చైనా అప్పుల బూచిని గుర్తిస్తున్న దేశాలు

చైనా అప్పుల బూచిని గుర్తిస్తున్న దేశాలు

చైనా విస్తరణవాదాన్ని మొదట్లో పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన యూరోపియన్‌ యూనియన్‌ ఇప్పుడు కళ్ళు తెరిచింది. అంతర్జాతీయ విత్త నిధి (ఇంటర్‌ నేషనల్‌ మోనిటరీ ఫండ్‌) కూడా చైనా విధానాలపట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ దేశాలను హెచ్చరించింది. దీనితో చైనా నిర్వహించే వార్షిక సమావేశాల పట్ల తూర్పు యూరోపియన్‌ దేశాల్లో ఆసక్తి తగ్గిపోయింది.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన హంబన్‌తోట నౌకా కేంద్రంపై హక్కులను ఎలా వదులుకోవలసివచ్చిందో వివరిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఇటీవల ఒక కథనం ప్రచురించింది. ఈ సంచలనాత్మ కథనంతో తమ వన్‌ బెల్ట్‌, వన్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ అందరికీ ‘ప్రయోజనాకారి’ అంటూ చైనా చేసిన ప్రచారం వట్టి బూటకమని తేలిపోయింది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌ పేరుచెప్పి చైనా అనేక దేశాలపై ‘అప్పుల ఊబి దౌత్యవిధానం’ అమలుచేస్తోందన్న నిపుణుల విశ్లేషణలు సరైనవేనని కూడా స్పష్టమైంది. స్పష్టతలేని చైనా ఋణ విధానం, ఆర్ధిక సహాయాన్ని న్యూయార్క్‌ పత్రిక బయటపెట్టింది. ఇలా చైనా అప్పులు, ఆర్ధికసహాయం అనే వలలో చిక్కుకుని శ్రీలంక విలవిలలాడటం చూసిన మయన్మార్‌ ముందుగానే కళ్ళు తెరచి జాగ్రత్తపడింది.

జాగ్రత్త పడుతున్న మయన్మార్‌

ఆసియా ఆర్ధిక వ్యవస్థల మధ్య పటిష్టమైన సహకారం పేరుచెప్పి చైనా మయన్మార్‌లోని రఖిన్‌ రాష్ట్రంలో క్యైక్‌ ప్యూ నౌకా కేంద్రాన్ని చేజిక్కించుకోవా లని, ఆ విధంగా మలక్కా సందిగ్ధం నుంచి బయటపడాలని భావించింది. మొదట్లో క్యైక్‌ ప్యూ నుండి చైనాలోని కూన్‌ మింగ్‌ వరకు సహజవాయు పైప్‌ లైన్‌ నిర్మించడానికి చైనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో చైనాదే అధిక వాటా కావడం వల్ల 2015లో ప్రారంభమయిన పైప్‌ లైన్‌ నిర్మాణం 2017 నాటికి పూర్తి అయ్యింది. క్యైక్‌ ప్యూ వ్యూహాత్మక ప్రయోజనాన్ని బాగా గుర్తించిన చైనా ఇక్కడే 7.3 బిలియన్‌ డాలర్లతో నౌకశ్రయాన్ని నిర్మించడానికి ఒప్పందం చేసుకోవడమేకాక బంగాళాఖాతం తీరం వెంబడి ప్రత్యేక ఆర్ధిక జోన్‌ను ఏర్పాటు చేసేందుకు 2.7 బిలియన్‌ డాలర్ల సహాయం అందించడానికి కూడా ముందుకు వచ్చింది. నౌకాశ్రయాన్ని నిర్మించడంలో అన్నివిధాలుగా సహాయం అందిస్తామన్న చైనా 50 ఏళ్ల పాటు పోర్ట్‌ నిర్వహణ బాధ్యతలు కూడా నిర్వహిస్తామని, ఆ తరువాత అవసరమైతే మరో 25 ఏళ్లపాటు ఆ బాధ్యత తీసుకుంటామని ఒప్పందంలో పేర్కొంది. మొత్తం ప్రాజెక్ట్‌లో 70శాతం తమ వాటా ఉంటుందని స్పష్టం చేసింది. ఏకంగా లక్ష ఉద్యోగాలు దీనివల్ల వస్తాయని, ఇవి ఈ ప్రాంతపు రూపురేఖల్ని మార్చేస్తాయని పేర్కొంది. 2017 డిసెంబర్‌లో మయన్మార్‌ కౌన్సిలర్‌ ఆంగ్‌ సాన్‌ సుకి చైనా – మయన్మార్‌ ఆర్ధిక నడవా ఏర్పాటుకు అంగీకారం తెలిపారు కూడా. ప్రస్తుతం రోహింగ్యాల విషయంలో మయన్మార్‌ అంతర్జాతీయ విమర్శలను ఎదుర్కొం టోంది. అలాగే యూరోపియన్‌ యూనియన్‌ ఆ దేశంపై ఆయుధ సరఫరా నిషేధాన్ని కూడా విధించింది. అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టి రెండేళ్ళు కావస్తున్నా అమెరికా – మయన్మార్ల మధ్య సంబంధాలను పునరుద్ధరించడానికి డొనాల్డ్‌ ట్రంప్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఇలా అమెరికా పట్టించుకోకపోవడంతో మయన్మార్‌ చైనాకు దగ్గరైంది. పాశ్చాత్య ప్రపంచపు తలుపులు మూసుకు పోవడంతో రుణాలకోసం, ఆర్ధిక సహాయం కోసం చైనా వైపు చూడవలసి వచ్చింది. ఒకపక్క చైనా అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక, మరోపక్క ప్రత్యేక ఆర్ధిక నడవా ఏర్పాటులో మరిన్ని నిధులు ఇవ్వాలంటూ పాకిస్తాన్‌ పదేపదే చైనాను కోరడం వంటి పరిణామాలు మయన్మార్‌లో చైనా ఆర్ధిక సహాయం పట్ల సందేహాలు కలిగించాయి. రాజధానికి చాలా దూరంలో ఉన్న నౌకాశ్రయం వల్ల పెద్దగా లాభపడలేక పోయిన శ్రీలంక అనుభవాన్ని చూసిన తరువాత క్యైక్‌ ప్యూ ప్రాజెక్ట్‌ ముందుకు సాగడం ‘సందేహాస్ప దమే’నంటూ మయన్మార్‌ మంత్రి ఒకరు అన్నారు.

2017 నాటికి మయన్మార్‌ విదేశీ అప్పు 9.6 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇందులో 40 శాతానికి పైగా చైనాకు తీర్చవలసి ఉంది. ప్రాజెక్టు పేరుతో 10 బిలియన్‌ డాలర్ల సహకారాన్ని అందుకుంటే అప్పుడు ఆ అప్పు మరింత పెరుగుతుంది. పనామా కాలువ విస్తరణకే 5.25 బిలియన్‌ డాలర్లకు మించి కాలేదని, ఈ పోర్ట్‌ ప్రాజెక్టు కోసం 7 బిలియన్‌ డాలర్లు ఖర్చవుతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆర్ధిక సలహాదారు సీన్‌ టర్నెల్‌ అంటున్నారు. అప్పు తీరే వరకు హంబన్‌తోట నౌకాశ్రయాన్ని 99 ఏళ్లపాటు తమ ఆధీనంలో ఉంచుకుంటామని చైనా చేసిన ప్రతిపాదనను దృష్టిలో ఉంచుకుని, మయన్మార్‌ బాగా ఆలోచించుకోవాలని ఆయన అభిప్రాయ పడ్డారు. ఒకప్పుడు శ్రీలంకకు ఏం జరిగిందో, ఇప్పుడు మయన్మార్‌కూ సరిగ్గా అదే జరుగుతోందని అన్నారు. అప్పుల ఉచ్చు గురించి ఆలోచించుకుని దేశాలు వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు.

కిర్గిస్థాన్‌

చైనా ప్రాజెక్ట్‌లలో అవినీతికి పాల్పడ్డారంటూ ఇటీవల మాజీ ప్రధాని, కొందరు ప్రభుత్వాధికారులపై ఆరోపణలు వచ్చినప్పటినుంచి తమపై చైనా దుష్ప్రభావం గురించి కిర్గిస్థాన్‌ కూడా ఆందోళన చెందుతోంది. ఆ దేశపు స్థూల జాతీయాదాయం 7 బిలియన్‌ డాలర్లు ఉంటే విదేశీ అప్పు 4 బిలియన్‌ డాలర్లు ఉంది. ఇందులో సగానికి పైగా చైనాకు తీర్చవలసిన అప్పే ఉంది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఆ దేశం అప్పుడే చర్యలు తీసుకుంటోంది. చుట్టూ ఉన్న టర్కీ, కజగిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌ మొదలైన దేశాలతో సంబంధాలను బలపరుచుకునే ప్రయత్నంలో ఉంది. చైనాతో కుదుర్చుకున్న ఆర్ధిక ఒప్పందాల కారణంగా ఒక్క ఆర్ధిక రంగంలోనేకాక, సాంస్క తిక రంగంలో కూడా తమపై చైనా ప్రాబల్యం పెరిగిపోయిందని కిర్గిస్థాన్‌ భావిస్తోంది. పర్యావరణ పరిరక్షణను పట్టించుకోక పోవడం, ఉత్పత్తి కోసం కార్మికులను పీడించడం వంటి చైనా విధానాల పట్ల తమ దేశస్తుల్లో ఆగ్రహం, అసంతప్తి వ్యక్తమవుతున్నాయని కిర్గిస్థాన్‌ పాలకులు గుర్తించారు. సరైన టెండర్‌ ప్రక్రియను అనుసరించ కుండా లంచాలు తీసుకుని ప్రభుత్వ అధికారులు చైనా కంపెనీలకే ప్రాజెక్ట్‌లు కట్టబెట్టారని ప్రభుత్వ విచారణలో తేలింది. ఈ కాంట్రాక్ట్‌లన్నింటికి చైనా ఎక్స్‌పోర్ట్‌, ఇంపోర్ట్‌ బ్యాంక్‌ నిధులు సమకూర్చింది.

వియత్నాం

వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన మూడు ప్రదేశాలలో ప్రత్యేక ఆర్ధిక జోన్‌లను ఏర్పాటు చేయాలనుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వియత్నాంలో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రత్యేక జోన్‌ల ఏర్పాటును ప్రభుత్వం చైనా పెట్టుబడిదారుల చేతిలో పెట్టిందన్న విషయం వారి ఆందోళనకు కారణం. ‘చైనాకు మన భూభాగాన్ని ఒక్కరోజుకైనా లీజుకు ఇవ్వడానికి వీలులేదు’ అంటూ ప్రజలు నిరసన తెలిపారు. దీనితో వెనక్కు తగ్గిన ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. అపారమైన సైనికీకరణకు పాల్పడుతున్న చైనా దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం బెస్తవారు చేపలు పట్టుకునేందుకు కూడా అనుమతివ్వడం లేదు. అలాగే వియత్నాం చమురు అన్వేషణ కార్యక్రమానికి కూడా అడ్డంకులు సష్టిస్తోంది. ¬చిమిన్‌ నగరంలో ప్రారంభమయిన చైనా వ్యతిరేక ప్రదర్శనలు క్రమంగా దేశమంతటా వ్యాపించాయి.

కంబోడియా

చైనా పెట్టుబడులు, అప్పులు కంబోడియాలో కూడా కలకలం స ష్టిస్తున్నాయి. కంబోడియాలో సముద్రం ఒడ్డున ఉన్న సిహనోక్వీల్లే నగరం వినోదకేంద్రంగా మారిపోయింది. గత పదేళ్లలోనే అక్కడ 30కి పైగా కాసినోలు వెలిశాయి. వీటిలో అంతా చైనా పనివాళ్లే. ఇక్కడికి వచ్చేది కూడా ఎక్కువగా చైనా పర్యటకులే. ఇలా తమ నగరంలో చైనా వాళ్ళు వ్యాపారం చేయడం స్థానికులకు నచ్చడం లేదు. ఎందుకంటే వారిలో ఎక్కువమంది పేదరికంలో మగ్గుతున్నవారే. పెద్దఎత్తున చైనా పర్యాటకులు రావడంతో నగరంలో వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చైనా నుండి వరదలా వచ్చిపడుతున్న పెట్టుబడుల ముందు కంబోడియా ఆర్ధిక వ్యవస్థ నిలవలేకపోతోంది. దానికి తోడు చైనా పర్యాటకులు, స్థానికులకు మధ్య కలతలు, కలహాలు కూడా తలెత్తుతున్నాయి. కంబోడియాలో విదేశీ పెట్టుబడుల్లో 90 శాతానికి పైగా చైనా నుండి వచ్చినవే. కంబోడియా నిరంకుశ పాలకుడు హున్‌ సేన్‌కు చైనా గట్టిగా మద్దతునిస్తోంది. విపక్షాన్ని ఉక్కుపాదంతో అణచివేయడం, మానవహక్కులను కాలరాయడం వంటి నిరంకుశ విధానాలకు పాల్పడు తున్నదంటూ పాశ్చాత్యదేశాలు ఖండిస్తున్నప్పటికి హున్‌ సేన్‌ను చైనా వెనకేసుకొస్తోంది. దిగజారి పోతున్న ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దుకోవడం కోసం కంబోడియా ప్రభుత్వం చైనా పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచేసింది. దీనితో ఆ దేశం చైనా వన్‌ బెల్ట్‌, వన్‌ రోడ్‌ ప్రాజెక్టు (ఒబిఒఆర్‌)లో కీలక భాగస్వామి అయింది.

లావోస్‌

గత మాసం ఒబిఒఆర్‌లో భాగంగా లావోస్‌లో ఏర్పరచిన చైనా సిమెంట్‌ ఫ్యాక్టరీలపై సాయుధ దళాలు దాడిచేసి పెద్దమొత్తంలో డబ్బు, విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. చైనా కంపెనీ లలో భాగస్వామిగా ఉన్న లావోస్‌ వ్యాపారస్తుడు కోరిన మీదట ప్రభుత్వ దళాలే దాడిలో పాల్గొన్నాయని అధికారిక ప్రకటన వెలువడింది కూడా. ఉమ్మడి భాగస్వామ్య కంపెనీ నుంచి చైనా మోసపూరితంగా లక్షల డాలర్లు తరలించిందని లావోస్‌ వ్యాపారస్తుడు ఆరోపించాడు. ‘ఈ మోసం ఇతర కంపెనీలకు నష్టం కలిగించకుండా నివారించేందుకే’ సాయుధ బలగాల దాడి నిర్వహించామని ప్రభుత్వ అధికారి ప్రకటిం చారు. ఇంతకు ముందు కూడా చైనా ఇలాంటి దోపిడీకి పాల్పడ్డప్పుడు లావోస్‌ అధికారులు ఇలాంటి దాడులే నిర్వహించారు.

యూరోపియన్‌ దేశాలు

చైనా పెట్టుబడులంటే తూర్పు యూరోపియన్‌ దేశాల్లో ఇంతకు ముందున్న ఆసక్తి, ఉత్సాహం ఇప్పుడు లేవు. చిన్న దేశాలన్నిటిని కలుపుకుని తన ప్రాబల్యం పెంచుకోవాలని చైనా 2012లోనే ఈ విధానాన్ని అమలుచేయడం ప్రారంభించింది. ఇందులో 16 దేశాలు – బల్గేరియా, క్రోయేషియా, చెకోస్లోవేకియ, ఎస్టొనియా, హంగరీ, లాట్వియా, లిథువేనియా, పోలండ్‌, రొమేనియా, స్లోవాకియా, స్లొవేనియాలు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలైతే అల్బేనియా, బోస్నియా, హెర్జగోవినా, మాసెడోనీయ, మొంటెనెగ్రో, సెర్బియాలు యూరోపియన్‌ యూనియన్‌లో లేని దేశాలు.

చైనా విస్తరణవాదాన్ని మొదట్లో పట్టించుకో కుండా నిర్లక్ష్యం చేసిన యూరోపియన్‌ యూనియన్‌ ఇప్పుడు కళ్ళు తెరిచింది. అంతర్జాతీయ విత్త నిధి (ఇంటర్‌ నేషనల్‌ మోనిటరీ ఫండ్‌) కూడా చైనా విధానాలపట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ దేశాలను హెచ్చరించింది. దీనితో చైనా నిర్వహించే వార్షిక సమావేశాల పట్ల తూర్పు యూరోపియన్‌ దేశాల్లో ఆసక్తి తగ్గిపోయింది. చైనా కార్మికులను, వస్తువులను ఎక్కువగా ఉపయోగించడం, యూరోపియన్‌ యూనియన్‌ ప్రమాణాలకు తగినట్లుగా నిర్మాణాలు లేకపోవడం వంటి విషయాల్లో ఈ దేశాలు తమ అసంతప్తిని వ్యక్తం చేశాయి.

బెల్‌గ్రేడ్‌, బుడాపెస్ట్‌ల మధ్య రైలు మార్గ నిర్మాణానికి చైనా పెట్టుబడులు పెట్టడంతో హంగరీ, సెర్బియాలు ఈ పెట్టుబడులపట్ల సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నా, ఇతర దేశాలు మాత్రం అసంతప్తితో ఉన్నాయి. చైనా తన హామీలను నిలబెట్టుకోవడం లేదని పోలెండ్‌, రొమేనియా, స్లోవాకియాలు తమ నిరసన వ్యక్తం చేశాయి కూడా. చైనా ఎక్జిమ్‌ బ్యాంక్‌ ఇచ్చే అప్పులతో బెల్‌ గ్రేడ్‌, బుడాపెస్ట్‌ల మధ్య నిర్మించ తలపెట్టిన హైస్పీడ్‌ రైలు మార్గానికి 2.89 బిలియన్‌ డాలర్లు ఖర్చవుతాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌ ఏమాత్రం లాభదాయకం కాదని యూరోపియన్‌ యూనియన్‌ తేల్చింది. ఈ రైలు మార్గం చైనాకు చాలా అవసరం. ఎందుకంటే యూరోప్‌లోని దేశాలకు తన వస్తువు లను చేరవేయడానికి చైనాకు ఇది ముఖ్యమైన మార్గం అవుతుంది. కానీ యూరోపియన్‌ యూనియన్‌ ప్రమాణాలకు తగినట్లుగా లేదన్న అభ్యంతరాల వల్ల ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు అవరోధాలు ఎదురవుతు న్నాయి. వివిధ దేశాల మధ్య ప్రయాణ సంబంధాల పేరుతో తన విస్తరణవాదాన్ని, వేర్పాటువాదాన్ని నెగ్గించుకోవాలనుకుంటున్న చైనాకు ఈ ప్రాజెక్ట్‌ నిలిచిపోతే ఇబ్బందే. ఇలా వివిధ దేశాలు చైనా పెట్టుబడులపట్ల సందేహాలు వ్యక్తం చేస్తుంటే నేపాల్‌ మాత్రం ఇటీవల 2.4 బిలియన్‌ డాలర్ల మౌలిక సదుపాయాల రంగానికి చెందిన ప్రాజెక్ట్‌లపై ఒప్పందం కుదుర్చుకోవడం విచిత్రంగా ఉంది. శ్రీలంక ఎదుర్కొన్న నష్టాన్ని గమ నించకపోవడం నేపాల్‌కు ప్రమాదకరమే అవుతుంది.

– డా.రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *