అవిశ్వాసం కాదు – అచ్చమైన ప్రహసనం

అవిశ్వాసం కాదు – అచ్చమైన ప్రహసనం

వీగిపోతుందని తెలుసు. అయినా విర్రవీగింది విపక్ష శిబిరం. ప్రభుత్వం పడిపోదని వాటికీ తెలుసు. ఆ మాట అవే చెప్పాయి కూడా. కేంద్ర ప్రభుత్వాన్ని దేశం ముందు దోషిగా నిలబెట్టడమే లక్ష్యమని, కేంద్రంలోని ఎన్డీయే ఆంధ్రప్రదేశ్‌కు చేసిన ‘మోసం’, ఆంధ్రులకు జరిగిన దగా గురించి ఎలుగెత్తి చాటుతామని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీ ఢంకా బజాయించింది. అసలు ప్రత్యేక హోదా డిమాండ్‌కు ఆదిలోనే మంగళం పాడిన దెందుకో, దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించడం ఎందుకో, నాలుగేళ్ల తరువాత మళ్లీ ప్రత్యేక హోదా పాత పాట ఎందుకో మాత్రం లోక్‌సభలో ఆ పార్టీ మహో పన్యాసకులు ఎవ్వరూ జాతి సంతృప్తి పడే రీతిలో వివరణ ఇవ్వలేకపోయారు. దీనిమీద వివరణను ఆశించడం మన అవివేకమే అవుతుంది. ఎందుకంటే, ఇలాంటి వివరణ ఒకటి ఇస్తామని తెలుగుదేశం అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెడుతున్నప్పుడు చెప్పలేదు. మరేవో విషయాలు మాత్రం చాలా చెప్పింది, ఇది తప్ప. కాబట్టి ఈ విషయంలో తెలుగుదేశం నిజాయితీని మెచ్చుకోవలసిందే. పైగా గడచిన కొన్ని మాసాలుగా తెలుగుదేశాధినేత నోటి నుంచి ఏమైతే విమర్శలు వచ్చాయో వాటినే, ఒక్క అక్షరం కూడా అటూ ఇటూ కాకుండా ఆ పార్టీ ఎంపీలు సగౌరవంగా సభలో వినిపించారు. తమదంటూ ఆలోచనను, మాటను తమ ఉపన్యాసాలలో ఎక్కడా ఏ దశలోను చొరబడకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు కూడా.

జూలై 20, 2018న నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మీద లోక్‌సభలో తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానం చర్చకు వచ్చింది. తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌ చర్చను ప్రారంభించారు. దాదాపు యాభయ్‌ పేజీల ఉపన్యాసాన్ని సభకు వినిపించారు. ఆ పార్టీ ఎంపీయే కేశినేని శ్రీనివాస్‌ (నాని) చర్చను ముగించారు. ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం మీద నాలుగు మాటలు చెపుతానంటూ, మోదీ ఉపన్యాసం వినలేదేమో మరి, కేశినేని ప్రధానిని డ్రామా ఆర్టిస్టు అంటూ నిందాస్తుతికి పాల్పడ్డారు.

మధ్యలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ (2019 ఎన్నికలలో కాంగ్రెస్‌ ప్రధానమంత్రి అభ్యర్థి) ప్రహసనం ఒకటి. తన ఉపన్యాసం ముగించి స్పీకర్‌ అనుమతి తీసుకోకుండా సరాసరి ప్రధాని దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకుని, మోదినీ విస్తుపోయేటట్టు చేసి, తరువాత తన స్థానంలోకి వెళ్ళి కన్నుగీటి దేశం ఆశ్చర్యపోయేలా, సొంత పార్టీ అదిరిపోయేలా చేశారు. ఒకరిమాటలు ఉత్తర కుమార ప్రగల్భాలతో పోటీపడితే, మరొకరివి సంక్రాంతి వేళ వచ్చే కొమ్మ దాసరి వాచాలత్వాన్ని మరిపించాయి. ప్రధాని తన వాగ్ధాటితో విపక్షం మొత్తాన్ని ఉతికి ఆరేశారు. ఇది మా ప్రభుత్వం మీద అవిశ్వాస పరీక్ష కానేకాదు, ప్రజాక్షేత్రంలో విపక్షాల విలువకు బలపరీక్ష అన్నారాయన. ఈ వ్యాఖ్య దేశాన్ని ఆలోచింపచేసేదే.

జయదేవుడి వాదనలు

చర్చను ప్రారంభించిన గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ విభజనలో అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ రెండూ దోషులేనని వాదించారు. హోదా సాధ్యం కాదని 14వ ఆర్థిక సంఘం చెబుతున్నదంటూ ఎన్డీయే ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నదని ఆయన ఆరోపణ. 15వ ప్రణాళికా సంఘం మంత్రి ఇందర్‌జిత్‌ సింగ్‌ కూడా ఆ ఆర్థిక సంఘం అలా చెప్పలేదని రాజ్యసభకు చెప్పారని ఆయన గుర్తు చేశారు. హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ యూటర్న్‌ తీసుకోలేదని జయదేవ్‌ వాదించారు. ప్రత్యేక హోదాకు సమానమైన మొత్తాన్ని ప్రత్యేక ప్యాకేజీ కింద ఇస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు. తుది బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాత కూడా ప్రత్యేక ప్యాకేజీ కింద పైసా ఇవ్వలేదు. కాబట్టి గత కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్నారాయన. గుజరాత్‌లో పటేల్‌ విగ్రహానికి, మహారాష్ట్రలో శివాజీ విగ్రహాలకి వేల కోట్లు కేటాయించారు. కానీ అమరావతి నిర్మాణానికి రూ. 1500 కోట్లే ఇచ్చారని ఎంపీ విమర్శించారు. మాట మీద నిలబడని వ్యక్తి మనిషి అనిపించుకోడు అంటూ ఇలా ప్రధాని మోదీయే లక్ష్యంగా జయదేవ్‌ ఇష్టపదులు ఆలపించారు. కానీ, 2019కి అమరావతి నిర్మాణం ఎట్టి పరిస్థితులలోను పూర్తవుతుందని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆ మాట నిలబెట్టుకుంటారని జయదేవ్‌కు ఇప్పటికీ విశ్వాసం ఉందా? ‘కేంద్రం, రాష్ట్రంలో విపక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అనేక కార్యక్రమాలు చేపట్టిన’ చంద్రబాబు ఈ పని కూడా పూర్తి చేస్తే అంతా గౌరవించి తీరాలి. అమరావతి నిర్మాణం పనికి ఒకరిద్దరు తెలుగు సినీ ప్రముఖులు, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ సంస్థలు శ్రమిస్తున్నాయి. కాబట్టి ఈ తరం వారికి కూడా సంపూర్ణ రాజధాని అమరావతిని చూసే భాగ్యం కలగవచ్చు. ఒకవేళ అలా జరగకపోతే, 2019 తరువాత కూడా ‘మాట నిలబెట్టుకోని వాడు’ సూత్రం తమ అధినాయకుడికి వర్తిస్తుందో లేదో జయదేవ్‌ ఇప్పుడే చెప్పేస్తే బావుంటుంది.

ఏడాదిన్నరలో దేశ రాజధానిలోనే బీజేపీ 70 గదులతో కార్యాలయాన్ని కట్టుకుంది. కానీ విభజన తరువాత ఏపీలో నాలుగేళ్లు గడిచినా విద్యా సంస్థల ఏర్పాటును ఎందుకు పూర్తి చేయలేదని మరో ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ప్రశ్నించారు. విశాఖ రైల్వే జోన్‌ గురించి హోంమంత్రి అబద్దాలు చెబుతున్నారని ఆయన వాదన. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినట్టే ప్రత్యేక హోదా తమకు ఎందుకు ఇవ్వరని ఆయన నిలదీశారు. ఇక్కడ బీజేపీ తన కార్యాలయాన్ని నిర్మించుకోవడానికి, ఆంధ్రప్రదేశ్‌లో త్వరితగతిన విద్యాసంస్థలను నెలకొల్పడానికి మధ్య ఎలాంటి లంకె ఉందో ఆయన వివరించి ఉంటే బాగుండేది. ఒక సందర్భంలో తెలుగుదేశం ఎంపీ మోదీ ‘మోసగాడు’ అన్నందుకు సభ భగ్గుమంది. దానికితోడు ప్రధాని ప్రసంగిస్తున్నంత సేపు ఆయన మాట వినిపించకుండా తెలుగుదేశం ఎంపీలు చేసిన గందరగోళం దేశమంతా చూసింది. ఇందుకోసం ప్రధాని మోదీ ఎంతో బిగ్గరగా మాట్లాడి ఇబ్బంది పడవలసి వచ్చింది. ఇది కూడా భారతదేశం గమనించింది. ప్రధాని ప్రసంగం ఎన్నో వాస్తవాలను ఆవిష్కరించింది. అవి భారతదేశం వినడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు. అందుకే అంత అప్రజాస్వామికంగా వ్యవహరించింది.

మోదీ సమాధానం

‘ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అంగీకారంతోనే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులు, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం. ఇందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థికమంత్రికి ధన్యవాదాలు కూడా తెలియచేశారు. కానీ ఇప్పుడు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి యూ టర్న్‌ తీసుకున్నారు’. ఇదే మోదీ ప్రసంగంలోని కీలకాంశం. అయితే ఈ విషయం తెలుగువారితో పాటు, దేశంలో చాలా ప్రాంతాల వారికి తెలుసు. ఇంకొన్ని విషయాలను ప్రధాని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినందు వల్లనే ప్యాకేజీ ఇచ్చాం. ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ సభ్యుడొకరు ప్యాకేజీయే బాగుందని కితాబు కూడా ఇచ్చారు. చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అలాగే విభజన చట్టంలోని ప్రతి హామీని అమలు చేయడానికే ఎన్డీయే కట్టుబడి ఉంది. కానీ ఎన్డీయేను చంద్రబాబు వీడి వెళ్లారు. మీరు వైఎస్సార్‌ పార్టీ వ్యూహంలో చిక్కుకోవద్దని ఆనాడు చంద్రబాబుకి ఫోన్‌లో చెప్పాను అని గుర్తు చేశారు మోదీ.

మోదీ చెప్పిన మాట సత్యదూరం కాదు. ఈ వ్యాఖ్య చాలు, మోదీ రాజకీయ పరిణతి ఎంతటిదో చెప్పడానికి. వైఎస్సార్‌సీపీ నేత, ఏపీ విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర మొదలైన తరువాత చంద్రబాబుకు మళ్లీ ప్రత్యేక హోదా భూతం ఆవహించింది. నిజానికి జగన్‌ పాదయాత్ర చేపట్టకపోతే చంద్రబాబు ప్యాకేజీకే పరిమితమై ఉండేవారు. ఇప్పుడు అధికారం జగన్‌ చేతికి పోకుండా కాపాడుకోవడానికి, గడచిన నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా విషయంలో జగన్‌ చేస్తున్న వాదనలోకే చంద్రబాబు వెళ్లిపోయారు. ఇది జగన్‌ విజయం అనేకంటే, చంద్రబాబులో పెరిగిన గందరగోళానికి నిదర్శనమనడం సరిగ్గా ఉంటుంది. ప్రధాని తన ప్రసంగాన్ని ఏ ఒక్క అంశానికో, రాష్ట్ర సమస్యకో పరిమితం చేయలేరు. అందుకే విపక్షాలన్నింటిని ఆయన ఎండగట్టవలసి వచ్చింది. తెలుగుదేశమే అనుకుంటే, అంతకు మించి పేలవమైన ప్రదర్శన కాంగ్రెస్‌ పార్టీది.

మహానాడులో ‘మీరే చెప్పండి తమ్ముళ్లు!’ అంటూ చంద్రబాబునాయుడు చూపుడు వేలుతో తన పార్టీ సభ్యులను అడుగుతారు. వారు ‘ఔను, కాదు’ అంటారు. అంతకే వారి మాటకారితనం పరిమితం. వీరేగా నిన్న అవిశ్వాసం మీద లోక్‌సభలో ప్రసగించినవారు! ఇంతకు మించి ఏం ఉంటుంది ? ప్రధాని ప్రసంగానికి సమాధానం చెప్పడానికి స్పీకర్‌ అవకాశం ఇచ్చిన సంగతిని కూడా చివరిగా ప్రసంగించిన కేశినేని నాని గమనించలేక నోరు జారారు. ఇక చర్చను ముగించి స్పీకర్‌ ఒటింగ్‌కు ఆదేశించారు. (అనుకూలం 126, వ్యతిరేకం 325).

రాహుల్కు ధీటుగా సమాధానం – రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్

తమ్ముళ్ల మీద అధినేత అవిశ్వాసం

బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చింది. తరువాత తెలుగుదేశం ఎంపీల మీద ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అవిశ్వాసం ప్రకటించవలసి వచ్చింది. సొంత పార్టీ ఎంపీల మీద ఇంత దారుణమైన అసమ్మతిని బాహాటంగా ప్రకటించడం ద్వారా చంద్రబాబు నిజంగానే చరిత్ర సృష్టించారు. ‘రాష్ట్రానికి న్యాయం జరిగేలా చేయడానికే అవిశ్వాస తీర్మానం పెట్టాం. కానీ ఫలితం లేకుండా పోయింది’ అని చంద్రబాబు వెంటనే విలేకరులను పిలిచి లబోదిబోమనవలసి వచ్చింది. ఇది ముమ్మాటికీ తెలుగు తమ్ముళ్ల మీద ఆయన ప్రకటించిన అవిశ్వాసం తప్ప మరొకటి కాదు. ప్రధాని మోదీ తెలుగువారిని అవమానించా రని, ఆర్థికమంత్రి అబద్ధాలాడారని తెలుగుదేశం ఆక్రోశించింది. నిజానికి ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలకు దిగజారింది టిడిపి అధినేతే.

ఎవరిది అహంకారం ?

తెలుగుదేశాన్ని విశేషంగా సమర్థించే ఒక పత్రికలో వచ్చిన వార్త మరింత దారుణంగా ఉంది. ‘ప్రధాని మోదీ పార్లమెంటులో ఇచ్చిన ప్రసంగం వింటే ఆయనకు తెలుగు ప్రజలంటే లెక్కలేనట్టే ఉందనిపిస్తున్నదని ఆ పార్టీ నాయకుడు భాష్యం చెప్పారుట. ఏం చేస్తారో చేసుకోండి, దిక్కున్న చోట చెప్పుకోండి అని అన్నట్టే ఉందని కూడా చంద్రబాబు విశ్లేషించారుట. తనకు ఎంతమాత్రం అహంకారం లేదట. ఏమైనా ఉంటే మోదీలోనే ఉందని కూడా ఆయన తేల్చేశారు. పైగా ఒక ప్రాంతీయ పార్టీ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి దేశంలో ఉన్న పార్టీలన్నీ క్యూ కట్టి మరీ మద్దతు ఇచ్చాయట’. కానీ వాస్తవం ఏమిటి? మోదీ ఉపన్యాసం చంద్రబాబు చెప్పినట్టు అహంకారంతో కూడుకుని ఉందని ఎవరైనా అనగలరా? మరి మోదీ మాట్లాడుతున్నంత సేపు తెలుగుదేశం ఎంపీలు చేసిన గందరగోళం గురించి ఏమంటారు?

ఇక తెలుగుదేశం అవిశ్వాసానికి మొత్తం విపక్షాలన్నీ మద్దతు ఇవ్వడం గురించి రెండు మాటలు. దేశంలోనే అత్యంత ‘సీనియర్‌ పొలిటీషియన్‌’ని అని తెలుగుదేశం అధినేత వీలైనప్పుడల్లా సంకల్పం చెప్పుకుంటారు. ప్రధాని పదవి కాళ్ల దాకా వచ్చినా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ వైపు చూడలేదని ఆయన చెప్పుకుంటారు కూడా. కానీ పక్కనే ఉన్న ఒడిశాను, తెలంగాణను, తమిళనాడును ఆయన తన దారిలోకి తెచ్చు కోవడంలో ఎందుకు విఫలమైనట్టు? నిజం చెప్పాలంటే ఆ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు అక్కడి ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని పలు సందర్భాలలో రుజువైంది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం విషయంలో అంత ధీమాగా చెప్పడం సాధ్యం కాదు. ఇంకా, ఇప్పుడున్న ఎన్డీయేని చూస్తుంటే కాంగ్రెస్‌ పార్టీయే ఎంతో మెరుగ్గా ఉందని అనిపిస్తున్నదట, చంద్రబాబునాయుడికి. అవును, ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని అంత దారుణంగా మెడపట్టుకు గెంటిన కాంగ్రెస్‌ అంటేనే చంద్రబాబుకు ఎక్కువ గౌరవం ఉండడం ఎంతమాత్రమూ ఆశ్చర్యం కాదు. ఆయనలో ’30 శాతం’ కాంగ్రెస్‌ రక్తం ఇంకా భద్రంగానే ఉందన్నమాట. ఆ శాతం ఇప్పుడు ఇంకొంచం పెరిగినట్టే ఉంది కూడా. తెలుగుదేశం ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాస తీర్మానం మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎదుర్కొన్న తొలి తీర్మానం. దీనివల్ల ఎలాంటి ప్రయోనాలు ఒనగూరలేదని చంద్రబాబే స్వయంగా అంగీకరించారు. ఆయన గుర్తించవలసిన ఇంకొక వాస్తవం… అవిశ్వాసాల చరిత్రలో ఇదొక మంచి ప్రహసనంగా కూడా మిగిలిపోతుంది. దాని దార్శనికునిగా చంద్రబాబు కూడా చరిత్రలో మరో కోణం నుంచి శాశ్వతంగా నిలిచిపోతారు.

కళ్లల్లో కళ్లు పెట్టి..

కాంగ్రెస్‌ నేతల కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే ఇబ్బందేనని మోదీ చమత్కరించారు. రాఫెల్‌ ఒప్పందం ద్వారా మోదీ ఒక వ్యక్తికి లబ్ది చేకూర్చారని రాహుల్‌ విమర్శించారు. అందుకే తన కళ్లల్లో కళ్లు పెట్టి చూడలేకపోతున్నారని ఆయన అన్నారు. దీనికి మోదీ ఇచ్చిన సమాధానం ప్రత్యేకంగా ఉంది. కాంగ్రెస్‌ కళ్లల్లో కళ్ళు పెట్టి చూసిన వారు గతంలో చాలామంది ఉన్నారు. అంతా ఇబ్బందులు పడినవారే అని ఆయన గుర్తు చేశారు. సుభాష్‌చంద్రబోస్‌, పటేల్‌, అంబేడ్కర్‌, జయప్రకాశ్‌ నారాయణ్‌, మొరార్జీ, చంద్రశేఖర్‌, దేవెగౌడ వంటి వారు ఎందరో ఉన్నారు. వీరంతా తరువాత ఏమయ్యారు ? అని మోదీ పశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *