అది దుష్ప్రచారం

అది దుష్ప్రచారం

ఇటీవల అమెరికా గూఢచారి సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సి (సి.ఐ.ఎ) వరల్డ్‌ ఫ్యాక్ట్స్‌ బుక్‌ తాజా సంచికలో విశ్వహిందూ పరిషత్‌, బజరంగదళ్‌ సంస్థలను తీవ్రవాద సంస్థలుగా పేర్కొనడం వారి అవగాహనా రాహిత్యం మాత్రమే కాక, పక్షపాత ధోరణితో కూడుకొన్న దుష్ప్రచారం కూడా.

50 లక్షల మంది కఠోర పరిశ్రమ చేయగలిగిన సభ్యులు కలిగిన శక్తివంతమైన యువకుల సంస్థ బజరంగదళ్‌ను కలుపుకుని సుమారు కోటి మందికి పైగా సభ్యులు కలిగిన సంస్థ విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి). ఇది సన్యాసుల, బ్రహ్మచారుల సారథ్యంలో ఇప్పటికే సేవా, సురక్షా, సంస్కార్‌ వంటి లక్ష్యాలతో దేశంలోని వందకోట్ల మంది, ఇతర దేశాలలో జీవిస్తున్న సుమారు మరొక 25 కోట్ల మంది హిందువుల సంక్షేమం కోసం పనిచేస్తున్నది. హిందూ సమాజములో అంతర్భాగమైన బౌద్ధ, జైన, సిక్కు, శాక్తేయ, గాణాపత్య, సౌర, శైవ, వైష్ణవ మొదలైన వివిధ ఆరాధనా పద్ధతులు అవలంబిస్తున్న వారందరికీ ఒక వేదికగా పనిచేస్తున్నది.

ఇప్పటికి 54 సంవత్సరాల క్రితం ముంబైలోని సాందీపని ఆశ్రమంలో స్వామి చిన్మయానంద అధ్యక్షతన విశ్వహిందూ పరిషత్‌ ప్రారంభమైంది.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ ద్వితీయ సర్‌ సంఘచాలకులు పూజనీయ మాధవ సదాశివ గోళ్వల్కర్‌ విశేష కషి కారణంగా ఆనాడు అగ్ర గణ్యులైన జైనముని, సిఖ్ఖు సాంప్రదాయ పెద్దలు మాస్టర్‌ తారాసింగ్‌, బౌద్ధలామాలు, దేశంలోని నాలుగు శంకర పీఠాలకు అధిపతులైన శంకరా చార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు.. ఇలా దేశంలోని ఆధ్యాత్మిక గురువులందరూ ఒకచోట కలిసి, ప్రపంచంలోని హిందువులందరికీ వేదికగా విశ్వహిందూ పరిషత్‌ను ప్రారంభించారు. వీరంతా దేశం కోసం, సమాజం కోసం సర్వస్వం త్యాగం చేసినవారు. వీరి ఆధ్వర్యంలో ప్రారంభమైన విహెచ్‌పి నాటి నుండి ప్రజలు ఏకమై దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలని పిలుపునిస్తూ వస్తున్నది.

విశ్వహిందూ పరిషత్‌ 1966లో ప్రయాగ రాజ్‌లో, 1968లో కర్ణాటకలోని ఉడిపిలో దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న హిందువులందరిని ఏకం చేయడానికి ప్రపంచ హిందూ సమ్మేళనాలు నిర్వహించింది. రోజులలోనే 50 దేశాల నుండి 25 వేలకు పైగా ప్రతినిధులు ఈ సమ్మేళనాలలో పాల్గొన్నారు.

ఈ సభలలోనే వేల సంవత్సరాలుగా మత దురహంకారుల పీడనకు గురైన భారత ప్రజలనుద్దేశించి వారి సంక్షేమం, ఐక్యత కోసం అనేక సంస్కరణలు చేపట్టి, తీర్మానాలు చేశారు.

మతమార్పిడులకు అడ్డుకట్ట వేయాలని; ఈ దేశ ఆధ్యాత్మికతకు, వ్యవసాయానికి ఆధారమైన గోవులను రక్షించుకోవాలనీ; ఆరాధనా పద్ధతులు, కులాలు ఏవైనా హిందువులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

దానిలో భాగంగానే

హైందవాః సోదరా సర్వే – న హిందుః పతితో భవేత్‌ |

(హిందువులందరూ సమానమే, ఏ హిందువు పతితుడు కాడు),

మమ దీక్షా హిందు రక్ష, మమ మంత్రం సమానత

(నా దీక్ష హిందూ సమాజ రక్షణ, నా మంత్రం సమానతను సాధించడం) అంటూ దేశంలోని అంటరానితనంపై యుద్ధం ప్రకటించారు. యుద్ధ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా స్వామీజీలు పర్యటనలు జరిపారు. ఏకత్వాన్ని ప్రబోధించారు. సమరసతను సాధించాలని ప్రజలకు బోధనలు చేశారు. దాని కారణంగా దేశంలో చాలా ప్రభావం కనబడింది.

ప్రజల మధ్య ఐక్యతను సాధించడానికి 1980 దశకంలో ఏకాత్మతా యజ్ఞం పేరుతో 12 కోట్ల మంది ప్రజలను కలిపి ‘మేమంతా భారతమాత సంతానం, మేమంతా భారతీయులం, వేషం, భాష, ఆరాధనా పద్ధతులు, కులాలు వేరైనా అందరం ఒక్కటే’ అనే భావాన్ని ప్రజల మనసులలో నింపటానికి విశ్వహిందూ పరిషత్‌ గంగామాత, భారతమాత విగ్రహాలతో దేశం నలుమూలలా రథయాత్రను నిర్వహించింది.

విహెచ్‌పి కార్యం

ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలలో విహెచ్‌పి తన కార్యాన్ని నిర్వహిస్తున్నది. మనదేశంలోని 42 ప్రాంతాలలో, 1033 జిల్లాలలో విస్తరించి, 75 వేల సమితిలు ఏర్పాటు చేసి, ఇరవై ఒక్క వేల స్థలాలలో సత్సంగ్‌ నిర్వహిస్తూ సంస్కారాన్ని ప్రబోధిస్తున్నది.

52,465 మంది సంయోజకులు, 35 లక్షలకు పైగా సభ్యులు కలిగిన బజరంగదళ్‌; ఇరవై వేలకు పైగా మహిళా సంయోజకులు, ఐదు లక్షలకు పైగా మహిళా సభ్యులు కలిగి ఉన్నది.

విహెచ్‌పి దేశంలో 65 వేలకు పైగా ఏకల్‌ పాఠశాలలు నిర్వహిస్తున్నది. ఇప్పటికే మారుమూల గ్రామాలలో ఇరవై ఐదు లక్షలకు పైగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన చరిత్ర విశ్వహిందూపరిషత్‌ది. పేద విద్యార్థులకు వందల సంఖ్యలో ఆవాస విద్యాలయాలు, అనాధ శరణాలయాలు, వేలాది మందిరాలు, 352 కేంద్రాల్లో గో ఆధారిత వస్తువుల తయారీ శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నది.

8 వేల మంది ఆరోగ్య కార్యకర్తలతో 186 చికిత్సా కేంద్రాలు నిర్వహిస్తూ ఉచిత వైద్యం అందిస్తున్నది. 2 వేల మంది కథాకారులు మారుమూల గ్రామాలలో పూరి గుడిసెల మధ్యన పర్యటిస్తూ ప్రజలలో సంస్కారాన్ని ప్రభోదిస్తున్నారు.

ప్రజల కష్టాలు తీరుస్తూ..

దేశంలో కష్టాలు వచ్చినా, కరువొచ్చినా, కడలి పైకొచ్చినా, హాహాకారాలు చేస్తున్న జనులకు మేమున్నామంటూ ఆపన్న హస్తాన్ని అందించే వారిలో విశ్వహిందూ పరిషత్‌, భజరంగదళ్‌ కార్యకర్తలు కూడా ఉంటారు.

ప్రతి సంవత్సరం రెండు లక్షల యూనిట్లకు పైగా రక్తదానం చేసి ఆపన్నులకు అందించేది బజరంగ్‌దళ్‌ కార్యకర్తలే. స్వయంగా అమెరికాలో హరికేన్‌ తుఫాన్‌ సంభవిస్తే ఆ దేశ అధ్యక్షుడు నేలమాళిగలో దాక్కొన్నప్పుడు, విశ్వహిందూ పరిషత్‌, ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీ, మాతా అమతానందమయి స్వచ్ఛంద సంస్థల నుండి ఐదు వందల మంది డాక్టర్లు సేవ చేసిన విషయం, మాతా అమతానందమయి అందించిన ‘అయిదు వందల కోట్ల రూపాయలు’ అమెరికాలో సేవ కోసం వినియోగించిన విషయం ఎంతమందికి తెలుసు ? సేవ చేసి ప్రచారం చేసుకోవడం విహెచ్‌పికి తెలియదు.

ఆస్ట్రేలియాలో స్వచ్ఛంద సేవలందించినందుకు విశ్వహిందూ పరిషత్‌ కార్యక్రమానికి ఆ దేశ ప్రధాని అధ్యక్షత వహించిన విషయం ఎంతమందికి తెలుసు? ఫిజీలో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి సేవలందించినది విశ్వహిందూ పరిషత్‌ కాదా !

హిందుత్వం అనగానే మతం అంటూ బురదచల్లే వాళ్ళకు హిందుత్వం అంటే జీవన విధానం అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి తెలియదా ! లేక తెలిసినప్పటికీ ఏదో రకంగా హిందువులను బానిసలుగా చేసుకోవాలనే తమ కుత్సిత ఆలోచన లకు దూరం కాలేక పోతున్నారా ! వీరి అక్కసు కారణంగానే విశ్వహిందూ పరిషత్‌, బజరంగదళ్‌పై దుష్ప్రచారం జరుగుతున్నది.

స్వాభిమాన ఉద్యమం

విదేశీ పాలన సమస్య మళ్లీ మన దేశానికి దాపురించకూడదనీ, 1962 చైనా యుద్ధ ఓటమి తర్వాత మనదేశ పౌరులలో జాతీయ భావాలను, ఐక్యమై పోరాడే తత్వాన్ని అలవరచటానికి, పోరాటం చేయగల ప్రవత్తిని పెంచడానికి విహెచ్‌పి ప్రయత్నం చేసింది. అందుకు ఈ దేశపు చక్రవర్తి శ్రీరామ చంద్రుని జన్మస్థాన విముక్తి ఉద్యమం నడిపింది. 25 సంవత్సరాలపాటు జరిగిన ఈ శాంతియుత పోరాటంలో, నిర్వహించిన సత్యాగ్రహంలో ‘లక్షా 25 వేల మంది’ పాల్గొని జైలుకెళ్లారు. నెలల తరబడి జైళ్లలో మగ్గారు. ఇది కాదా స్వాభిమాన సంకేతం !

రామజన్మభూమి ఉద్యమం తర్వాత దేశంలో జాతీయ భావాల విస్తరణ జరిగింది. మేధావులు, విజ్ఞానవేత్తలు, శాస్త్రజ్ఞులు, ఉపాధ్యాయులు పూనుకొని దేశాన్ని అగ్రస్థానంలో నిలపటానికి ప్రయత్నించడం ప్రారంభించారు. దేశ పురోగతి ఆరంభమైంది. ఆర్థిక పరిస్థితి గాడిన పడింది. మనదేశ ప్రధాన మంత్రులకు, మనదేశ పౌరులకు ప్రపంచంలో ఒక గుర్తింపు రావడం ప్రారంభమైంది.

అవధులు దాటిన దుష్ప్రచారం

స్వాతంత్ర పోరాటంలో తిలక్‌ని, మహాత్మా గాంధీని హిందూ నాయకులుగా జిన్నా వంటి వారు ప్రకటించారు. నాటి ఆంగ్ల ప్రభుత్వం కూడా అలాగే భావించేది. భగత్‌ సింగ్‌, సుభాష్‌ చంద్రబోస్‌, తిలక్‌, చివరికి బంకించంద్ర చటర్జీ, లాలా లజపతిరాయ్‌, వీర సావర్కర్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌ లాంటివారినీ హిందూ తీవ్రవాదులుగా ముద్ర వేసిన విషయం మనకు తెలిసిందే.

మళ్లీ ఇన్నాళ్ల తర్వాత విశ్వహిందూ పరిషత్‌, భజరంగదళ్‌లను తీవ్రవాద సంస్థలుగా పేర్కొంటూ దుష్ప్రచారం చేయడం ప్రారంభమైంది. దీని వెనుక దేశ వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగిస్తూ, స్వచ్ఛంద సంస్థల పేరుతో అనైతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారి హస్తం ఉంది.

లెక్కలు చూపని 20 వేల స్వచ్ఛంద సంస్థల ఖాతాలను, వాటి గుర్తింపును రద్దు చేసిన తర్వాత, ఆర్థిక ఇక్కట్లతో అసహనానికి గురైన కొన్ని విదేశీ స్వచ్ఛంద సంస్థలు తమ మాతసంస్థలను కలుపుకుని విదేశాలలో కుట్రలు పన్ని, భారతీయుల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విశ్వహిందూ పరిషత్‌, బజరంగదళ్‌ సంస్థలను బూచిగా చూపిస్తూ తమ పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నంలో భాగమే ఈ దుష్ప్రచారం. ఇటువంటి కుటిల యత్నాలు ఎప్పటికీ ఫలిరచవని వారు తెలుసుకోవాలి.

ఏకే-47 వంటి ఆయుధాలను తయారు చేసి తీవ్రవాదులకు అందివ్వటం; రకరకాల పన్నాగాలను పన్ని ఎన్నో దేశాల ప్రభుత్వాలను పడగొట్టడం; ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, హత్యలకు పాల్పడటం; యుద్ధాల పేరిట, స్టార్‌ వార్స్‌ పేరిట, రసాయన ఆయుధాలను, అణుబాంబులను తయారు చేసి వేలమందిని హతమార్చటం; తమ దేశ కంపెనీలు తాము అడుగు పెట్టిన చోట ఆ దేశాలను దోచుకో వటం వంటి వి అమెరికా సాగించిన తీవ్రవాద చర్యలు. ప్రపంచ జనాభాలో నాలుగు శాతం ఉన్న తమ ప్రజలకు ప్రపంచంలోని 42% వనరులను దోచిపెడుతోంది అమెరికా.

అటువంటి దోపిడీ మనస్తత్వం గల అమెరికా విశ్వహిందూ పరిషత్‌, బజరంగదళ్‌ వంటి సామాజిక, ధార్మిక, సాంస్కతిక, సేవా, దేశభక్త సంస్థలను తీవ్రవాద సంస్థలుగా పేర్కొనడం విడ్డూరం. ఇది 100 ఎలుకలను మింగిన పిల్లి ‘నేను శాకాహారిని’ అని ప్రకటించినట్లుంది. ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి లేదు.

హిందుత్వం వైపు ప్రయాణం

స్వయంగా భారతదేశ మూలాలను, గొప్పతనాన్ని గ్రహించిన అమెరికా ప్రజలు 15 శాతం మంది హిందూ జాతి అందించిన ఆయుర్వేదం, యోగా, చికిత్స, సంగీతం, గానం, నత్యం, యజ్ఞయా గాదులు, శాకాహార భోజనం వంటి వాటిని ఆచరిస్తున్నట్లు అమెరికా దేశపు సర్వేలే స్పష్టం చేస్తున్నాయి.

హిందుత్వం ఎవరినీ మతం మారమని ప్రలోభ పెట్టదు. మనిషిగా మారమని చెబుతుంది. అంతకు మించి మహోన్నతునిగా, మాధవునిగా మారమని చెబుతుంది. అదే ఆదర్శానికి కట్టుబడినవి విశ్వహిందూ పరిషత్‌, బజరంగదళ్‌ సంస్థలు. ఈ విషయం అమెరికా గ్రహిస్తే మంచిది.

-రచయిత రాంచీలో విశ్వహిందూ పరిషత్‌ నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *