గుజరాత్‌, హిమాచల్‌ ఎన్నికలు చెబుతున్న పాఠాలు

గుజరాత్‌, హిమాచల్‌ ఎన్నికలు  చెబుతున్న పాఠాలు

 

– జాతీయ వాదానికే ప్రజలు మొగ్గుచూపారు

– కుల, ప్రాంతీయ రాజకీయాలను తిరస్కరించారు

– కనుమరుగైన మైనారిటీ రాజకీయాలు

– నకిలీ హిందుత్వాన్ని గుర్తించాలి

– ఇది రెండు దృక్పథాల మధ్య పోటి

– బిజెపిది అసాధారణ విజయం

గుజరాత్‌లో బిజెపి విజయానికి, కాంగ్రెస్‌ ఓటమికి ఒకే ఒక్క కారణం ఉంది. అది బిజెపి కార్యకర్త. కాంగ్రెస్‌ కూడికలు, తీసివేతల రాజకీయం చేసింది. కానీ ఓటర్లను పూర్తిగా ప్రభావితం చేయలేకపోయింది. బిజెపి జాతీయవాద రాజకీయాలు చేసింది. తన సర్వశక్తులను ఒడ్డి ఎన్నికల్లో విజయం సాధించింది. రానున్న అన్ని ఎన్నికల్లోనూ సంస్థాగత పటిష్టత; కార్యకర్తల ఉద్యమశీలత; తాము దేశానికి, జాతీయ వాదానికి సేవ చేస్తున్నామన్న అవగాహన చాలా ముఖ్యం. గుజరాత్‌, హిమాచల్‌ ఎన్నికలు చెబుతున్న పాఠాలు ఇవే.

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి పోయాయి. విజయం ఎవరిదన్న విషయంలో ఏనాడూ, ఏ దశలోనూ ఎవరికీ సందేహాలు లేవు. భారతీయ జనతా పార్టీ రెండు చోట్లా విజయం సాధించి తీరుతుందన్నది ముందస్తుగానే అందరికీ తెలుసు.

నిజానికి ఈ ఎన్నికల నుంచి ఏం నేర్చుకోవాల న్నదే అతి ముఖ్యమైన విషయం. 2019 ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవ డానికి, ఆ ఎన్నికలలో జాతీయవాద శక్తులకు ఎలాంటి సవాళ్లు ఎదురు కానున్నాయో గుర్తించేందుకు ఈ ఎన్నికలు చాలా ఉపయోగ పడతాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌ ఫలితాలనే కాదు, ప్రచార సరళిని, జాతీయవాద వ్యతిరేక శక్తుల వ్యూహాన్ని కూడా లోతుగా పరిశీలించా ల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ముందు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఇది రెండో, మూడో పార్టీల మధ్యో; లేక నలుగురో అయిదుగురో నాయకుల మధ్యో జరిగిన పోరాటం కాదు. రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో అధికారం కోసం చేసిన పోరాటం అంతకన్నా కాదు. ఇది రెండు దక్పథాల మధ్య, రెండు ఆలోచనా విధానాల మధ్య జరిగిన పోరు. దేశం విషయంలో రెండు విరుద్ధ దక్పథాల మధ్య జరిగిన పోరు. కాబట్టి గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలు, ఆ తరువాత జరిగే కర్నాటక, ఇతర రాష్ట్రాల పోరు, ఆ మాటకొస్తే 2019 లో జరిగే సార్వత్రిక ఎన్నికలు సైతం సైద్ధాంతిక కురుక్షేత్రానికి ముందు జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌, సెమీ ఫైనల్స్‌ మాత్రమే. కాబట్టి రెండు రాష్ట్రాల ఎన్నికల గెలుపుతో ఆగిపోవడానికి, కాస్త అలసట తీర్చుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే జరుగుతున్నవి ఒక మహా యుద్ధంలోని చిన్న పోరాటాలు మాత్రమే.

కుల, ప్రాంతీయ తత్వాలే విపక్షాల ఆయుధాలు

రెండవ అతి ముఖ్యమైన పాఠం ఏమిటంటే జాతీయవాదాన్ని దెబ్బతీయడానికి విపక్షాల వద్ద ఉన్న ఆయుధాలు రెండు. ఒకటి కుల విద్వేషాలను రగిలించడం. రెండవది ప్రాంతీయవాదాన్ని పెంచడం. మతం ఇక వారికి ఆయుధం కాదు. మైనారిటీ ఓటు బాంకుల రాజకీయం ఈ దేశంలో ఇక నడవదు. మత విద్వేషాలను పెంచి రాజకీయ పబ్బం గడుపుకోవడం ఇక సాధ్యం కాదు. అందుకే గుజరాత్‌ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కాంగ్రెస్‌ నాయకులెవరూ మసీదుల గడపలు తొక్కలేదు. గుజరాత్‌ అల్లర్ల గురించి ఒక్క రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. గుజరాత్‌ లోపలా, వెలుపలా ఈ విషయంపై ఒక్క నాయకుడు కానీ, బిజెపి వ్యతిరేక నేత, విమర్శకుడు, విశ్లేషకుడు కూడా మాట్లాడ లేదన్నది గమనించాలి. తీస్తా సెతల్వాడ్‌ వంటి వారు కేసుల రాజకీయం చేసి హడావిడి చేయలేదు. హర్ష మందర్‌ వంటి వారు నోరు మెదపనేలేదు. సంజీవ్‌ భట్‌ వంటి మాజీ పోలీసులూ ఒక్క మాట మాట్లాడలేదు. ఒక వ్యూహంలో భాగంగా గుజరాత్‌ అల్లర్లను ప్రస్తావించలేదు.

కాబట్టి విపక్షాల చేతిలో ఉన్న రెండే రెండు ఆయుధాలు కులం, ప్రాంతీయవాదం. ఈ రెండింటినీ రాబోయే రోజుల్లో బిజెపియేతర పార్టీలన్నీ చాలా గట్టిగా ఉపయోగిస్తాయన్నది ఈ ఎన్నికల్లో రుజువైపోయింది. మమతా బెనర్జీ, సిద్ధరామయ్య వంటి వారు ప్రాంతీయ తత్వాన్ని, కులతత్వాన్ని పెద్ద ఎత్తున రెచ్చగొట్టడానికి ప్రయత్నించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్తున్న కర్నాటకలో సిద్ధరామయ్య ఈ ప్రాంతీయ తత్వాన్ని ఎలా రెచ్చగొడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కన్నడ భాష పేరిట ఆయన ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.

కుల రాజకీయాలే కాంగ్రెస్‌కు ఆయువు పట్లు

కులతత్వాన్ని పెంచిపోషించి, జాతిని దెబ్బతీసే ప్రయత్నాలు కూడా చాలా జరగబోతున్నాయి. గుజరాత్‌ అందుకు ఒక పెద్ద ఉదాహరణ. గుజరాత్‌లో కాంగ్రెస్‌ కులరాజకీయాలను ముందుకు తెచ్చింది. హార్దిక్‌ పటేల్‌ పేరిట పటేళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. హార్దిక్‌కు అండదండలు అందించింది కాంగ్రెస్‌ పార్టీయే. అదే విధంగా హార్దిక్‌ చేపట్టిన పాటీదార్ల ఉద్యమానికి వ్యతిరేకంగా జరిగే ఒబిసి, క్షత్రియ నేతల ఆందోళనకు నాయకత్వం వహించిన అల్పేష్‌ ఠాకోర్‌ కూడా కాంగ్రెస్‌ తరఫున ఎన్నికల్లో నిలుచుని గెలిచారు. అంటే అటు పటేళ్లను, ఇటు ఒబిసి క్షత్రియులను రెచ్చగొట్టి లాభపడేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించింది. అయితే హార్దిక్‌ కాంగ్రెస్‌లో చేరలేదు. ఎందుకంటే పటేళ్లు ఆర్ధికంగా రాజకీయంగా ముందు వరుసలో ఉన్నవారు. కాబట్టి వారు వస్తే ఒబిసిల ఓట్లు పోతాయన్న భయం కాంగ్రెస్‌ను పట్టుకుంది. మరో విషయం ఏమిటంటే పటేళ్ల ఓట్ల కోసం కేశూభాయి పటేల్‌ 2012 లో ఒక పార్టీయే పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. ఫలితం ఏమిటో అందరికీ తెలుసు. కాబట్టి పటేళ్లను బిజెపికి దూరం చేయాలే తప్ప వారిని కాంగ్రెస్‌లో కలుపుకోకూడదు. అందుకే హార్దిక్‌ రాహుల్‌ గాంధీని, అహ్మద్‌ పటేల్‌ను పలుమార్లు కలిసినా ఆయనను కాంగ్రెస్‌లో చేర్చుకోలేదు. అల్పేష్‌ ఠాకూర్‌ కాంగ్రెస్‌లో చేరినట్టు చాలా పెద్దెత్తున్న ప్రచారం చేశారు. కానీ వాస్తవం ఏమిటంటే ఆయన తండ్రి ఖోడాభాయి ఠాకొర్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత. కాబట్టి ఇదంతా కాంగ్రెస్‌ ఆడిన కుల రాజకీయం మాత్రమేనన్నది అర్థం చేసుకోవాలి. ఇలాగే షెడ్యూల్డు కులాలను చేరదీయాలని కాంగ్రెస్‌ జిగ్నేష్‌ మేవానీని ముందుకు తీసుకువచ్చింది.

గతంలో కాంగ్రెస్‌ గుజరాత్‌లో కె.హెచ్‌.ఏ.ఎం. (ఖామ్‌) రాజకీయం చేసింది. కె అంటే క్షత్రియ, హెచ్‌ అంటే హరిజన్‌, ఏ అంటే ఆదివాసి, ఎం అంటే ముస్లిం. బిజెపి ఈ కులసమీకరణలను బద్దలు కొట్టగలిగింది. ఈ సారి కాంగ్రెస్‌ ఖాప్‌ రాజకీయం చేసింది. అంటే అల్పేష్‌, భరత్‌ సింగ్‌ సోలంకీ నేతత్వంలో క్షత్రియ, ఒబిసిలు, జిగ్నేష్‌ నేత త్వంలో షెడ్యూల్డు కులాలు, హార్దిక్‌ నాయకత్వంలో పటేళ్లను కలుపుకుని, గిరిజన, ముస్లిం ఓట్లు ఎలాగో తమకే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నించింది. అంటే కాంగ్రెస్‌ గెలిచి ఉంటే గుజరాత్‌ కుల ఘర్షణల కుట్రల కేంద్రంగా మారిపోయి ఉండేది. గుజరాత్‌లో కాంగ్రెస్‌ సీట్లు పెరిగాయి కాబట్టి కాంగ్రెస్‌ దానితో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు ఈ కుల కుట్రలకు పాల్పడి, సమాజాన్ని చీల్చే ప్రయత్నాలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ముసుగు కమ్యూనిస్టుల ప్రమాదం

మరొక సవాలు కూడా ఉంది. అదేమిటంటే కమ్యూనిస్టులు తాము కమ్యూనిస్టులుగా పోరాడినట్టయితే గెలిచే అవకాశాలు లేవు కాబట్టి వేర్వేరు సంస్థల పేర్లతో ఎన్నికల్లో పోరాడి, కుల చిచ్చు పెట్టి విజయం సాధించవచ్చు. జిగ్నేష్‌ మేవానీ అందుకు తాజా ఉదాహరణ. జిగ్నేశ్‌ మేవానీ కమ్యూనిస్టు పార్టీకి చెందిన వాడు. ఢిల్లీ జంతర్‌ మంతర్‌లో వామపక్షీయులు ఏర్పాటు చేసే అన్ని కార్యక్రమాల్లోనూ జిగ్నేశ్‌ ఖాయంగా ఉంటాడు. అంతే కాదు. అంబేద్కర్‌ మార్క్స్‌ అంతటి గొప్ప ఆలోచనాపరుడు కాడని బహిరంగంగా ప్రకటించిన వాడు. సిపిఐకి చెందిన జెఎన్‌యు విద్యార్థి సంస్థ నేత కన్హయ్యా కుమార్‌తో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కానీ గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో కేరళ కమ్యూనిస్టులు జిగ్నేశ్‌ను ఒక కార్యక్రమానికి పిలిస్తే ఆయన వెళ్లలేదు. ఎందుకంటే తాను కమ్యూనిస్టు అని తెలిస్తే ఓట్లు పడవు కాబట్టి దళిత వాద ముసుగు వేసుకోవడానికి జిగ్నేశ్‌ ఇష్టపడ్డాడు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ముసుగులోనూ గోపాల్‌ రాయ్‌ వంటి మాజీ నక్సలైట్లు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి జిగ్నేశ్‌ వంటి నేతలు చాలా మంది పుట్టుకురావడం ఖాయం. ఈ సవాలును ఎదుర్కొనేందుకు జాతీయవాద శక్తులు సన్నద్ధంగా ఉండాలి.

ఇలాంటి వారందరూ కాంగ్రెస్‌ తోనే చేతులు కలుపుతారు. అది ఆంధ్ర, తెలంగాణాలైనా, గుజరాత్‌ అయినా చాలా మంది మాజీ కమ్యూనిస్టులు, మాజీ నక్సల్స్‌ కాంగ్రెస్‌లో ఉన్నారన్నది బహిరంగ రహస్యం. వారి రాజకీయ ఆలోచనా విధానం ఇప్పటికీ మార్క్సిజంపైన, జాతీయవాద వ్యతిరేకత పైనే ఆధారపడి ఉన్నాయన్నదీ బహిరంగ సత్యం.

సంస్థాగత పటిష్టతే కీలకం

ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు బిజెపి, జాతీయ వాద శక్తులు తయారు కావలసిన అవసరం ఉంది. నిజానికి గుజరాత్‌లో ఇంత క్లిష్టమైన కుట్రలు జరుగుతున్నా బిజెపి విజయం సాధించగలిగింది. సీట్లు తగ్గినట్టు కనిపించినా బిజెపి గెలుపు మామూలు విజయం కాదు. ఇది కులతత్వ రాజకీయాలపై బిజెపి సాధించిన విజయం. గుజరాత్‌లోనే కాదు, మిగతా దేశంలోనూ కుల, ప్రాంతీయ తత్వాలు మరింత పెచ్చరిల్లచేసే ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి జాతీయవాద శక్తులు తమ సంస్థాగత పటిష్టతను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సైద్ధాంతిక అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది.

నిజానికి గుజరాత్‌లో ఈ సారి బిజెపి విజయానికి అసలు కారణం సంఘటనాత్మక పటిష్టత. బూత్‌ స్థాయి వరకూ మాత్రమే కాదు. ఆఖరికి ఓటర్ల జాబితాలో పేజీ స్థాయి వరకూ పార్టీ కార్యకర్తలు పూర్తి దీక్షా దక్షతలతో పనిచేశారు. పన్నా ప్రముఖ్‌ ల పేరిట ఒక్కో కార్యకర్త రెండు వందల మంది ఓటర్లతో నిత్య సంబంధాలు కలిగి పనిచేశాడు. ఫలితంగా బిజెపి అనుకూల ఓటర్లను సమీకరించడం, వారిని ఓటింగ్‌ రోజున బూత్‌లకు వెళ్లేలా చేయడంలో బిజెపి విజయం సాధించగలిగింది. దానివల్లే బిజెపి అత్యంత క్లిష్టమైన శత్రు వ్యూహాన్ని ఛేదించ గలిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో సంస్థాగత పటిష్టత, బూత్‌ కంటే దిగువ స్థాయిలో క్రియాశీలత, పట్టుదలతో ఓటర్లను చేరడం, వారికి జాతీయవాద సందేశాన్ని అందించడం చాలా ముఖ్యం.

ఇన్ని కుట్రలు పన్నినా గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఓటమికి, బిజెపి విజయానికి ఒకే ఒక్క కారణం ఉంది. అది బిజెపి కార్యకర్త. కాంగ్రెస్‌ కూడికలు, తీసివేతల రాజకీయం చేసింది. కానీ ఓటర్లను పూర్తిగా ప్రభావితం చేయలేకపోయింది. బిజెపి జాతీయవాద రాజకీయాలు చేసింది. తన సర్వశక్తులను ఒడ్డి ఎన్నికల్లో విజయం సాధించింది.

రానున్న అన్ని ఎన్నికల్లోనూ సంస్థాగత పటిష్టత, కార్యకర్తల ఉద్యమశీలత, తాము కేవలం రాజకీయాలే కాదు, దేశానికి, జాతీయవాదానికి సేవ చేస్తున్నామన్న అవగాహన చాలా ముఖ్యం. గుజరాత్‌, హిమాచల్‌ ఎన్నికలు చెబుతున్న పాఠాలు ఇవే.

అంకెలు, శాతాలు, సీట్లు, ఓట్లు ఈ లెక్కలు విశ్లేషకులు వేసుకుని, వివరణలు ఇచ్చుకుంటూ మరో అయిదేళ్లు గడిపేయవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే కార్యకర్తలు ఉద్యమశీలతతో పనిచేస్తే ఎంత క్లిష్టపరిస్థితిలోనైనా విజయం సాధించవచ్చని గుజరాత్‌ ఎన్నికలు నిరూపిస్తున్నాయి.

నకిలీ హిందుత్వాన్ని గుర్తించాలి

ఈ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ, అహ్మద్‌ పటేల్‌ సహా అందరు కాంగ్రెస్‌ నేతలు హిందూ మందిరాల చుట్టూ చక్కర్లు కొట్టారు. దేవుడికి దణ్ణాలు పెట్టుకున్నారు. తిలకాలు దిద్దుకున్నారు. ప్రసాదాలు తిన్నారు. తీర్థాలు తీసుకున్నారు. ఇది హిందుత్వం పట్ల ప్రేమతో చేసింది కాదు. ఇది ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం.

లోకమత్‌ పరిష్కార్‌ – దీనదయాళ్‌ మంత్రం

ప్రజలను చైతన్య పరచేందుకు పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ‘లోకమత్‌ పరిష్కార్‌’ అన్న ఆలోచనను ముందుకు తెచ్చారు. ప్రజలలో ఉన్న పొరబాటు అభిప్రాయాలు, తప్పుడు అవగాహనలను తొలగించి; వారిని చైతన్యవంతులుగా చేయడం కూడా రాజకీయ పార్టీల బాధ్యత అని ఆయన అన్నారు. దానిని ఆయన ‘లోకమత్‌ పరిష్కార్‌’ అన్నారు. అంటే ప్రజాభిప్రాయాన్ని సరిదిద్దడం. ఈ దష్ట్యా అట్టడుగు స్థాయి నుంచి పార్టీ కార్యకర్తలు జనంతో మమేకం అయి, వారి అభిమానాన్ని చూరగొని, వారిలోని పొరబాటు అభిప్రాయాలను సరిదిద్దాలి. గుజరాత్‌లో అత్యంత కఠిన పరిస్థితులు ఉన్నా బిజెపి విజయం సాధించడానికి ఈ లోకమత్‌ పరిష్కారమే కారణం.

– ఆర్‌.కస్తూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *