కొరియాల మధ్య శాంతి నిజమౌతుందా !

కొరియాల మధ్య శాంతి నిజమౌతుందా !

కొరియా దేశాల మధ్య జరిగిన సమావేశం చారిత్రకమైనది. ప్రపంచ దేశాలన్ని ఈ దృశ్యాన్ని చూచి సంతోషించాయి. కాని కొరియా దేశాల దీర్ఘచరిత్రను పరిశీలిస్తే కొరియా ద్వీపకల్పం అణ్వస్త్ర రహితంగా మారాలంటే చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది.

ఆసియాఖండం దౌత్యపరమైన మధనం నుండి ప్రయాణిస్తోంది. ఏప్రిల్‌ 27, 2018 రోజు ప్రపంచ చరిత్రలో గొప్పగా నిలిచిపోయే రోజు. ఆ రోజు జరిగిన ముఖ్యమైన మూడు సంఘటనలు ప్రపంచంలో దీర్ఘకాలికంగా రగులుతున్న సమస్యలకు పరిష్కారాలు సూచించవచ్చు.

మొదటిది భారత ఉపఖండంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఉహాన్‌లో ప్రధాని మోదీ అనౌపచారిక సమావేశం కాగా, రెండవది రెండు కొరియాల మధ్య జరిగిన చారిత్రిక సమావేశం. ఈ రెండవ సంఘటన ప్రపంచ దేశాలన్నింటి దృష్టిని ఆకర్షించింది. ఈ రెండు సంఘటనలే కాకుండా మూడవది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జర్మన్‌ అధ్యక్షురాలు ఎంజెలా మెర్కెలాతో జరిపిన సమావేశం. ఈ సమావేశంలో ఇనుము, ఉక్కుల వాణిజ్యంతో పాటు ఇరాన్‌తో గల అణు ఒప్పందంపై చర్చించారు.

ఇరు కొరియా దేశాల మధ్య సైన్యం కాపలా లేని ప్రదేశం (నిస్సైన్య మండలం) దక్షిణ కొరియాలో పనుంజోమ్‌లోని ట్రూస్‌ గ్రామంలో ఉంది. ఈ గ్రామం ఉత్తర, దక్షిణ కొరియా దేశాలను వేరు చేస్తుంది. ఈ రెండు దేశాలు 1953లో జరిగిన యుద్ధం తరువాత విడిపోయాయి. అప్పటి నుండి ఉత్తర కొరియా అధ్యక్షుడు ఎవరు కూడా దక్షిణ కొరియా భూభాగంలో అడుగుపెట్టలేదు.

అయితే చారిత్రికంగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌-జె.ఎన్‌.తో సమావేశమవ్వడానికి ఏప్రిల్‌ 27,2018న దక్షిణ కొరియా భూభాగంలోకి అడుగు పెట్టారు. నిజంగా ఈ సంఘటన చారిత్రాత్మకమైనది. కిమ్‌తో పాటు అతడి సోదరి కిమ్‌ జో యాంగ్‌, ఇరుదేశాల మధ్య సంబంధాల ప్రముఖుడు దక్షిణ కొరియాకు చేరుకున్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జె ఎన్‌ ఉత్తర కొరియా భూభాగంలో అడుగుపెట్టి వెనక్కి వచ్చారు. తర్వాత ఇరుదేశాల అధ్యక్షుల మధ్య దక్షిణ కొరియాలో సమావేశాలు జరిగాయి.

రాబోయే నెలలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ సమావేశం కానున్నారు. దానికి ముందు ఇరు కొరియాల మధ్య జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించు కుంది. ఒకవైపు ‘కిమ్‌’ తన పూర్వీకుల నుండి వస్తున్న విలువలను కాపాడాలని ప్రయత్నిస్తుండగా దక్షిణ కొరియా అధ్యక్షుడు ఇరు దేశాలను ఒక్కటి చేయడానికి ఉత్సాహం చూపుతున్నాడు.

గమనించవలసిన విషయమేమంటే ‘కిమ్‌’ దక్షిణ కొరియా సందర్శించడానికి ఎలాంటి నిబంధనలు విధించలేదు. ఒక స్వతంత్ర స్వచ్ఛంద సంస్థ జరిపిన సర్వేలో 71.2 శాతం ప్రజలు రెండు కొరియాలు ఒక్కటి కావాలని కోరుకుంటున్నారు. 20 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

1953 తరువాత ఇరు దేశాల మధ్య మూడు సమావేశాలు జరిగాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు కిం-డే-జంగ్‌ ఇరు కొరియాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి శతవిధాల ప్రయత్నించాడు. ఈ కారణంగా అతడికి నోబెల్‌ శాంతి పురస్కారం లభించింది. ఉత్తర కొరియా 2006 సంవత్సరంలో అణుపరీక్ష నిర్వహించింది. ఈ అణుపరీక్ష తరువాత ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది.

ఇరు దేశాల మధ్య దూరాన్ని తగ్గించడానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ ఈ సంవత్సరం దక్షిణ కొరియా భూభాగంలో అడుగుపెట్టాడు. అధ్యక్షులు ఇద్దరు స్వేచ్ఛగా చర్చలు జరిపారు. వ్యాహ్యాళికి వెళ్ళివచ్చారు. ఈ సమావేశంలో ‘కిమ్‌’ ఇక ముందు తాను అణుపరీక్షలు నిర్వహించనని ప్రకటించారు. తన ప్రభుత్వానికి రక్షణ కల్పించాలని కోరారు.

సంయుక్త ప్రకటన

ఇరు నేతలు సంయుక్త ప్రకటన చేస్తూ ‘ఇక మా మధ్య యుద్ధాలు ఉండవని’ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణాన్ని తొలగించి ఇరు దేశాలు శాంతి సౌభాగ్యాలతో వృద్ధిచెందే విధంగా ఇరు దేశాలు సహకరించుకుంటామని అన్నారు. ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలు ఇచ్చి పుచ్చుకోవాలని ప్రజల అభివృద్ధికి అవసరమైన యోజనలు రూపొందించి అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. దేశ విభజనలో వేరైన కుటుంబం రెడ్‌ క్రాస్‌ సంస్థ ద్వారా కలవాలని నిర్ణయించాయి. ఇరు దేశాల సరిహద్దులలో నెలకొని ఉన్న ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని నిర్ణయించాయి.

అనుమానమే..!

మే 1 వరకు ఇరు దేశాల త్రివిధ దళాలను దేశ సరిహద్దుల నుండి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇరు దేశాల మధ్య జరిగిన త్రైపాక్షిక చర్చలు జరిగిన తర్వాత చాలా ప్రాంతాలను సైన్యం కాపలా లేని ప్రాంతంగా మార్చివేయాలని నిర్ణయించాయి. ఇరు దేశాల మధ్య నమ్మకం పెంచడానికి నాయకులు తరచుగా కలుసుకోవాలనే నిర్ణయం కూడా జరిగింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇలా జరగాలని ప్రపంచ దేశాలు కూడా కోరుకుంటున్నాయి. కాని ఉత్తరకొరియా అధ్యక్షుడు ‘కిమ్‌’ తన వాగ్దానాల మీద నిలబడతారా? అనేది పెద్ద అనుమానం.

‘ట్రంప్‌’ ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షల వల్ల ‘కిమ్‌’ తన మార్గాన్ని మార్చుకోవలసి వచ్చింది. కొరియా దేశాల మధ్య జరిగిన సమావేశం తరువాత ట్రంప్‌ ట్వీట్‌ చేస్తూ కొరియా యుద్ధం సమాప్తమైంది అన్నాడు.

అమెరికా సంధిగ్ధావస్థ

ఇప్పటివరకు ఉత్తర కొరియా ఆరుసార్లు అణుపరీక్షలు నిర్వహించింది. ఇవి కాకుండా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం కూడా విజయవంతంగా పరీక్షించింది. పలు పర్యాయాలు క్షిపణుల ప్రయోగాలు నిర్వహించింది. కిమ్‌కు అణుపరీక్షల పట్ల ఉన్న గాఢవాంఛ ఉత్తర కొరియాకు సమీపాన ఉన్న దేశాలను నిరాశలోకి పడదోశాయి. ఉత్తర కొరియా ఆరవసారి చేసిన అణుప్రయోగం, ఖండాంతర క్షిపణి ప్రయోగం విజయవంతంగా పూర్తిచేసుకున్న తర్వాత అణ్వాయుధాల అభివృద్ధి పూర్తి చేసుకుంది.

ఆ తర్వాత దక్షిణ కొరియా, వాషింగ్టన్‌లతో ఒక ఒప్పందానికి సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‘కిమ్‌’తో సమావేశమవడానికి సమ్మతి తెలియజేశారు. దాని తరువాత ‘కిమ్‌’ గత నెలలో చైనా పర్యటించారు. చైనా నాయకులతో జరిగిన చర్చలలో ఆసియా ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొల్పడానికి తనవంతు కృషి చేస్తానని వాగ్ధానం చేశారు.

కొరియాకు సంబంధించిన సమస్యలో నలుగురు భాగస్వాములున్నారు. ఆ నాలుగు దేశాలు అమెరికా, చైనా, జపాన్‌, రష్యా. ఉత్తర కొరియాకు చైనా, రష్యాలు మద్దతు ఇస్తున్నాయి. దక్షిణ కొరియాకు జపాన్‌, అమెరికాలు మద్దతిస్తున్నాయి. కానీ ఈ కొరియా దేశాల మధ్య జరిగిన సమావేశం చాలా ముఖ్యమైనది. కొరియన్‌ యుద్ధం ముగిసిపోయి శాంతి నెలకొనాలని ఇరు దేశాల ఆకాంక్ష. ప్రపంచ దేశాల సరిహద్దులలో సైన్యాల మోహరింపులనకు పరిశీలిస్తే ఈ రెండు కొరియా దేశాల సరిహద్దుల్లో మోహరించినన్ని సైన్య బలగాలు ఏ దేశంలోను లేవు. యుద్ధ విరమణ ప్రకటించుకున్నా సైన్య బలగాల మోహరింపు తప్పలేదు. అమెరికా, జపాన్‌ దేశాలు రెండూ కొరియా దేశాలతో అణ్వాయుధాల నిరస్త్రీకరణ పూర్తి స్థాయిలో జరగాలని కోరుతు న్నాయి. ఇక ఉత్తరకొరియాను సమర్ధిస్తున్న చైనా, రష్యాలు రెండు కొరియా దేశాల మధ్య జరుగుతున్న మార్పులను నిశితంగా పరిశీలిస్తున్నాయి.

ఇరాక్‌, లిబియా దేశాలలో మరణాయుధాలను పెద్ద ఎత్తున నాశనం చేశారు. అదే విధంగా తమ రెండు దేశాలలోనూ జరగాలని కొరియా ప్రజలు ఆశిస్తున్నారు. ఇరాన్‌ దేశంలో పూర్తిస్థాయిలో అణ్వాయుధాల నిరస్త్రీకరణకు ఇరాన్‌తో ఒక ఒప్పందం కుదిరింది. అదే జాయింట్‌ కాంప్రిహెన్సివ్‌ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ (JCPOA). అణ్వాయుధాలు కలిగి ఉండి యుద్ధ నిమగ్నమయ్యే దేశాలకు అన్నింటికి JCPOA ని అమలు పరచాలని కోరుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికైన తర్వాత JCPOA ఒప్పందాన్ని ఒక చెడ్డ ఒప్పందంగా వర్ణించారు. JCPOA ప్రకారం ప్రతి 120 రోజులకు ఇరాన్‌ను పరిశీలించి సర్టిఫై చేయవలసి ఉంటుంది. తరువాత మే 12న ఇరాన్‌కు అనుమతులు ఆమోదిం చాలి. కాని ఇరాన్‌ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి దానికి ఇచ్చే సహాయాన్ని నిలిపివేయాలని JCPOAలో అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని ట్రంప్‌ మిగతా యూరోపియన్‌ దేశాలను ఒత్తిడి చేశారు.

ఇరాన్‌తో సుదీర్ఘంగా జరిగిన చర్చల తరువాతే JCPOA ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో మార్పులు చేయడానికి యూరోపియన్‌ దేశాలు ఒప్పుకోవడం లేదు. JCPOAలో మార్పులు అడ్డుకోవడానికి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మక్రాన్‌ అమెరికా అధ్యక్షుడిని ఒప్పించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.

JCPOA ఒప్పందాన్ని చించివేస్తానని ట్రంప్‌ హెచ్చరించారు. ఒప్పందం నుండి అమెరికా వెళ్ళిపోతే తను ఒప్పందం నుండి తప్పుకుంటానని ఫ్రాన్సు బెదిరించింది. ఒప్పందం కుదుర్చుకున్న పత్రంలో ఏకపక్షంగా మార్పులు చేయాలని మొండి పట్టు పడుతున్న ట్రంప్‌ ప్రవర్తన ‘కిమ్‌’లో అనుమా నాలు రేకెత్తించే అవకాశాలు ఉన్నాయి. ‘కిమ్‌’ తన ప్రభుత్వ క్షేమంపై తీక్షణంగా ఆందోళన చెందుతారు.

JCPOA పట్ల అమెరికా వ్యవహారం వల్ల ఇప్పటికే రష్యా, చైనాలతో బీటలువారిన సంబంధా లకు మరింన్ని పగుళ్ళు వచ్చాయి. అంత్యరుద్ధ శకంలో అమెరికా, రష్యాలు ఆధునాతనమైన క్షిపణులను రూపొందించాయి. అణ్వాయుధాల పరుగు పందెంలో ముందు ఉండటానికి ప్రయత్నిస్తున్నాయి. కొరియా సమస్యలో వాటి భాగస్వాముల మధ్య ఎన్నో విభేదాలున్నాయి.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‘కిమ్‌’తో చర్చలకు ఒప్పుకోవడం వలన కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితంగా మార్చడానికి అడుగువేసినట్లవుతుంది. గతంలో ఉత్తర కొరియా ఎన్నో దేశాలతో సంబంధా లను తెంచుకుంది. ఏ సంబంధాలను గౌరవించలేదు. ఇదే విషయం ట్రంప్‌ను కదిలించగా అతడు ఆశావాదిగా స్పందించారు. ‘అతడు మనతో ఆట లాడుతున్నాడని నేను అనుకోను. ఇది అంత దూరం వెళ్ళలేదు. ఒక ఒప్పందం చేసుకోవడానికి వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు’ అని అంటూ మేము ఒక మంచి ఒప్పందం చేసుకోగలమని నేను భావిస్తు న్నాను. ఒకవేళ కాకపోయినా మంచిదే’ అన్నారు.

దేశభద్రతకై అవసరమైన ఆయుధాలు కలిగి ఉండడం సరైన విషయమే. అదే సమయంలో ఉత్తర కొరియా అణ్వస్త్రాలను నిరస్త్రీకరణం చేయాలన్న విషయం వేధిస్తోంది. ఒకవైపు ప్రపంచం అణు మేఘాలతో కప్పబడి చీకటిలో మునుగుతున్న వేళ కొరియన్‌ ద్వీపకల్పంలో అణ్వస్త్రాల నిరస్త్రీకరణం చేయగలరా?ధూర్తుడైన ‘కిమ్‌’ను ఎలా ఎదుర్కొంటారు?

సమావేశం విజయవంతంగా ముగిసిన తరువాత కొరియన్‌ నాయకులు ఇరువురు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. దీనికి ముందు ఇరువురు నాయకులు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఆ కార్యక్రమంలో చివరగా మరల ఒక కుటుంబంగా ఉందామని సందేశం ఇవ్వబడింది.

జరిగింది ఒక చారిత్రక సమావేశం. ప్రపంచ దేశాలన్ని ఈ దృశ్యాన్ని చూచి సంతోషించాయి. కాని కొరియా దేశాల దీర్ఘచరిత్రను పరిశీలిస్తే కొరియా ద్వీపకల్పం అణ్వస్త్ర రహితంగా మారాలంటే చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది.

– డా|| రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *