కెటలాన్‌కు స్వతంత్రం లభించేనా ?

కెటలాన్‌కు స్వతంత్రం లభించేనా ?

స్వాతంత్య్ర భావన అనేది వివిధ దేశాల ఏర్పాటుకు పునాదిగా నిలుస్తోంది. వివిధ జాతుల ప్రజలు స్వతంత్ర రాజ్యాలను ప్రకటించుకొంటూ తమ మాతృభూమికి విధేయత చూపుతున్నారు. దీనికోసం వారు హింసాయుత, శాంతియుత మార్గాలు రెండింటిని అవలంబిస్తున్నారు. అలా కొత్త దేశాలు ఏర్పడిన దృష్టాంతాలు చరిత్రలో చాలా ఉన్నాయి. కానీ నేటి కాలంలో స్వాతంత్య్ర సముపార్జనకు ‘ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం)’ అనే పద్ధతి ప్రజాదరణ పొందింది. అందుక్కారణం ఈ పద్ధతి శాంతియుతమైనది, రక్తపాతం లేనిది కావటమే.

1945 నుండి ఇప్పటివరకు రెఫరెండం ప్రక్రియను అనుసరించి ముప్ఫై కొత్త దేశాలు స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. ఈ అన్ని దేశాల విషయంలో చాలా సందర్భాలలో స్వతంత్ర ప్రకటన వెలువడిన వెంటనే ఐరాస సభ్యత్వం లభించడం, వివిధ దేశాలతో దౌత్య సంబంధాలు ఏర్పడటం సహజ పరిణామంగా జరిగిపోయాయి. కాని, 2008లో కొసావోలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణకు మిశ్రమ స్పందన వచ్చినపుడు ఈ రెఫరెండం నియమానికి పెద్ద దెబ్బ తగిలింది. కొసావో తమ సార్వభౌమ భూభాగంలో అంతర్భాగ మని సెర్బియా వాదించడంతో ఐరాస భద్రతా మండలి రెండుగా విడిపోయింది. అసందిగ్ధతను ఐరాస అంతర్జాతీయ న్యాయస్థానానికి నివేదించగా, కొసావో స్వాతంత్య్ర ప్రకటన ‘అంతర్జాతీయ చట్ట నిబంధనలను ఉల్లఘించలేదు’ అని 2010లో న్యాయస్థానం ప్రకటించింది. 2013లో ఇరు దేశాల సభ్యత్వానికి యూరోపియన్‌ యూనియన్‌ అనుమతి లభించిన తరువాత సెర్బియా, కోసావోలు సాధారణ సంబంధాలు ఏర్పరచుకున్నాయి.

అయిత ఈ కొత్త పరిణామాన్ని పట్టించుకోకుండా తమకు స్వాతంత్య్రం ప్రకటించుకోవడానికి జాతులు ఎక్కువ అనుకూల మార్గంగా రెఫరెండంపైనే ఆధారపడుతున్నాయి. 2014లో అటువంటివి నాలుగు రెఫరెండంలు జరిగాయి. అవి క్రిమియా, డొనేట్‌స్క్‌, లుంగాన్‌స్క్‌, స్కాటిష్‌, మరియు కెటిలోనియా రెఫరెండంలు. వీటిలో క్రిమియా, డొనేట్‌స్క్‌, కెటలోనియా రెఫరెండాలను చట్టవిరుద్ధమైనవిగా పరిగణించారు. స్కాటిష్‌ రెఫరెండంలో అధిక సంఖ్యా కులు యుకెతో కలసి ఉండటానికి ఇష్టపడడంతో వేరుపడాలనే స్కాటిష్‌ వాదన వెనుకబడింది.

కెటలాన్‌ వివాదం

కెటలాన్‌ ప్రాంతం స్పెయిన్‌ దేశంలో అంతర్భాగం. అయితే సాంస్కృతికంగా ఈ రెండు ప్రాంతాలు ఒకటి కావు. అందువలన ఈ రెండు ప్రాంతాల ప్రజల మధ్య అగాధం ఏర్పడింది. స్పెయిన్‌ ప్రభుత్వం- కెటలాన్ల మధ్య నున్న అగాధాలు ఈనాటివి కాదు. అవి 300 సంవత్సరాల ముందు నుంచి ఉన్నాయి. కెటలానియన్లు స్పెయిన్‌ ప్రభుత్వం చేతిలో శతాబ్దాలుగా అణచివేతకు గురికావడం ప్రస్తుత వేర్పాటువాద ఉద్యమానికి దారితీసింది. కెటలాన్‌ ప్రాంతం ఒకప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాంతం. స్పెయిన్‌కు చెందిన బోర్బన్‌ రాజులు 1714లో బార్సిలోనాను స్వాధీనం చేసుకున్న తరువాత కెటలాన్‌ భూభాగం తన స్వయంప్రతిపత్తి కోల్పోయింది.

ప్రస్తుతం స్పెయిన్‌లో భాగంగా ఉన్న కెటలాన్‌ ప్రాంతం అత్యంత ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఒకటి. స్పెయిన్‌కు సాంస్కృతికంగా విభిన్నమైన కెటలోనియా భూభాగం స్పెయిన్‌లో 6% ఉండగా జనాభా 7.5 మిలియన్‌లతో 16%తో ఉంది. ఐదోవంతు ఆర్థికోత్పత్తికి, నాలుగోవంతు ఎగుమతులకు, సగం అంకుర పెట్టుబడులకు, కారణభూతమైన కెటలాన్‌ మూడో వంతు స్పెయిన్‌ ఒలింపిక్‌ విజేతల నివాసంగా ఉంది. ఇది ఒక వైపు ఫ్రాన్స్‌తోను, మధ్యధరా ప్రాంతంతోను సరిహద్దును, విపరీతమైన పర్యాటక సామర్థ్యాన్నీ కలిగి ఉంది. స్పెయిన్‌ ఆర్థిక, రాజకీయ స్థిరత్వానికి కెటలాన్‌ చాలా ముఖ్యమైనది.

రజోయ్‌

1898లో యుఎస్‌ ఆధీనంలోకి వెళ్ళే వరకు పూర్వ స్పెయిన్‌ కాలనీలు ప్యూర్టోరికో, ఫిలిప్పీన్స్‌ మరియు క్యూబాలకు వస్తువుల ఎగుమతి ద్వారా కెటలాన్‌ చాలా అభివృద్ధి చెందింది. యుఎస్‌ ఆధీనంలోకి వెళ్ళాక కెటలాన్‌ వ్యాపారులు పూర్వ స్పానిష్‌ కాలనీలలో మార్కెట్‌ను కోల్పోయారు. 1899 నాటికి కెటలాన్‌ వ్యాపారులు, ఉన్నత మధ్య తరగతి వర్గం జాతీయ ఉద్యమానికి మద్దతివ్వడం ప్రారంభించారు. 1928 నాటికి హవానాకు వలసవెళ్ళిన కెటలాన్‌ రిపబ్లికన్లు రాజ్యాంగ ప్రణాళిక రచించారు. 1931లో వివిధ వర్గాల రిపబ్లికన్లు బోర్బన్‌రాజుల రాచరికాన్ని కూలదోశారు. 1932లో జాతీయదళాలు రెండవ రిపబ్లిక్‌గా స్వయంప్రతిపత్తి సాధించాయి. అయితే, చివరకు జనరల్‌ ప్రాన్‌సిస్కో ప్రాంకో నాయకత్వంలో జరిగిన సైనిక కుట్ర రిపబ్లిక్‌ ప్రభుత్వాన్ని పడగొట్టి స్పెయిన్‌లో ఏకీకృత దేశ నమూనా పరిపాలనను పునరుద్ధరించింది.

 

కెటలాన్‌ల సాంస్కృతిక గుర్తింపును ధ్వంసంచేసిన నియంత ప్రాంకో స్పెయిన్‌ – కెటలోనియా మధ్య ద్వేషాన్ని విస్తరించాడు. ప్రాంకో చేపట్టిన క్రూర అణచివేతతో కెటలాన్‌లో బలమైన జాతీయోద్య మానికి పునాదులు పడ్డాయి. 1970 మధ్యకాలానికి కెటలాన్‌, బాస్క్‌ ప్రాంత వేర్పాటువాదుల నిరసనలు తీవ్రమయ్యాయి. 1978లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరిగి స్పెయిన్‌లోని 17 ప్రాంతాలకు కొంతమేరకు స్వీయ ప్రభుత్వం, స్వయంప్రతిపత్తి లభించాయి. సాంస్కృతికంగా, భాషాపరంగా ఐక్యత లేని ప్రాంతాలకు సైతం స్వయంప్రతిపత్తి లభించడం కెటలోనియాకు ఆగ్రహం కలిగించింది. బాస్క్‌ ప్రాంతానికి, నవారెకి 100 శాతం పన్నులు వసూలు చేసుకోవడానికి అనుమతించిన స్పెయిన్‌, అదే హక్కును కెటలోనియాకు తిరస్కరించగా కెటలోనియా ప్రాంతీయుల మనసుకు గాయమైంది.

2006లో కెటలోనియన్లు స్వయంప్రతిపత్తి కోసం తీవ్ర ప్రయత్నాలు చేయగా స్పెయిన్‌ పార్లమెంటు ‘అటానమి ఆఫ్‌ కెటలోనియా 1979’ చట్టానికి సవరణను ఆమోదించింది. దానినిబట్టి పీఠికలో కెటలోనియాను ‘దేశం’గా పేర్కొన్నారు. కొత్త చట్టం ద్వారా సంక్రమించిన హక్కుతో కెటలోనియా వ్యవస్థీకృత రాజకీయ వ్యవస్థలో పార్లమెంటు, అధ్యక్షుడు, కార్యనిర్వాహక మండలి ఏర్పడ్డాయి. కెటలోనియా ప్రభుత్వానికి విద్య, సంస్కృతి, పన్నులు, రవాణాలపై అధికారం ఉంటూ, ఉగ్రవాదాన్ని, వలసలను నియంత్రించే ప్రత్యేక సంస్థలు ఉండేవి.

అయితే స్పెయిన్‌ అధ్యక్షుడు రజోయ్‌ ఈ విషయాన్ని రాజ్యాంగ న్యాయస్థానానికి పంపడంతో పరిస్థితులు మారిపోయాయి. నాలుగు సంవత్సరాల పరిశీలన తరువాత న్యాయస్థానం ‘దేశం’ పదం చట్టపరంగా లేదని నిర్ణయించింది. 2008లో స్పెయిన్‌ ప్రభుత్వం మొదటిసారిగా ప్రాంతాలవారీ ఆర్ధిక కేటాయింపుల వివరాలను విడుదల చేసింది. ఈ వివరాలను బట్టి కెటలోనియా ప్రాంతంలో సేకరించిన పన్నులను ఇతర ప్రాంతాల అభివృద్ధికి వెచ్చిస్తున్నట్లు వెల్లడయింది. అదే సమయంలో స్పెయిన్‌ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన ఆర్థికమాంద్యంతో కెటలోని

మాస్

యాలో నిరుద్యోగం తీవ్రంగా ప్రబలి పోయింది. కెటలోనియా స్వయంప్రతిపత్తికి సంబంధించిన కొన్ని నిబంధనలను స్పెయిన్‌ న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పునివ్వడం పూర్తి స్వతంత్య్రం కొరకు రెఫరెండం నిర్వహించాలనే కోరిక కెటలానియన్లలో రగిలింది.

 

జాతీయ ఉద్యమం

కెటలోనియా అధ్యక్షుడు మాస్‌ ఆర్ధర్‌ జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. న్యాయస్థానం తీర్పును నిరసిస్తూ దాదాపు ఒక మిలియన్‌ మంది ప్రజలు బార్సిలోనా వీధులకెక్కారు. ఆర్థికరంగం ఇంకా మాంద్యంలోనే కొనసాగుతున్న సమయంలో, 2012లో ప్రాంతీయ పన్నులు సేకరించేందుకు అనుమతించాలని కెటలాన్‌ ప్రభుత్వం స్పెయిన్‌కు విజ్ఞప్తి చేసింది. (బాస్క్‌ దేశంలో ఈ ఏర్పాటు ఉంది). కాని ఇది ‘రాజ్యాంగానికి విరుద్ధం’ అంటూ అధ్యక్షుడు రజోయ్‌ ఈ ప్రతిపాదనను తిరస్కరించాడు. స్వాతంత్య్రానికి మద్దతు కోరుతూ కెటలాన్‌ అధ్యక్షుడు మాస్‌ ఆకస్మిక ఎన్నికలకు పిలుపునిచ్చాడు. పార్ల మెంటులో రెఫరెండం అనుకూల పక్షాలు స్వతంత్రం కోసం రెఫరెండానికి ఆమోదిస్తూ స్పెయిన్‌ పార్లమెంటుకు పంపారు. రాజ్యాంగం ప్రకారం రెఫరెండం జాతీయ స్థాయిలో నిర్వహించాలి కాని ప్రాంతీయ స్థాయిలో కాదని సూచిస్తూ రెఫరెండం ప్రతిపాదనను స్పెయిన్‌ తిరస్కరించింది. అయితే నిషేధం ఉన్నప్పటికీ 2014లో రెఫరెండం జరిగింది. 80.8% మంది స్వతంత్రాన్ని సమర్థించారు.

రెఫరెండం సమస్య రాజకీయ అస్థిరత సృష్టించడంతో కెటలాన్‌ అధ్యక్షుడు మాస్‌ రెండోసారి ఆకస్మిక ఎన్నికలకు పిలుపునిచ్చారు. కెటలాన్‌ రాజకీయ పక్షాలలో అంతర్గత కుమ్ములాటలు, ఉద్రిక్తతలు తీవ్రమై ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యత లభించలేదు. ‘ద్వేషపూరిత అంతర్గత కొట్లాట’ తరువాత, 2016 జనవరిలో కార్లెస్‌ పూగ్జిమెంట్‌ నేతృత్వంలోని పార్టీల కొత్త సంకీర్ణం అధ్యక్ష పదవి చేపట్టి రెఫరెండం, మరో 46 అంశాలపై చర్చలు కోరింది. అయితే 2016 అక్టోబర్‌లో స్పెయిన్‌ పార్లమెంటుకు తిరిగి ఎన్నికైన రజోయ్‌ కెటలోనియా సమస్యలను చర్చించడానికి ‘విశ్వసనీయ సహకారం’ కోరారు. ఇంతలోనే, ఈ సంవత్సరం (2017) కెటలోనియా మౌలిక వసతుల అభివృద్ధికి స్పెయిన్‌ ప్రభుత్వం 3.9 బిలియన్‌ పౌండ్లను ప్రకటించినప్పటికి, కెటలానియన్లు దానిని చాలా తక్కువగా భావించారు. తగ్గిపోయిన పెట్టుబడుల గురించి కెటలోనియా ప్రభుత్వం ప్రశ్నించగా, తగ్గిన మొత్తాన్ని 2018లో మంజూరు చేస్తామని స్పెయిన్‌ ఆర్థికమంత్రి సమాధానం ఇచ్చారు. మే నెలలో, స్వాతంత్య్రం గురించి పార్లమెంటు చర్చను అనుమతించినందుకు కెటలాన్‌ అసెంబ్లి అధ్యక్షుడిని అరెస్టు చేశారు. ఆర్థిక సమస్యలపై ఉద్రిక్తత, స్వయం ప్రతిపత్తి గురించి చర్చించడంపై విముఖత కలసి కెటలోనియా వ్యాప్తంగా నిరసనలకు దారి తీశాయి.

సెప్టెంబర్‌ 6న స్పెయిన్‌ నుండి స్వతంత్రం కోరుతూ రెఫరెండం కోసం చట్టాన్ని ఆమోదించిన కెటలాన్‌ పార్లమెంటు స్వతంత్రానికి సాధారణ మెజారిటి సరిపోతుందని, కనీస ఓటరు హాజరు అవసరం లేదని ప్రకటించింది. ఆ మరునాడే రెఫరెండం చట్ట విరుద్ధమైనదని ప్రకటించిన స్పెయిన్‌ రాజ్యాంగ న్యాయస్థానం, రెఫరెండాన్ని నిలుపు చేసేందుకు బలప్రయోగం చేసింది. బల ప్రయోగం జరిగినప్పటికీ 43% హాజరీ నమోదు కాగా, అందులో 92% స్వతంత్య్రానికి అనుకూలంగా ఓటు వేశారు. కెటలానియన్‌ పార్లమెంటు రెఫరెండం ఓటింగ్‌కు అంతర్జాతీయ పరిశీలకులను ఆహ్వానిం చింది. కాని అంతర్జాతీయ నియమాలను పాటించని కారణంగా రెఫరెండం చెల్లదని వారు ప్రకటించారు. అయితే కెటలోనియాలో పెరుగుతున్న వేర్పాటువాదాన్ని అరికట్టడానికి తొందరపాటుతో బలప్రయోగం చేసిన రజోయ్‌ కెటలోనియన్ల ఆగ్రహాన్ని చూడవలసి వచ్చింది.

స్పెయిన్‌ ప్రభుత్వము, కెటలాన్‌లు మనస్సు మార్చుకోవడానికి తిరస్కరిస్తుండడంతో స్పెయిన్‌ వ్యాప్తంగా నిరాశ, అపనమ్మకం విస్తరించాయి. అణచివేతను ఉధృతం చేసిన స్పెయిన్‌ కెటలాన్‌ వేర్పాటువాదులను దేశద్రోహ ఆరోపణలపై జైలు పాలు చేసింది. కెటలాన్‌ ఉన్నత అధికారులను తొలగిస్తామని స్పెయిన్‌ బెదిరిస్తుండడంతో భారీ శాసనోల్లంఘన ఉద్యమం చేపట్టడానికి ప్రజలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ముఖ్యంగా జాతి గుర్తింపు సమస్యలే నిర్దిష్ట భూభాగాలపై హక్కుల కొరకు శక్తివంతమైన వాదనకు ప్రేరేపకాలుగా ఉంటున్నాయి. దీనికితోడు ఆర్థిక వనరుల అసమాస పంపిణీ, పేదరికం; రాజకీయ ప్రాతినిధ్యం, భౌగోళిక, జనాభా పరమైన కారణాలు కూడా వేర్పాటువాద ఉద్యమాలను ప్రేరేపిస్తున్నాయి. వీరిని అనుసరించి ఇతర బృందాలు సైతం ఇదేవిధమైన వాదన లేవనెత్తుతాయేమోనన్న భయం వలన స్వతంత్ర భావనలను దేశాలు అంగీకరించ లేకపోతున్నాయి. కాని ‘ఆచరణాత్మక ఫెడరలిజం’ ను స్వీకరించి, కెటలోనియాకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పించినట్లైతే రజోయి స్పెయిన్‌కు గొప్ప సేవ చేసినవాడు కాగలడు.

– డా.రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *