అమెరికా ప్రభావ దేశాలలో చైనా పాగా

అమెరికా ప్రభావ దేశాలలో చైనా పాగా

– నిన్న కరిబియన్‌ దీవులలో..

– నేడు గ్రెనడా దీవిలో..

ఇంతకుముందు అమెరికా బృందంలోని దేశం గ్రెనడా తాజాగా చైనా బృందంలో చేరింది. ప్రస్తుతం చైనా గ్రెనడా కోసం కొత్త అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తోంది. చైనా బహుళ బిలియన్‌ డాలర్ల ప్రణాళికను గ్రెనడా ఆమోదించబోతున్నదని నివేదికలు సూచిస్తున్నాయి. రహదారులు, రైలు మార్గాలు, ప్రత్యేక ఆర్థిక మండలులు వంటి భారీ పెట్టుబడి అవసరమయ్యే నిర్మాణాలు ఈ ప్రణాళికలో ఉన్నాయి.

శ్రీలంకలోని హంబన్‌తోట నౌకాశ్రయాన్ని 99 సంవత్సరాల అద్దెకు తీసుకొని హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని పెంచుకున్న చైనా ఇప్పుడు అమెరికా పెరట్లో పాగా వేయడానికి సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ‘అవమానాల శతాబ్దం’ నుంచి ‘పునరుజ్జీవన శకానికి’ దూసుకుపోతున్న చైనా ప్రపంచ వ్యాప్తంగా తన ఉనికిని విస్తరిస్తోంది. వివిధ దేశాలకు చేరువ కావడంలో పురోగతిని సాధిస్తోంది. 60 దేశాలను కలుపుకొంటూ చైనా చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రపంచ అనుసంధాన నెట్‌వర్క్‌ ‘ఒక బెల్టు ఒక రోడ్డు (ఒబిఒఆర్‌)’ ప్రాజెక్టు చైనా ఆకాంక్షలకు అద్దం పడుతోంది. దక్షిణ చైనా సముద్రంలోకి చైనా విస్తరణ వాదంతో చొచ్చుకుపోతూ చిన్న పొరుగు వారిపై ఒత్తిడి చేయడాన్ని అమెరికా ప్రశ్నిస్తుండగా, బీజింగ్‌ చడీ చప్పుడు లేకుండా కరిబియన్‌ దేశాలను దువ్వుతోంది. వారితో తన సంబంధాలను పెంచుకుంటోంది. లాటిన్‌ అమెరికాలో విస్తృత వాణిజ్యం, మౌలిక వసతుల పెట్టుబడులు కలిగి ఉన్న బీజింగ్‌, కరిబియన్‌ దీవులతో పెద్ద ఎత్తున సంబంధాలు ఏర్పరచుకోవడం ప్రారంభించింది. 2008 నాటి ఆర్థిక మాంద్యంలో యుఎస్‌ ఆర్థికంగా కుదేలవగా కరిబియన్‌ ప్రాంతంలో అమెరికా పెట్టుబడులు క్షీణించాయి. అమెరికా, ఐరోపా సమాజాల సంబంధాల పతనాన్ని అనుకూలంగా మలచుకొన్న చైనా కరెబియన్‌ దేశాలతో తన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడులను క్రమంగా పెంచుకుంది. యుఎస్‌-చైనా ఆర్థిక భద్రత సమీక్ష కమిషన్‌ నివేదికలు పెరుగుతున్న చైనా ఉనికిని ధృవీకరిస్తున్నాయి.

అమెరికా సంయుక్త రాష్ట్రాలకు, ప్రధాన సముద్ర మార్గాలకు వాటి సామీప్యత దృష్ట్యా, కరిబియన్‌ దీవుల వ్యూహాత్మకతను చైనా గుర్తించింది. 2013లో అధ్యక్షుడు జీ లాటిన్‌ అమెరికా, కరిబియన్‌ ప్రాంతాలకు తన మొదటి విదేశీ పర్యటన చేశారు. అంతేకాక, రెండు డజన్‌లకు పైగా దేశాలున్న ఈ ప్రాంతం ఐరాస, అనుబంధ సంస్థలలో గణనీయమైన దౌత్య ప్రభావం చూపేందుకు చాలా విలువైనదని చైనా భావించింది. త్వరలోనే, కరీబియన్‌లో ఏకైక అతిపెద్ద పెట్టుబడి దారుగా చైనా ఉద్భవించనుంది. జమైకాలో వి 720 మిలియన్ల రహదారిని నిర్మించిన చైనా, పనామా కాలువకు ప్రయాణించే చైనా కంటైనర్‌ నౌకలకు మజిలీ కేంద్రంగా పనిచేసేందుకు ఒక లోతైన నౌకాశ్రయాన్ని నిర్మించింది. నౌకాశ్రయాలకు ప్రవేశాన్ని మరింత బలోపేతం చేయడానికి చైనా ఒక డీప్‌-వాటర్‌ పోర్టు (లోతైన నౌకాశ్రయం) అభివృద్ధి చేయడానికి జమైకా అధికారులతో 1.5 బిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. లాటిన్‌ అమెరికాలో అందించినట్లుగానే, కరిబియన్‌ దేశాలకు కూడా చైనా విశ్వ విద్యాలయాలలో అధ్యయనం చేయడానికి చైనా ఉపకార వేతనాలను అందించింది. గయానా, బహమాస్‌, బార్బడోస్‌లు చైనా నుండి సహాయం, పెట్టు బడులు అందుకున్నాయి. చైనా వస్తువులు, ఆయుధా లకు ఈ దేశాలు లాభదాయక మార్కెట్లుగా మారాయి.

చైనా ప్రభావంలోకి గ్రెనడా

ఇంతకుముందు అమెరికా బృందంలోని దేశం గ్రెనడా తాజాగా చైనా బృందంలో చేరింది. బ్రిటిష్‌ వలస ప్రాంతమైన గ్రెనడాకు 1974లో స్వాతంత్య్రం లభించింది. 1978 నాటికి బలంగా ఉన్న వామపక్ష ఉద్యమం అధికారం చేజిక్కించుకొని, రాజ్యాంగాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, పాలకులను జైలుపాలు చేసింది. 1983లో సైనిక నాయకత్వం తిరుగుబాటు చేసి వామపక్ష ప్రధానిని చంపి వేయడంతో దేశం అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయింది. గ్రెనడాకు క్యూబా రష్యాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. రష్యా స్వాధీనం చేసుకుంటుందని అనుమానించిన అమెరికా, కరిబియన్‌ సంకీర్ణంపై దాడి చేసింది. అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ ‘ఆపరేషన్‌ అర్జెంట్‌ ఫ్యూరీ’ ప్రారంభించాడు. 7 రోజుల తీవ్ర పోరాటం తరువాత, శాంతి నెలకొనడంతో ఎన్నికలకు పిలుపు నిచ్చారు. అమెరికా దాడిని ఐరాసలో 100 కు పైగా దేశాలు ఖండించాయి. వెంటనే ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగినందున నిరసనలు తగ్గిపోయాయి. ప్రస్తుతం చైనా గ్రెనడా కోసం కొత్త అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తోంది. చైనా బహుళ బిలియన్‌ డాలర్ల ప్రణాళికను గ్రెనడా ఆమోదించబోతున్నదని నివేదికలు సూచిస్తున్నాయి. రహదారులు, రైలు మార్గాలు, ప్రత్యేక ఆర్థిక మండలులు వంటి భారీ పెట్టుబడి అవసరమయ్యే నిర్మాణాలు ఈ ప్రణాళికలో ఉన్నాయి. హాంగ్‌కాంగ్‌కు నాలుగు రెట్ల పరిమాణం ఉన్న ఈ ద్వీపం 1 లక్ష జనాభా కలిగి 6 మండ లాలుగా విభజితమైంది. అభివృద్ధి ప్రణాళికలలో పునరుత్పాదక ఇంధనం, పండ్ల శుద్ధి కోసం ప్రణాళి కలు ఉన్నాయి. విదేశీ పెట్టుబడులకు రక్షణ కల్పించే నిబంధనను గ్రెనడా ప్రభుత్వం ఈ ప్రణాళికలో చేర్చనున్నదని అభిజ్ఞ వర్గాలు భావిస్తున్నాయి. ఈ దీవిని పన్ను స్వర్గం (ుaఞ ష్ట్రవaఙవఅ)గా మార్చడానికి చైనా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

వామపక్ష భావ జాలానికి ఈ ప్రాంతం అనుకూల మని గ్రహించిన చైనా, ఈ దేశ ఆంతరంగిక వ్యవహా రాలలో జోక్యం చేసుకోబోనని వాగ్దానం చేసింది. కాని ఇటీవలి నేపాల్‌ ఎన్నికలలో బీజింగ్‌ అవాంఛ నీయ ప్రభావం తప్పుదోవ పట్టించేదిగా ఉంది. కరీబియన్‌తో పెట్టుబడి కూటములను ఏర్పరచేందుకు చైనా చేస్తున్న భారీ ప్రయత్నాలు భయపెడుతున్నాయి. భారతదేశ పొరుగు దేశాలతో ఆర్థిక సంబంధాలు ఏర్పరచుకొనే మిషతో చైనా మొదట్లో దక్షిణ ఆసియా ప్రాంతంలోకి ప్రవేశించింది. అయితే ఒక దశాబ్దంలోపే భారతదేశం చుట్టుపక్కల ఉన్న అన్ని దక్షిణాసియా దేశాలనూ చైనా విజయవంతంగా తన ప్రభావంలోకి తెచ్చుకొంది. చైనా సందేహాస్పద చరిత్రను పరిగణించి, తన ప్రభావ ప్రాంత పరిధిలోకి చొచ్చుకు వస్తున్న బీజింగ్‌ దుర్మార్గ ప్రయత్నాల పట్ల అమెరికా జాగ్రత్తగా ఉండంవలసిన అవసరం ఎంతైనా ఉంది.

– డా.రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *