ఊగిసలాటలో భారత్‌-సీషల్స్‌ సంబందాలు

ఊగిసలాటలో భారత్‌-సీషల్స్‌ సంబందాలు

విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ ‘రెండు దేశాల హక్కులను దృష్టిలో పెట్టుకుని అసంప్షన్‌ దీవి ప్రాజెక్ట్‌పై తాజాగా ప్రయత్నాలు కొనసాగించాలని భావిస్తున్నాం’ అంటే, ‘రెండు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కలిసి పనిచేయడానికి ప్రాధాన్యమిస్తాం’ అని సీషల్స్‌ అధ్యక్షుడు డాని స్పందించారు. దీనితో అటకెక్కిందనుకున్న అసంప్షన్‌ ఒప్పందం ముందుకు సాగుతుందన్న ఆశాభావం రెండు దేశాల నాయకుల్లోనూ కనిపించింది.

భారత, సీషల్స్‌ మధ్య కుదిరిన సైనిక ఒప్పందం వివరాలు గత మార్చి నెలలో బహిర్గతం కావడం ప్రధాన రక్షణ లోపంగా మిగిలిపోతుంది. ఒప్పందానికి చెందిన అతి చిన్న వివరంతో పాటు మ్యాపులు కూడా యూట్యూబ్‌లో ప్రత్యక్షం కావడం అధికారులను ఆందోళనకు గురిచేసింది. బహిర్గతమైన పత్రాల ప్రకారం సీషల్స్‌ ప్రభుత్వం ఒక దీవిని భారత్‌కు విక్రయించింది. కానీ ఆ తరువాత సీషల్స్‌ అధ్యక్షుడు డాని ఫార్‌ మాత్రం భారత్‌కు ఏ దీవిని విక్రయించడంగాని, లీజుకు ఇవ్వడంగాని జరగలేదని పార్లమెంట్‌కు తెలియ జేశారు. తరువాత సీషల్స్‌ జరిపిన విచారణలో రహస్యపత్రాల బహిర్గతం కావడానికి ఒక ప్రభుత్వ అధికారే కారణమని తేలింది.

హిందూమహాసముద్రంలో చైనా చొరబాటును అడ్డుకునేందుకు ప్రధాని మోదీ సాగర్‌ (సెక్యూరిటీ అండ్‌ గ్రోత్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ ది రీజన్‌) విధానాన్ని 2015లో తలపెట్టారు. ఇతర వ్యూహాత్మక అంశాలతోపాటు సాగర్‌లో సముద్రజల సంబంధమైన వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం, వాతావరణ సంబంధమైన వివరాలను పంచుకోవడం వంటి విషయాలు ఉన్నాయి. స్నేహం, పరస్పర విశ్వాసం ఆధారంగా సంబంధాలను మెరుగుపరుచుకోవలసిన అవసరాన్ని హిందూ మహాసముద్ర ద్వీప రాజ్యాలైన మారిషస్‌, సీషల్స్‌కు మోదీ గుర్తుచేశారు. వ్యూహాత్మక ప్రయోజనాలను సాధించడం కోసం భారత్‌ 2015లో సీషల్స్‌కు చెందిన అసంప్షన్‌ దీవితోపాటు, మారిషస్‌కు చెందిన అగలేగా ద్వీపం పైన కూడా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసేందుకు ప్రాధమిక ఒప్పందం చేసుకుంది. ఈ రెండు దీవులు భారత దేశానికి చాలా ముఖ్యమైనవి. మెడగాస్కర్‌కు ఉత్తరంగా సూయజ్‌ కెనాల్‌కు దగ్గరగా మొజాంబిక్‌ చానల్‌ వెంబడి ఉన్న సీషల్స్‌కు చెందిన అసంప్షన్‌ దీవి అట్లాంటిక్‌, పసిఫిక్‌ సముద్రాల మధ్య రాకపోకలకు చాలా కీలకమైన ప్రదేశం. ఇక అగలేగా దీవి మెడగాస్కర్‌కు ఈశాన్యంగా 1000 కి.మీ. దూరంలో ఉంది. ఈ రెండు దీవుల వల్ల ఈ సముద్ర ప్రాంతంలో విదేశీ నౌకల రాకపోకలను గమనించేందుకు భారత్‌కు వీలవుతుంది. ముఖ్యంగా అసంప్షన్‌ దీవిలో సైనిక స్థావరాన్ని ఏర్పరచడం వల్ల మొజాంబిక్‌ చానల్‌లో భారతీయ నౌకలకు రక్షణ లభించడంతో పాటు చైనా దిగ్బంధన వ్యూహానికి, నకిలీ వస్తువుల రవాణాను అడ్డుకునే అవకాశం లభిస్తుంది.

500 మిలియన్‌ డాలర్ల ఒప్పందం ప్రకారం అసంప్షన్‌ దీవిలో ఆ దేశ సైన్యానికి (సీషల్స్‌ పీపుల్స్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌) విమాన స్థావరాన్ని నిర్మించి ఇవ్వడానికి భారత్‌ అంగీకరించింది. సీషల్స్‌ అధ్యక్షుడిగా జేమ్స్‌ మిచెల్‌ ఉన్నప్పుడూ ఈ ఒప్పందం కుదిరింది. కానీ అధికార యంత్రాంగపు అసమర్ధత మూలంగా ఆ ఒప్పందంపై పార్లమెంట్‌ అంగీకారాన్ని పొందడంలో సీషల్స్‌ ప్రభుత్వం విఫలమైంది. అక్టోబర్‌ 2016లో జరిగిన ఎన్నికల్లో విపక్షానికి చెందిన డాని ఫార్‌ అధికారం చేపట్టారు. దానితో అక్టోబర్‌ 2017లో భారత్‌తో ఒప్పందాన్ని సమీక్షించుకోవాలని విపక్షం పట్టుబట్టడంతో భారత్‌ అప్రమత్తమైంది. విదేశాంగ కార్యదర్శి జయశంకర్‌ సుబ్రమణ్యంను సీషల్స్‌ పంపింది. సీషల్స్‌ అభ్యంతరాలను, సందేహాలను పరిశీలించిన భారత్‌ కొత్త ఒప్పందానికి సిద్ధమయింది. రెండు దేశాలు జనవరి 2018లో కొత్త ఒప్పందంపై సంతకాలు చేశాయి. దాని ప్రకారం నకిలీ వస్తువుల రవాణాను అడ్డుకోవడం, నిఘా కార్యకలాపాలలో సహకరించుకోవడం, ప్రత్యేక ఆర్ధిక జోన్‌ ఏర్పాటును వేగవంతం చేయడం వంటి అంశాలను అందులో చేర్చారు. అన్నింటికంటే ముఖ్యంగా పోర్ట్‌ను కేవలం 20 ఏళ్ళకు మాత్రమే భారత్‌కు అప్పగించడానికి సీషల్స్‌ ముందుకు వచ్చింది. అలాగే నౌకాశ్రయాన్ని సైనిక అవసరాలకు వాడకూడదని, ఆ పోర్ట్‌ను వాడుకునేందుకు మరే దేశానికి అవకాశం ఇవ్వకూడదని షరతులు విధించింది. ఒప్పందంపై సంతకం చేస్తూ భారత దేశపు స్నేహ సంబంధాలపై తమకు నమ్మకం ఉందని అధ్యక్షుడు ఫార్‌ పేర్కొన్నారు. కానీ ఎప్పుడైతే అధ్యక్షుడు ఒప్పందాన్ని పార్లమెంట్‌ అంగీకారం కోసం సమర్పించారో, అప్పుడే ఇంటర్‌నెట్‌లో ఒప్పందపు వివరాలన్నీ బహిర్గతం కావడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దానితో ఒప్పందాన్ని సీషల్స్‌ పార్లమెంట్‌ తిరస్కరించింది. దీనితో ఈ ప్రాజెక్ట్‌కు కాలం చెల్లిందని విపక్షం ప్రకటించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మక బలాన్ని పెంచుకోవాలనుకున్న భారత్‌ ప్రయత్నాలకు విఘాతం కలిగింది.

అయినా భారత్‌ తన ప్రయత్నాలను విరమించ లేదు. ఈ ఒప్పందం వీగిపోవడం వెనుక చైనా హస్తం ఉందని భారత్‌ భావిస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు భారత పర్యటనలో రెండు దేశాల సంబంధాల గురించి, భారత్‌ అందిస్తున్న సహకారం గురించి ఎంతో గొప్పగా చెప్పిన విపక్ష నేత జాన్‌ చార్లెస్‌ ఆ తరువాత తన అభిప్రాయాన్ని మార్చుకుని భారత్‌తో ఒప్పందాన్ని వ్యతిరేకించడం అందరినీ ఆశ్చర్య పరచింది.

సీషల్స్‌కు ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతను గుర్తించిన చైనా 2000 సంవత్సరం నుంచే అక్కడ ప్రాజెక్ట్‌లను దక్కించుకునే ప్రయత్నం చేసింది. అక్కడ సుప్రీంకోర్ట్‌, అసెంబ్లీ, ఇతర విద్యా సంస్థల భవనాలు, రహదారులు నిర్మించిన చైనా 2004లో సైనిక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. 2011 నాటికి సీషల్స్‌లో నావికాదళ స్థావరాన్ని ఏర్పరచే ఒప్పందాన్ని కూడా ఖరారు చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. విచిత్రంగా అప్పుడు మన దేశంలో అధికారంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం ఈ పరిణామాలన్నిటిని పట్టించుకోలేదు. పైగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా స్థావరాలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం మనకు ప్రమాదకారి అనే విషయాన్ని గుర్తించడానికి కూడా సిద్ధపడలేదు. నకిలీ వస్తువుల రవాణాను అరికట్టేందుకే చైనా అలాంటి స్థావరాన్ని ఏర్పరచుకుంటోందని, దానివల్ల మనకు వచ్చిన ముప్పు ఏమి లేదని సాక్షాత్తు రక్షణ మంత్రి స్పష్టం చేశారని అప్పట్లో స్ట్రాఫోర్డ్‌ వార్తా సంస్థ ఉటంకించింది. ఇలా చైనా విస్తరణ వాదాన్ని, దానివల్ల వచ్చే ప్రమాదాలను గుర్తించడంలో అప్పటి ప్రభుత్వం విఫలమైందని చెప్పక తప్పదు.

అయితే సీషల్స్‌లో నావికాదళ స్థావరాన్ని ఏర్పాటుచేయడంలో విఫలమైనా ద్జిబౌతిలో మొదటి స్థావరాన్ని స్థాపించడంలో చైనా విజయం సాధించింది. చైనా ఇలా ద్జిబౌతిలో అడుగుపెట్టడంతో అసంప్షన్‌ దీవిలో స్థావరం ఏర్పరచే ప్రయత్నాలను భారత్‌ ముమ్మరం చేసింది. 2011 నుండి సీషల్స్‌కు చైనా పర్యాటకుల సందడి పెరిగింది. భారత్‌ చుట్టుపక్కల దేశాలతో సంబంధాలను బలపరచుకు నేందుకు చైనా ప్రత్యేకంగా ప్రయత్నించడం గత కొంతకాలంగా చోటుచేసుకున్న ముఖ్యమైన పరిణామం. అసంప్షన్‌ దీవి ఒప్పందం వీగిపోవ డానికి సీషల్స్‌లో చైనా జోక్యం పెరగడం కూడా ఒక కారణం కావచ్చని అంటున్నారు. పైగా ఈ దీవి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఉన్న అల్దబ్రాకు దగ్గరగా ఉండడం, ఇది ప్రపంచంలోనే తాబేళ్ళు అత్యధికంగా ఉండే ప్రదేశం కావడం కూడా పర్యావరణ వేత్తలు ఒప్పందాన్ని వ్యతిరేకించి ఉండవచ్చును. విదేశీ పర్యాటకులతో ఎప్పుడు కళకళలాడే తమ గడ్డ భారత, చైనా స్పర్ధలకు వేదిక కావడం సీషల్స్‌ వాసులకు రుచించకపోవడం కూడా ఒక కారణం కావచ్చును.

హిందూ మహాసముద్రంలోని ఈ ద్వీప దేశంతో భారత్‌ సంబంధాలు శతాబ్దాల పురాతనమైనవి. సీషల్స్‌ జనాభాలో 10శాతం భారత సంతతికి చెందినవారు. ఒకప్పుడు ఫ్రెంచ్‌-బ్రిటిష్‌ రాజ్యంగా ఉన్న సీషల్స్‌తో 1976లో మొట్టమొదటసారిగా భారత్‌ దౌత్య సంబంధాలు ఏర్పరచుకుంది. రెండు దేశాల మధ్య సంబంధాలను రక్షణ ఒప్పందాలు మరింత బలపరచాయి. నకిలీ వస్తువుల రవాణాను అరికట్టేందుకు సీషల్స్‌కు సహకరిస్తూ భారత్‌ 2005లో టోపాజ్‌, కాంస్టంట్‌ అనే గస్తీ పడవలను, 2014లో దొర్నియర్‌ విమానాన్ని, 2016లో హెర్మెస్‌ అనే మరో గస్తీ పడవను అందజేసింది. 2015లో ఆరు తీర నిఘా రాడార్‌ వ్యవస్థలను ప్రధాని మోదీ ప్రారంభించారు. 80వ దశకంలో సీషల్స్‌లో అనేక సైనిక తిరుగుబాట్లను తిప్పికొట్టడంలో భారత్‌ కీలక పాత్ర పోషించింది. 1986లో రక్షణ మంత్రి అధ్వర్యంలో తిరుగుబాటుకు రంగం సిద్ధమైందని సమాచారం అందుకున్న భారత్‌ వింధ్యాగిరి అనే యుద్ధ నౌకను సీషల్స్‌కు పంపింది. మరమ్మత్తుల మిషతో రెండు నెలలపాటు సీషల్స్‌ నౌకా కేంద్రంలో తిష్టవేసిన వింధ్యాగిరి అక్కడ సైనిక తిరుగుబాటును నివారించగలిగింది. ఇలా సీషల్స్‌తో పాటు మాల్దీవులలో కూడా అనేక తిరుగుబాటులను నివారించడంలో భారత సైన్యం ప్రధాన పాత్ర పోషించింది. హిందూ మహాసముద్ర దేశాలతో సత్సంబంధాలను ఏర్పరచుకునేందుకు భారత్‌ ప్రత్యేకంగా ఇండియన్‌ ఓషన్‌ రిమ్‌ అసోసియేషన్‌ను ఏర్పరచింది. అందులో మారిషస్‌, సీషల్స్‌ను సభ్య దేశాలుగా చేర్చుకుంది. ఆర్ధిక, సైనిక ఒప్పందాలనే తాయిలాలు చూపి మచ్చిక చేసుకోవాలని చైనా ఎంత ప్రయత్నిస్తున్నప్పటికి భారత్‌తో ఉన్న ఈ దేశాలకున్న సత్సంబంధాల వల్ల ఆ ప్రయత్నాలు సాగడం లేదు.

ఈ నేపధ్యంలోనే సీషల్స్‌ అధ్యక్షుని భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటన సందర్భంగా అధ్యక్షుడు డాని అహ్మదాబాద్‌, ఢిల్లీ, పనాజీ, డెహ్రాడూన్‌ నగరాలను సందర్శించారు. పర్యటనకు ముందే అసంప్షన్‌ దీవికి సంబంధించిన ఒప్పందంపై ఎలాంటి సంభాషణలు ఉండవని, ఒప్పందాన్ని తమ పార్లమెంట్‌ ముందు ఉంచే ఆలోచన కూడా ఏది లేదని అధ్యక్షుడు డాని స్పష్టం చేశారు. అయినప్పటికీ భారత్‌ ఆయనకు ఘనస్వాగతం చెప్పింది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు డాని జరిపిన చర్చల్లో ఆరు ఒప్పందాలు ఖరారు అయ్యాయి. 100 మిలియన్‌ డాలర్ల రుణాన్ని ఇవ్వడానికి అంగీకరించిన భారత్‌ 2015లో అంగీకరించిన విధంగా రెండవ డోనియార్‌ విమానాన్ని కూడా సీషల్స్‌కు అందించింది.

తాము స్వయంగా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటామని జూన్‌ 4న అధ్యక్షుడు డాని వెల్లడించినప్పటికి రెండు దేశాల నేతలు సంభాషణలు కొనసాగించారు. చివరలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ ‘రెండు దేశాల హక్కులను దృష్టిలో పెట్టుకుని అసంప్షన్‌ దీవి ప్రాజెక్ట్‌పై తాజాగా ప్రయత్నాలు కొనసాగించాలని భావిస్తున్నాం’ అంటే, ‘రెండు దేశాల ప్రయోజనా లను దృష్టిలో పెట్టుకుని కలిసి పనిచేయడానికి ప్రాధాన్యమిస్తాం’ అని అధ్యక్షుడు డాని స్పందించారు. దీనితో అటకెక్కిందనుకున్న అసంప్షన్‌ ఒప్పందం ముందుకు సాగుతుందన్న ఆశాభావం రెండు దేశాల నాయకుల్లోనూ కనిపించింది.

ఇటీవల భారత్‌ చొరవ తీసుకోవడంతో అసంప్షన్‌ దీవిలో పాత వైమానిక కేంద్రాన్ని పునరుద్ధ రించడంతోపాటు ఉమ్మడి సైనిక స్థావరాన్ని ఫ్రాన్స్‌, భారత్‌లతో కలిసి ఏర్పరచేందుకు సీషల్స్‌ అంగీక రించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమాన్యుఎల్‌ పర్యటన సందర్భంగా భారత్‌ ఆ దేశంతో 14 ఒప్పందాలను కుదుర్చుకుంది. అసంప్షన్‌ ప్రాజెక్ట్‌లో ఫ్రాన్స్‌ కూడా భాగస్వామి కావడం సీషల్స్‌ నాయకులకు నమ్మకాన్ని పెంచే అవకాశం ఉంటుంది. కనుక భారత్‌ ఈ విషయంలో అటు ఫ్రాన్స్‌, ఇటు సీషల్స్‌ నేతలతో సంభాషణలు వేగవంతం చేయాలి.

– డా.రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *