అవతార మూర్తి స్వామి వివేకానంద

అవతార మూర్తి స్వామి వివేకానంద

ఆచార్య ఆదిశంకరులు, రామకృష్ణ పరమ హంస, రమణమహర్షి, స్వామి వివేకానంద వంటి భగవత్సరూపులు, భగవత్‌ శక్తి అవతార మూర్తులు భారతదేశంలో జన్మించటం ఈ దేశపుపురా సంస్కృతి, ఋషి సంప్రదాయం, ఆధ్యాత్మిక మహోన్నతి, వైభవానికి నిదర్శనం.

స్వామి వివేకానంద 30 సంవత్సరాల వయసు లోనే హిందూ మత పరమ వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటాడు. రామకృష్ణ పరమహంస దివ్యత్వాన్ని సకల లోకాలకు తెలియజేశాడు. హిందూ మతంలోని మేలిమిని, ఇతర మతాలవారిని ఆకర్షించేశాడు. లోక సంక్షేమ, సమాజ ప్రబోధ, శాంతి విప్లవ ప్రవక్తగా తన అవతార కార్యక్రమ ధ్యేయాన్ని నిర్వహించాడు.

ఆధునిక ప్రపంచ సాహిత్య పరమ విశిష్ట మూర్తిమంతుడుగా పరిగణితుడైన రష్యా దేశపు రచయిత లియొటాల్‌స్టాయ్‌ 1896 సెప్టెంబర్‌ నెలలో తన డైరీలో తాను భారతీయ సంప్రదాయ, విజ్ఞాన సమ్మోహక, ఆత్మ సౌందర్యసముపేత, హృదయోత్తేజక గ్రంథాన్ని ఒకదానిని చదివినట్లు రాసుకున్నాడు. ఈ పుస్తకం ఏమిటి? న్యూయార్క్‌ నగరంలో స్వామి వివేకానంద 1895-96 శీతాకాలంలో భారతీయ పురా ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ఆవిష్కరింపచేసిన ఉపన్యాస సంకలనం. ఆ తరువాత మళ్ళీ ఒక దశాబ్దానంతరం టాల్‌స్టాయ్‌ స్వామి వివేకానంద ప్రసంగాలు, ప్రబోధాలు, ఉద్బోధనల రెండు సంకల నాలు చదివాడు. తాను చదివిన ఈ పుస్తకాలను గూర్చి టాల్‌స్టాయ్‌ ఇట్లా రాసుకున్నాడు. ఈ రచనలు చదవటం పరమాహ్లాదకరమే కాక ఆత్మోద్దీపనం చేసి ఉదాత్త, ఉదార ఆత్మ సౌందర్యాన్ని ప్రాపింప చేస్తాయని అభిప్రాయపడ్డాడాయన. ఇంగ్లీషు భాష సొబగులు, సౌందర్య సౌకుమార్య శైలీ విన్యాసాలు, సతార్కిక రమ్య నుడికారాలు స్వామి వివేకానందకు ఇంతగా ఎట్లా వశీకృతమైనాయి? అని టాల్‌స్టాయ్‌ ప్రశంసాముదిత చిత్త ప్రకటన చేశాడు. స్వామి వివేకానందకు ఇంగ్లీషుభాషపై సాధికార ప్రభుత సిద్ధించిందని కొనియాడాడాయన. 1911లో ‘ది ఫిలాసఫీ ఆఫ్‌ యోగ’ (యోగ తాత్త్విక దర్శనం- రాజయోగ) అనే స్వామి వివేకాంద రచన రష్యన్‌ లోకి అనువాదం పొందింది. స్వామి నిర్యాణం చెంది పది సంవత్సరాలు కాకముందే నాగరిక ప్రపంచ భాషలలో స్వామి రచనలు ప్రాచుర్యం పొందాయి.

1931లో రోమారోలా స్వామి వివేకానంద జీవిత చరిత్రను కూర్చాడు. విశ్వవిఖ్యాత ఫ్రెంచి రచయిత రోమారోలా నోబుల్‌ పురస్కార గ్రహీత. ఆయనను స్వామి వివేకానంద రచనలు, లేఖలు, ఉద్బోధ ప్రసంగాలు ఎంతగానో ప్రభావితం చేశాయి. స్వామి వివేకానంద రచనలు చదివి రోమారోలా అత్యంత ముగ్ధుడయ్యాడు. ఆయనన్నాడు ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు బీతోవెన్‌ సంగీత గమకాల వంటివి స్వామి వివేకానంద రచనలు, హండేల్‌ బృందగీత నాదస్వర విన్యాసాల వంటివి స్వామీజీ రచనలు. ముప్ఫై ఏళ్ళు గడిచిన తర్వాత నేడు కూడా ఒక్కచోట లభించకపోయినా, చెరురు మదురుగా లభించినంతవరకైనా, చదువుతున్నప్పుడు విద్యుత్‌ స్పందనలేవో తనువును వశీకరించుకొనేంతగా చొక్కిపోతే తప్ప స్వామీజీ రచనలు నేను చదవలేను. అంత మనోవశీకరణ సంస్కృతి సుందరమైనవి ఆయన రచనలు అన్నాడు రోమారోలా. అటువంటి మహత్తర సంస్కార ప్రబోధమైనవి స్వామి వివేకానంద భావాలు, ప్రభావాలు. ఆధునిక కాలంలో భారతదేశాన్ని ఆయన వ్యక్తిత్వం ఎంతగానో ప్రభావితం చేసింది. స్వామి వివేకానంద రచనలను మహాత్మాగాంధీ అధ్యయనం చేశారు. గాంధీజీ అన్నారు స్వామి రచనలు చదివిన తర్వాత తనకు మాతృదేశం పట్ల అనురాగం వెయ్యింతలు ప్రవృద్ధమైందని. ఇందుకు తానెంతగానో కృతజ్ఞుడినై ఉంటానని గాంధీజీ భావించాడు. గడచిన శతాబ్ది భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో స్వామి వివేకానంద ఉద్బోధనల వల్ల, స్ఫూర్తి ప్రదమైన ప్రబోధాలవల్ల ప్రభావితులు కాని జాతీయ నాయకులు లేరనే చెప్పాలి. ఇక సుభాష్‌ చంద్రబోస్‌ స్వామి వివేకానందకు స్వాత్మార్పణం చేసుకున్నాడు. స్వామీజీ ఇప్పుడే కనుక జీవించి ఉన్నట్లైతే ఆయన పాద సన్నిధానువర్తినై ఉండేవాణ్ణి అని నేతాజీ స్వామి పట్ల తన భక్తిని, అనురక్తిని వెల్లడించుకున్నాడు. తన అవగాహనలో స్వామి కంటే జాతీయోద్యమ స్ఫూర్తి దాతలలో మించిన నాయకుడు మరొకరు లేరు అని నేతాజీ స్వామి వివేకానందకు నివాళి ఘటించాడు.

అమెరికాలో వేదాంత సొసైటీ స్థాపించి తన గురు సోదరుల ద్వారా ఆయన నిర్వహింపజేసిన ఉపనిషద సంస్కృతి జగద్విదితం. ఆత్మార్పణం చేసుకున్న అమెరికన్‌లకు కొందరికి స్వామి పరివ్రాజక దీక్ష ఇచ్చారు. గొప్ప కోటీశ్వరుడైన జాన్‌ జి.రాక్‌ ఫెల్లర్‌కు స్వామి వివేకానంద ఆ సంపద అంతా తనది మాత్రమే కాదనీ ఉదార దాతృత్వపరత అలవరచుకోవలసిందనీ ఉపదేశించాడు. రాక్‌ఫెల్లర్‌ మొదట చికాకు పడ్డా తరువాత స్వామీజీ సద్బోధకు వశుడై దానధర్మాలకు పేరుగాంచాడు.

స్వామి వివేకానంద ఇంగ్లండు వెళ్ళినప్పుడు సుప్రసిద్ధ సంస్కృత విద్వాంసుడు మాక్స్‌ముల్లర్‌కు అతిథిగా ఉన్నాడు. మాక్సుముల్లర్‌ స్వామీజీని ఎంతగానో గౌరవించాడు. స్వామీజీకి వీడ్కోలు చెప్పటానికి రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. వారిద్దరి మధ్య జరిగిన సన్నివేశం స్మరణీయ ఘట్టం. స్వామి వివేకానందకు ఇంగ్లాండులోని హార్వర్డ్‌ విశ్వ విద్యాలయంలో, కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రాచ్య విజ్ఞాన సంస్కృతి బోధించే ఆచార్య పదవిని సమర్పిస్తామని అక్కడి విద్వాంసులు ఆయనను అభ్యర్థించారు. జర్మనీలోని హైడల్‌బర్గ్‌ విశ్వ విద్యాలయ ఇండాలజిస్ట్‌ (భారతీయ పురా విజ్ఞానవేత్త) పాల్‌డాసన్‌ తన అతిథిగా స్వామి వివేకానంద పట్ల నతమస్తకుడైనాడు. మళ్ళీ భారతదేశ వేదాంత విజ్ఞానాన్ని సకల దేశాలు శిరసావహించే శుభతరుణం ఆసన్నమవుతున్నదని డాసన్‌ అభిభాషించాడు స్వామీజీతో.

స్వామి వివేకానంద తన ముప్ఫై తొమ్మిది ఏళ్ళ స్వల్ప జీవితకాలంలో సకల దేశాలను చకచ్యకితం చేశాడు. భారతదేశ ఆశావధీన జ్యోతిలా వెలు గొందాడు. ఆయన జీవితమొక మనోహర కావ్యం. మనోజ్ఞ ఇతిహాసం. ఆయన భారతదేశ ఋషి సంప్రదాయ ప్రవర్తకుడు. సకల మత సమన్వయ ప్రబోధకుడు. అయ్యో! ఆయన నిర్యాణం చెంది ఇంకా నూట పన్నెండేళ్ళే! భారతదేశం ఇంతటి పరిభ్రష్ట దీనకుటిల విషాద అప్రభంశ దుష్ట ఆత్మద్రోహ అమానవీయ అనైకమత్య స్వార్థపూరిత అధికారా లాలసతను, అవినీతిని, సామాజిక దుర్దశను ఎందుకు చూస్తున్నది?! మతం గూర్చి ఆయన ఏమన్నాడు? కులం గూర్చి ఏం చెప్పాడు! అన్యాయాలకు, అక్రమాలకు, గురి అయిన సాంఘిక వర్గాలు ఎట్లా ప్రాముఖ్యం, ప్రాధాన్యం, రాజకీయాధికారం పొందుతాయని, పొందాలని భవిష్యదాశావహ దర్శనాన్ని ముఖ్యంగా భారతదేశానికి ప్రసాదించాడు. భారతీయులు తెలుసుకోవాలి. ముసురుకుంటున్న చీకట్లు అప్పుడు తొలగిపోతాయి.

– డా|| అక్కిరాజు రమాపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *