ఎవరు గెలిచారు?

ఎవరు గెలిచారు?

అతి పెద్ద పార్టీగా నిలిచిన భాజపాను గవర్నర్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించారు. అయితే భాజపాపై లేని పోని అభాండాలు వేసి, కల్పిత ఫోన్‌ కాల్స్‌, కల్పిత కథనాలతో ప్రజలను కాంగ్రెస్‌ అయోమయానికి గురిచేసింది. ఇలాంటి సమయంలో 104 సీట్లు సాధించి కూడా యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవిని సునాయాసంగా వదులుకోడానికి సిద్ధమై, విశ్వాస పరీక్ష కంటే ముందుగానే తాను రాజీనామా చేస్తున్నట్లు సభలో ప్రకటించి, హుందాగా వ్యవహరించి పదవి నుంచి తప్పు కున్నారు. ఇది ప్రజలను ఆలోచింప జేసింది.

కాంగ్రెస్‌ విభజన రాజకీయాలతో విసుగు చెందిన కన్నడ ప్రజలు వారిని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి తగిన శాస్తి చేశారు. అయినప్పటికి అనైతిక పొత్తుతో ముఖ్యమంత్రి పదవి ఆశచూపి జెడిఎస్‌తో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌. ఇది గొప్ప విజయంగా కుహనా లౌకిక కూటమి సంబురాలు చేసుకుంటున్నా కన్నడ ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారతీయ జనతా పార్టీ ఉత్తర భారత పార్టీ అని, దానికి దక్షిణ భారతంలో చోటులేదని విమర్శించిన కుహనా మేధావులు తాజా ఫలితాలతో ఖంగు తిన్నారు. 222 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 104 స్థానాలు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అడుగు దూరంలో నిలిచింది.

దేశవ్యాప్తంగా భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు, కూటములు కలసి దుష్ప్రచారం చేస్తున్న ప్రస్తుత తరుణంలో కర్నాటకలో 104 సీట్లు గెలవడం అన్నది భాజపా సత్తాను తెలియజేస్తోంది. దేశంలోని పార్టీలన్ని ఒకవైపు, భాజపా ఒక వైపుగా ఈ ఎన్నికలు జరిగాయి. హిందూ వ్యతిరేక నినాదాలతో బరిలోకి దిగిన సిద్ధరామయ్య నేతత్వం లోని కాంగ్రెస్‌ 78 స్థానాలకే పరిమితం అయ్యింది. ఒక్కలిగలు అధికంగా ఉన్న మైసూరు ప్రాంతంలో ఎక్కువ సీట్లు సాధించి జెడిఎస్‌ పార్టీ 38 స్థానాలను సాధించింది.

భారతీయ జనతా పార్టీకి ముంబై కర్నాటక, కోస్తా కర్నాటక ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో సీట్లు వచ్చాయి. బెంగళూరు, హైదరాబాదు కర్నాటకలలో కూడా గతంలో పోల్చితే సీట్ల సంఖ్య పెంచుకుంది.

రోజురోజుకు బలపడుతున్న భారతీయ జనతా పార్టీని నిలువరించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రయత్నించారు. రకరకాల కుట్రలను పన్ని ఒకరు కాంగ్రెస్‌కు మరొకరు జెడిఎస్‌కు మద్దతు పలికారు. ఎపికి ప్రత్యేక ¬దా నిరాకరించారన్న సాకుతో భాజపాను నిలువరించడానికి చంద్రబాబు కర్నాటకలోని తెలుగు ప్రజలకు బిజెపికి వ్యతిరేకంగా ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపును అందుకొని చంద్రబాబు భజన బందం వెంటనే బెంగళూరులో వాలిపోయి రహస్య మీటింగులు, ఉపన్యాసాలతో హడావుడి సష్టించారు. వీరి మోసపూరిత మాటలను కర్నాటకలోని తెలుగు వారు నమ్మలేదు. ఎందుకంటే తెలుగువారు కీలకంగా ఉన్న ప్రాంతాల్లో 2013తో పోల్చితే ప్రస్తుతం బిజెపికి అధిక సంఖ్యలోనే ఓట్లు, సీట్లు వచ్చాయి.

ముస్లింలు, దళితులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు మొదటి నుంచి గట్టిపట్టు ఉంది. తెలంగాణ సరిహద్దుగా ఉన్న హైదరాబాదు కర్నాటకలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్‌కు వచ్చినా భాజపా కూడా గతంలో కంటే ఎక్కువ స్థానాలను ఈ ప్రాంతంలో గెలుచుకుంది. ఈ ప్రాంతంలో 2013లో బిజెపి మొత్తం 31 స్థానాలకు గానూ కేవలం 6 స్థానాలనే గెలుచుకోగా ఇప్పుడు (2018) 13 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ ప్రాంతంలో పట్టు సాధించి భాజపా దక్షిణాదిలోకి విజయవంతంగా రంగ ప్రవేశం చేసింది.

తెలుగు ప్రాంతంలోనూ మెరుగే..

కర్నాటకలోని 12 జిల్లాలలో తెలుగువారి ప్రభావం అధికంగా ఉంది. తెలుగు ఓటర్లు అధికంగా ఈ 12 జిల్లాల్లో ఉన్న మొత్తం 65 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ 31, భాజపా 21, జెడిఎస్‌ 12 స్థానాలను గెలుచుకున్నాయి. ఈ ప్రాంతాల్లో భాజపా పరిస్థితి 2013 కంటే బాగా మెరుగుపడింది. తెలుగుదేశం పార్టీ చెబుతున్నట్లు హోదా ప్రభావం కన్నడ ఎన్నికల్లో అసలు కనబడలేదు. బాబును సొంత రాష్ట్ర ప్రజలే నమ్మే స్థితి లేదు. ఇక కర్నాటకలో ఏం నమ్ముతారు!

బెంగళూరు పట్టణ, బెంగళూరు గ్రామీణ, బళ్లారి, కోలార్‌, చిక్‌బళ్లాపూర్‌, తుముకూరు, చిత్రదుర్గ, కొప్పల్‌, రాయచూర్‌, కలబురిగి, యాద్గిర్‌, బీదర్‌ జిల్లాలలో తెలుగు వారి ప్రభావం ఉంది. ఈ జిల్లాలలో ఎపికి చెందిన తెలుగుదేశం, కాంగ్రెస్‌ నాయకులు పర్యటించి బిజెపికి వ్యతిరేకంగా ఓటు వెయ్యాలని తెలుగు ప్రజలను కోరారు. ఎపి ఎన్‌జిఒ నేతలు విమానాల్లో బెంగళూరు వెళ్లి తెలుగు సంఘాల సమావేశం పేరుతో భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

బెంగళూరు నగరంలోని మొత్తం 26 స్థానాలకు ఎన్నికలు జరగగా బిజెపి 12 స్థానాలను గెలుచుకుంది. బెంగళూరు నగరంలో ఓటింగ్‌ శాతం తక్కువగా ఉండటంతో భాజపా ఇంకా ఎక్కువ సీట్లు సాధించాల్సి ఉన్నా సగం స్థానాలకే పరిమితం అయ్యింది. చిత్రదుర్గ జిల్లాలో మొత్తం 6 స్థానాలకు గానూ 5 స్థానాలను భాజపా గెలుచుకుంది. తుముకూరులో 11 స్థానాలకు గానూ 4 స్థానాలను, కొప్పల్‌లో 5 స్థానాలకు గాను 3 స్థానాలు గెలుచుకుంది. యాద్గిర్‌ జిల్లాలో మొత్తం నాలుగులో రెండు, గుల్బర్గాలో తొమ్మిదిలో నాలుగింటిని గెలుచుకుంది. బళ్లారిలో 9 స్థానాలకు గానూ భాజపా కేవలం 3 స్థానాలను మాత్రమే దక్కించుకోగలిగింది. బళ్లారిలో గాలి సోదరులపై ఆంక్షలు విధించి సిద్దరామయ్య అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో అక్కడ మెజారిటీ స్థానాలను భాజపా కోల్పోవలసివచ్చింది.

బొంబాయి కర్నాటక, కోస్తా కర్నాటకలో భాజపాను జెడిఎస్‌ కానీ, కాంగ్రెస్‌ కాని నిలువరించ లేకపోయాయి. ఒక్కలిగలు ఎక్కువగా ఉండే పాత మైసూరు ప్రాంతంలో మాత్రమే జెడిఎస్‌కు స్థానాలు వచ్చాయి. చాముండేశ్వర స్థానంలో కాంగ్రెస్‌ సిఎం సిద్ధరామయ్య జెడిఎస్‌ చేతిలో ఘోరంగా ఓడి పోయారు. అదే జెడిఎస్‌కు కాంగ్రెస్‌ సిఎం సీటును ఎరగా చూపి అనైతిక పొత్తుతో మళ్లీ గద్దెనెక్కింది.

ఈ ఎన్నికల్లో భాజపా మొదటి నుంచీ యడ్యూరప్పను సిఎం అభ్యర్ధిగా ప్రచారం చేసింది. కాంగ్రెస్‌, జెడిఎస్‌లకు వ్యతిరేకంగా ప్రజలు యడ్యూరప్ప ముఖ్యమంత్రి కావాలని ఆశించి 104 స్థానాలు కట్టబెట్టడం వాస్తవం. కానీ ఎన్నికల్లో ఓడి పోయిన కాంగ్రెస్‌ జెడిఎస్‌తో కూటమికి తెర లేపి, అనైతికంగా కుమారస్వామిని గద్దెనెక్కించడం కూడా వాస్తవమే.

అవాక్కయిన చంద్రులు

కర్నాటకలో దాదాపు ఉనికిని కోల్పోయిన జెడిఎస్‌కు ఒకపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌, మతతత్వ పార్టీ ఎంఐఎం బహిరంగ మద్దతు పలకగా; మరోపక్క ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎపిలో ఒక్క ప్రజా ప్రతినిధి సీటు లేని కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. కెసిఆర్‌ తన ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతిస్తారనే ఆశతో జెడిఎస్‌కు మద్దతిస్తే; బాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి ¬దా పేరుతో భాజపాపై నింద మోపి, నానా గలాటా చేసి, అది విఫలమవడంతో కర్నాటకలో భాజపాను ఓడించి తన కక్ష తీర్చుకోవాలనుకున్నారు. అందుకు శత విధాల ప్రయత్నించారు. ఆ విషయంలో ప్రజాభి మతానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలువునా చీల్చిన కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవడానికి కూడా బాబు వెనుకాడలేదు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తనకు మేలు జరుగుతుందని, తన అవినీతి బయటకు రాదని బాబు ఆశించినట్లున్నారు.

కాని కర్నాటకలో భాజపా మెజారిటీ స్థానాలు గెలుచుకోవడంతో ఇద్దరు చంద్రులు అవాక్కయ్యారు. తమ తోక ప్రసార సాధనాలతో ఎమ్మెల్యేలను భాజపా కొనడానికి ప్రయత్నిస్తున్నట్లు అభూత కల్పనలు, అసత్య వార్తలను ప్రసారం చేయించారు. తను అధికారంలో ఉండగా ఎప్పుడూ తన సొంత జిల్లా చిత్తూరులో నాలుగుకు మించి స్థానాలు సాధించని బాబు తన వల్లే భాజపా అధికారంలోకి రాకుండా 104 స్థానాల వద్ద ఆగిందని, తెలుగు ప్రాంతాల్లో తమ ప్రచారం వల్లే కాంగ్రెస్‌ గెలిచిందని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఈ ప్రాంతంలో 2013 కంటే ఎక్కువగా భాజపా సీట్లు సాధిచందన్న విషయాన్ని వారు విస్మరిస్తున్నారు.

హుందాగా యడ్యూరప్ప

అతి పెద్ద పార్టీగా నిలిచిన భాజపాను గవర్నర్‌ తనకున్న విచక్షణాధికారాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించారు. అయితే తమ ఎమ్మెల్యేలు ఎక్కడ చేజారిపోతారో అని భాజపాపై లేని పోని అభాండాలు వేసి, కల్పిత ఫోన్‌ కాల్స్‌, కల్పిత కథనాలతో ప్రజలను కాంగ్రెస్‌ అయో మయానికి గురిచేసింది. ఇలాంటి సమయంలో 104 సీట్లు సాధించి కూడా యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవిని సునాయాసంగా వదులుకోడానికి సిద్ధమై, విశ్వాస పరీక్ష కంటే ముందుగానే తాను రాజీనామా చేస్తున్నట్లు సభలో ప్రకటించారు. హుందాగా వ్యవహరించి పదవి నుంచి తప్పుకున్నారు. రాజీనామా సందర్భంగా యడ్యూరప్ప చేసిన ప్రసంగం కన్నడ ప్రజలను ఆలోచింపజేసింది.

గతంలో కుమారస్వామి వెన్నుపోటుతో అధికారం కోల్పోయిన భాజపాను తర్వాత ప్రజలు గెలిపించా రన్నది గమనార్హం. దేశవ్యాప్తంగా భాజపాను వ్యతిరేకించే వారిని మాత్రమే కుమారస్వామి ఇప్పుడు తన పదవీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వా నించడం కూడా గమనార్హం.

ప్రకాశ్‌రాజ్‌, రాహుల్‌ గాంధీ లాంటి వారు భాజపాకు వ్యతిరేకంగా ర్యాలీలు, సభలు నిర్వహించినప్పటికీ వాటిని నమ్మకుండా ప్రజలు భాజపాకు 104 స్థానాలు కట్టబెట్టడం వాస్తవం.

కుమారస్వామి ఎన్నాళ్ళుంటారు ?

కాంగ్రెస్‌ వేసిన ఉచ్చులో చిక్కుకున్న కుమారస్వామి సిఎం పీఠం అధిరోహించినా, ఆయన ఆ పదవిలో ఎన్నాళ్ళుంటారనేది ప్రస్తుతం ప్రజలలో నడుస్తున్న అతి పెద్ద చర్చ. ఇందులో వాస్తవం లేకపోలేదు. ప్రజలు ఆలోచిస్తున్నట్లుగానే కుమార స్వామిని ఆ పదవిలో కాంగ్రెస్‌ ఎక్కువకాలం ఉండనివ్వకపోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్‌ కేవలం భాజపాకు వ్యతిరేకంగా మాత్రమే ఆలోచించింది. వ్యతిరేకంగా చేసే పనులేవీ విజయం సాధించిన దాఖలాలు చరిత్రలో కనబడవు.

భాజపాకు అధికారం రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ సిద్ధరామయ్య ఇతర కన్నడ నేతలను సంప్రదించకుండానే సిఎం పదవి ఆఫర్‌ చేశారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలోనే అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. కెపిసిసి అధ్యక్షుడు పరమేశ్వరకు, లింగాయత్‌ నేత శివకుమార్‌కు డిప్యూటి సిఎం విషయంలో అప్పుడే పోటీ ప్రారంభమైంది. కాంగ్రెస్‌లోని లింగాయత్‌ నేతలు యడ్యూరప్పకు మద్దుతు తెలపకుండా శివకుమార్‌ అడ్డుకున్నారు. ఇప్పుడు లింగాయత్‌ లకు మెజారిటీ మంత్రి పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్య శాఖలను కాంగ్రెస్‌కు ఇవ్వడానికి జెడిఎస్‌ సిద్ధంగా లేదు. మరోపక్క పాత మైసూరు ప్రాంతానికే పరిమితమైన జెడిఎస్‌ తన పరిధిని రాష్ట్రమంతా విస్తరించడానికి ప్రయత్నాలు ప్రారం భిస్తుంది. దీనికి గండి కొట్టడానికి కాంగ్రెస్‌ ప్రయత్నించొచ్చు. మరో ఆరు నెలల తిరగక్కుండానే సిఎం పీఠాన్ని కాంగ్రెస్‌ ఆశించవచ్చు. 78 స్థానా లున్న కాంగ్రెస్‌ ఎక్కువ మంత్రి పదవులు ఆశించొచ్చు, ఇది కుమార స్వామికి రుచించకపోవచ్చు.

కేవలం భాజపాకు వ్యతిరేకంగా మాత్రమే జట్టు కట్టిన ఈ ఇరు పార్టీలు ఇలా ఒకరికి నచ్చని పనులు మరొకరు చేయాలనే మనస్తత్వం, ఒకరి ఎదుగు దలను అడ్డుకునేందుకు మరొకరి ప్రయత్నాలు కలసి చివరికి ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఎదురు కావచ్చు. ఎందుకంటే తాను మద్దతిచ్చి నిలబెట్టిన ఏ ప్రభుత్వాన్నీ కాంగ్రెస్‌ పూర్తి కాలం నిలవనీయలేదనేది చరిత్ర చెబుతున్న పచ్చి నిజం.

– ఆర్‌.సి.రెడ్డి ఉప్పల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *