కేంద్రీయ విశ్వవిద్యాలయంపై ఏబీవీపీ విజయ కేతనం

కేంద్రీయ విశ్వవిద్యాలయంపై ఏబీవీపీ విజయ కేతనం
  • కుప్పకూలిన కమ్యూనిస్టు కులం
  • జాతీయ భావాలకు పట్టం

ఒకింత ఆలస్యం కావచ్చు, విద్వేష రాజకీయాలనీ, విభజన సిద్ధాంతాలనీ ప్రజలు గుర్తించ మానరు. అలాగే విజాతీయ భావాలనీ, అవి వేసే వీరంగాన్నీ కూడా దేశ ప్రజానీకం ఎక్కువ కాలం సహిస్తూ కూర్చోదు. ఈ దేశాన్ని గౌరవించని వారిని, ఇక్కడి ప్రజల విశ్వాసాలను అవహేళన చేసేవారిని కూడా జనం ఎల్లకాలం నెత్తిన పెట్టుకుని ఊరేగరు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘ ఎన్నికల ఫలితాలు ఇవే రుజువు చేస్తున్నాయి. 2018-2019 విద్యార్థి సంఘం ఎన్నికలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) కేంద్రీయ విశ్వవిద్యాలయం మీద విజయ కేతనం ఎగురవేసింది. ఇది విజాతీయత మీద జాతీయశక్తుల విజయం. విధ్వంసక శక్తుల మీద దేశభక్తుల విజయం. మహాపురుషుల పేర్లతో సంఘాలు స్థాపించి, వాటి చాటున సమాజ విభజనకు పాల్పడుతున్న, విద్వేషాలు సృష్టిస్తున్న విద్యార్థి సంఘాలకు కూడా ఏబీవీపీ విజయం చెంపపెట్టు. ఈ ఎన్నికల ఫలితాలు పత్రికలలో వెలువడిన రోజునే (అక్టోబర్‌ 6న విశ్వవిద్యాలయం వెల్లడించగా 7న పత్రికలు ప్రచురిం చాయి) ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తొలి పేజీలో వేరొక ప్రత్యేక వార్తా కథనం ప్రచురించింది. ఎంతో కలవర పెట్టే కథనమది. అయితే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ గెలుపు వార్త ఆ కలవరానికి కొంచెం ఉపశమనం.

జాతీయవాదం మీద, జాతీయ భావాల మీద నీచమైన వ్యాఖ్యలు చేస్తూ, అలాంటి భావాలు కలిగి ఉండడమే పెద్ద నేరంగా పరిగణించి దాడులు చేస్తూ ఎనిమిదేళ్లుగా పబ్బం గడుపుకుంటున్న వామపక్ష విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ అత్యంత అవమాన కరమైన తీరులో ఈ ఎన్నికలలో మట్టి కరిచింది. నిజంగానే ఆ విద్యార్థి సంఘంలో ‘ప్రగతిశీలత్వం’ ఉందా? అది ఇచ్చే నినాదాలలో, చెప్పే మాటలలో కొంచమైనా నిజాయితీ ఉందా? మచ్చుకైనా లేవు. కమ్యూనిజం సిద్ధాంతం ఆ సంస్థల వరకు కరి మింగిన వెలగ చందమే. కమ్యూనిజం వారికి నేర్పేది ఒక్కటే – అవతలి వారిని నీచంగా చిత్రించడం. అవతలి శిబిరంలో ఉన్న వారి నోరు నొక్కడం, దాడులు చేయడం, బురద చల్లడం. ఇదంతా వాటి మాతృసంస్థలు ఇచ్చిన తర్ఫీదు మాత్రమే. అవి చెప్పే మాటలనే విశ్వవిద్యాలయాలలో వీళ్లు చిలకపలుకుల్లా వల్లిస్తూ ఉంటారు. అయినా ఇంతకాలం విద్యార్థి సంఘం ఎన్నికలలో వామపక్ష అనుబంధ సంఘం తిరుగు లేకుండా ఎలా గెలుస్తూ వచ్చిందో కూడా తాజా ఫలితాలు ఎలుగెత్తి చాటాయి. మహా పురుషుల పేరుతో, వారి సిద్ధాంతాల ముసుగులో జాతీయతను అవమానించే కుల సంఘాలతో సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ అంటకాగుతూ విద్యార్థి సంఘం ఎన్నికలలో గెలుస్తోంది. ఇది దాచేస్తే దాగని సత్యం. ఇక్కడే కాదు, కొన్ని దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలోను, బహుశా దేశంలోను వివిధ విద్యార్థి సంఘాల ఎన్నికలలో ఎస్‌ఎఫ్‌ఐ అనుసరిస్తున్న నీచమైన వ్యూహం ఇదే. ఈ ప్రగతివాదులు పదవుల కోసం చేస్తున్న నిర్వాకం ఇదే. ఇదికాకుండా ‘హిందూ మతోన్మాదాన్ని అడ్డుకుంటాం’ అనే నినాదం అడ్డం పెట్టుకుని మైనారిటీలను వెంటేసుకు తిరగడం మరొకటి. ఈసారి హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘ ఎన్నికలలో ఈ విధ్వంసక శక్తుల మధ్య సయోధ్య బెడిసి కొట్టింది. ఈ విశ్వవిద్యాలయం వారి అడ్డా అన్నట్టు వ్యవహరించిన ఎస్‌ఎఫ్‌ఐ అసలు బలమేమిటో బయటి ప్రపంచానికి తెలిసిపోయింది. నిజం చెప్పాలంటే ఈ ఎన్నికలలో కమ్యూనిస్టు కులం లేదా కుల కమ్యూనిస్టులు కకావికలయ్యారు.

నిజానికి వామపక్షాల విద్యార్థి సంఘాలు బలపడిన తరువాత విశ్వవిద్యాలయాలలోకి ప్రవే శించిన వికృతులు అన్నీ ఇన్నీ కావు. ఈ సంఘాలూ, వీటిని అడ్డంగా ప్రోత్సహించే వామపక్షాలూ విశ్వ విద్యాలయాలను విషవలయాలుగా మార్చేశాయి. ఈ విద్రోహ, విధ్వంసక కార్యకలాపాలకు కొందరు ఆచార్యుల బహిరంగ మద్దతు కూడా ఒక వాస్తవమే. ఈ బాపతు ఆచార్యులకే బయట కొన్ని మీడియా సంస్థలు మేధావులంటూ పెద్ద పెద్ద మకుటాలు పెడుతూ ఉంటాయి. వీరికి భారత రాజ్యాంగాన్ని గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. అయితే ఆ రాజ్యాంగం ఇచ్చే హక్కులు మాత్రం కావాలి.

ఈ ఎన్నికలలో ఓబీసీ ఫ్రంట్‌, సేవాలాల్‌ విద్యార్థి దళ్‌లతో కలసి ఏబీవీపీ రంగంలోకి దిగింది. ఎస్‌ఎఫ్‌ఐ ఒంటిరిగానే పోటీ చేసింది. ఆరు విద్యార్థి సంఘాలతో పొత్తు పెట్టుకుని యునైటెడ్‌ డెమాక్రటిక్‌ అలయెన్స్‌ పేరుతో ఏఎస్‌ఏ బరిలోకి దిగింది. ఒకవేళ ఏబీవీపీ గెలిచినా అది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా వచ్చిన మార్పు అని భావించరాదు సుమా అంటూ ముందే ఈ యూడీఏ సన్నాయి నొక్కులు నొక్కడం విశేషం. ఎందుకంటే ఏబీవీపీ అనేది ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ అనుబంధ సంస్థ కాబట్టి ప్రజలకి వ్యతిరేకేనట. అయితే ఏబీవీపీ స్థానిక సమస్యలు ప్రధానంగా చూపిస్తూ ప్రచారం చేసింది. మనస్తత్వశాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థిని ఆర్తి నాగ్‌పాల్‌ను ఏబీవీపీ అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆమె తన సమీప ప్రత్యర్థి, ఎస్‌ఎఫ్‌ఐకి చెందిన ఎర్రం నవీన్‌కుమార్‌ మీద 334 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఆర్తికి 1,663, నవీన్‌ కుమార్‌కు 1,329 వంతున ఓట్లు లభించాయి. ఇంకా అమిత్‌ కుమార్‌ (ఉపాధ్యక్షుడు), ధీరజ్‌ సంగోజీ (ప్రధాన కార్యదర్శి), ప్రవీణ్‌ చౌహాన్‌ (సంయుక్త కార్యదర్శి), అరవింద్‌ ఎస్‌ కుమార్‌ (క్రీడల కార్యదర్శి), నిఖిల్‌రాజ్‌ కె (సాంస్కృతిక కార్యదర్శి) కూడా చక్కని ఆధిక్యాలతో విజయం సాధించారు. అంటే మొత్తం పదవులన్నీ ఏబీవీపీ కైవసం చేసుకుని మిగిలిన విద్యార్థి సంఘాలను తుడిచిపెట్టేసింది. వాటి డొల్లతనాన్ని బయటపెట్టింది. కాగా, విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి ఒక విద్యార్థిని ఎంపిక కావడం విశ్వవిద్యాలయం చరిత్రలో ఇది రెండోసారి.

ఇప్పుడు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిన కథనం మీద విహంగ వీక్షణం చేద్దాం. ఫయాజ్‌ వని, పుష్కర్‌ బనకర్‌, సనా షకీల్‌ ఈ వ్యాసం రాశారు. ఇది ఆ ధారావాహికలో తొలి వ్యాసం మాత్రమే.

మనాన్‌ వని అలీఘడ్‌ ముస్లిం విశ్వవిద్యాల యంలో పరిశోధక విద్యార్థి. కుప్వారా (కశ్మీర్‌)కు చెందిన ఈ విద్యార్థి ఈ సంవత్సరం జనవరిలో చదువుకు స్వస్తి చెప్పి హిజ్‌బుల్‌ ముజాహుదీన్‌లో చేరిపోయాడు. ‘భారత సైనిక బలగాలతో పోరాడడంలో ఆత్మగౌరవం ఉంది’ అని అతడు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. కశ్మీర్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మహమ్మద్‌ రఫీ భట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. ఇతడు కూడా ఈ మే మాసంలో హిజబ్‌లో చేరాడు. మరునాడు జరిగిన ఎదురుకాల్పులలోనే చనిపోయాడు. దోడాకు చెందిన హరూన్‌ అబ్బాస్‌ ఎంబీఏ చదివాడు. ఏకే 47 పట్టుకుని ఉన్న ఇతడి ఫోటో ఈ సెప్టెంబర్‌లో సామాజిక మాధ్యమాలలో దర్శనమిచ్చింది. ఒక ఔషధాల తయారీ సంస్థలో పనిచేసిన అబ్బాస్‌ తాను హిజబ్‌లో చేరుతున్నట్టు ప్రకటించాడు. ఇదేదో ఉన్నత చదువులు చదువుకొని ఉగ్రవాదం వైపు మళ్లిన కొద్దిమంది యువకుల సమాచారం అనుకోవద్దు. పెద్దగా చదువుకోకుండా ఉగ్రవాదం వైపు తిరిగిన వారి కంటే ఇటీవల ఇలాంటి ఉదాహరణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి జమ్మూకశ్మీర్‌, ఢిల్లీలకు చెందిన రెండు సంస్థలు వెలికి తీసిన వాస్తవాలు.

జూలై 2016లో బుర్హన్‌వనీ ఎన్‌కౌంటర్‌ తరువాత ఇలాంటి ధోరణి యువకులలో బలపడు తోందని ఆ సంస్థలు తమ గణాంకాలలో పేర్కొ న్నాయి. అవి ఇచ్చిన గణాంకాల ప్రకారం ఐదేళ్లలో (2011-2015) పట్టభద్రులైన 14 మంది యువకులు మాత్రమే ఉగ్రవాదులలో చేరారు. తరువాత ఇలాంటి సంఖ్య పెరిగిపోయింది. ఒక్క 2016 సంవత్సరంలోనే 37 మంది పట్టభద్రులు ఉగ్రవాదం బాట పట్టారు. 2017 నాటికి ఈ సంఖ్య 49కి చేరుకుంది. ప్రభుత్వం అనుసరిస్తున్న (కశ్మీరీలకు వ్యతిరేకంగా) కండబలానికి నిరసనగానే యువత ఉగ్రవాదం వైపు మళ్లుతోందని జమ్మూ కశ్మీర్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ షేక్‌ షౌకత్‌ విశ్లేషించారు. ఇదే అభిప్రాయాన్ని ఇంకొందరు మేధావులు కూడా వ్యక్తం చేశారు.

ఇలాంటి విశ్లేషణలు కలవరం కలిగిస్తాయి. అయితే వాస్తవం ఏమిటి? కశ్మీర్‌లో జరుగుతున్న వీధి పోరాటాలు శాంతియుతమైనవా? శాంతి యుతంగా పోరాడుతున్న యువత మీద ఢిల్లీ ప్రభుత్వం బల ప్రయోగం చేయడం వల్లనే యువత తుపాకి పట్టుకోవాలన్న నిశ్చయానికి వస్తున్నదని విశ్లేషించడం వారిని మరింత పెడతోవ పట్టించడం కాదా! రాళ్లు విసురుతూ భద్రతా బలగాలను తరుముకు వెళ్లడం శాంతియుత పోరాటమా? బుర్హన్‌వనీ భద్రతా బలగాల స్థావరాల మీద మిలిటెంట్‌ దాడులకు పాల్పడినవాడు. అతడి మీద సానుభూతి చూపడంలో ఔచిత్యం ఉందా? ఇది రాజ్యాంగబద్ధ వైఖరేనా? కాదని చిన్నపిల్లలు కూడా చెబుతారు. కానీ చాలామంది విశ్వవిద్యాలయ మేధావులు వనీ హక్కులను భారత ప్రభుత్వం కాలరాచిందనే అంటున్నారు. ఇవీ నేడు విశ్వవిద్యా లయాలలో కనిపిస్తున్న ధోరణులు. ఒకప్పుడు తెలుగు ప్రాంతంలోను, దేశంలోని ఇతర ప్రాంతాలలోను విశ్వవిద్యాలయాల నుంచి వామపక్ష ఉగ్రవాదం వైపు యువకులు వెళ్లేవారు. ఇప్పుడు మతోన్మాదంతో వెళుతున్నారు. దీనిని సమర్థించడం సబబా? రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన వ్యవస్థ మీద, రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించినట్టు చెప్పే ఉగ్రవాదుల నుంచి సామాన్యులను రక్షించ డానికి ప్రభుత్వాలు ఏం చేయాలి? ఒకటి వాస్తవం. విశ్వవిద్యాలయాలను ఇంత విషవలయాలుగా మారుస్తున్నవారు ఎవరో సమాజానికి తెలుసు.

ఈ నేపథ్యంలో జాతీయ భావాలు గల, జ్ఞానానికీ, శీలానికీ, ఏకత్వానికీ కట్టుబడి ఉండే ఏబీవీపీ వంటి విద్యార్థి సంఘం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం మీద తన జయ కేతనం ఎగురువేయడం దేశంలో ఎక్కువ మందిని సంతోష పరుస్తుంది. ఇటీవల ఢిల్లీ విశ్వవిద్యాలయంలో కూడా ఏబీవీపీ విజయం సాధించింది.

చివరిగా, కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘ ఎన్నికలు ముగిశాయి. ఏబీవీపీ గెలుపొందింది. ఈ విజయాన్ని ప్రజాస్వామిక స్ఫూర్తితో మిగిలిన సంస్థలు స్వీకరించాలి. ఇక్కడితో ఎన్నికల వేడిని మరచిపోవాలి. ఈ గెలుపును కూడా ప్రధాని మోదీ కుట్రగా అభివర్ణించే కుయుక్తులు మానుకోవాలి. అలా అని వారి అభిప్రాయాలను త్యాగం చేయమని అర్థం కాదు. విశ్వవిద్యాలయాలు స్వేచ్ఛాయుత వాతావరణంలోనే ఉండాలి. సృజనకు దోహదం చేయాలి. మేధో వికాసానికి అంతకు మించి మార్గం లేదు. కానీ ఈ స్వేచ్ఛను, రాజ్యాంగం ఇచ్చిన స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేయడాన్ని, సృజనాత్మకత పేరుతో విధ్వంసాన్ని అనుమతించ రాదు. ఈ ప్రాంగణం దేశ వ్యతిరేక నినాదాలకు కేంద్రం కారాదు. ఈ క్రమంలో మనస్పర్థలు, భేదాభిప్రాయాలు సహజం. అందునా కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాయికి చేరిన వారంతా మేధావులు. జాతికి ఆశాజ్యోతులు. కాబట్టి కొన్ని విభేదాలు వస్తాయి. వాటిని వారే పరిష్కరించు కోవాలి. బయటి మేధావుల వరకు విషయం వెళ్లకుండా ఎస్‌ఎఫ్‌ఐ వంటి సంస్థలు జాగ్రత్త తీసుకోవాలి. బయటి మేధావులంటే మళ్లీ విద్వేషా లను రెచ్చగొట్టేవారే. ఇప్పటిదాకా అలాంటి విషబీజాలు నాటే మేధావుల పట్టులో ఉన్న విద్యార్థులు, విద్యార్థి సంఘాలు వారి నుంచి బయట పడడం మంచిది. ఈ విజయం నిరాశ నుంచి బయటపడడానికి వేగిర పడుతున్న విద్యార్థులు ఇచ్చిన విజయంగా, నిర్మాణాత్మకంగా ఆలోచించ డానికి సిద్ధపడిన తరం ఇచ్చిన తీర్పుగా ఏబీవీపీ భావించాలి. అందుకు అనుగుణంగా వ్యవహరించాలి.

– సత్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *