ఏది సంప్రదాయం? ఏది స్వేచ్ఛ? ఏది జోక్యం?

ఏది సంప్రదాయం? ఏది స్వేచ్ఛ? ఏది జోక్యం?

‘ప్రపంచమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటోంది. మనం మాత్రం మహిళలను ఆలయంలోకి అనుమతించాలా, వద్దా? అనే అంశం దగ్గరే ఊగిసలాడుతున్నాం!’ ఆ మధ్య ఒక మహిళా జర్నలిస్ట్‌ రాసిన వ్యాసంలో ఒలకబోసుకున్న ఆవేదన ఇది. శబరిమలైలోని స్వామి అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించడం గురించిన వివాదం కేరళ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు వెళ్లిన నేపథ్యంలోనే ఆమె ఆ వ్యాసం రాశారు. మనం అంటే మొత్తం భారతదేశంలో మహిళల గురించి మాత్రం కాదు.

ఇంతకీ అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చునా లేదా అనేది తేల్చే హక్కు సంప్రదాయకంగా ప్రధాన అర్చకుడు లేదా ‘తంత్రి’కి సంబంధించినది. కానీ ఆలయంలో స్త్రీల ప్రవేశం గురించి కోర్టులలో వాదోపవాదాలు జరిగాయి. ఆ అంశం మీద నిర్ణయించే అధికారం కోర్టుల పరమైంది. తాజాగా సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. అంతకు ముందు కేరళ హైకోర్టులో జరిగాయి. క్రైస్తవ సంప్రదాయంలో కూడా కొన్ని మతాచారాలలో స్త్రీలకు పరిమితులు ఉన్నాయి. కానీ వాటి గురించి చర్చించే అధికారం ఎవరికీ లేదంటున్నాయి ఆ వర్గాలు. చర్చిలలో అపరాధాలు ఒప్పుకునే కార్యమ్రాన్ని రద్దు చేయాలంటూ జాతీయ మహిళా కమిషన్‌ చేసిన సిఫారసులను అదే కేరళ చర్చి పెద్దలు, జాతీయ మైనారిటీ కమిషన్‌ తూర్పార పట్టాయి. మహిళా కమిషన్‌ చేసిన సిఫారసులు క్రైస్తవుల మనో భావాలను కించపరిచేవేనని ఎలాంటి శషభిషలు లేకుండా ప్రకటించాయి. క్రైస్తవుల మత విషయాలలో ఇతరుల జోక్యం సహించేది లేదని మైనారిటి కమిషన్‌ అధ్యక్షుడు ఘాయోరుల్‌ హసన్‌ రిజ్వి జూలై 29న మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మను హెచ్చరించడం కూడా జరిగిపోయింది. చర్చిలలో అక్రమాలు జరుగుతున్నాయి. ముస్లిం మహిళలకు వారి ప్రార్థనా స్థలాలలోకి అనుమతి ఉండదు. ఈ రెండు అంశాల గురించి మాత్రం ‘ఇతరులు’ ఎవరూ మాట్లాడకూడదు. కానీ చిరకాలం నుంచి వస్తున్న ఒక హిందూ ఆచారం గురించి కోర్టులు తమ అభిప్రాయాలను యథేచ్ఛగా వెల్లడించవచ్చునా? కోర్టుల కంటే ముందే మీడియా తీర్పులు ప్రకటించ వచ్చునా? కాబట్టి ఆ మహిళా జర్నలిస్ట్‌ మహిళలకే సంబంధించిన ఈ రెండు అంశాల మీద కూడా స్పందించాలని కోరుకుందాం. అయితే అది దురాశే అవుతుంది. అది వేరే విషయం. మరొక వాస్తవాన్ని కూడా గుర్తించాలి. భారతదేశంలో దాదాపు 99 శాతం ఆలయాలలో మహిళల ప్రవేశం మీద ఎలాంటి ఆంక్షలూ లేవు. కొన్నిచోట్ల మూలవిరాట్టును తాకుతూ అర్చనలు చేసే హక్కు కూడా ఉంది.

అసలు మహిళకే ప్రవేశం లేదనుకుంటున్నారా?

శబరిమలై ఆలయంలో మహిళల ప్రవేశం గురించిన వివాదంలో జూలై 18న ఐదుగురు సభ్యులు ఉన్న సుప్రీం కోర్టు ధర్మాసనం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘ఒక పురుషుడు ప్రవేశించగలిగినప్పుడు, మహిళకు కూడా అలాంటి హక్కు ఉంటుంది. పురుషుడికి ఏది వర్తిస్తుందో, మహిళకు కూడా అదే వర్తిస్తుంది’ అని పేర్కొన్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఆర్‌ ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రా, జస్టిస్‌ ఎఎం ఖన్విల్కర్‌ ఈ ధర్మాసనంలో సభ్యులు. కేశవానంద భారతి వ్యాజ్యం దేశంలో ఎంతో క్లిష్టమైనది. ఈ కేసును అదే స్థాయిలో పరిగణిస్తూ ఐదుగురు సభ్యులు ఉన్న ధర్మాసనం ఏర్పాటు చేశారన్న అభిప్రాయం ఉంది. నిజానికి ఇంతకంటే పెద్ద ధర్మాసనానికి కూడా ఈ కేసు వెళ్లినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన అభిప్రాయం మాత్రం గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు పూర్తిగా విరుద్ధం. సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని తాము గౌరవిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అంతకు మించి చేసేదేమీ లేదు కూడా. అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్ణయం ఏమిటో తెలియవలసి ఉంది. ఈ వ్యవహారం మొత్తంలో ఇదే కీలకం. ఎందుకంటే స్వామి దర్శనానికి వచ్చే మహిళలు తమ వయో పరిమితిని తెలియచేసే పత్రాన్ని తప్పక వెంట తెచ్చుకోవాలని దేవస్థానం ప్రకటించి ఎంతోకాలం కాలేదు.

ఇంతవరకు సుప్రీంకోర్టు వ్యాఖ్యలలో వినిపించినదానిని బట్టి, మీడియాలో వినిపిస్తున్న, కనిపిస్తున్న వాటిని బట్టి శబరిమలై ఆలయంలో మహిళలకు అసలు ప్రవేశమే లేదా అన్న ప్రశ్న రావడంలో ఆశ్చర్యం లేదు. ఆ విషయంలో సుప్రీంకోర్టును మహిళా హక్కుల రక్షకులు తప్పుతోవ పట్టించారా? నిజానికి అక్కడ అసలు మహిళలకు ప్రవేశం లేదనడం తొందరపాటు. అక్కడ అమలులో ఉన్న నిషేధం పదేళ్లు దాటి, యాభయ్‌ ఏళ్ల లోపు వయసు ఉన్న ఆడవారికి మాత్రమే వర్తిస్తుంది. యౌవనంలోకి అడుగు పెట్టనివారు, యౌవన దశ ముగిసిన మహిళలు స్వామివారిని దర్శించుకోవడం సర్వసాధారణం. కాబట్టి అక్కడ మహిళలకు ప్రవేశం లేదన్న వాదన ఎంత వరకు సబబు అన్న ప్రశ్న హేతుబద్ధమే. దాని మీదే వాదోపవాదాలు సాగడం కూడా ప్రశ్నార్థకమే. ఒక వయసు ఉన్న మహిళలను అక్కడికి అనుమతించడం లేదు. అందుకు కారణం… శారీరకమైనది. అది ప్రవేశం నిరాకరిస్తున్న మహిళలకు ఉండే బహిష్టు దశ. వారిని అనుమతించకపోవడం వెనుక ఈ కారణం తప్ప మరొక దురుద్దేశం ఏదీ లేదని సంప్రదాయాన్ని సమర్ధిస్తున్నవారు చెబుతున్నమాట. బహిష్టు అయిన మహిళలు వివాహ కార్యక్రమాలు, ఇళ్లల్లో జరిగే ఇతర శుభకార్యాలలో కూడా పాల్గొనరు. దేవాలయాలకు కూడా వెళ్లరు. ఇదొక విశ్వాసం.

కేరళ హైకోర్టు తీర్పులో వాస్తవికత

ఈ అంశాన్ని కేరళ హైకోర్టు పరిశీలించిన తీరు ఆదర్శనీయంగా ఉంది. సాంస్కృతిక, చారిత్రక అంశాలను పరిశీలించిన మీదట హైకోర్టు ఒక అభిప్రాయానికి వచ్చింది. 1991లోనే అయ్యప్ప దేవాలయంలోనికి 10…50 ఏళ్ల మధ్య వయసు మహిళలను అనుమతించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకం కాదనే తేల్చి చెప్పింది. అక్కడ హక్కుల సమస్యను కాకుండా, మనోభావాలను కోర్టు ప్రధానంగా పరిశీలించింది. అయ్యప్ప దర్శనానికి వెళ్లేవారు మండల దీక్ష (41 రోజులు) చేసి, అంతిమంగా స్వామివారిని దర్శించుకుంటారు. ఇది నియమం. దీక్ష ధ్యేయం, ఆచారం. కానీ యౌవన దశలో ఉన్న మహిళలకు బహిష్టు సహజం కాబట్టి వారికి పరిపూర్ణంగా మండల దీక్ష చేసే అవకాశం దాదాపు లేదు. కాబట్టి వారి వరకు నిషేధం రాజ్యాంగ విరుద్ధం కాదన్నదే కేరళ హైకోర్టు అభిప్రాయం.

తరువాత కేరళ హిందూక్షేత్రాలు, బహిరంగ ప్రదేశాల ఆరాధన స్థలాలో పాటించవలసిన నియమాలను (1965)ను అనుసరించి అందులోని మూడో నిబంధనను మార్చమని కేరళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మతారాధనలో రాజ్యాంగం ఇస్తున్న సమాన హక్కుకు ఇది విరుద్ధమని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నాయి. నాయర్స్‌ సోసైటీ యౌవనంలో ఉన్న మహిళలను అనుమతించరాదని కోరుతూ ఉండగా, ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ కేరళ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేసింది. వీరికి ‘హ్యాపీ టు బ్లీడ్‌’ ఉద్యమానికి చెందిన విద్యార్థులు మద్దతుగా ఉన్నారు. దరిమిలా వచ్చినదే సుప్రీంకోర్టు అభిప్రాయం. ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది. ఆలయ సంప్రదాయాలు, ఆచారాల విషయంలో నిర్ణయమంతా ప్రధాన పూజారిది. ఆయననే అక్కడ తంత్రి అని పిలుస్తారు. ఈ విషయం అత్యున్నత న్యాయస్థానం ఎందుకు పరిగణించడం లేదు? ఇది ఆయన హక్కును హరించడం కూడా అవుతుందనేది అయ్యప్ప భక్తుల ఆవేదన.

చర్చిలపై ఆరోపణల గురించి మాట్లాడరాదు

అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశం గురించి సుప్రీం కోర్టు అభిప్రాయం వెలువడిన సరిగ్గా వారానికే కేరళ చర్చిలపై వివాదాలు కూడా దేశం దృష్టికి వచ్చాయి. అందులో ప్రధానంగా కనిపిస్తున్నవి మహిళల మీద చర్చి పెద్దలు లైంగిక దోపిడీకి పాల్పడినవే. వాటి మీద జాతీయ మహిళా సంఘం దర్యాప్తు చేయించి, కొన్ని సిఫారసులు చేస్తే అది మత స్వేచ్ఛకు భంగకరమని కేరళ కేథలిక్‌ బిషప్‌ల మండలి అధ్యక్షుడు ఆర్చ్‌బిషప్‌ సుసా పకీయం మండిపడుతున్నారు. ప్రధానికి ఫిర్యాదు చేశారు.

జూలై 26న జాతీయ మహిళా కమిషన్‌ తన సిఫారసులను పంపించింది. ఈ చర్య దిగ్భ్రాంతి కరమంటూ సుపా పకీయం తిరువనంతపురంలో మరునాడే విలేకరుల సమావేశం పెట్టి ఆక్రోశించారు. ఇది క్రైస్తవ సమాజానికే కాదు, మత స్వేచ్ఛను గౌరవించేవారందరికీ కూడా దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. ఇంతటి విషయాన్ని చర్చితో కనీసం సంప్రతించకుండానే మహిళా కమిషన్‌ ‘ఏకపక్షం’గా సిఫారసు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది చర్చి విశ్వసనీయతనీ, ప్రతిష్టనీ దెబ్బ తీసేందుకే చేపట్టారని కూడా తీవ్ర స్థాయిలోనే ఆరోపణ చేశారు. ఈ వివాదాన్ని తగిన క్రైస్తవ వేదిక మీద లేవదీసి చర్చకు పెట్టవలసిందని మైనారిటీ కమిషన్‌ సభ్య కార్యదర్శి జార్జి కురియన్‌ను కూడా ఆయన కోరారు. కురియన్‌ వెనువెంటనే ప్రధానికీ, హోంమంత్రికీి ఈ సిఫారసుల గురించి ఫిర్యాదు చేశారు. మీరూ నోరు విప్పాలంటూ ఎన్డీయే మంత్రివర్గ సభ్యుడు అల్ఫోన్సో కన్నన్తానమ్‌ను కూడా సుసా కోరారు. కేరళకే చెందిన అల్ఫోన్సో కూడా ఈ సిఫారసులను వ్యతిరేకించారు. జాతీయ మహిళా కమిషన్‌ చర్చి వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం తగదని జాతీయ మైనారిటీ కమిషన్‌ కూడా జూలై 28న హెచ్చరించింది. చర్చిలలో అపరాధాలు (కన్ఫెషన్స్‌) ఒప్పుకునే కార్యక్రమాన్ని రద్దు చేయాలని మహిళా కమిషన్‌ చెప్పడం సరికాదని మైనారిటీ కమిషన్‌ చెప్పింది. ఇలా కన్ఫెషన్‌ చెప్పించడమంటే ఆమెను బెదిరించడమేనని మహిళా కమిషన్‌ అభిప్రాయపడుతోంది. నలుగురు మత పెద్దల చేతిలో అత్యాచారానికి గురైన మహిళ విషయంలో జరిగింది ఇదేనని మహిళా కమిషన్‌ ఉద్దేశం. కానీ క్రైస్తవుల ఆచార వ్యవహారాలను నిషేధించాలని కోరే అధికారం రేఖా శర్మ (మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌)కు లేదని మైనారిటి కమిషన్‌ చైర్మన్‌ హసన్‌ రిజ్వి ప్రకటించారు.

ఇంతకీ మహిళా కమిషన్‌ ఇలాంటి సిఫారసులు చేయడానికి ఉన్న నేపథ్యం ఏమిటి? కేరళ చర్చిలో జరుగుతున్న లైంగిక అత్యాచారాల మీద మహిళా సంఘం చైర్‌పర్సన్‌ రేఖా శర్మ ఒక కేంద్ర దర్యాప్తు సంఘాన్ని నియమించారు. ఒకటి రెండు కాదు, ఇలాంటి అఘాయిత్యాలు అంతకు మించి జరిగినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. అందులో ఒక ఫిర్యాదు ఒక బాధితురాలి భర్త చేసినదే కూడా. మలాంకర్‌ సిరియన్‌ ఆర్థ్‌డాక్స్‌ చర్చిలో ఒక వివాహితపై నలుగురు మత పెద్దలు లైంగిక అత్యాచారం చేశారు. తరువాత ఆమెపై ఒత్తిడి తెచ్చి కన్ఫెషన్‌ చేయించారు. దీని మీదే ఆమె భర్త ఫిర్యాదు చేశారు. తన దర్యాప్తు నివేదికను, కొన్ని సిఫారసులను మహిళా కమిషన్‌ చేసి, ప్రధాని, ¬ంమంత్రులకు ఇప్పటికే అందించింది. దీనికే వీరందరూ కలసి పెడుతున్న పేరు…. మత స్వేచ్ఛకు భంగకరం.

శబరిమలై ప్రత్యేకత వేరు

అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్‌ ఈశ్వర్‌ చేస్తున్న వాదనలు కొన్ని ఉన్నాయి. వాటిని మనమైనా విందాం. దేశంలో చాలాచోట్ల అయ్యప్ప ఆలయాలు ఉన్నాయి. వాటిలో మహిళలు ప్రవేశించడానికి ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ శబరిమలై అయ్యప్ప ఆరాధన మొత్తం బ్రహ్మచర్యం అనే అంశం చుట్టూ, మనిషిలోని చైతన్యాన్ని మేల్కొల్పాన్న ఆశయం చుట్టూ సాగుతుందంటారాయన. శబరిమలై ఆలయం చైతన్యకేంద్రమని స్వాముల నమ్మకం. మనిషి ఒక ఆశయాన్ని సాధించడానికి దీక్షతో ఉండడం ఎలాగో నేర్పుతుంది ఈ సేవ. దీనికి అయ్యప్ప జీవితంతో ముడిపడి ఉన్న పురాణగాథ ఉంది. మాలికాపు రత్తమ్మ అనే స్త్రీ ఆయనను మోహించింది. కానీ తనకు ఒక ఆశయం ఉందనీ, అది సాధించగానే పెళ్లి చేసికుంటా ననీ, ఆశయం సిద్ధించే వరకు నైష్ఠిక బ్రహ్మచర్యం ఆచరించవలసి ఉంటుందనీ ఆయన ఆమెను ఒప్పించాడట. హిందూ ధర్మంలో ఏదైనా ఆరాధనకీ, విశ్వాసానికీ దేవుని ప్రతిమ, ఆలయం, గర్భగుడి వంటివి కీలకంగా ఉంటాయి. ఇది మితవాద, వామపక్ష, స్త్రీవాదానికి సంబంధించిన అంశం కాదు. ఇది మనోభావాలకి సంబంధించింది. ఈ అంశాలనే కోర్టు పరిగణన లోనికి తీసుకుంటే సంతోషిస్తామని రాహుల్‌ ఈశ్వర్‌ సుప్రీం కోర్టుకు విన్నవించారు. అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు సైతం ప్రవేశం కల్పించాలని కోరుతున్నవారు హిందూ ధర్మం పట్ల కనీస మర్యాద ఉంటే దేవుడు సర్యాంతర్యామి అని ఆ ధర్మం చెబుతున్న వాస్తవాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి.

– జాగృతి డెస్క్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *