ఓం నమఃశివాయ

ఓం నమఃశివాయ

శివుని ఉపాసించటానికి తగినది శివరాత్రి. ఆ రోజు శివుని ఉద్దేశించి చేసే వ్రతాదికాలు రాత్రి పూటే చేయాలి. అదే ఆయనకు ప్రియం కలిగిస్తుంది. శివరాత్రి కూడా నవరాత్రి లాగా వ్రతమే అని నిర్ణయ సింధువు తెలియచేసింది. అంటే దీక్షగా ఉపాసన చేయవలసినది. ఆ ఉపాసనకు వీలుగా ఆయన మంత్రం ఉద్భవించింది. అదే ‘ఓం నమశ్శివాయ’.

ప్రతి మాసంలోను ప్రదోషవేళ కష్ణ చతుర్దశి ఉంటే దానిని మాస శివరాత్రి అంటారు. మాఘ మాసంలో వచ్చే మాసశివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఇది శివుడు ఆవిర్భవించిన దినం.

అప్రమేయుడు, అవ్యక్తుడు, నామరూపాతీతుడైన పరమాత్మ బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతల కోరిక మీద అందరు సేవించుకునేందుకు అనువుగా, వారిని అనుగ్రహించి, మాఘ కష్ణచతుర్దశి అర్థరాత్రి కోటిసూర్యుల కాంతితో లింగంగా ఉద్భవించాడు. ఆ విధంగా ఆవిర్భవించిన ఆదిదేవుని ‘శివ’ శబ్దంతో సూచించారు. కనుక ఆ రాత్రి శివరాత్రి అని ప్రఖ్యాతమయింది అని ఈశానసంహిత తెలియ చేస్తుంది. దానిని దేవతలు శివుని పుట్టిన రోజుగా జరుపుకుంటారు.

‘మాఘే కష్ణ చతుర్దశ్యాం ఆది దేవో మహానిశి

శివలింగ తమోద్భూతః కోటి సూర్య సమ ప్రభః

తస్మాచ్ఛివస్య యా రాత్రిః సమాఖ్యాతా శివప్రియా

తస్యాం సర్వేషు లింగేషు సదా సంక్రమతే హరః’

సత్యజ్ఞానానంతస్వరూపమైన సనాతన పరబ్రహ్మ సనాతనుడు. నిర్గుణ పరబ్రహ్మ అయినా సగుణుడు. నిర్వికార సచ్చిదానంద స్వరూపుడు. సష్టి, స్థితి, లయకర్త అయిన పరమాత్మ ఆయా కార్య నిర్వహణార్థమై బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా విడివడ్డాడు. అటువంటి అద్వితీయము, నిత్యము, అనంతము, పూర్ణము, అసంగము అయిన ప్రకతి పురుషాతీతమయిన ఈ పరతత్త్వాన్నే ‘శివుడు’ అని చెప్పింది శివపురాణం. శివుడు అని అనటానికి గల కారణం ఆ పదానికున్న అర్థం చూస్తే తెలుస్తుంది.

‘శం నిత్యసుఖమానంద మికారః పురుషః స్మతః

వకారశ్శక్తి రమతం మేలనం శివ ఉచ్యతే

తస్మాదేవం స్వమాత్మానం శివం కత్వార్చయే చ్ఛివం’

అని శివ శబ్దానికి నిర్వచనం. ‘శం’ నిత్యసుఖం. ‘ఇ’ కారం పురుషుడు. ‘వ’ కారం శక్తి. వాటి కలయిక అమతం. శివ అన్న మాటలో ఉన్న ‘ శ్‌’, ‘ఇ’, ‘ వ’ అనేవి విడివిడిగా నిత్యసుఖాన్ని, పురుషుని, శక్తిని సూచిస్తాయి. కలిసినపుడు ఏర్పడిన ‘శివ’ అనే శబ్దం అమతత్త్వాన్ని సూచిస్తుంది. అందుచేత ఒక్కసారి ‘శివ’ అంటే ఈ భావాలన్నింటిని తలచుకున్నట్టే. శివ శబ్దానికి శుభం, మంగళం అనే అర్థాలున్నాయి కనుక శివుడు అంటే శుభప్రదుడు, మంగళప్రదుడు అని అర్థం.

‘శివ ప్రియా తదుపాసనార్థా రాత్రిః శివరాత్రిః

మాఘే కష్ణ చతుర్దశ్యాం రాత్రేహి శివపూజ్య

వ్రతాదికం క్రియతే ఇతి తస్యా రాత్రేః తత్‌ ప్రియత్వం’

శివుని ఉపాసించటానికి తగినది శివరాత్రి. ఆ రోజు శివుని ఉద్దేశించి చేసే వ్రతాదికాలు రాత్రి పూటే చేయాలి. అదే ఆయనకు ప్రియం కలిగిస్తుంది. శివరాత్రి కూడా నవరాత్రి లాగా వ్రతమే అని నిర్ణయ సింధువు తెలియచేసింది. అంటే దీక్షగా ఉపాసన చేయవలసినది. ఆ ఉపాసనకు వీలుగా ఆయన మంత్రం ఉద్భవించింది. పంచ ముఖుడైన శివుని ఉత్తర ముఖం నుండి, ‘అ’ కారం, పశ్చిమ ముఖం నుండి ‘ఉ’ కారం, దక్షిణ ముఖం నుండి ‘మ’ కారం, తూర్పు ముఖం నుండి బిందువు, మధ్య ముఖం నుండి నాదం పుట్టి, అవి ఐదు విధాలుగా విస్తరించి, మళ్ళీ ఐదు కలిసి ఒక్కటిగా అయి, ‘ఓం’ కారం అనే మంత్రంగా రూపొందింది. దీనినే ప్రణవం అంటారు. దీని నుండే సమస్తమైన శబ్ద ప్రపంచం, వస్తు ప్రపంచం ఉద్భవించాయి. దీనినే సూక్ష్మ ప్రణవం అంటారు. ‘ఓం నమశ్శివాయ’ అనేది స్థూల పంచాక్షరి. దీనికి ‘ఓంకార పూర్వకంగా శివునకు నమస్కారం’ అని అర్థం. ఈ రెండూ శివుని సూక్ష్మ, స్థూల రూపాలే.

జప ధ్యానాలకి ప్రణవం పంచాక్షరి. ఉపాసనకు, సేవకు అంటే పూజాదికాలకు లింగస్వరూపం. భూమండలంలో ఉన్న ప్రాణులందరికి అర్చనకు అందుబాటులో ఉండటానికి వీలుగా నామరూపాతీత మైన పరమేశ్వర తత్త్వం లింగాకారం ధరించింది. లింగము అంటే గుర్తు, సంకేతము అని అర్థం. భగవంతుడు అని ఒక గుర్తుండాలి కదా పూజ అయినా, ధ్యానమైనా చేయటానికి! బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలకు మాఘ కష్ణ చతుర్దశినాడు దర్శన మిచ్చిన ఆ వెలుగుల స్తంభ స్వరూపమే 64 లింగాలుగా భూమిపై అవతరించిందని భక్తుల విశ్వాసం. అయితే వాటిలో 12 ప్రధానమైనవిగా చెప్పబడుతున్నాయి. ఇవి కాక మరెన్నో స్వయంభూ శివలింగాలు భారతదేశ మంతటా దర్శనమిస్తూ ఉంటాయి. ఇవన్ని లింగాకారంలో ఉన్న శివుని మూర్తులు. భారతదేశ మంతా శివుని నివాస స్థానమేనని, అందరు ఆ శివుని భక్తులే కనుక ఒకే కుటుంబమని ఇవి నిరూపిస్తాయి.

జ్యోతిర్లింగాలు

జ్యోతిర్లింగాలు భారతదేశంలోని నలుమూలలా ఉన్నాయి. శివభక్తులైన వారు ఈ ద్వాదశ జ్యోతిర్లింగా లను దర్శించాలనుకుంటారు. ఒక్కొక్క క్షేత్రంలోనూ అనంతము, అవ్యయము అయిన శివుని యొక్క ఒక్కొక్క మూర్తి వెలసింది. అన్నీ చూస్తేనే పూర్ణదర్శన మయినట్టు. జ్యోతిర్లింగాలను దర్శించు కున్నట్టయితే భారత పరిక్రమణ చేసినట్టే! ప్రాంతీయ, భాషా భేదాలను పక్కకు పెట్టి భక్తులైన వారందరు ఒక్క చోటికి చేరుతారు. ఒక జాతి, ఒక దేశం సమైక్యంగా ఉండటానికి ఇంత కన్న గొప్ప మార్గం మరొకటి ఉంటుందా?

జ్యోతిస్వరూపుడైన పరమ శివుని పన్నెండు రూపాల వైభవాన్ని దర్శించిన ఆదిశంకరులు పరవశించి అన్నింటిని కలిపి ఒక్క స్తోత్రంలో కీర్తించారు. ఒక్కమారుగా తలచుకోనేందుకు వీలుగా సంగ్రహ జ్యోతిర్లింగ స్తోత్రం కూడా ఉంది. అన్నింటిని ఒక్కమారు తలచుకుంటే చాలునట, ఏడు జన్మలలోని పాపాలు నశిస్తాయట!

‘సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీ శైలే మల్లికార్జునం

ఉజ్జయిన్యామ్‌ మహాకాళం ఓంకార మమలేశ్వరం

ప్రజ్వల్యాం వైద్యనాథం చ డాకిన్యామ్‌ భీమశంకరం

సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే

వారాణస్యాంతు విశ్వేశం త్య్రంబకం గౌతమీతటే

హిమాలయేతు కేదారం ఘష్ణేశమ్‌ చ శివాలయే

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః

సప్త జన్మ కతం పాపం స్మరణేన వినశ్యతి’

సోమనాథలింగం సౌరాష్ట్రంలో అంటే గుజరాతులో అరేబియా సముద్రతీరాన ఉంది. మల్లికార్జునలింగం ఆంధ్రదేశంలో ఉంది. మహాకాళేశ్వరుడు, ఓంకారేశ్వరుడు (పక్కనే అమలేశ్వరుడు) మధ్యప్రదేశ్‌లోను, కేదారేశ్వరుడు మందాకినీ తీరాన, విశ్వేశ్వరుడు గంగానదీ తీరాన ఉత్తరప్రదేశ్‌లోను, త్య్రంబకేశ్వరుడు, వైద్యనాథ లింగము, ఘష్ణేశ్వర లింగము, నాగనాథ లింగము, భీమశంకర లింగము మహారాష్ట్రలోనూ, రామేశ్వర లింగము తమిళనాడులోనూ ఉన్నాయి. ఇవన్నీ చూసినట్లయితే భారతదేశ మంతటిని చూసినట్టే కదా!

ఈ క్షేత్రాలకి సంబంధించిన ఇతివత్తాలు, మాహాత్మ్యాలు, జ్యోతిర్లింగాల ఆవిర్భావానికి సంబంధించిన పూర్వగాథలు శివమహాపురాణం లోను, స్కాంధపురాణంలోనూ కనపడతాయి.

పంచభూత లింగాలు

ఇవి కాక పంచభూత లింగాలు భక్తులకు మోక్షదాయకాలై విలసిల్లు తున్నాయి.

పంచారామాలు

ఆంధ్రదేశానికి మాత్రమే పరిమితమైన పంచారామ క్షేత్రాలు పుణ్యప్రదాలై భక్తుల సేవలందుకుంటున్నాయి. వీటి ఆవిర్భావానికి సంబంధించిన ఇతివత్తం కూడా స్కాంధపురాణంలో కనపడుతుంది.

పూర్వం హిరణ్య కశిపుని కుమారుడైన నముచి కొడుకు తారకాసురుడు బ్రహ్మదేవుని గురించి కఠోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమైతే అందరు రాక్షసుల లాగానే మరణం లేకుండా వరం ఇవ్వమని అడిగాడు. అది తన చేతుల్లో లేదని, వేటి వల్లనైనా చావు లేకుండా కోరుకుంటే ఇవ్వగలనని అన్నాడు. తారకాసురుడు ఆలోచించి అప్పటి వరకు సష్టిలో ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు ముఖాలున్న జీవులే ఉన్నాయి కనుక తనకు ఆరు ముఖాలున్న అర్చకుడి చేతిలో తప్ప చావు లేకుండ వరం ఇవ్వమని అడిగాడు. బ్రహ్మ సరే నన్నాడు. దానితో షణ్ముఖుడు అవతరించవలసి వచ్చింది. అతడు కోరిన మిగిలిన నిబంధనలు కూడా అనుసరించబడినాయి. అతడు అజేయుడవటానికి ఈశ్వర వరప్రసాదమైన అమతలింగం కంఠాన ఉండటమే కారణం. కుమారస్వామి తారకాసురునితో యుద్ధంచేసి, హతమార్చినప్పుడు కుమారస్వామి వేసిన బాణపు దెబ్బకి ఆ అమతలింగం ఐదు ముక్కలుగా విచ్ఛిన్నమయింది. ఆ ఐదు ముక్కలను దేవతలు ఐదు ప్రదేశాలలో పునఃప్రతిష్ఠించారు. అవే పంచారామ క్షేత్రాలుగా ప్రఖ్యాతి పొందాయి.

పంచభూత లింగాలు, పంచ ఆరామాల గురించి ముందు పుటలలో వివరంగా తెలుసుకోవచ్చు.

సర్వవ్యాపకుడైన పరబ్రహ్మము లింగరూపంలో ఎన్నో క్షేత్రాలలో కొలువై ఉండి భక్త సులభుడై అనుగ్రహాన్ని వర్షిస్తున్నాడు. భారతదేశం అఖండం అనే సత్యాన్ని నిరూపిస్తున్నాడు.

– డా|| అనంతలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *