ప్రయ త్నించవచ్చు.

చైనా ఋణ ఊబిలో చిక్కుకున్న శ్రీలంక ఇప్పటికే తమ హంబన్‌తోట నౌకా కేంద్రాన్ని 99 ఏళ్ళకు చైనాకు లీజుకిచ్చింది. నేపాల్‌లో కమ్యూనిస్టు అనుకూల ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం ద్వారా జిన్‌ పింగ్‌ హిమాలయ ప్రాంతంలో జోక్యం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ను కూడా భారత్‌ నుండి దూరం చేయడం కోసం ఆర్ధిక సహాయం అందించడంతో పాటు అల్లకల్లోలంగా ఉన్న ఆ దేశ ఉత్తర ప్రాంతంలో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి చైనా ఇప్పటికే సుముఖం వ్యక్తం చేస్తూ సంభాషణలు సాగిస్తోంది. భారత్‌ ఊహించని విధంగా ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ఒక సమన్వయ బందాన్ని ఏర్పాటు చేసింది. అలాగే బంగ్లాదేశ్‌కు చవకైన సబ్‌మెరైన్‌లు అందించిన చైనా 24 బిలియన్‌ డాలర్ల ఆర్ధిక సహాయం అందించడానికి కూడా హామీ ఇచ్చింది. చైనా అండ చూసుకుని మాల్దీవులలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఆ దేశాధ్యక్షుడు యమీన్‌, ఏమాత్రం వెనుకడుగువేసేది లేదని స్పష్టం చేశారు. భూటాన్‌ను మచ్చిక చేసుకునేందుకు కూడా చైనా విశ్వప్రయత్నం చేస్తోంది. అక్కడ ఈ సంవత్సరం ఎన్నికలు జరగడానికి ముందే ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవాలని చైనా అనుకుంటోంది. ఈ ఏడాది బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, మాల్దీవులలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో చైనా అనుసరించే వ్యూహాలపై భారత్‌ ఒక కన్నువేసి ఉంచాలి.

దక్షిణ చైనా సముద్రంలో తన బలాన్ని పెంచుకు నేందుకు బీజింగ్‌ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఈ ప్రాంతంలో సమీకరణలను మార్చే ప్రమాదం ఉంది. చైనా ఆర్ధిక ప్రాబల్యం అంతకంతకూ పెరుగు తుండడంతో ఆగ్నేయాసియా దేశాలు సమర్ధమైన నాయకత్వం కోసం భారత్‌ వైపు చూస్తున్నాయి. తూర్పు యూరోప్‌ దేశాల్లో కూడా చైనా తన ఆర్ధిక బలాన్ని పెంచుకుంటోంది. బాల్కన్‌ ప్రాంతంలో పెరుగుతున్న చైనా జోక్యాన్ని చూసి ఫ్రాన్స్‌, జర్మనీలు ఆందోళన చెందుతున్నాయి. అంతర్జాతీయ వేదికపై అమెరికా ప్రాభవం తగ్గుతున్న తరుణంలో చైనా ఆ స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తోంది. ఒక పక్క చైనా దుందుడుకు విధానాలతో యూరోప్‌ దేశాలు ఆందోళన చెందుతుంటే, అమెరికా మాత్రం పాశ్చాత్య దేశాల్లో రష్యా జోక్యాన్ని తగ్గించాలనే ప్రయత్నంలో మునిగి ఉంది. ఆ విధంగా చచ్చిన పామును మరింత కొట్టడానికి ప్రయత్నిస్తూ కాలాన్ని, శక్తిని వథా చేసుకుంటోంది. కానీ చైనా మాత్రం అమెరికా మార్కెట్‌లను ఆక్రమించుకుంటూ రోజురోజుకీ వాణిజ్య మిగులును పెంచుకుంటోంది. చైనాలో ఇటీవలి పరిణామాల గురించి ప్రశ్నించినప్పుడు వైట్‌ హౌస్‌ కార్యదర్శి ‘తమ దేశానికి ఏది మేలు చేస్తుందో ఆ నిర్ణయం తీసుకునే అధికారం వారికి ఉంది’ అని సమాధానమిచ్చారు.

అక్టోబర్‌లో జరిగిన చైనా 19వ కాంగ్రెస్‌ జిన్‌పింగ్‌కు పూర్తి అధికారాలు కట్టబెడుతూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‘అసాధారణమైన పదోన్నతి’ కి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు ఆ తరువాత ఒక ఇంటర్వ్యూలో జిన్‌పింగ్‌ను ‘చైనా రాజు’గా కూడా అభివర్ణించారు. ఇప్పుడు కూడా అధ్యక్ష పదవి పరిమితిని ఎత్తివేయడాన్ని ప్రశంసించారు. దౌత్య పరమైన ఈ పద్దతులు, ఆచారాలను పక్కనపెడితే అంతర్జాతీయ వేదికపై పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని అమెరికా అంచనా వేయలేకపోయిందని మాత్రం స్పష్టమవుతోంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్ధిక నమూనాతో పాటు నిరంకుశ రాజకీయ వ్యవస్థతో చైనా పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయంగా రూపొందుతోంది. అంతర్జాతీయ ప్రాబల్యం సాధించడం కోసం ఆ దేశం మరో రూపంలో సామ్రాజ్యవాద విధానాలకు పాల్పడుతోంది. చైనా రూపొందించిన ఈ అధికార విస్తరణ విధానం గురించి ప్రపంచ దేశాలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.

– డా|| రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *