ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సహకారం – వాస్తవాలు

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సహకారం – వాస్తవాలు

నిన్నటి వరకు మోదీతో చంద్రబాబు చేయి, చేయి కలిపి తిరిగారు.

ఇప్పుడు అదే చేతిని విదిలించుకుని మోదీని ఘాటుగా విమర్శిస్తున్నారు.

కొద్ది నెలల క్రితమే బాబు మోదీని పాలన బాగుందంటూ అభినందించారు.

ఇప్పుడు ఆ నోటితోనే మోదీని తప్పు పడుతున్నారు.

నిన్నటి వరకు ప్యాకేజియే ముద్దు అన్న బాబు..

ఇప్పుడు హోదా కావాలంటున్నారు.

ఇప్పటివరకు మాకేమిచ్చారని కేంద్రాన్ని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటి వరకు ఎన్‌డిఎలో ప్రధాన భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం బయటకు వచ్చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు భాజపాపై నిప్పులు చెరుగుతున్నారు. దీక్షలు, ఊరేగింపులు చేసి మరీ నిరసన తెలుపుతున్నారు.

బాబు చెపుతున్నట్లు కేంద్రం రాష్ట్రానికి నిజంగానే ఏమీ ఇవ్వలేదా ? అని ప్రజలలో సందేహాలు మొదలయ్యాయి. నిజానిజాలు పరిశీలిద్దార.

ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పథకాల ఖర్చును 90 శాతం కేంద్రం భరిస్తుంది. 10 శాతం మాత్రమే రాష్ట్రం భరించాలి. అలాగే హోదా లేని రాష్ట్రాలకు కేంద్రం 60 శాతమే ఇస్తుంది. మిగతా 40 శాతం రాష్ట్రం భరించాలి. తేడా ముప్పై శాతం.

ఈ 30 శాతాన్ని లెక్కకట్టి దానిని ప్రత్యేక ఆర్ధిక సహాయం రూపంలో దాదాపు సంవత్సరానికి మూడు వేల కోట్లకు పైగా రాష్ట్రానికి సహాయం చెయ్యడానికి కేంద్రం అంగీకరించింది. ఆ సహాయాన్ని విదేశీ రుణ సంస్ధల ద్వారా చేయాలని వచ్చిన ప్రతిపాదనకు కూడా కేంద్రం ఒప్పుకుంది. ఇది రాష్ట్రం, కేంద్రం కలిసి అంగీకరించిన ఫార్ములా. తర్వాత కేంద్రమే ఋణాలు చెల్లిస్తుంది.

అయితే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ లాంటి విదేశీ ఆర్ధిక సంస్ధల నుండి ప్రాజెక్టులకు రుణ ఆమోదం పొందడానికి ఎక్కువ సమయం పట్టే పరిస్థితుల దృష్ట్యా, ప్రత్యేక ఆర్ధిక సహాయాన్ని నాబార్డు, హడ్కో లాంటి స్వదేశీ ఆర్ధిక సంస్ధల నుండి చేయాలని రాష్ట్రం జనవరి 2018 లో కేంద్రాన్ని కోరింది. కేంద్రం దానికి కూడా అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సహాయం వారి ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులకు ఇబ్బంది లేకుండా స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్‌పివి) ద్వారా చేస్తామని ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎస్‌పివి ని ఏర్పాటు చేయలేదు.

10 నెలల రెవిన్యూ లోటు

ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర విభజన జరిగిన మొదటి సంవత్సరం 10 నెలల పాటు 2014 జూన్‌ 2 నుండి 2015 మార్చి వరకు రాష్ట్ర రెవెన్యూ లోటును కేంద్రప్రభుత్వం భరించాల్సి ఉంది. అందు కోసం ఇప్పటికే సుమారకు 4 వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. నిర్ధారణకు లోబడి అదనపు మొత్తాన్ని చెల్లించడానికి కేంద్రం అంగీకరించింది. అందుకు ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉంది. రెవెన్యూ లోటు భర్తీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఋణమాఫీ, ఇతర ఉచిత పథకాలకు వర్తించదు. 2013-14లో ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో ఆంధ్ర వాటాను లెక్కిస్తే 2015లో ఎంత తగ్గిందో అదే రెవెన్యూ లోటు అని కేంద్రం వాదన.

పెట్డుబడులు

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు విరివిగా పెట్టుబడులు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసినదే. పది లక్షల కోట్ల వరకు వచ్చే పెట్టుబడు లలో మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెట్టేవే. మిగిలినవి ప్రైవేటు పెట్టు బడులు. వీటికి పథకాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.

విద్యుత్‌ సమస్య పరిష్కారం

2014 ఎన్నికలకు ముందు విద్యుత్‌ కొరత ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన సమస్య కాగా కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ చర్చలు జరిపి నిధులు మంజూరు చేయటం, కేంద్ర వాటాలోని మిగులు విద్యుత్తు రాష్ట్రానికి కేటాయించడంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ కేంద్ర సహకారంతో విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా ఏర్పడింది.

ఆకాశవాణి, దూరదర్శన్‌

ఝార్ఖండ్‌, ఛత్తీస్‌ఘడ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు ఏర్పడి ఇప్పటికి 17 ఏళ్ళు అయినప్పటికీ స్వతంత్రంగా ఆ రాష్ట్రాలలో ఆకాశవాణి, దూరదర్శన కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అలాంటిది ఆంధ్ర ప్రదేశ్‌లో రాష్ట్ర విభజన జరిగిన ఆరునెలల లోపే విజయవాడ ఆకాశవాణి, దూరదర్శన్‌ కేంద్రాలను ప్రత్యేక కేంద్రాలుగా చేసి మొత్తం కార్యకలాపాలు అన్నీ అక్కడి నుంచే నడుపుతున్నారు.

పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాధారం, కేంద్రం ఇచ్చిన వరం

ఎప్పుడో 1981లో ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు మొన్న 2014 వరకు ఏ దశలో ఉందో అందరికీ తెలుసు. పోలవరానికి తగిన ప్రాధాన్య మిచ్చి, బడ్జెట్‌లో నిధుల కొరత ఉన్నప్పటికీ నాబార్డ్‌ ద్వారా పోలవరానికి నిధులు సమకూర్చి కేంద్రం తానే వాటిని చెల్లించే విధంగా అంగీకరించింది.

త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేస్తామని, ఆ బాధ్యతను తమకు అప్పగించమని ముఖ్యమంత్రి కోరితే, కేంద్రం సానుకూలంగా స్పందించి రాష్ట్రానికి పోలవరం నిర్మాణ బాధ్యతను అప్పగించింది. కేంద్ర ప్రాజెక్టును రాష్ట్రం అమలు చేయడం కూడా అసాధారణమే.

వాస్తవానికి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం నిధులు ఇవ్వాలి. కాని ఇది రైతుల సంక్షేమానికి సంబంధించింది కావున కేంద్రం నీటి పారుదల ప్రాజెక్టుకు 100 శాతం నిధులు ఇస్తామని చెప్పింది.

పారిశ్రామిక రాయితీలు

వెనుకబడిన జిల్లాలలో పరిశ్రమల స్థాపనకు 15 శాతం అదనపు తరుగుదల అలవెన్సు, 15 శాతం పెట్టుబడి అలవెన్సు వంటి కొన్ని పన్ను రాయితీలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి

రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలైన ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు సంవత్సరానికి 50 కోట్ల చొప్పున, సంవత్సరానికి 350 కోట్లు, మూడు సంవత్సరాలకు 1050 కోట్లను కేంద్రం అందజేసింది. మరో మూడు సంవత్సరాలకు మరో 1050 కోట్ల నిధుల మంజూరుకు కూడా అంగీకరించింది.

ప్రత్యేక హోదా – అర్హత

ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఐదు నిబంధలు ఉన్నాయి. 1) పర్వత ప్రాంతంగా ఉండాలి. 2) అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండాలి. 3) గిరిజనులు ఎక్కువగా ఉండాలి. 4) సరిహద్దు రాష్ట్రాలై ఉండాలి. (ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు ఈ కోవలోకి వస్తాయి). 5) ఆర్ధికంగా వెనుకబడి ఉండాలి.

పైన తెలిపిన ఐదు అంశాల కిందకు రాని ఏ ఒక్క రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ¬దా ఇవ్వలేదన్న విషయాన్ని మనం గమనించాలి.

2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలు ఏర్పడి ఇప్పటికి 17 ఏళ్ళయినప్పటికీ వాటి రాజధాని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కేంద్రం పెద్దగా నిధులు కూడా ఏమీ ఇవ్వడం లేదు.

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన, చెయ్యడానికి అంగీకరించిన సంస్థలు, ప్రాజెక్టులు

జాతీయ ప్రాజెక్టు పోలవరం

పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించ బడింది. దీని మొత్తం ఖర్చు కేంద్రమే భరిస్తోంది, భరించనుంది.

విద్యాసంస్థలు

ఐ.ఐ.టి. : ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజి స్థాపితమై, తిరుపతిలో తాత్కాలిక వసతితో ప్రారంభమైంది. తిరుపతి సమీపంలో మెర్లపాక గ్రామంలో శాశ్వత ప్రాంగణం నిర్మాణమవుతోంది.

ఎన్‌.ఐ.టి. : నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజి తాడేపల్లి గూడెంలోని తాత్కాలిక వసతిలో ప్రారంభమైంది. శాశ్వత ప్రాంగణం 450 కోట్ల రూపాయల వ్యయంతో అక్కడే నిర్మాణం జరుగుతోంది.

ఐ.ఐ.ఐ.టి. : ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ప్రారంభమై, కాంచీపురంలో తాత్కాలిక వసతిలో నిర్వహణ జరుగుతోంది. శాశ్వత ప్రాంగణం నిర్మాణం కర్నూల్‌ జిల్లా దిన్నె దేవరపాడులో జరుగుతోంది.

కేంద్రీయ విశ్వవిద్యాలయం (సెంట్రల్‌ యూనివర్శిటి) : కేంద్రీయ విశ్వవిద్యాలయం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనంతపురం జిల్లాలో సూచించిన భూమిని స్థల ఎంపిక సమితి అంగీకరించింది. పార్లమెంటులో చట్టం ద్వారా త్వరలో ప్రారంభమవుతుంది. బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.

ఐ.ఐ.ఎస్‌.ఇ.ఆర్‌. : ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ తిరుపతిలో తాత్కాలిక ప్రాంగణంలో ప్రారంభమై, నిర్వహణ జరుగుతోంది. శాశ్వత ప్రాంగణం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో నిర్మాణం జరుగుతుంది.

ఐ.ఐ.ఎం. : ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్శిటీ లోని తాత్కాలిక క్యాంపస్‌లో ప్రారంభమై నిర్వహణ జరుగుతోంది. శాశ్వత ప్రాంగణం గంభీరం గ్రామంలో నిర్మితమవుతున్నది.

వ్యవసాయ విశ్వవిద్యాలయం : గుంటూరు జిల్లా లామ్‌ గ్రామంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది.

ఐ.ఐ.పి.ఇ. : విశాఖపట్నం జిల్లా, సబ్బవరం మండలంలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ శాశ్వత ప్రాంగణ నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రా యూనివర్శిటీలోని తాత్కాలిక ప్రాంగణంలో నిర్వహణ జరుగుతోంది.

ఎ.ఐ.ఐ.ఎం.ఎస్‌ : ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ వంటి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ మరియు బోధనా సంస్థ గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద సిద్ధమవుతోంది. విజయవాడ సిద్ధార్థ కళాశాలలో తాత్కాలిక వసతిలో 2019-20 బ్యాచ్‌తో తరగతులు ప్రారంభమవుతాయి.

గిరిజన విశ్వవిద్యాలయం (ట్రైబల్‌ యూనివర్శిటి): విజయనగరం జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన స్థలంలో గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభించటానికి స్థల ఎంపిక సమితి అంగీక రించింది. త్వరలో పార్లమెంట్‌లో చట్టం ద్వారా ప్రారంభమవుతుంది. బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.

ఎన్‌.ఐ.డి.ఎం. : నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఆధారిటీ (ప్రకృతి వైపరీత్యాల నివారణ సమితి) దక్షిణాది ప్రాంగణం గుంటూరు జిల్లా బాపట్లలో పని ప్రారంభించింది.

విభజన చట్టంలో ఈ సంస్థలను పదేళ్ల కాలపరిమితిలో ఏర్పాటు చేయాలని పేర్కొన్నప్పటికీ కేంద్రం వీటిని రెండేళ్లలోపే మంజూరు చేయడం విశేషం.

విభజన చట్టంలో చేర్చనివి సైతం..

పై సంస్థలు కాక విభజన చట్టంలో పేర్కొనని మరెన్నో ప్రాజెక్టులను, సంస్థలను కేంద్రం ఈ నాలుగేళ్ళలో రాష్ట్రానికి మంజూరు చేసింది. యుపిఎ హయాంలో మంజూరయి ప్రారంభానికి నోచుకోని కొన్ని పథకాలను సైతం ఎన్‌డిఎ ప్రారంభించి నిధులు మంజూరు చేసింది. అవి..

ఎన్‌.ఏ.సి.ఇ.ఎన్‌. : నేషనల్‌ అకాడెమి ఆఫ్‌ కస్టమ్స్‌, ఎక్సయిజ్‌ మరియు నార్కోటెక్‌ సంస్థ మంజూరు జరిగింది. అనంతపురం జిల్లా పాలసముద్రంలో శంకుస్థాపన జరిగి, నిర్మాణం జరుగుతోంది. ఈ సంస్థలో 5 వేల మందికి పైగా ఐఆర్‌ఎస్‌ అధికారులు, 8 వేల మందికి పైగా ఇతర అధికారులకు శిక్షణ ఇవ్వగలరు. వ్యయం 500 కోట్లు. విభజన చట్టంలో ఈ అంశం లేదు. అయినా కేంద్రం మంజూరు చేయడం విశేషం.

ఎన్‌.ఐ.ఒ.టి. : సముద్ర పరిశోధనా సంస్థ 250 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు జిల్లా తుప్పులిపాలెం గ్రామం వద్ద మంజూరై నిర్మాణంలో ఉంది. ఇది కూడా విభజన చట్టంలో లేదు. అయినా కేంద్రం మంజూరు చేయడం విశేషం.

ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి. : నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ వారి రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఆర్‌.ఐ.ఇ.) మంజూరు అయి, నెల్లూరు జిల్లా వద్ద నిర్మాణంలో ఉంది. ఉపాధ్యాయ శిక్షణా కేంద్రంగా ఇది ఉపకరిస్తుంది. ఇటువంటి ప్రతిష్టాత్మక రకమైన సంస్థలలో దక్షిణాదిలో ఇది రెండవది. ఇది కూడా విభజన చట్టంలో లేదు. అయినా కేంద్రం మంజూరు చేయడం విశేషం.

ఎం.ఎస్‌.ఎం.ఇ. : ఎం.ఎస్‌.ఎం.ఇ. టెక్నాలజీ సెంటర్‌ మంజూరై విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడి వద్ద సిద్ధమవుతోంది. స్టీల్‌, నౌకా నిర్మాణం పరిశ్రమలకు మరియు ఇతర ఇంజనీరింగ్‌ పరిశ్రమలకు నైపుణ్యం గల మానవ వనరుల అవసరాలను తీర్చేవిధంగా ఈ సంస్థ నైపుణ్య శిక్షణనిస్తుంది. విభజన చట్టంలో ఇది కూడా లేదు.

నేషనల్‌ కామధేను బ్రీడింగ్‌ సెంటర్‌ : దక్షిణాది రాష్ట్రాలకు ఉపయుక్తమైన నేషనల్‌ కామధేను బ్రీడింగ్‌ సెంటర్‌ నెల్లూరు జిల్లా చింతలదేవి గ్రామంలో 2 వేల ఎకరాల్లో ఏర్పాటవుతోంది. విభజన చట్టంలో ఇది కూడా లేదు.

సి.ఐ.పి.ఇ.టి. : సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ మంజూరయి విజయవాడ దగ్గర సూరంపూడిలో వస్తోంది. విభజన చట్టంలో ఇది కూడా లేదు.

ఎన్‌.పి.ఎ. : స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ విజయవాడకు 2008 లో మంజూరయింది. కాని దానికి ప్రాంగణ నిర్మాణం ఎన్‌.డి.ఎ. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభమై, ప్రస్తుతం కొనసాగుతోంది.

సెంటర్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ రీహాబిలిటేషన్‌ : రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ రీహాబిలిటేషన్‌ నెల్లూరు దగ్గర ప్రాంతానికి మంజూరయింది. త్వరలో ప్రారంభమవుతుంది. విభజన చట్టంలో ఇది కూడా లేదు.

దివ్యాంగుల కోసం క్రీడా స్టేడియం : విశాఖ పట్నం సమీపంలోని తుర్లువాడలో 20 ఎకరాల్లో దీనిని ఏర్పాటుచేసేందుకు అనుమతిచ్చారు. విభజన చట్టంలో ఇది కూడా లేదు.

దూరదర్శన్‌ కేంద్రం : విజయవాడలో దూరదర్శన్‌ కేంద్రం ఏర్పాటయింది విభజన చట్టంలో ఇది కూడా లేదు.

ఆకాశవాణి కేంద్రం : రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలోని ఆకాశవాణి కేంద్రానికి ¬దా పెంచి, దానికి శ్రీ పింగళి వెంకయ్య ఆకాశవాణి కేంద్రంగా పేరుపెట్టారు. విశాఖలో ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాన్ని ఏర్పాటుచేశారు. విభజన చట్టంలో ఇది కూడా లేదు.

పాస్‌ పోర్టు కార్యాలయం : విజయవాడలో కొత్త ప్రాంతీయ పాస్‌ పోర్టు కార్యాలయాన్ని ప్రారంభిం చారు. ఇక్కడ పాలసీ నిర్ణయాలు, పాస్‌ పోర్టు సేవా కేంద్రాల నుంచి వచ్చిన పలురకాలైన సమస్యలను పరిష్కరిస్తారు. పాస్‌ పోర్టుల ప్రింటింగ్‌ యూనిట్‌ కూడా ఉంది. భీమవరంలో పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభించారు. విభజన చట్టంలో ఇది కూడా లేదు.

మౌలిక సదుపాయాలు

రహదారులు :

పలు రకాల పథకాల కింద జాతీయ రహదారులకు రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కేంద్రం ముందుకు వచ్చింది. ప్రాజెక్టుల ఎంపిక పూర్తయింది. 2014 తర్వాత ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన జాతీయ రహదారుల పొడవు 4,193 కి.మీ.లు.

– రూ.24 వేల కోట్ల ఖర్చుతో అమరావతి- అనంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే 557 కి.మీ.పొడవైన రహదారి నిర్మాణం.

– 180 కి.మీ.పొడవైన అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు.

పెట్రో కెమికల్స్‌ :

పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలు రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇది విభజన చట్టంలో లేదు.

– హెచ్‌పిసిఎల్‌, గెయిల్‌ రూ.30 వేల కోట్ల పెట్టుబడితో కాకినాడ వద్ద గ్రీన్‌ ఫీల్డ్‌ పెట్రో కెమికల్‌ కాంప్లెక్సు స్థాపించడానికి ప్రతిపాదనలు చేశాయి.

– కృష్ణా-గోదావరి బేసిన్‌లో అయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కంపెనీ (ఒఎన్‌జిసి) రూ.68 వేల కోట్ల ఆఫ్‌షోర్‌ పెట్టుబడి పెట్టనుంది. ఇది కూడా విభజన చట్టంలో లేదు.

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌ విశాఖపట్నం రిఫైనరీని రూ.20,928 కోట్లతో విస్తరిస్తోంది. విభజన చట్టంలో ఇది కూడా లేదు.

పారిశ్రామిక నడవా :

విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక నడవాకు రూ.4,211 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో మొదటి విడతగా రూ.2,500 కోట్లు అసియన్‌ డెవలెప్‌మెంట్‌ బ్యాంకు విడుదల చేసింది.

విమానాశ్రయాలు

విశాఖపట్నంలో అంతర్జాతీయ హరిత విమానాశ్రయం నిర్మిస్తున్నారు. విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేశారు. తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేశారు. రాజమండ్రి విమానాశ్రయం రన్‌ వే పొడవును పెంచుతున్నారు. ఇక్కడ రాత్రిపూట విమానాలు దిగే ఏర్పాటు చేశారు. కడప విమానాశ్రయంలో కొత్త భవనం ప్రారంభించారు.

ఉక్కు కర్మాగారాలు

విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని 7.5 ఎం.టి. పి.ఎ. నుంచి 12 ఎం.టి.పి.ఎ. కు విస్తరిస్తున్నారు.

కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని నిపుణుల కమిటి తేల్చి చెప్పింది. మరలా కేంద్రం టాస్క్‌ ఫోర్స్‌ను నియమించింది. ఆ టాస్క్‌ఫోర్స్‌ నుంచి అనుకూల నివేదిక రావడంతో రాయలసీమ ప్రజల ఆకాంక్ష అయిన కడప ఉక్కు కర్మాగారం త్వరలో కర్మారూపం దాల్చనుంది.

నౌకాశ్రయం

దుగ్గరాజపట్నం నౌకాశ్రయానికి బదులు ప్రత్యామ్నాయ నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రక్షణ ప్రాజెక్టులు

– రక్షణ రంగంలో ఉపయోగించే నైట్‌ విజన్‌ ఆప్టిక్‌ డివైసెస్‌ తయారు చేసే కర్మాగారం కృష్ణాజిల్లా నిమ్మకూరులో ఏర్పాటు చేయనున్నారు. దీనికి శంకుస్థాపన కూడా జరిగింది. నిర్మాణం పురోభి వృద్ధిలో ఉంది. ఇది కూడా విభజన చట్టంలో లేదు.

– దేశంలో అతిపెద్దదైన మిసైల్‌ సిస్టమ్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫెసిలిటీని అనంతపురం జిల్లా పాల సముద్రం వద్ద స్థాపించేందుకు భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ ప్రతిపాదించింది. ఇది కూడా విభజన చట్టంలో లేదు.

– విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద గల బందంగిలో నౌకాదళ విమానాశ్రయాన్ని, కృష్ణాజిల్లా నాగాయలంక వద్ద గల గుల్లలమోద గ్రామంలో డిఆర్‌డిఏ మిసైల్‌ టెస్ట్‌ ఫెసిలిటి, కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజ్‌ ఎవాల్యుయేషన్‌ సెంటర్‌, విశాఖపట్నం జిల్లా రాంబిల్లి వద్ద నేవల్‌ అల్టర్నేటివ్‌ ఆపరేషన్‌ బేస్‌ల ఏర్పాటుకు సూత్రప్రాయ అంగీకారం లభించింది. కార్యాచరణ ప్రారంభమైంది. ఇవి కూడా విభజన చట్టంలో లేవు.

షిప్పింగ్‌

కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారి మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ హబ్‌ విశాఖపట్నంలో నిర్మిస్తు న్నారు. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక నడవాకు ఉత్తర దక్షిణాలుగా రెండు కోస్టల్‌ ఎకనామిక్‌ జోన్లు ఏర్పాటు కానున్నాయి. ఇవి విభజన చట్టంలో లేవు.

జలరవాణా

బకింగ్‌ హాం కెనాల్‌ను రూ.7015 కోట్లతో మూడు దశల్లో అభివృద్ధి చేస్తారు. ముక్త్యాల నుంచి విజయవాడ వరకు మొదటిదశ ఇప్పటికే మొదలైంది. అమరావతి రాజధాని నిర్మాణానికి కావాల్సిన సరకుల రవాణాకు ఇది ఉపకరిస్తుంది. ఇది కూడా విభజన చట్టంలో లేదు.

మెడిటెక్‌ పార్కు

ఆసియాలోనే మొట్టమొదటి వైద్య పరికరాల తయారీ పరిశ్రమల పార్కు విశాఖపట్నం వద్ద ఏర్పాటవుతోంది. ఈ పార్కులో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు రాగలవని అంచనా. ఇది కూడా విభజన చట్టంలో లేదు.

విద్యుత్‌ రంగం

– 2014 కి ముందు ఆంధ్రప్రదేశ్‌ పెద్ద ఎత్తున విద్యుత్‌ సమస్యను ఎదుర్కొంది. 2014 తర్వాత ఈ పరిస్థితిలో మార్పులు వచ్చి 2017 ఏప్రిల్‌ నుండి డిసెంబరు మధ్య విద్యుత్‌ కొరత సమస్య 0.1 శాతానికి తగ్గింది.

– గత మూడున్నరేళ్లలో ఉత్పత్తి సామర్ధ్యం 25 శాతం పెరిగింది. వివిధ పథకాల కింద విద్యుత్‌ మౌలిక సదుపాయాలు నగరాల్లో పెరిగాయి.

– గ్రామాల్లో 24 గంటల కరెంటు ఉండేలా చేశారు. 2.1 కోట్ల కంటే ఎక్కువ ఎల్‌ఇడి బల్బులను పంపిణి చేశారు. 9.3 లక్షల ఎల్‌ఇడి వీధి లైట్లను అమర్చారు.

– ఉదయ్‌ పథకం కింద విద్యుత్‌ పంపిణి సంస్థల పరిస్థితి మెరుగుపరిచి రాష్ట్రానికి రూ.4,400 కోట్లు ఆదా అయ్యేలా చూశారు.

– పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి ఐదింతలు పెంచారు.

బొగ్గు కేటాయింపు

– 2,400 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్‌ కర్మాగారం కోసం ఎపీ జెన్‌కోకు ఒడిశాలో బొగ్గు గనులు కేటాయించారు. ఇది కూడా విభజన చట్టంలో లేదు.

రైల్వేలు

కొత్త రైల్వే జోన్‌ ప్రతిపాదన దశలో ఉంది. దీనిపై ఇచ్చిన కమిటి నివేదిక వ్యతిరేకంగా ఉన్నా కేంద్రం పునఃపరిశీలన చేస్తోంది.

రైల్వే పెట్టుబడుల పెంపు

– ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్‌ వ్యయం 2009-14 తో పోలిస్తే 2014-19 లో 214 శాతం పెంచారు. రూ.47,989 కోట్ల విలువైన 32 ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి.

– రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి పనులు, కొత్త రైల్వే లైన్లు, రైల్వే లైను డబ్లింగ్‌, రైల్వే లైన్ల విద్యుదీకరణ, కొత్త రైలు సర్వీసులు ఇందులో ఉన్నాయి.

కొత్త రైల్వేలైన్లు

విజయవాడ – గుంటూరు వయా అమరావతి, కడప – బాంగారు పేట, నడికుడి – శ్రీకాళహస్తి, ఓబులవారిపల్లె – కృష్ణపట్నం కొత్తరైల్వే లైన్లు, గుంటూరు – గుంతకల్లు డబ్లింగ్‌ రైల్వే లైన్లు, నంద్యాల – ఎర్రగుంట్ల లైను రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి.

వాణిజ్యం – పరిశ్రమలు

ఐఐపి : ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ కాకినాడ ఎస్‌ఇజెడ్‌లో 25 ఎకరాల్లో ప్రారంభించ నున్నారు. శంకుస్థాపన చేశారు. ఇది కూడా విభజన చట్టంలో లేదు.

ఐఐఎఫ్‌టి : ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ కూడా కాకినాడ ఎస్‌ఇజెడ్‌ లో ప్రారంభిస్తారు. దీనికి కూడా శంకుస్థాపన జరిగింది. ఇది కూడా విభజన చట్టంలో లేదు.

కమ్యూనికేషన్స్‌ – ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజి

సమీర్‌ : సెంటర్‌ ఫర్‌ ఎలక్ట్రో మాగ్నెటిక్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎఫెక్ట్స్‌ సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దశ నిర్మాణం పూర్తయింది. ఈ ఏడాదిలో సిద్ధం అవుతుంది. ఇది కూడా విభజన చట్టంలో లేదు.

ఎస్‌టిపిఐ : విశాఖపట్నంలో ఎస్‌టిపిఐ-ఉడా ఆధ్వర్యంలో ఐటి ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ప్రారంభం. ఇది కూడా విభజన చట్టంలో లేదు.

ఇఎంసి : గ్రీన్‌ ఫీల్డ్‌ ఎలక్ట్రానిక్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ రూ.339.8 కోట్లతో చిత్తూరు జిల్లాలో అభివృద్ధి చేస్తున్నారు. ఇది కూడా విభజన చట్టంలో లేదు.

నగరాభివృద్ధి – గృహవసతి

గృహవసతి : ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌) కింద 110 ప్రాజెక్టులలో 6.80 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. మొత్తం పెట్టుబడి రూ.27,200 కోట్లలో కేంద్ర ప్రభుత్వ సహాయం రూ.10,200 కోట్లు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఇది అత్యధికం.

హడ్కో రుణం : హడ్కో ద్వారా రాజధాని అమరావతి నిర్మాణానికి ఇప్పటికి రూ.7,500 కోట్లు రుణం మంజూరు చేశారు.

స్మార్ట్‌ సిటీలు : ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, అమరావతిలను స్మార్ట్‌ సిటీలుగా ఎంపిక చేశారు.

అమృత్‌ : ఆంధ్రప్రదేశ్‌లోని 33 నగరాలూ అటల్‌ మిషన్‌ ఫర్‌ రిజువినేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కింద అభివృద్ధి చేయడానికి గుర్తించారు. ప్రత్యేక సహాయం కింద అమరావతిని కూడా చేర్చారు.

హృదయ్‌ : హృదయ్‌ పథకం కింద వారసత్వ నగరంగా సమగ్రాభివృద్ధి చేయడానికి అమరావతి ఎంపికైంది.

పిఎంఎవై : ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (గ్రామీణ) కింద గత మూడేళ్లలో 1,23,112 ఇళ్ళు మంజూరయాయి. వీటికి సరిపడా నిధులూ కేటాయించారు.

ఆరోగ్యం – కుటుంబ శ్రేయస్సు

వైద్యం

– విజయవాడ, అనంతపురంలలోని ప్రభుత్వ వైద్య కళాశాలలను ఆధునీకరించారు.

– విశాఖపట్నంలో 300 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారు.

– కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన పెన్షనర్ల కోసం విశాఖపట్నంలో సిజిహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ ప్రారంభించారు.

యోగ – నేచురోపతి

కృష్ణాజిల్లాలో సెంట్రల్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ యోగ అండ్‌ నాచురోపతి ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. ఇది కూడా విభజన చట్టంలో లేదు.

టూరిజం : కాకినాడ హోప్‌ ఐలెండ్‌ అభివృద్ధి, నెల్లూరు కోస్టల్‌ టూరిజం సర్య్యూట్‌లు ముఖ్యమైన టూరిజం ప్రాజెక్టులు. ఇవి కూడా విభజన చట్టంలో లేవు.

మోదీ పాలన భేష్‌ – బాబు తీర్మానం

2017 ఏప్రిల్‌ 10న దిల్లీలో జరిగిన ఎన్‌డిఎ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోదీని అభినందిస్తూ ప్రతిపాదించిన తీర్మానం ఇది. దీనిని ప్రకాష్‌సింగ్‌ బాదల్‌, ఉద్దవ్‌ థాకరే, రాంవిలాస్‌ పాశ్వాన్‌ తదితర 30 పార్టీల నాయకులు సమర్ధించారు.

తీర్మానం : ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం మొదటి మూడేళ్లలో దేశంలో దారిద్య్ర నిర్మూలనకు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి, పటిష్టమైన ఆర్ధిక పరిపుష్టికి ఎనలేని కృషి చేసింది. ‘సబ్‌కా సాథ్‌ – సబ్‌ కా వికాస్‌’ అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు పోతోంది. సంక్షేమం మరియు అభివృద్ధిల మధ్య సమన్వయం పాటించడమే ఎన్‌డిఎ ప్రభుత్వ ముఖ్య విజయ రహస్యం.

గత యుపిఎ ప్రభుత్వం అవినీతి మరియు అస్తవ్యస్తమైన పాలనతో దేశాన్ని అధోగతి పాలు చేసింది. ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం దానిని చక్కదిద్దేందుకు సముచితమైన చర్యలు చేపట్టింది.

మనదేశం పటిష్టమైన ప్రభుత్వం, దూరదృష్టిగల ప్రధాని నరేంద్రమోదీ గారి నేతృత్వంలో ప్రపంచం లోనే అభివృద్ధి చెందుతున్న దేశంగా పరుగులు పెడుతోంది. ప్రపంచ ఆర్ధిక నిపుణులు, అనేక సంస్థలు భారతదేశం యొక్క అభివృద్ధిని గుర్తిస్తున్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వం అమలు చేస్తోన్న అనేక సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను వారు శ్లాఘిస్తున్నారు. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి, పటిష్టమైన విధానానికి నిదర్శనం. బలమైన ఆర్ధిక వ్యవస్థ ఏర్పాటుకు, అవినీతిని అంతమొందించ డానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలను చేపట్టింది.

నరేంద్రమోదీ గారి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం యొక్క పెరిగిన పారదర్శకత మరియు జవాబుదారీతనం, అవినీతి రహిత సుపరిపాలన, క్రమశిక్షణ గల ఆర్ధిక చర్యలతో వ్యాపారం చేయడం సులభతరం కావడంతో దేశంలో అనేక పెట్టుబడులు రావడానికి మార్గం సుగమం అయ్యింది. దీంతో మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్ట్‌ ఆప్‌ ఇండియా, స్టాండ్‌ అప్‌ ఇండియా వంటి లక్ష్యాలను సాధించడం సులభమైంది.

అభివృద్ధి మరియు ప్రజాస్వామ్య ప్రక్రియలో అందరినీ భాగస్వాములను చేసే ఉద్దేశ్యంతో ఎన్‌డిఎ ప్రభుత్వం కో ఆపరేటివ్‌ ఫెడరలిజం స్ఫూర్తితో నిర్ణయ ప్రక్రియలోను, అలాగే నిధుల కేటాయింపులోను రాష్ట్రాలను భాగస్వాములను చేసింది. దీంతో కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం పెరిగి దేశంలోని ప్రతి పౌరునికి మేలు కలిగేలా చేసింది. గత మూడు సంవత్సరాల్లో దేశంలోని ప్రతి పౌరుడు వేగవంతమైన అభివృద్ధి, పెరిగిన పారదర్శకతలను ప్రత్యక్షంగా చేశారు. దీనికి ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నాను.

ప్రధాని నరేంద్రమోదీ అకుంఠిత దీక్షతో, అపారమైన కృషితో దేశాన్ని ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన మరియు అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. ఎన్‌డిఎ లోని మిత్రపక్షాలు మరియు దేశ ప్రజలంతా ప్రధానికి పూర్తి మద్దతు ఇవ్వాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. దేశప్రజలందరూ ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు మద్దతుగా 2019 సాధారణ ఎన్నికల్లో ఎన్‌డిఎకు అఖండమైన మెజారిటీని అందించి నరేంద్రమోదీ గారిని మరోసారి ప్రధానిని చేయాల్సిందిగా నేను (చంద్ర బాబు నాయుడు) కోరుతున్నాను.

2018 నాటికి బాబులో మార్పు వచ్చింది. ప్రధాని మోదీని విమర్శించడం ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *