అయినా… చూస్తూనే ఉండాలా?

అయినా… చూస్తూనే ఉండాలా?
  • భారతదేశంలో అధిక సంఖ్యాకుల, అంటే హిందువుల మనోభావాల మీద కొన్ని మీడియా వ్యవస్థలు అమర్యాదకరంగా వ్యవహరించడమే పనిగా పెట్టుకున్నాయా?
  • హిందువుల సమస్యలు కాదు కదా, కనీసం దేశాన్ని కుదిపివేస్తున్న సామాజిక, ఆర్థిక సమస్యలు కూడా వాటి కంటికి కనిపించవెందుకు?
  • అల్పసంఖ్యాకుల హక్కుల పరిరక్షణ, లౌకికవాద పరిరక్షణ నామస్మరణ, నినాదాల మాటున దేశ సార్వభౌమాధికారానికి, రాజ్యాంగానికి వస్తున్న ముప్పును కూడా అవి సౌకర్యంగా విస్మరిస్తున్నాయా?
  • టీఆర్‌పీ రేటు పెంచుకోవడానికి చానళ్లు ఎంతకైనా దిగజారిపోతాయా?

ఇవి ఇప్పుడు మీడియా తీరు గురించి వినిపిస్తున్న ప్రశ్నలు. ఇవి ఎవరడుగుతున్న ప్రశ్నలు, ఏ ‘వర్గం’ అడుగుతున్న ప్రశ్నలు అంటూ ఎవరైనా ‘మేధావి’ బిరుదాంకితులు గడుసుగా ప్రశ్నిస్తే సమాధానం లేకపోలేదు. వాస్తవం ఏమిటంటే హిందువుల గళాలకు ఇలాంటి మీడియాలో చోటు దక్కడంలేదు. కానీ యావద్భారతదేశంలో అసంఖ్యాక హిందువుల మనోవేదన ఇదే.

‘చూస్తూనే ఉండండి…!’ అంటూ సవాలక్ష అవాంఛనీయ ధోరణులను మన నట్టింట్లోనే ప్రదర్శిస్తున్నాయి చాలా టీవీ చానళ్లు. అందులో ముఖ్యమైనది.. భారతీయత మీద, భారతీయ మనోభావాల మీద, పురాణ పురుషుల మీద విషం చిలకరించడం. ఇప్పుడు ఇవి శ్రుతి మించాయి. కేంద్రంలో ఉన్నది హిందువులు అభిమానించే ప్రభుత్వమన్న సాకుతో ఇవీ, వీటి వెనుక ఉన్న శక్తులు దాడిని తీవ్రం చేశాయి. హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడిని కూడా నిందించడం అందులో భాగమే. చిత్రం ఏమిటంటే, అలాంటి నీచాతినీచమైన వ్యాఖ్యలు చేసిన కుసంస్కారికీ, వాటిని ఖండిస్తూ ప్రజాస్వామ్య పంథాలో నిరసనకు దిగిన స్వాముల వారికీ కూడా నగర బహిష్కరణ శిక్షే విధించడం. ఈ మధ్య తెలంగాణలో జరిగిన ఈ వికృత పరిణామం అనేక మంది హిందువుల మనో భావాలను తీవ్రంగానే గాయపరిచింది.

ఏది భావ ప్రకటనా స్వేచ్ఛ ?

దీనికి హిందూ వ్యతిరేకులు పెడుతున్న ఘనమైన పేరు ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’. భావ ప్రకటనా స్వేచ్ఛ దేశంలో ఉద్రిక్తలు పెంచడానికా? వర్గాల మధ్య చిచ్చు రేపడానికా? శాంతిభద్రతల సమస్యగా పోలీసులు పరిగణించవలసిన పరిస్థితులు తలెత్తుతున్నాయంటే సత్యదూరం కాదు. భావ ప్రకటనా స్వేచ్ఛకు రాజ్యాంగ బద్ధత ఉంది. దానిని గౌరవించవలసిందే. కానీ భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే భారతీయతను వ్యతిరేకించడానికీ, హిందువుల మనోభావాలను కించపరచడానికీ పర్యాయపదంగా కొందరు మేధావులు మార్చేశారంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ చాలా ఇంగ్లిష్‌ చానళ్లలోను, చాలా ప్రాంతీయ భాషల చానళ్లలోనూ చెలరేగిపోతోంది. ఈ వ్యాసారంభంలో కనిపించిన ఆ ప్రశ్నలు ఇదంతా గమనించిన, గమనిస్తున్న కొందరు విజ్ఞులు, సామాన్య ప్రజలు వేసుకుంటున్నవే. కానీ మీ మనోవేదనకు కారణం ఏమిటి? మీ నిరసన ఏమిటి? వాటికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏమిటి? అని అడగడానికి ఏ ఒక్క మైకు గొట్టం హిందువుల నోటి ముందుకు రాదు. తప్పని పరిస్థితులలో వచ్చినా పూర్తిగా వినేందుకు దానికి మనసు రాదు. సమయం అసలే ఉండదు. ఒకవేళ వాదన పూర్తిగా వినిపించినా చానల్‌లో ప్రసారం జరిగే వేళకి అది ‘ఎడిట్‌’ అవుతూ ఉంటుంది. హిందువుల వాణిని కత్తిరించేందుకు మీడియా హౌస్‌లలో పదునైన కత్తెర్లు చాలా ఉన్నాయి.

ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ గురించి చర్చించేటప్పుడు సంయమనం అవసరం. ఈ విషయంలో సాధారణ ప్రజానీకంలో నిబద్ధత ఉంది. అలాంటి గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే హద్దులు దాటడం సరికాదన్న కనీస మర్యాద మీడియాలోనే కనిపించడం లేదు. పత్రికా రంగానికి ఉన్న చరిత్రను బట్టి ఇప్పటికీ పత్రికలను గాని, వాటి తరువాతి అవతారంగా వచ్చిన ఎలక్ట్రానిక్‌ మీడియాను గాని ప్రజలు తొందరపడి నిందించే పనికి పూనుకోవడం లేదు. దీనినే ప్రజల బలహీనత అని మీడియా భావిస్తున్నదేమో కూడా. 2003లో టీవీ చానళ్లు వెల్లువెత్తినప్పుడే కొన్ని వాస్తవాలు, అంచనాలు అనుభవజ్ఞులను భయపెట్టాయి. వార్తాపత్రికలకు ప్రెస్‌ కౌన్సిల్‌ ఉంది. అలాగే మీడియా కౌన్సిల్‌గా దీని రూపు మార్చాలన్న అభిప్రాయం కూడా వచ్చింది. 2012లో బీబీసీ ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం దేశంలో వార్తాపత్రికల సంఖ్య 70,000. ఉపగ్రహ చానళ్ల సంఖ్య 500 పైనే. వీటి ప్రభావాన్ని సమాజం మీద ఊహించండి! మీడియా ఇంతగా పెరిగిన మాట వాస్తవమే అయినా నైతిక విలువలు, సత్య సంధతలను పణంగా పెట్టే ఎదిగిందని ఆ వార్తా సంస్థ ఢిల్లీ ప్రతినిధి వ్యాఖ్యానించడం విశేషం.

ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మార్కండేయ కట్జూ కూడా ఈ విషయం మీద పలుసార్లు విచారం వ్యక్తం చేయడం మరొక విశేషం. ఆ సమయానికే మీడియాలో నైతిక విలువలకు మంగళం పాడే ధోరణి తారస్థాయికి చేరిపోయింది. వ్యక్తుల స్వప్రయోజనాల కోసం కొన్ని సంస్థలు డబ్బు తీసుకుని వార్తలను ప్రచురించాయని 71 పేజీల నివేదికలో ప్రెస్‌కౌన్సిల్‌ వాపోయింది. కానీ ఈ నివేదికను కూడా కొన్ని పెద్ద మీడియా సంస్థలు నీరుగార్చే ప్రయత్నం చేశాయి. అలాంటి ఆ నివేదికకు సయితం దుర్గతి పట్టడం పట్ల నాటి ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ కూడా విచారం వ్యక్తం చేశారు.

ఇలాంటి రాజ్యాంగ పదవులలో ఉన్నవారు చెప్పిన మాటలను ఎవరూ కొట్టి పారేయలేరు. వీరు ప్రకటించే విచారమైనా కొన్ని పరిధులలోనే ఉంటుంది. కాబట్టి అందరి దృష్టికీ వచ్చినవి, రానివీ, ఒకవేళ వచ్చినా వాటి గురించి వ్యాఖ్యానించడం సాధ్యం కావనుకున్నవీ అయిన ప్రసారాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించాలి.

జాతీయ స్థాయి చానళ్లు అంటే, ప్రధానంగా ఇంగ్లిష్‌ భాషా చానళ్లు కశ్మీర్‌ సమస్య మీద, ‘సంఘ్‌ పరివార్‌’ మీద తమదైన శైలిలో చర్చలు, వ్యాఖ్యానాలు, ప్రత్యేక కథనాలు దేశం మీదకి వదిలిపెడుతూ దేశ ప్రతిష్టను దెబ్బతీసే పనిని తరుచూ చేస్తూ ఉంటాయి. దీనికే లౌకికవాద పరిరక్షణ అని, బడుగుల వాణి అని, సామాజిక న్యాయమని అవి పెట్టిన పేరు. చాలా ప్రాంతీయ భాషా చానళ్లూ హిందూ విశ్వాసాలను గాయపరిచే పనిని నిరంతరం చేస్తున్నాయి.

రోహింగ్యాల విషయంలో..

మైన్మార్‌ నుంచి పారిపోయి వచ్చిన రోహింగ్యా ముస్లింల ఉదంతం దీనికి ఒక ఉదాహరణ. అక్కడి స్థానిక బౌద్ధులు, హిందువులతో గొడవపడి భారతదేశం మీద పడిన వారు రోహింగ్యా ముస్లింలు. వీరికి ‘మానవతా దృక్పథం’తో ఆశ్రయం కల్పించాలని సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశం మేరకే కేంద్రం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. రోహింగ్యా ముస్లింలకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఎన్డీయే ప్రభుత్వం వాదించింది. దీని మీద ఇంగ్లిష్‌ చానళ్లు పుంఖాను పుంఖాలుగా చర్చలు జరిపాయి. వారు రోహింగ్యా ‘ముస్లింలు’ కాబట్టి ఎన్డీయే నాయకత్వంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతూ తన హిందూత్వ వైఖరిని రుద్దుతున్నదని వాటిలో ఎక్కువ చర్చల సారాంశం. ఇదంతా జరిగిన కొన్ని నెలలకే ఒక వార్త వచ్చింది. 99 మంది హిందువులను రోహింగ్యా ముస్లిం ఉగ్రవాదులు చంపారు. ఫొటోలతో సహా ఈ సమాచారం వచ్చింది. పత్రికలు కూడా ఈ వార్తకు తక్కువలో తక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి. కానీ ఏ ఒక్క ఇంగ్లిష్‌ చానల్‌ కూడా తన నిజాయితీని నిరూపించుకోలేదు. వ్యక్తం చేయలేదు. చర్చ జరపలేదు. స్త్రీలు, బాలలు అని కూడా చూడకుండా జరిగిన ఊచకోత విషయంలోనూ పక్షపాతమేనా? రోహింగ్యా ముస్లింలు ఉగ్రవాదుల ప్రభావంలో ఉన్నారంటూ కేంద్రం ఇచ్చిన సమాధానం బీజేపీ సొంత అభిప్రాయమో, విధానమో కాదు. భారత ప్రభుత్వం నియమించిన నిఘా వ్యవస్థలు నిగ్గు తేల్చిన వాస్తవమది. అదికూడా గమనించకుండా చర్చలతో రాద్ధాంతం చేయడం ఎలాంటి ప్రజాస్వామ్యం?

కశ్మీర్‌ విషయాలు

అలాగే కశ్మీర్‌ ఉగ్రవాది బుర్హాన్‌ వనీ ఉదంతం. సైనికాధికారులు, నిఘా వ్యవస్థలు వాస్తవాలు బయటపెట్టేదాకా అతడు ‘అమాయక ముస్లిం’ అంటూ సాగిన చర్చలకు తెరపడలేదు. అతడు సైనిక శిబిరాల మీద, పోలీసు వాహనాల మీద సాయుధ దాడిచేశాడు. పట్టిస్తే 14 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ఉన్మాదికి మద్దతు పలకడం ఎలాంటి భావ ప్రకటన? భద్రతా బలగాల ఆత్మ స్థయిర్యాన్ని దిగజార్చడం ఎంతవరకు సబబు? చట్టానికి ఎవరూ అతీతులు కారు.పరిస్థితులను బట్టి సైన్యం కొన్నిపార్లు కాఠిన్యం చూపిన మాట నిజమే. కానీ అక్కడ సైన్యమే లేకపోతే పరిస్థితి ఏమిటి? ఏకే 47 ఆయుధాలతో, పొరుగు దేశం ప్రోద్బలంతో విరుచుకుపడుతున్న మూకలతో సామాన్య ప్రజానీకం పోరాడుతుందా? కశ్మీర్‌ గురించి వేర్పాటువాదులు చేసే ప్రకటనలకు చానళ్లు ప్రాధాన్యం ఇస్తాయి. చర్చల కోసం విపక్ష సభ్యులు వెళ్లినా వేర్పాటువాదులు తమ ఇళ్ల తలుపులు కూడా తీయలేదు. దీనినెందుకు చర్చించలేదు? వేర్పాటువాదుల అసలు ఉద్దేశం కనుగొనే యత్నం ఎందుకు చేయలేదు?

శ్రీనగర్‌ తదితర ప్రాంతాలలో భద్రతా దళాల మీద రాళ్లు రువ్వే మూకల మీద ఈ చానళ్లకు అపారమైన సానుభూతి. వారి చేతులలో పాకిస్తాన్‌ పతాకాలు ఉంటాయి. నినాదాలు భారత్‌కు వ్యతిరేకంగా ఉంటాయి. అయినా చర్చలలో, ప్రత్యేక కథనాలలో అల్లకల్లోలానికి కారణమవుతున్న వారి హక్కుల రక్షణకు గొంతులు చించుకుంటూనే ఉంటారు. కానీ తమ స్వస్థలాలను విడిచిపెట్టి వచ్చి జమ్మూలో, ఢిల్లీలో కాందిశీకుల మాదిరిగా బతికే కశ్మీరీ పండిట్ల గురించి చర్చలు పెట్టేందుకు ఈ చానళ్లకు సమయం చిక్కదు. అదృష్టవశాత్తు ఇలాంటి విమర్శలోని వాస్తవం ఇప్పుడిప్పుడే దేశం దృష్టికి వస్తున్నది.

గతంలో ఒకసారి అమర్‌నాథ్‌ యాత్రికుల మీద జరిగిన ఊచకోత మేధావుల చర్చలలో ఏనాడూ చోటు చేసుకోలేదు. కానీ గోరక్షకుల పేరిట ఎవరో ఏదో చేసినా దానిని బీజేపీకి అంటగడుతూ గంటల కొద్దీ చర్చలు జరుగుతాయి. ఎదుటి వారి ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు. ఉండకూడదు. అది అనాగరికమే. కానీ ఒక వర్గం వారి ప్రాణాలు పోతే మొక్కుబడిగా స్పందించడం, ప్రత్యేకించి కొన్ని వర్గాలకు చెందిన వారు ప్రాణాలు కోల్పోతేనే గుండెలు బాదుకోవడం ఏమిటన్నదే ఇప్పుడు అందరూ వేసుకుంటున్న ప్రశ్న. అమర్‌నాథ్‌ హిమలింగం, మకరజ్యోతి, కుంభమేళా, పూరీ జగన్నాథుడి ప్రసాదం, గురవాయుర్‌ ఆలయం దగ్గర వస్త్రధారణ, అక్కడ స్త్రీలకు ప్రవేశం లేకపోవడం ఏదీ ఇంగ్లిష్‌ చానళ్లు విడిచిపెట్టవు. కానీ ఇలాంటి కొన్ని నియమాలు ఇతర మతాలలో కూడా కనిపిన్నాయి. వాటి పట్ల మాత్రం ఆ చానళ్లు కఠినమైన మౌనం వహిస్తాయి. కేరళలో క్రైస్తవ ఫాదరీలు భూకబ్జాలకూ, స్వలింగ సంపర్కానికీ పాల్పడుతూ కేసులు ఎదుర్కొంటున్నారు. వారి గురించి చర్చలేవి?

ఐఎస్‌ఐఎస్‌ అమానుషాలు, సౌదీలో సున్నీ చట్టాలు, టెహ్రాన్‌ మొదలుకొని ఇస్లామాబాద్‌ వరకు చాలామంది ముస్లిం మత గురువులు నూరిపోసే ఉన్మాదం, జకీర్‌ నాయక్‌ విద్వేషపూరిత వ్యాఖ్యానాలు ఈ చానళ్లకు ఎందుకు పట్టవు? కొద్దికాలం క్రితం చార్లీ హెబ్డో అనే కార్టూనిస్టును అతడి కార్యాలయం లోనే ముస్లిం ఉగ్రవాద మూకలు చంపేశాయి. నిన్నగాక మొన్న కశ్మీర్‌లో షుజాత్‌ అనే జర్నలిస్టును చంపేశారు. ఈ రెండింటికి ఆ చానళ్లలో కనిపించిన స్పందన ఎంతటిది? బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ తరువాత చేసిన గగ్గోలు ఎంతటిది?

జాతీయ గీతాలాపన

జాతీయ గీతాలాపన వివాదం మరొకటి. ఇంగ్లిష్‌ చానళ్లు క్షేత్రస్థాయి వాస్తవాలను ఎంతగా విస్మరిస్తాయో దీనితోనే తెలుస్తుంది. దేశభక్తికి జాతీయ గీతం పాడడమే గీటురాయా? అంటూ చర్చలు జరిపారు. కానీ సినిమా హాళ్లలో వీక్షకులు స్వచ్ఛందంగా లేచి జాతీయ పతాకాన్ని గౌరవించడం ఈ దేశంలో ఎక్కువ మంది చూసిన, చూస్తున్న నిజం. ఒకరిద్దరు కూర్చునే ఉన్నట్టు సామాజిక మాధ్యమాలలో చిత్రాలు వచ్చాయి. అదీ నిజమే. వారు కేవలం ఇంగ్లిష్‌ చానళ్ల ప్రభావంతో కలిగిన విపరీత బుద్ధిని దట్టించుకున్నవాళ్లు మాత్రమే అనుకోవాలి. అలా కూర్చుండిపోయిన వారి మీద దాడులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి ‘పథకం’ ప్రకారం జరిగినవి కావు. ఎందుకంటే ఈ చానళ్లకు తెలియని విషయం.. ఈ దేశంలో జాతీయ పతాకానికి సగౌరవంగా వందనం చేసేవారు, జాతీయ గీతాన్ని మనసారా ఆలపించేవారు తక్కువేమీ కాదు. అన్ని వర్గాలలో, అన్ని మతాలలో కూడా ఇలాంటి వారు ఉన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కునే మేం ఉపయోగించు కుంటున్నాం అంటూనే అరుంధతీ రాయ్‌ మావోయిస్టులకు మద్దతు ఇస్తూ చేసిన ప్రకటనలను, వారి చర్యలను సమర్ధిస్తూ ఆమె చేసే వ్యాఖ్యానాలను యథేచ్ఛగా ప్రసారం చేస్తున్నారు.

దేశ ప్రతిష్టను సైతం దిగజార్చుతూ..

నరేంద్ర మోదీని, బీజేపీని నిలువరించడానికి ఈ చానళ్లు ఎంతకయినా దిగజారతాయన్న సంగతి జాతికి ఎప్పుడో అర్థమైంది. ఇంకొక చిత్రం కూడా ఉంది. మోదీని గోధ్రా కుట్రదారుడంటూ యథేచ్ఛగా వదరుతూనే ఈ దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ బొత్తిగా కరువైపోయిందని ఆక్రోశించడం. మొత్తంగా చూస్తే భారతీయ జనతాపార్టీ మీద వ్యతిరేకతకీ, భారతదేశం మీద వ్యతిరేకతకీ మధ్య గీతను వీరంతా ఎప్పుడో చెరిపివేశారు. బీజేపీని, ఆ పార్టీ విధానాలను వ్యతిరేకించే హక్కు వారికి ఉంది. కానీ భారతదేశం గురించి అవాకులూ చెవాకులూ పేలే హక్కు లేదన్న స్పృహే లేదు.

ప్రాంతీయ చానళ్లూ తక్కువేం కాదు

ప్రాంతీయ ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’ సొగసు మీద కూడా విహంగ వీక్షణం చేద్దాం. ఈ సొగసును బాగా రంగరించుకున్నవి తమిళ టీవీ చానళ్లు. కాబట్టి వాటి గురించి మొదట తెలుసుకుందాం. అక్కడ విజయ టీవీ అనే ఒక చానల్‌ హిందూ వ్యతిరేక భావాల వ్యాప్తిని ఉద్యమంలా చేపట్టింది. కొన్నేళ్ల నుంచి ఇది సాగుతోంది. వీటన్నిటికీ ప్రాతిపదిక ద్రవిడ సిద్ధాంత భావజాలం. ఈ భావజాలం నిజరూపం కరుణానిధి ద్వారా బట్టబయలైనా, అన్నా డీఎంకే ద్వారా కూడా కొంత బట్టబయలైనా హిందూ వ్యతిరేకతా వ్రతాన్ని మాత్రం అవి పాటిస్తున్నాయి. నిజానికి ఇంగ్లిష్‌ చానళ్లయినా, ఇలాంటి ప్రాంతీయ చానళ్లయినా ఈ వితండవాదాలన్నీ రుద్దుతున్నది టీఆర్‌పీ (రేటు) దేవతను ప్రసన్నం చేసుకోవడానికే. కొన్ని మాత్రం పక్కా పథకం ప్రకారం కొన్ని విద్రోహ సంస్థల ప్రోద్బలంతో, హిందూ వ్యతిరేక కుట్రలో భాగంగానే చేస్తున్నాయి. భారతదేశ విచ్ఛిత్తి వీటి ధ్యేయం. ఇంకొన్ని కేవలం డబ్బు కోసం చేస్తున్నాయి.

ఇంతకీ విజయ టీవీ (స్టార్‌ టీవీ గ్రూప్‌) ఏం చేసింది? ఇప్పటికీ చేస్తోంది?! 2009 అక్టోబర్‌ 11న ఈ చానల్‌ ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. గోపీనాథ్‌ అనే యాంకర్‌ నిర్వహణలో మెర్క్యురీ క్రియేషన్స్‌ అనే క్రైస్తవ సంస్థ ద్వారా నడిచే కార్యక్రమం ఇది. పేరు ‘నీయా నానా’ (నీవా నేనా). ఆ రోజు కార్యక్రమం పేరు ‘మంగళసూత్రం తప్పనిసరా?’. ‘మంగళసూత్రాన్ని ధరించడం కేవలం మూఢ నమ్మకం. దానికి ఎలాంటి పవిత్రతా లేదు. అదొక తాడు మాత్రమే!’ అంటూ యాంకర్‌ ఉపోద్ఘాతం ఇచ్చాడు. అభిప్రాయాలను వెల్లడించేందుకు అనుకూల, వ్యతిరేక వర్గాలు కూడా అక్కడ చేరాయి. మరో టీవీలో పనిచేసే మహిళా యాంకర్‌ నిర్మలా పెరియసామి కూడా పాల్గొన్నారు. మీ మంగళసూత్రం తీసేస్తారా? అని గోపీనాథ్‌ అడగగానే ఆమె తీసేసి ఇచ్చింది. ఇందుకు ఆమెకు ఉత్తమ పార్టిసిపెంట్‌ పురస్కారం ఇచ్చి చానల్‌ సత్కరించింది కూడా. మంగళసూత్రం ధరించడాన్ని సమర్థించిన ఒక మహిళని గోపీనాథ్‌ అవమానించిన తీరు దారుణం. మీరు ఎప్పుడూ మంగళ సూత్రం తొలగించరా అని అడిగాడు. అత్యవసరంగా, అంటే శస్త్రచికిత్స సమయంలో డాక్టర్‌ చెబితే తీశానని ఆమె చెప్పారు. అంటే డాక్టర్‌ ఏం చెప్పినా చేస్తారా అంటూ ప్రశ్నించాడతడు. దీని గురించి ఏ మహిళా సంఘం నోరు మెదపలేదు.

కానీ ద్రవిడ సిద్ధాంత భావాలతో అలరారుతున్న ఇదే తమిళనాడు హిందూ వ్యతిరేక సమాజం ఒకసారి ఖుష్బూ అనే నటి చేసిన వ్యాఖ్యకు మండిపడింది. పెళ్లికి ముందు శారీరక సంబంధాన్ని ఆమె సమర్థించారు. దీని మీద తమిళ చానళ్లు దాడి చేశాయి. మంగళసూత్రాన్ని గౌరవించడం.. పాతివ్రత్యం, శీలం అనే భావనలు వేర్వేరా? ఎంత మూర్ఖత్వం? ఇదే కార్యక్రమంలో మరొకసారి ఆలయాలలో పూజాదికాలకి సంస్కృతమే ఎందుకు? తమిళంలో చేయరాదా? అని అడిగాడు యాంకర్‌. ఇంకొకసారి గ్రామదేవతారాధన ఎందుకు? అనే చర్చ పెట్టాడు. ఇంతకీ ఇతడు క్రైస్తవ మతస్థుడు.

కలైంజర్‌ టీవీ మరొకటి. ఇది సాక్షాత్తు డీఎంకే మూల విరాట్టు కరుణానిధి కుటుంబానిది. ఇందులో వినాయక చవితి, దసరా వంటి పండుగల నాడే హిందూ దేవుళ్లను వెక్కిరించే రీతిలో కార్యక్రమాలు ప్రసారం చేస్తారు.

మరొకటి మక్కల్‌ టీవీ. ఇది పట్టాల్‌ మక్కల్‌ కచ్చి పార్టీది. ఒక్క ఆంగ్లపదం కూడా రాకుండా మొత్తం తమిళంలోనే ఇందులో కార్యక్రమాలు సాగుతాయని దీనికో పేరు. తమిళ సంస్కృతి వ్యాప్తి దీని ఉద్దేశం. నిజానికి అదొక ముసుగు. ఆ పేరుతో హిందూ ధర్మాన్ని అవహేళన చేయడమే అసలు లక్ష్యం. ఇందులో వచ్చే కార్యక్రమాలకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. ప్రేమికులకి, కుట్రలు పన్నేవారికి, కుటుంబ కలహాలకి కేంద్రాలు హిందూ దేవాలయాలన్నట్టే చూపిస్తారు. చర్చిలు, మసీదులను పవిత్ర స్థలాలుగా, ప్రశాంత ధామాలుగా చిత్రిస్తారు.

2014 ఫిబ్రవరిలో ఒక కన్నడ చానల్‌ ‘కామెడీ సర్కిల్‌’ అనే ధారావాహికను ప్రసారం చేసింది. ఇందులో శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌నీ, మాతా ఆనంద మాయినీ, కాషాయధారులనీ అవహేళన చేయడం కనిపిస్తుంది. తెలుగులో ఒక చానల్‌లో ఒక సినిమా క్రిటిక్‌ శ్రీరాముడి మీద నోరు పారేసుకుంటే ఆ ముక్కని రోజంతా ప్రసారం చేసింది. కులాన్ని తరిమి కొట్టమని, మూఢనమ్మకాలని వదలమని హితబోధ చేసే ఇదే చానల్‌, ఒక సినీనటి, యాంకర్‌ ప్రియుడి రూపంలో ఉన్న ప్రేమోన్మాది చేతిలో చనిపోతే, ఆస్తవ్యస్తంగా గుడ్డలు ఉన్న ఆమె భౌతికకాయాన్ని ఆ రోజంతా చూపించింది. ఈ ధోరణిని ఏమనాలి? హిందువుల వైపు నుంచి వినిపించే వాదనలను బలహీనపరచడం ఈ మొత్తం చానళ్లు అనుసరించే ఒక వ్యూహం.

హిందూ వాదన కోసం అంతగా మాట్లాడలేని వ్యక్తిని ఎంపిక చేసి కూర్చోబెడతారు. ఒకవేళ వాదన బలంగా ఉంటే సాధ్యమైనంత వరకు యాంకరే వారికి కళ్లెం వేసేస్తాడు. వెకిలిగా నవ్వుతూ, హిందూ వ్యతిరేక వర్గానికి వత్తాసు పలుకుతూ ఉంటారు. లేదంటే ఎడిటింగ్‌ పేరుతో తొలగిస్తారు.

సమాధానం లేదు

విజయా టీవీ మంగళసూత్రాన్ని గేలి చేస్తూ కార్యక్రమం నిర్వహించిన తరువాత కొన్ని హిందూ సంస్థలు ఆ చానల్‌కు కొన్ని ప్రశ్నలు సంధించాయి. వీటికి దేశం మొత్తం మీద ఆ ధోరణితో ఉన్న టీవీ చానళ్లు జవాబు చెప్పాలి.

ముస్లిం స్త్రీలు బురఖా ఎందుకు ధరించాలి? ఆ వర్గం బాలురకి సున్తీ ఎందుకు? ముస్లిం మహిళలను వారి ప్రార్థనా స్థలాలలోకి ఎందుకు అనుమతించరు? అలాగే తమిళనాట ముస్లింలకు పర్షియా లేదా ఉర్దూలతో పరిచయం ఉండదు. వారిని ప్రార్థనలకు అనుమతిస్తారా?

ఫాదరీలు పొడవాటి దుస్తులు ఎందుకు వేసుకోవాలి? క్రైస్తవంలో దళితులు ఇంత వరకు బిషప్‌లుగా ఎందుకు ఎంపిక కాలేదు? క్రైస్తవ శ్మశానవాటికలలో, చర్చిలలో దళితులకు వేరే స్థలాలు ఎందుకు ఉంటాయి? అగ్రకులాల నుంచి మతం మారిన వారు ప్రధానంగా హాజరయ్యే చర్చిలలో దళితులను ఎందుకు రానివ్వడం లేదు? రెండువేల సంవత్సరాలు గడచిపోయినా క్రీస్తు పునరుత్థానం ఎందుకు జరగలేదు?

వీటికి ఇంతవరకు జవాబు లేదు. రాదు.

ఇది లౌకికవాద పరిరక్షణా? ఒక మతాన్నీ, దాని మనోభావాలనీ లక్ష్యంగా చేసుకోవడమా? రాజ్యాంగం సమున్నత స్థానంలో ఉంచిన లౌకికవాదమనే భావనను వక్రీకరిస్తున్నదే ఇలాంటి టీవీ చానళ్లు. ప్రభుత్వం కార్యకలాపాలలో మత ప్రమేయం లేకుండా చూడాలన్నదే లౌకికవాదం అసలు తాత్వికత. కానీ లౌకికవాదం పేరుతో సాగిస్తున్న ఈ హిందూ వ్యతిరేక ప్రచారానికీ ఆ సిద్ధాంతం అసలు భావనకీ ఎక్కడైనా లంకె కుదురుతున్నదా? బీజేపీ ఏం చెప్పినా, ఆరెస్సెస్‌ ఏం చేసినా అంతా మైనారిటీలకు వ్యతిరేకమనే వాదన ఎంత వరకు సబబు? మైనారిటీలంతా బంగారుకొండలని చెప్పడమే వీరి లక్ష్యమని అనిపిస్తుంది.

కేంద్రానికి వ్యతిరేకంగా కేరళ సీపీఎం ముఖ్యమంత్రి చిన్నమాట చెప్పినా పెద్దపెద్ద వార్తలు ప్రసారం చేస్తారు. కానీ కేరళలో సీపీఎం కార్యకర్తల చేతులలో మరణించిన బీజేపీ, ఆరెస్సెస్‌ కార్యకర్తల గురించి మొక్కుబడి సమాచారమే ఇస్తారు. ముస్లిం మతోన్మాదుల చేతిలో కాళ్లు చేతులు కోల్పోయిన ప్రొఫెసర్‌ గురించి కూడా సమాచారం ఇవ్వరు. కేరళలో చర్చి ఫాదరీల మీద నీచమైన ఆరోపణలు వచ్చినా అవెందుకు చర్చనీయాంశాలు కావు? ముస్లింలకు సంబంధించి, వారి కార్యకలాపాలకు సంబంధించి అంతర్జాతీయ నేపథ్యం కూడా ఉంది. పాకిస్తాన్‌లో కూర్చున్న కొందరు ఉగ్రవాద ముఠాల నేతల ప్రకటనల ద్వారా ఈ విషయం ఇప్పటికే పలుసార్లు రుజువైంది కూడా. అవెందుకు చర్చలలోకి రావడం లేదు? క్రైస్తవం కూడా అంతే. ఏ అంశమైనా హేతుబద్ధంగా చర్చించడం అవసరం. మైనారిటీ మతోన్మాదం కంటే మెజారిటీ మతోన్మాదం ప్రమాదకరం వంటి సూత్రీకరణలు పెడధోరణులను ఇంకాస్త పెంచుతాయి. బయట ఎవడో ఏదో వదరుతాడు. దాని మీద చర్చ. ఆ చర్చలో మళ్లీ ఇంకో వివాదం. ఇంకో చర్చ. ఇలా చర్చల మీద చర్చలు. గంటల తరబడి సాగిస్తున్నారు. రోజుల తరబడి వినిపిస్తున్నారు.

వీటిపై చర్చలేవి ?

దేశంలో ఈ రెండు దశాబ్దాలలోనే లక్షలలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వామపక్ష మేధావి పాలగుమ్మి సాయినాథ్‌ దీని మీద ఎన్నో విషయాలు వెల్లడిస్తున్నారు. మరి దీనిమీద ఎందుకు లోతైని చర్చ ఉండదు? ఆత్మహత్యలలో తరువాతి స్థానం చేనేత కార్మికులది. ఆ విషయం ఎందుకు చర్చనీయాంశం కావడం లేదు? ఇలాంటి దురదృష్ట వంతులలో మైనారిటీలు దాదాపు ఉండరనా? అధికార స్థాయిలో, ఉద్యోగస్వామ్యంలో ఉన్న అవినీతి గురించి ఒకప్పుడు అద్భుతమైన చర్చలు జరిగాయి. కథనాలు వచ్చాయి. ఇప్పుడెందుకు లేవు? అంటే అక్కడ అవినీతి మటుమాయమైందని ఈ చానళ్ల నిశ్చితాభి ప్రాయమా? విద్యలో అంతరాలు పెరుగుతున్నాయి. ప్రైవేటు విద్య, ప్రైవేటు వైద్యం సామాన్యుడిని కుంగదీస్తున్నాయి. ఇవెందుకు పట్టవు? అందులోని ఆంతర్యం ఏమిటి? గ్రామీణ ప్రాంతంలో, గిరిజనులు నివశించే కొండా కోనలలో వైద్య సదుపాయాలు లేవు. ఉన్నవాటిని చతికిల పడేటట్టు చేసేశారు. వర్షం కురిస్తే విష జర్వాలు గిరిజనులను ముట్టడిస్తాయి. ఇవేమీ కనిపించవా? మహిళల మీద అత్యాచారాల విషయంలో వర్గాన్ని బట్టి మీడియాలో స్పందన ఉంటుందన్న విమర్శ ఎందుకు వచ్చింది? కొన్ని మీడియా సంస్థల అధిపతులు, ఉదాహరణకి తరుణ్‌ తేజ్‌పాల్‌ వంటివారి మీద నేరుగా ఆరోపణలు వచ్చినా నైతిక విలువలు ఎందుకు గుర్తుకు రాలేదు? చర్చ ఎందుకు జరగలేదు? మీడియా సాధారణ ప్రజల గళం కావాలి. వారి పాలిట కొత్త సమస్య కాకూడదు.

మార్చి 18, 2016న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా జేషా (అమిత్‌షా కుమారుడి వ్యాజ్యం) వివాదం విషయంలో చేసిన వ్యాఖ్యను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ‘పత్రికా రచయితలు తమకు తోచింది రాయలేరు. మీడియా నోరు నొక్కడమనే ప్రశ్నే లేదు. దానిని నేనే వ్యతిరేకిస్తాను. కానీ మీడియా, మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ మీడియా నుంచి బాధ్యతాయుతమైన ధోరణిని మేం ఆశిస్తున్నాం’.

భారత ప్రధాన న్యాయమూర్తి మాటయినా చానళ్లు గౌరవిస్తాయా?

– జాగృతి డెస్క్‌

రాజ్యాంగ స్ఫూర్తికి సుదూరంగా..

రాజ్యాంగం ప్రవచించిన లౌకికవాద స్ఫూర్తి ఇప్పుడు చానళ్లలో వస్తున్న చర్చలలో ఎంత మాత్రమూ ప్రతిబింబించడం లేదు. ఈ చానళ్ల దృష్టిలో లౌకికవాదం అంటే హిందువులకు చేటు చేయడం, ముస్లింలకు మేలు చేయడం. ప్రథమ ప్రధాని నెహ్రూ కాలం నుంచి ప్రబలిన ధోరణి ఇది. అల్పసంఖ్యాకులను సంతుష్టీకరించడం. దానితో అధిక సంఖ్యాకులకు అన్యాయం జరుగుతున్నా మౌనం దాల్చడం. ఇది సరికాదంటే అది హిందూవాదం. 70 ఏళ్ల నుంచి ఏవో కొన్ని పార్టీలు అంటే బీజేపీ, శివసేన వంటివి తప్ప, మిగిలిన పార్టీల ధోరణి ఇదే. 1952 నాటి తొలి సాధారణ ఎన్నికలలో కేరళలో నెహ్రూ అఖిల భారత ముస్లింలీగ్‌తో పొత్తు పెట్టుకున్నారు. ముస్లిం లీగ్‌ ఏమిటి? ద్విజాతి సిద్ధాంతాన్ని నమ్మి, హిందువులు, ముస్లింలు వేర్వేరు అని చెప్పి, పాకిస్తాన్‌ను ఏర్పాటు చేసుకున్న సంస్థ. 1956లో హజ్‌ యాత్రకు చట్టం తెచ్చినవారు కూడా నెహ్రూనే. ఈ యాత్రకు వెళ్లే ముస్లింలకు ప్రభుత్వమే ఆర్థికసాయం చేస్తుంది. తరువాత జెరూసలేం యాత్రకు ఇదే సౌకర్యం కల్పించారు. చర్చిలకు, మసీదుల నిర్మాణానికి ప్రభుత్వ ధనం ఇస్తున్నారు. ఇది ప్రజలంతా ఇచ్చినది. దీనితో హజ్‌ భవనాలు, చర్చిలు కడుతున్నారు. అవే ప్రభుత్వాలు హిందూ దేవాలయాలను మాత్రం కూల్చడానికి వెనుకాడవు. ఇదంతా ఏమిటని ప్రశ్నిస్తే అది హిందూవాదం. ఇప్పుడు చానళ్లలో వినిపిస్తున్న చర్చల సారం ఇది కాక మరేమిటి?

– పద్మశ్రీ డా.టి.హనుమాన్‌ చౌదరి

కన్వీనర్‌, భారతీయ ధర్మరక్షణ సమాఖ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *