జిఎస్‌టితో అవినీతి తగ్గింది

జిఎస్‌టితో అవినీతి తగ్గింది

జిఎస్‌టి (వ.సేవ.) పన్నుల వ్యవస్థలో మౌలిక మార్పులు తెచ్చింది. అనేక రకాల వాణిజ్య పన్నులు వసేపలో కలిసిపోయి అనేకమంది అధికారుల, నిర్వహణ, అనేక రకాలుగా అనుసరించడం వంటి భారం నుండి వ్యాపార సమాజానికి ఊరట లభించింది. వసేపలో సాంకేతికత వలన వ్యాపారులకు, అధికారులకు మధ్య నేరు సంబంధాలు ముగిసిపోయి తద్వారా అవినీతి తగ్గిపోయింది.

‘ఒకే దేశం, ఒకే పన్ను’ అమలులోకి వచ్చి సంవత్సరం అవుతోంది. మొదట్లో అనుమానాలు ఉన్నప్పటికీ, ‘సగటు మనిషికీ అనుకూలత’ ‘వాణిజ్య, పరిశ్రమ రంగాలకు ప్రయోజనాలు’, ‘ఆర్థిక రంగ ప్రయోజనాలు’, ‘సరళమైన పన్ను వ్యవస్థ’ వంటి కొలబద్దలతో దీని విజయాన్ని కొలవాల్సి ఉంటుంది.

స్వాతంత్య్రం తరువాత మోది ప్రభుత్వం వస్తుసేవల పన్ను అనే అతి పెద్ద పన్ను సంస్కరణను విజయవంతంగా అమలుచేసింది. అటల్‌ బిహారీ వాజపేయి హయాంలో 2000 సంవత్సరంలో మొదలైన ఈ ఆలోచన, కేల్కర్‌ కమిటి పరిశీలన తరువాత తుదకు జులై 1, 2017 నాడు ప్రారంభమైంది.

‘వ.సే.ప. సహకార సమాఖ్య విధానానికి గొప్ప ఉదాహరణ. జాతి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని దేశ వ్యాప్తంగా ఇంత భారీ పన్ను సంస్కరణ అమలు చేయడానికి అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నాయి’.

– ప్రధానమంత్రి నరేంద్రమోది

దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్‌

‘భారత భూభాగం అంతటా అడ్డంకులు లేని వ్యాపారం, లావాదేవీలు’ రాజ్యాంగం 301 అధికరణం ఉద్దేశం. అయితే, వాస్తవంలో 302, 304 అధికరణాల ద్వారా వచ్చిన వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పన్నులు విధించడానికి వాడుకున్నాయి. రాజ్యాంగంలో ఏర్పరచిన రక్షణ ఏర్పాట్లు అమలు కాలేదు. వివిధ రాష్ట్రాలలో వివిధ పన్నురేట్లు, విధానాలు, గజిబిజి పన్ను వ్యవస్థ దేశమంతా ఒకే మార్కెట్‌ ఆవిర్భావానికి అడ్డుగా నిలిచాయి. దీంతో భారతదేశ మార్కెట్‌ 29 ప్రాంతీయ మార్కెట్‌లుగా విడిపోయింది.

రాష్ట్రాల మధ్య ఎగుమతులకు కేంద్రం అమ్మకపు పన్ను విధిస్తుండగా, దిగుమతులపై ప్రవేశపన్ను, ఆక్ట్రాయ్‌ విధించేవారు. వీటి సక్రమ నిర్వహణకు చెక్‌పోస్టులు, ఇతర భౌతిక అడ్డంకులు అవసరమ య్యాయి. ఇతర రాష్ట్రాలకు చేసిన ఎగుమతులు ఇతర దేశాలకు చేసిన ఎగుమతుల కంటే ప్రియం అయ్యాయి. అదే దిగుమతుల విషయంలో కూడా ఇతర దేశాల నుండి దిగుమతులు ఇతర రాష్ట్రాల నుండి దిగుమతుల కంటే చౌక అయ్యాయి. అందు వలన ఈ వాణిజ్య అడ్డంకులను బద్దలు చేయడమే ఈ విప్లవాత్మక సంస్కరణ ప్రధాన ఉద్దేశం.

అనేక పన్నులు భారత పరిశ్రమల పోటీతత్వానికి అడ్డంకిగా మారాయి. అంతరాష్ట్ర కొనుగోలుపై చెల్లించే కేంద్ర అమ్మకపు పన్ను వ్యాపారాలకు అదనపు వ్యయంగా మారింది. దీంతో ఎగుమతులపై వ్యతిరేక ప్రభావం, దిగుమతులపై ప్రోత్సాహక సానుకూల ప్రభావం పడ్డాయి. వీటన్నిటికి ఏకైక పరిష్కారం వసేప. ఏకీకృత జిఎస్‌టి (వస్తువులు, సేవల పన్ను – వసేప) వ్యవస్థ వలన దేశ వ్యాప్తంగా తయారీదారులు, చిల్లర వర్తకులు, వినియోగదారులు అందరూ ప్రయోజనం పొందగలరు.

పన్ను పరిధి విస్తరణ

చాలామంది అనుకుంటున్నట్లు వసేప ఉపద్రవమూ కాదు, ఆర్థిక వ్యవస్థను అకస్మాత్తుగా నిలిపివేయనూ లేదు. ఈ ప్రణాళిక అమలు దశకు చేరడానికి దశాబ్దాలు పట్టినప్పటికీ, అమలు మాత్రం చెప్పుకోదగినంత వేగంగా జరిగింది. సెప్టెంబరు 2017 బదులు జూన్‌లోనే ప్రారంభించినందున ప్రారంభ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వానికి తగినంత సమయం లభించింది. సరఫరా సమయంలో అన్ని వస్తు, సేవలపై వసేప విధించడం (కొన్ని మినహాయింపులతో) ద్వారా పన్ను చెల్లింపుదారులు పెరిగి, ఆదాయం పెరిగింది. మార్చి 2, 2018 నాటికి 1,03,99,305 మంది పన్ను చెల్లింపుదారులు వసేప క్రింద నమోదు చేసుకోగా అందులో 54-42 లక్షలమంది పాత పన్ను వ్యవస్థ నుంచి మారిపోయారని, 39.56 లక్షలమంది వసేప కింద కొత్తగా నమోదు చేసుకున్నారని ఆర్థికశాఖ సహాయమంత్రి శివ్‌ప్రతాప్‌ శుక్ల తెలిపారు.

ఈ గణాంకాలు పరిశీలిస్తే పన్ను చెల్లింపు దారులు పెరగడమేకాక ఆదాయం కూడా పెరుగుతోందని అర్థం అవుతోంది.

సహకార సమాఖ్య

గమ్యస్థానం ఆధారంగా వసేప విధించడం వలన వినియమం జరిగే రాష్ట్రాలకు పన్ను అందుతుంది. అయితే తయారీ చేసే రాష్ట్రాలకు అసౌకర్యం ఉంది. అటువంటి రాష్ట్రాలకు పరిహారం ఇచ్చేందుకు కేంద్రం భరోసా ఇచ్చింది. కొత్తగా ఏర్పాటయిన వసేప కౌన్సిల్‌ సహకార సమాఖ్య ఆలోచనకు అద్దం పడుతోంది. అవసరమైన సందర్భా లలో ఈ కౌన్సిల్‌ దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది.

ముఖ్యంగా ఎగుమతిదారులు, చిన్న పరిశ్రమ దారులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించ డానికి ఎన్నో చొరవలు తీసుకున్నారు. వసేప వలన ఎగుమతుల వ్యయాలు తగ్గి ఎగుమతులు 3.2 నుండి 6.3 శాతం పెరుగుతాయని అంచనా.

సమస్యల పరిష్కారం

వసేప అమలుతో కొన్ని సమస్యలూ వచ్చాయి. వాటి పరిష్కారానికి విధాన నిర్ణేతలు త్వరగా స్పందించగలరని, వారికి ఆ సామర్థ్యం ఉందని వసేప అమలు తీరుతో అర్థం అవుతోంది. మార్పు నిర్వహణపై చూపిన ఉత్సాహం గొప్పది. ఇదే ఉత్సా హంతో పనిచేసి ప్రభుత్వం సామాన్యునికి ప్రయో జనం కలిగించే విధంగా చర్యలు తీసుకోగలదని ఆశిద్దాం.

గణనీయంగా తగ్గిన ట్రక్కుల టర్న్‌ ఎరౌండ్‌ సమయం

ట్రక్కుల టర్న్‌ ఎరౌండ్‌ సమయం (పని పూర్తిచేసుకొని తిరిగి వచ్చేందుకు పట్టే కాల వ్యవధి) గణనీయంగా తగ్గిందని ఇక్రా అధ్యయనం తెలిపింది. సంవత్సరం క్రితం వసేప అమలులోకి వచ్చినప్పటి నుంచి ట్రక్కుల టర్న్‌ ఎరౌండ్‌ సమయం గణనీయంగా తగ్గింది. ఇంతకుముందు సరిహద్దుల వద్ద ఎక్కువ సమయం వేచియుండేవి. కేరళ, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బీహారు రాష్ట్రాలలో ఈ ప్రభావం బాగా కనిపిస్తోంది. ఇక్రా అంచనా ప్రకారం వసేప కారణంగా టర్న్‌ ఎరౌండ్‌ సమయం 18-20% మెరుగైంది అని ఇక్రా అధ్యయనం వెల్లడించింది.

సరళమైన వ్యవస్థకు మారాల్సిన తరుణం

– రశేష్‌ షా, ఫిక్కీ అధ్యక్షుడు

జులై 1, 2017న ప్రవేశపెట్టిన వసేప దేశ పన్నుల చరిత్రలో ఒక మైలురాయి. వసేప ఒక సంవత్సర చరిత్ర దీని విజయవంతమైన అమలుకు, జాతి యావత్తు చేసిన చెప్పుకోదగిన ప్రయాణానికి తార్కాణం.

గత సంవత్సరం అంతా ఎన్నో సవాళ్ళు ఎదురయ్యాయి. సగటు జీవికి వసేవ అమలు వలన మొదట్లో సమస్యలు వచ్చినప్పటికి ఇపుడు అవన్నీ సమసిపోయాయి. కొత్త జాతీయ పరోక్ష పన్నుల వ్యవస్థకు సర్దుబాటు కావడం పరిశ్రమ వర్గాలకు పెద్ద సవాలుగా నిలిచింది. వీటన్నిటి మధ్యలో వసేప అమలు సవ్యంగా సాగేందుకు ప్రభుత్వం, వసేప కౌన్సిల్‌లు దిద్దుబాటు చర్యలకై తీసుకున్న చొరవ, సంప్రదింపుల విధానం ఎంతో ప్రశంసనీయం.

వసేప రెండో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. దీని వాస్తవ లక్ష్యాలను సాధించేందుకు ఇంకా చేయవలసింది చాలా ఉంది. సరసమైన పన్ను రేట్లతో పారదర్శకమైన, సరళమైన పన్నుల సేకరణ విధానం అవసరం ఉంది.

రిటర్నుల సమర్పణ ప్రక్రియను ఇంకా సరళం చేయాలి. కొత్త రిటర్న్‌ సమర్పణ విధానం అమలుచేసే ముందుగానే, దానిని పూర్తిగా పరీక్షించి, ప్రతిపాదిత రిటర్న్‌ పత్రాలను ప్రజాక్షేత్రంలో ఉంచి, వివిధ భాగస్వాములతో చర్చించిన తరువాత తుది నిర్ణయం చేయాలి.

ఇంకా, వసేప సంస్కరణం యదార్థంగా ప్రభావవంతంగా చేయడానికి పెట్రోలియం, స్థిరాస్తి సహా ప్రస్తుతం వసేప పరిధిలో లేని రంగాలను అంతిమంగా వసేప పరిధిలోకి తేవలసిన అవసరాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రస్తుతం ఉన్న వసేప రేట్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మూడు అంతస్తులకు కుదించాలి.

దేశవ్యాప్తంగా ఒకే రిజిస్ట్రేషన్‌ నంబరు అనుమతించాలి

– ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌, సెక్రటరి జనరల్‌, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌

వసేప పన్నుల వ్యవస్థలో మౌలిక మార్పులు తెచ్చింది. అనేక రకాల వాణిజ్య పన్నులు వసేప లో కలిసిపోయి అనేకమంది అధికారుల, నిర్వహణ, అనేక రకాలుగా అనుసరించడం వంటి భారం నుండి వ్యాపార సమాజానికి ఊరట లభించింది. వసేపలో సాంకేతికత వలన వ్యాపారు లకు, అధికారులకు మధ్య నేరు సంబంధాలు ముగిసిపోయి తద్వారా అవినీతి తగ్గిపోయింది.

ఇన్‌పుట్‌ క్రెడిట్‌ల లభ్యత వసేప వ్యవస్థలో ముఖ్యమైన ప్రయోజనం. వసేప వ్యవస్థలో సరఫరాలో చిట్టచివరి వినియోగదారుడే పన్నులు చెల్లించవలసి ఉన్నందున తమ స్వంత డబ్బును చెల్లించే అవసరం ఉండకపోవటం ప్రధాన ప్రయోజనం. ఈ లక్షణం వలన వసేప విలక్షణ మైన పన్ను వ్యవస్థ అవుతున్నది. వసేప పన్ను వ్యవస్థ స్థిరత్వం పొందిన తరువాత ఇది వ్యాపారు లకు, ప్రభుత్వానికి ప్రయోజనకారి అవుతుంది.

అయితే అనేక రిటర్నులు సమర్పించవలసి రావడం, ప్రభుత్వం నుంచి రావలసిన తిరిగి చెల్లింపులు, వసేప ప్రాథమిక విషయాల గురించి అవగాహన కల్పించడం, చట్టప్రకారం అనుసరించ వలసిన బాధ్యత వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే దృష్టిసారించాలి. నెలవారీ రిటర్నుల బదులు త్రైమాసిక రిటర్నుల సమర్పణ విధించాలి. అంతేకాక, తిరిగి చెల్లింపులు వ్యాపారుల ఖాతాలో వాటంతట అవే జమకావాలి. హెచ్‌ఎస్‌ఎన్‌ కోడ్‌ తయారీదారులకు మాత్రమే వర్తింపచేయాలి. వర్తకులకు వర్తింపచేయరాదు.

ప్రతి రాష్ట్రంలోను రిజిస్ట్రేషన్‌ చేసుకొనే బదులు దేశవ్యాప్తంగా ఒకే రిజిస్ట్రేషన్‌ నంబరు అంగీకరించాలి. కంప్యూటర్‌లు లేని వ్యాపారులకు వాటిని సమకూర్చుకొనేందుకు ప్రభుత్వం రాయితీ (సబ్సిడీ) ఇవ్వాలి. ప్రభుత్వం, వ్యాపారుల మధ్య పరస్పర సహకారంతో వసేప మంచి పన్ను వ్యవస్థగా ఆవిర్భవించగలదు.

– డా.సారంగపాణి

– ఆర్గనైజర్‌ నుండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *