ఇది జిజియా పన్ను వంటిదే

ఇది జిజియా పన్ను వంటిదే

ఇటీవల విజయవాడ విద్యాధరపురంలో 80 కోట్ల ఖర్చుతో ఆరు అంతస్తుల హజ్‌ భవవాన్ని నిర్మించడానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఒక్క విజయవాడలోనే కాదు, కడపలో కూడా మరో హజ్‌హౌస్‌ కడతానని, హైదరాబాద్‌తో సహా ముస్లింలకు మూడు హజ్‌హౌస్‌లు కట్టించిన ఘనత తనదేనని సగర్వంగా చెప్పుకున్నారు.

అల్లాఉద్దీన్‌ ఖిల్జీ సేనాని మాలిక్‌ కాఫూర్‌ కాకతీయ సామ్రాజ్యాన్ని తుదముట్టించాడు. ఒక తుఫాన్‌లాగా మధురై వరకు వెళ్ళి తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఈ అవకాశాన్ని చూసుకుని ముసునూరి కాపయ, ప్రోలయ సోదరులు ఖమ్మం జిల్లాలోని రేకపల్లిని రాజధానిగా చేసుకుని ఓరుగల్లులో తిష్ఠవేసిన తురక సైన్యాలను మట్టుబెట్టి తిరిగి హిందూ పాలనను స్థాపించారు. వారి 42 ఏళ్ళ పాలనా కాలంలో అంతకుముందు ధ్వంసం అయిన అనేక దేవాలయాలను తిరిగి నిర్మించారు. వివిధ సామాజిక సమూహాలను సమీకరించి, చక్కగా పాలిస్తుండగా, ఒక వర్గం అసూయతో బహమనీ సుల్తాన్‌లతో చేతులు కలిపి ఓరుగల్లు హిందూ రాజ్యాన్ని అంతమొందించింది.

అలాగే తీరాంధ్ర ప్రాంతం తురుష్కుల పాలనలోకి పోయినప్పుడు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతి ప్రాంతంలో హైదరాబాద్‌ సుల్తాన్‌లకు లోబడి ఉండి, తన అధిపత్యంలో ముస్లింలు ధ్వంసం చేసిన ఎన్నో దేవాలయలను గుంటూరు, కృష్ణా జిల్లా ప్రాంతాలలో పునరుద్ధరిం చారు. నాటి హిందువులైన ముసునూరి వారు, వాసిరెడ్డి వారు హిందువులకు, దేవాలయాలకు చేసిన సేవ చారిత్రకమైనది.మరి హిందువులైన ఇప్పటి మన నాయకులు ఏం చేస్తున్నారో ఓపికతో ఆలోచిద్దాం.

ఆలయాల కూల్చివేత

కృష్ణా పుష్కరాల సందర్భంలో (2016) ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో వీథులను వెడల్పు చేసి, నగరాన్ని సుందరీకరణ చేసే ప్రయత్నంలో దాదాపు 20 దేవాలయాలు కూల్చివేతకు గురయ్యాయి. ఈ దేవాలయాలు పెద్ద ఖర్చుతో టిక్కెట్లు కొనుక్కొని దేవుళ్ళని చూసే స్థోమత లేని సామాన్య ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాకంగా, అండగా ఉండేవి. ఈ దేవాయాలను కూల్చివేయడం హిందువులపై దాడిగా తలచి ఎంతో మంది భక్తులు, సామాజిక శక్తులు వాటి పునర్నిర్మాణం కోసం ఉద్యమించారు. ముస్లింల, క్రైస్తవుల మత పరమైన కట్టడాలను నిర్మూలించే ధైర్యం సెక్యులరిస్టులమని చెప్పుకునే పార్టీ, ప్రభుత్వానికి లేదా ? హిందువుల అగ్రహాన్ని చూసి, కూల్చివేతకు గురైన దేవీదేవుళ్ళ మందిరాలను అనతికాలంలోనే తిరిగి దివ్యంగా నిర్మిస్తామని వాగ్దానం చేసిన ఆ ప్రభుత్వం ఇంతవరకు ఆ నిర్మాణాలను చేపట్టలేదు.

హజ్‌ హౌస్‌ నిర్మాణం

కాని ఇటీవల విజయవాడ విద్యాధరపురంలో 80 కోట్ల ఖర్చుతో ఆరు అంతస్తుల హజ్‌ భవవాన్ని నిర్మించడానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ధ్వంసమైన హిందూ దేవాలయాల పునర్మిర్మాణ ఊసే ఎత్తకుండా ‘హజ్‌ యాత్రికులపై జిఎస్‌టి బాధాకరం’ అని, ‘కేంద్రంపై పోరాడదాం కదలి రండి’ అని ముస్లింలకు పిలుపునిచ్చారు. తిరుమలలో ప్రతి రోజు లక్షమందికి పైగా అన్నదానం చేయడానికి కావలసిన పదార్థాలపై జిఎస్‌టి ఉంది. ఆ జిఎస్‌టిని తొలగించడానికి ఎవరూ పూనుకోలేదు. ఒక్క విజయవాడలోనే కాదు, కడపలో కూడా మరో హజ్‌హౌస్‌ కడతానని, హైదరా బాద్‌తో సహా ముస్లింలకు మూడు హజ్‌హౌస్‌లు కట్టించిన ఘనత తనదేనని సగర్వంగా చెప్పుకున్నారు ముఖ్యమంత్రి.

విజయవాడలో నిర్మిస్తున్న హజ్‌హౌస్‌ను దేశంలో ఎక్కడా లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తామన్నారు ముఖ్య మంత్రి. హజ్‌హౌస్‌ కోసం సేకరించిన 1.20 ఎకరాలలో కొంత భాగం హిందువులకు చెందినది కావడంతో నిర్భాగ్యులైన హిందువులు వీథి పాలయ్యారు. ఆరు అంతస్థుల హజ్‌హౌస్‌లో 120 రూములు, 30 సర్వీస్‌ అపార్టమెంటులు, 20 డార్మిటరీలు నిర్మిస్తామని, ఒకేసారి 1200 మంది హజ్‌ యాత్రికులకు వసతిని కల్పిస్తామన్నారు. ఈ ఆవరణలోనే మసీదు, షాదీఖానా, వక్ఫ్‌బోర్డు అఫీసులు ఉంటాయన్నారు. ఈ హౌస్‌ కోసం మరో పది కోట్లు అదనంగా కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ఏడాది 7321 మందిని హజ్‌ యాత్రకు పంపామన్న ముఖ్యమంత్రి, ఈ ఏడాది దాదాపు 11 వేల మందిని పంపుతున్నా మన్నారు. హజ్‌యాత్రికుల కోసం గత ఏడాది 32 కోట్ల రూపాయలు బడ్జెట్‌ కేటాయించగా, ఈ ఏడాది ఎంత అవసరం అయితే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

మరిన్ని కానుకలు

నెల్లూరులో బారాషరీఫ్‌ కింద 20 కోట్లు, జూనియర్‌ కాలేజ్‌కి 3 కోట్లు, బరియల్‌ గ్రౌండుకి 2 కోట్లు ప్రభుత్వ సొమ్మిస్తామన్నారు.

రంజాన్‌కి ముస్లింలకు చంద్రన్న కానుకల రూపంలో తోఫాలకై నిధులు మంజూరు చేసిన ఘనత తనదేనని ముఖ్యమంత్రి అన్నారు. చంద్రన్న పెళ్ళి కానుకగా హిందువులకు 35 వేల రూపాయలిస్తుంటే ముస్లింలకు 50 వేల రూపాయలు అందిస్తున్నా మన్నారు. ముస్లిం రిజర్వేషన్‌ గురించి రాజీ పడబోమని హామీ ఇచ్చారు.

అది జిజియా కాదా !?

ఈ విధంగా ఒక పక్కన రాజ్యాంగం, మత కుల ప్రాతిపదికలుగా ప్రజల ముందు వివక్ష చూపకూడ దని ఆదేశిస్తుంటే (15వ అధికరణం), ఏపి ముఖ్యమంత్రి కులాన్ని, మతాన్ని బట్టి పెళ్ళి కానుక లివ్వడం; గవర్నమెంటు సొమ్మును ముస్లిం మత ప్రయోజనానికి ఉపయోగించడం; ముస్లింలు, క్రైస్తవులకు తీర్థయాత్రలకు ప్రభుత్వపు సొమ్ముని ఖర్చుపెట్టడం వంటివి చేస్తున్నారు. ఇవన్నీ రాజ్యాంగానికి విరుద్ధం. సెక్యులరిస్టులమని చెప్పుకునే ప్రాంతీయ పార్టీలు ముస్లింల, క్రైస్తవుల ఓట్లకై హిందువుల నుండి పన్నులు వసూలు చేస్తూ, హిందుత్వాన్ని అంతమొందించటానికి మత మార్పిడులు చేపడుతున్న హైందవేతర మతాల ప్రయోజనాలకు హిందువుల సొమ్మును ఖర్చుపెట్టడం చూస్తుంటే, నాడు ఔరంగజేబు, మరికొంతమంది ముస్లిం సూల్తాన్‌లు ముస్లింల సంక్షేమం కోసం, ఆధిపత్యం కోసం హిందువులపై విధించిన జిజియా పన్నును తలపిస్తోంది.

చర్చిలు గాని, మసీదులు గాని హజ్‌హౌస్‌లు గాని ప్రభుత్వ పాలనలో లేవు. కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. అవికూడా ఎక్కువ ఆదాయం వచ్చేవి మాత్రమే. ఆదాయ రహితమైన దేవాలయాలు మూతబడిపోతున్నాయి. వాటిని ఏ ప్రభుత్వమూ పట్టించుకోదు. ఆదాయం వచ్చే ఆలయాలలో దేవుళ్ళను చూడాలంటే, పూజలు చేయాలంటే హిందువులు టిక్కెట్లు కొనుక్కోవలసివస్తోంది.

సొమ్ము ఒకరిది – సోకు మరొకరిది

దేవాదాయ ధర్మాధాయ శాఖలో హైందేవతరులు (క్రైస్తవులు) 20-30 శాతం దాకా ‘హిందూ ఎస్‌.సి.’ అనే దొంగ సర్టిఫికెట్‌లతో దూరారు. కార్యనిర్వాహ ణాధికారులు తదితర ¬దాలలో ఉండి అసలైన హిందూ ఎస్‌.సిల ఉద్యోగావకాశాలను హరిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థలలో నకిలీ హిందూ ఎస్‌.సి.లు చేరి ఆ దేవాలయాలను అపవిత్రం చేయడమే కాక, వాటి ఆస్తి పాస్తులను అన్యక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల 26 మంది క్రైస్తవులమని నిర్ద్వంద్వంగా చెప్పుకున్న తి.తి.దే.లోని ఉద్యోగులను తొలగించాలని చూస్తే వారు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ అన్య మతస్తులు తి.తి.దే. నడుపుతున్న విద్య, వైద్యశాలల్లో కూడా దూరి, అక్కడ వారి మత ప్రచారాన్ని సాగిస్తున్నారు. మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం తి.తి.దే. కళ్యాణ మండపాలు; విద్య, వైద్యశాలలు అన్నీ హిందూ భక్తులిచ్చే కానుకలతో నడుస్తున్నాయి. ఈ దేవాలయాలలో పని చేసే వారికే కాక, ప్రభుత్వ ఎండోమెంట్‌ డిపార్ట్‌మెంట్‌లోను, సెక్రటేరియట్‌లోను పనిచేసేవారందరి జీతభత్యాలు తి.తి.దే. ఆలయా లకు హిందూ భక్తులు సమర్పించే ద్రవ్యం నుండే లభిస్తున్నాయి.

దివ్య దర్శనానికి, రామాలయ నిర్మాణాలకు అయ్యే ఖర్చులన్నీ హిందూ భక్తులు తమ దేవుళ్ళకు సమర్పించిన ద్రవ్యంతోనే నడుస్తున్నాయి గాని, ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపులతో కాదు. హిందూ దేవాలయ వ్యవస్థకు, భక్తుల సదుపాయాలకు, ఆలయ నిర్మాణాలకు, నిర్వహణకు కేవలం హిందూ భక్తులిచ్చే కానుకలే ఆధారం. ఆ సొమ్ముతోనే ఉర్దూఘర్‌లు, షాదీఖానాలు, ముస్లిం-క్రైస్తవులకు పెళ్ళి కానుకలు, వారి పండుగలకు కానుకలను ప్రభుత్వం ఇస్తోంది.

సిబిఐ దర్యాప్తు అవసరం

ముసునూరి కాపయ, ప్రోలయ సోదరులు; వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు చేసిన హిందు ధర్మ సేవలను, వారి ఆలయ పోషణను ఈ సమయంలో మనం స్మరించుకోవాలి. రాజ్యాంగానికి, సమన్యా యానికి ప్రభుత్వం పెడుతున్న తూట్లను గుర్తించాలి. హిందువులపై వివక్షను, హైందవేతరుల ఓట్ల కోసం హిందూ ఆలయాల సొమ్మును, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఖర్చు పెట్టకూడదని ప్రభుత్వాన్ని కోరాలి.

అలాగే ఆలయ ధర్మ కర్తలుగా పార్టీకి, నాయకులకు నిధులు, సేవలు సమర్పించిన వారికి గాక, హిందూ ధర్మ రక్షణకు సిద్ధమై, తగు జ్ఞాన, విజ్ఞానాలున్న మచ్చలేని పెద్దలను నియమించాలి. చట్ట ప్రకారం ఉండవలసిన ధార్మిక పరిషత్తును తక్షణమే పునరుద్ధరించాలి. తిరమలేశుని సేవ, సంపదల గురించి ఇటీవల తలెత్తిన అనుమానాలు, ఆక్షేపణల విషయంలో దర్యాప్తుకు సిబిఐకి అప్పగించాలి.

– డా|| త్రిపురనేని హనుమాన్‌ చౌదరి, 9849067359

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *