కర్ణాటక ఎన్నికలు – ఎవరికి అవకాశం

కర్ణాటక ఎన్నికలు – ఎవరికి అవకాశం

భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప లింగాయత్‌కు చెందినవాడు కనుక అతడు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి సిద్ధరామయ్య కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మఠాలను, దేవాలయాలు అన్నింటినీ ప్రభుత్వ అధీనంలోకి తేవాలని సిద్ధరామయ్య ప్రయత్నించారు. ప్రతిపక్షాలు ఎదురుతిరిగే సరికి విరమించుకున్నారు. కర్ణాటకలో వక్కలు పండించే రైతులకు కనీస మద్దతు ధరలు కల్పించనందున ఎందరో రైతులు నష్టపోయారు. – అమిత్‌ షా

భారత ఎన్నికల కమిషన్‌ కర్ణాటక అసెంబ్లీకి జరిగే ఎన్నికల తేదీని ప్రకటించింది. మే 12, 2018న ఎన్నికలు జరుగుతాయి. ఆ తరువాత మే 15న ఓట్లు లెక్కింపు జరుగుతుందని ప్రకటించింది.

వాస్తవానికి ఎన్నికల తేదీ ప్రకటనలో ఆలస్యం జరిగింది. జరిగిన ఆలస్యానికి ఎన్నికల కమిషన్‌ కింది కారణాలను పేర్కొంది. ఎన్నికల ప్రధాన అధికారి ఒ.పి.రావత్‌ మాట్లాడుతూ ఎన్నికల తేదీలు నిర్ణయించడానికి వాతావరణ పరిస్థితులు, విద్యా సంవత్సరం, ప్రధాన పండుగలు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు, కేంద్ర పోలీసు బలగాల లభ్యత, ఒక నియోజక వర్గం నుండి మరొక నియోజక వర్గానికి బలగాలను తరలించడానికి పట్టే సమయం, రవాణా, సరైన సమయానికి రక్షణ దళాల మోహరింపు, స్థానిక పరిస్థితులు వంటివన్నీ పరిగణనలోకి తీసుకొని తేదీలను నిర్ణయించామని అన్నారు.

రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలలో ఒకే దశలో పోలింగ్‌ పూర్తవుతుంది. VVPAT లను (వోటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌) అన్ని EVM ల వద్ద అంటే 224 అసెంబ్లీ నియోజక వర్గాలలోని 56,696 పోలింగ్‌ కేంద్రాలలోనూ ఏర్పాటు చేస్తారు.

వీటి ఏర్పాటు వల్ల ఎన్నికలలో పారదర్శకత పెరుగుతుంది. చాలా చోట్ల ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థులు EVM (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌) లోపం వల్లే ఓడిపోయామని, తనకు వేసిన ఓట్లు కూడా గెలిచిన అభ్యర్థికి వెళ్ళిపోయాయని నిందలు వేస్తుంటారు. VVPAT ల ఏర్పాటు వల్ల ఆ సమస్య తీరుతుంది. VVPAT లతో ఓటరుకు తన ఓటు ఎవరికి వెళ్ళిందనేది అపుడే తెలిసిపోతుంది. దీనివల్ల ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది.

వారికే అవకాశం

రాబోయే ఎన్నికలలో ప్రస్తుత ప్రభుత్వ అవినీతి, లంచగొండితనం; ఓట్ల కోసం లింగాయతులని మైనారిటీలుగా ప్రకటించడం; సమగ్ర అభివృద్ధి, నీటి సమస్య, పెరుగుతున్న జిహాదీల కార్యక్రమాలు; రాష్ట్రంలో చట్టం, శాంతి, భద్రతల నిర్వహణ లోపం వంటి సంక్లిష్ట సమస్యలన్ని ప్రభావం చూపుతాయి. సామాన్యంగా కర్ణాటక ఓటర్లు ప్రతి ఐదు సంవత్సరాలకు ప్రభుత్వాలను మారుస్తుంటారు. ఇది అక్కడి ఓటర్ల ఆనవాయితి.

ఇక పోతే దేశమంతటా భాజపా గాలి వీస్తోంది. కర్ణాటకలో కాంగ్రెసుకు పోటీ భాజపాయే. అలా అని గట్టిగా చెప్పలేం. కర్ణాటక ఎన్నికలలో జనతాదళ్‌ (ఎస్‌) కూడా ప్రభావం చూపుతుంది. జనతాదళ్‌ (సెక్యులర్‌) కు కర్ణాటకలో ఓట్‌ షేర్‌ ఎక్కువే ఉంది. అయినప్పటికి వాటిని సీట్ల రూపంలోకి మార్చుకోలేక పోతోంది. దానికి సరైన నాయకుల కొరత, తగ్గిపోతున్న మౌలిక వసతులు కారణం కావచ్చు.

అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను ఎవరు ఓట్లుగా మలచుకో గలుగుతారో ఆ పార్టీ లాభపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఎటు దారి తీస్తుందో..

ఇక దక్షిణ భారతదేశంలో పెద్ద రాష్ట్రం, ప్రస్తుత ఏకైక కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రం కర్ణాటకే. కాబట కాంగ్రెసు కూడా ఈ ఎన్నికలను సవాలుగా స్వీకరిస్తుంది. ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి, దేశవ్యాప్తంగా కాంగ్రెసు శ్రేణులకు ఉత్సాహాన్నివ్వాలని సిద్ధరామయ్య ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టిన రాహుల్‌గాంధీకి కూడా ఇదొక పరీక్ష. తన అధ్యక్షతన కాంగ్రెసును గెలిపించాలని అతడి తపన.

ఇన్నాళ్ళూ హిందుత్వాన్ని విమర్శించిన రాహుల్‌ మొన్నటి గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా హిందూ అభిమానిగా మారిపోయాడు. ప్రస్తుత కర్ణాటక ఎన్నికల సమయంలో కూడా ఆ పద్ధతిని కొనసాగిస్తూ గుళ్ళు, గోపురాలు, మఠాలు సందర్శిస్తున్నాడు. మఠాధిపతులను కలుస్తున్నాడు. ఇలా అన్ని చోట్లకు వెళ్తున్నాడు. మరొక విషయమేంటంటే మైనారిటీలపై రాహుల్‌కు ప్రేమ ఎక్కువ. ఇది అందరికీ తెలిసిన విషయమే. దానిని తొలగించు కోవడానికి గుళ్ళు, గోపురాలు దర్శించుకుంటున్నాడు. కాబట్టి ఈ విధానం ఎటు దారి తీస్తుందనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

రెండు ధోరణులు

కర్ణాటక ప్రజలు సిద్ధరామయ్యను ఓటు బ్యాంకు రాజకీయాలు, అవినీతి, లంచగొండితనం, ప్రజలను విభజించే విధానాల గురించి పలు వేదికల మీద నిలదీస్తున్నారు. ఒకవైపు రాహుల్‌గాంధీ శృంగేరి మఠం సందర్శించి వస్తుంటే మరోవైపు సిద్ధరామయ్య ప్రజలను విభజిస్తూ సంతృప్తి పరచి ఓట్లు పొందాలనుకుంటున్నాడు. అక్కడి కాంగ్రెసు పార్టీలో ఈ రెండు కోణాలూ నడుస్తున్నాయి. ఏది ఏమైనా దక్షిణాన అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. అందుకు సిద్ధమయ్యే ఎన్నికల బరిలోకి దిగింది.

ఇక రాహుల్‌గాంధీ తనదైన శైలిలో ఉపన్యాసాలు ఇస్తున్నారు. కాంగ్రెస్‌కు సామాన్యులతో సంబంధాలు అంతంత మాత్రమే. దీనికి రాహుల్‌ అతీతుడేమీ కాదు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఇంజ నీరింగ్‌లో భారతదేశ కీర్తిపతాకాన్ని ప్రపంచానికి ఎగరేసిన సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరును రాహుల్‌ స్పష్టంగా పలకలేకపోయారు. ఈ సంఘటన కాంగ్రెసు వారిని ఆత్మరక్షణలో పడవేసింది. ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లు పొందాలని ప్రయత్నిస్తున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు వ్యతిరేకంగా మిగతా పార్టీలను తనతో కలుపుకొని భాజపాను ఎదుర్కోవాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. కర్ణాటక ఎన్నికలు ఆ ప్రయోగానికి వేదిక కానన్నాయి. కర్ణాటకలో మిగతా పార్టీలను వెంటేసుకుని వెళ్ళగలిగితే ఇదే విధంగా పార్లమెంటు ఎన్నికలలో పోటీ ఇవ్వగలమని కాంగ్రెసు భావిస్తోంది.

మరోవైపు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తన ఎన్నికల విజయయాత్రను అప్రతిహతంగా కొనసాగించడానికి తనకు లభించిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడంలేదు. రాహుల్‌గాంధీ కర్ణాటకలో పర్యటిస్తున్న సమయంలో కూడా అమిత్‌ షా కర్ణాటకలో పర్యటిస్తున్నారు.

అడ్డుకోడానికే : అమిత్‌ షా

అమిత్‌ షా మాట్లాడుతూ సిద్ధరామయ్య హిందువై ఉండి హిందు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడు తున్నాడని; వీర శైవులకు, లింగాయతులకు ఎలాంటి మేలు చేయలేదని, భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప లింగాయత్‌కు చెందినవాడు కనుక అతడు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి సిద్ధరామయ్య కుట్రలు చేస్తున్నాడని అన్నారు. రాష్ట్రంలో ఉన్న మఠాలను, దేవాలయాలను అన్నింటినీ ప్రభుత్వ అధీనంలోకి తేవాలని సిద్ధరామయ్య ప్రయత్నించాడని, ప్రతిపక్షాలు ఎదురుతిరిగే సరికి విరమించుకున్నాడని అన్నారు. కర్ణాటకలో వక్కలు పండించే రైతులకు కనీస మద్దతు ధరలు కల్పించనందున ఎందరో రైతులు నష్ట పోయారని అమిత్‌షా పేర్కొన్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిగా యడ్యూరప్పను భాజపా ప్రకటించింది. కర్నాటక ఓటర్లు సిద్ధరామయ్యను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని అమిత్‌షా కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం సుమారు 100 పథకాలను ప్రవేశపెట్టింది. రాష్ట్రం లోని కాంగ్రెసు ప్రభుత్వం ప్రజల వద్దకు ఈ పథకాలను చేర్చలేదని అమిత్‌షా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు.

జరగబోయే ఎన్నికల రణరంగంలో గెలవడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రకరకాల ఎత్తులు వేస్తున్నారు. అందుకోసం ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడానికి సైతం సిద్ధపడుతున్నారు. ప్రజలను విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. సిద్ధరామయ్య చర్యలు ఎలాంటి ఫలితాలిస్తాయో తెలియాలంటే మే 15 వరకు ఆగాల్సిందే.

ఏది ఏమైనా ఓటర్లను పోలింగ్‌ బూతులకు రప్పించగలిగిన పార్టీ విజయాన్ని సునాయాసంగా అందుకుంటుంది. ఈ విషయంలో మిగతా పార్టీల కన్నా భాజపాకు సామర్థ్యం ఎక్కువే అని ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ఫలితాలు చెపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *