అందరికీ విద్యుత్‌

అందరికీ విద్యుత్‌

స్వతంత్ర భారతదేశ చరిత్రలో 28 ఏప్రిల్‌ 2018కి ఒక ప్రత్యేకత ఉంది. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ సదుపాయం కల్పించే పని ఆ రోజున సాకారమైంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలకు గానీ ఈ పని పూర్తిచేయలేకపోయాం. అది కూడా నరేంద్ర మోదీ నేతత్వంలో కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడిన తరువాతే జరిగింది.

2014 మేలో మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి దేశంలోని మొత్తం 5.97 లక్షల గ్రామాల్లో 18,400 గ్రామాలు విద్యుత్‌ సౌకర్యానికి దూరంగానే ఉన్నాయి. అన్ని గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామని మోదీ తన ఎన్నికల వాగ్దానంలో చెప్పారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ అందిచాలనే లక్ష్యంతో ఆయన ముందుకు కదిలారు. అందరికీ విద్యుత్‌ అనే అంశాన్ని 2018 మే 10 లోపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా 2018 ఏప్రిల్‌ 28 నాటికే పూర్తిచేయడం గమనార్హం. భారత అభివద్ధిలో దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం అనేది గొప్ప మైలురాయి. ఇక మిగిలింది అన్ని ఇళ్లకు విద్యుత్‌ అందించడం మాత్రమే. అది కూడా త్వరలోనే సాకారమౌతుందని అశించవచ్చు.

90వ దశకంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలై నేటికి 30 ఏళ్లు కావస్తున్నా అభివద్ధి ఫలాలు దేశంలోని పేదలకు నేటికి దక్కడంలేదు. నేటికి కూడా సూమారు 3 కోట్ల 20 లక్షల గహాలు విద్యుత్‌కు దూరంగా ఉన్నాయి. వీరందరికీ విద్యుత్‌ సౌకర్యం కల్పించడం, వారిని దేశ అభివద్ధిలో భాగస్వాములను చెయ్యాలనే ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి పథకం ద్వారా దేశంలోని ఇప్పటివరకు విద్యుత్‌ లేని 18,452 గ్రామాల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించారు.

ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం దేశంలోని సుమారు 3.2 కోట్ల గహాలకు ఇప్పటికీ విద్యుత్‌ సౌకర్యం లేదు. (విద్యుత్‌ అన్ని గ్రామాలకు చేరింది. కానీ ఆ గ్రామాలలోని అన్ని ఇళ్ళకూ ఇంకా చేరలేదు.) ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యుత్‌ అందుబాటులో లేని ఆ గ్రామాల్లోని మిగిలిన గహాలకు కూడా 2018 డిసెంబరు నాటికి విద్యుత్‌ సౌకర్యం అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం ‘ప్రధానమంత్రి సహజ్‌ బిజిలీ హర్‌ ఘర్‌ యోజన’ లేదా ‘సౌభాగ్య యోజన’ పథకాన్ని ప్రారంభించింది. దీనికి కావాల్సిన 16,320 కోట్ల రూపాయల్లో 12,320 కోట్ల రూపాయలను ఈ సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించింది.

దక్షిణాదిలోని కేరళ, తమిళనాడు రాష్ట్రాలు దశాబ్దాల కిందటే 100 శాతం విద్యుత్‌ సౌకర్యాన్ని సాధించాయి. అయితే ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఒడిశా, అసోం, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాలు విద్యుత్‌ సౌకర్యానికి దూరంగా ఉన్నాయి. ఆ సమస్యను 2018 ఏప్రిల్‌ 28 నాటికి మోదీ పరిష్కరించారు.

అయితే 2018 మార్చి 31 నాటికి భారత దేశవిద్యుత్‌ తయారీ సామర్థ్యం కేవలం 344 గిగావాట్లుగానే ఉంది. దీనిలో ఎక్కువభాగం బొగ్గు మండించడం ద్వారా ఉత్పత్తి అయ్యే థర్మల్‌ విద్యుత్‌. దేశంలో దేశీయ అవసరాలకు సరిపడినంత విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్నా, పంపిణీలో మౌలిక సదుపాయాల లేమితో దేశంలోని మారుమూల గ్రామాల్లోని ప్రజలకు విద్యుత్‌ను అందించలేక పోతున్నారు.

పవర్‌ ఫర్‌ ఆల్‌

పంపిణీకి సంబంధించిన అవరోధాలను తొలగించడానికి ‘పవర్‌ ఫర్‌ ఆల్‌’ కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. విద్యుత్‌ ఉత్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు తక్కువున్న రాష్ట్రాలకు విద్యుత్‌ అమ్ముకోడానికి, తక్కువగా ఉన్న రాష్ట్రాలు కొనుగోలు చేయడానికి ‘ఉజ్వల్‌ డిస్కం యోజన’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

విద్యుత్‌ ఆర్థికాభివద్ధిలో ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్థిక రంగంలోని మూడు ముఖ్య రంగాలు ప్రత్యక్షంగా విద్యుత్‌తో అనుసంధానమై ఉంటాయి. అవి వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం. వీటికి విద్యుత్‌ ఎంతో కీలకం. ఒక రాష్ట్రం తలసరి విద్యుత్‌ వినియోగాన్ని బట్టి ఆ రాష్ట్ర అభివద్ధిని అంచనా వేయవచ్చు. దేశ తలసరి విద్యుత్‌ వినియోగం 1010 కిలోవాట్లుగా ఉంది. గుజరాత్‌, పంజాబ్‌, హర్యానాలలో తలసరి విద్యుత్‌ వినియోగం అత్యధికంగా ఉండగా, ఈశాన్య రాష్ట్రాలు, బీహార్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లలో తలసరి విద్యుత్‌ వినియోగం తక్కువగా ఉంది. విద్యుత్‌ వినియోగంలో తేడా ఆయా రాష్ట్రాల వెనుకబాటు తనాన్ని సూచిస్తుంది.

పెరుగుతున్న సంప్రదాయేతర ఉత్పత్తి

దేశంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల్లో ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. దీంతో పవన, సౌర విద్యత్తు ఉత్పత్తి దేశంలో ఏటికేడు పెరుగుతూ పోతోంది. భారతదేశానికి ఇది శుభ సూచకం. అ్యతధిక కాలుష్యాన్ని వెదజల్లే థర్మల్‌ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్‌ ఉత్పత్తి మెరుగు పడుతోంది. దేశంలో ప్రస్తుత సౌర విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం 22 వేల మెగావాట్లుగా ఉంది. పవన విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం 35 వేల మెగావాట్లుగా ఉంది. ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను సరిగ్గా పంపిణీ చేయడానికి దేశ వ్యాప్తంగా గ్రిడ్‌ అనుసంధాన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కొన్ని మారుమూల ప్రదేశాలకు విద్యుత్‌ లైన్లను నూతనంగా నిర్మిస్తున్నారు. పాత లైన్లను సరిచేయడం, పంపిణీకి అధునాతన పరికరాలను ఉపయోగించడం వంటి చర్యలతో మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

విద్యుత్‌ ఉత్పత్తి – ఆర్థిక అభివృద్ధి

విద్యుత్‌ను అందరికి అందుబాటులోకి తెస్తే గహ అవసరాలకు విద్యుత్‌ను విరివిగా ఉపయోగించ వచ్చు. తద్వారా గ్రామాల్లో గహ అవసరాలకు వినియోగిస్తున్న ఎల్‌పిజి గ్యాస్‌, కిరోసిన్‌ను ఆదా చేయవచ్చు. మనం మన ఇంధన అవసరాలకు ఎక్కువగా శిలాజ ఇంధనాలపైనే ఆధారపడుతున్నాం. దేశీయంగా శిలాజ ఇంధనాల లభ్యత తక్కువగా ఉండటంతో మనం వీటి కోసం విదేశాలపై ఆధార పడుతున్నాం. వీటి దిగుమతికి పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తున్నాం. తత్ఫలితంగా దేశ కరెంటు ఖాతా లోటు ఏడాదికేడాది పెరుగుతూ పోతోంది. విద్యుత్‌ను సమర్థవంతంగా ఉపయోగిస్తే రానున్న కాలంలో రవాణా వాహనాలకు కూడా విద్యుత్‌ను ఉపయోగించవచ్చు. ఇదే జరిగితే భారత ఇంధన దిగుమతులు తగ్గి ఆ ధనాన్ని భారతదేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించవచ్చు.

రైతుకు లాభం

భారత్‌ వంటి వ్యవసాయ రంగంపై ఆధారపడిన దేశాలకు వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్‌ను అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెంచవచ్చు. తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా రైతు ఆదాయాన్ని పెంచే చర్యే. రైతులు ఉత్పత్తికి చేసే ఖర్చుకు 50 శాతం అధికంగా మద్దతు ధర అందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని ఇది నెరవేరుస్తుంది.

దీంతోపాటు భారతదేశంలో ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉండి విద్యుత్‌కు దూరంగా ఉన్నారో వారికి ఉచితంగా విద్యుత్‌ అందించడంలో ఎలాంటి తప్పు లేదు. కాని దీన్ని వారు సద్వినియోగ పరుచుకోడానికి గ్రామీణ పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి. డిజిటల్‌ ఇండియాలో భాగంగా అన్ని డిజిటల్‌ సేవలు ప్రజలకు చేరాలంటే గ్రామాల్లో నాణ్యమైన విద్యుత్‌ అందుబాటులోకి రావాలి.

మరింత పెరగాలి

విద్యుత్‌ ఉత్పత్తిలో భారతదేశం చైనా, అమెరికాల తర్వాత మూడో స్థానంలో ఉంది. చైనాలో భారత్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ కంటే నాలుగు రెట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతూంటే, అమెరికాలో భారత్‌ కంటే రెండు రెట్లు ఎక్కువ విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. విద్యుత్‌ను వినియోగించి ఆయా దేశాలు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా అవతరించాయి. జపాన్‌, రష్యాలు విద్యుత్‌ ఉత్పత్తిలో భారత్‌కు చేరువలో ఉన్నాయి. భారతదేశంలో కూడా దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించడం మాత్రమే కాకుండా ఆ విద్యుత్‌ను వినియోగించుకునే గ్రామీణ పరిశ్రమలను ఏర్పాటు చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు, గ్రామీణ భారతానికి కూడా అది లాభదాయకంగా ఉంటుంది.

సాంకేతికత – విద్యుత్‌ ఆదా

విద్యుత్‌ ఉపకరణాల విషయంలోనూ టెక్నాలజీ రోజురోజుకు మారుతూ వస్తోంది. సాధారణ బల్బుల స్థానంలో వచ్చిన ఎల్‌ఇడి బల్బులు 50 శాతం మేర విద్యుత్‌ను ఆదా చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలకు ఈ ఎల్‌ఇడి బల్బులను ప్రభుత్వం సరఫరా చేయడం ద్వారా చాలా విద్యుత్‌ ఆదా అయ్యింది. విద్యుత్‌ ఆదా అంటే విద్యుత్‌ మిగులు కింద లెక్క. ఈ మిగులు విద్యుత్‌తో మరిన్ని జనావాసాలకు విద్యుత్‌ వసతి కల్పించవచ్చు. దేశంలో విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం వేగంగా పెరుగుతోంది.

పలు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రయివేటు రంగంలోనూ పెద్ద ఎత్తున విద్యుత్‌ ఉత్తత్తి కేంద్రాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుత దేశ డిమాండ్‌కు మించి విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఈ మిగులు విద్యుత్‌ను ఎలక్ట్రిక్‌ వాహనాలకు వినియోగిస్తే దేశ ఇంధన అవసరాలు తీరడంతో పాటు ఇంధన భద్రత కూడా లభిస్తుంది. ఇప్పటికే భారతీయ రైల్వేలో పలు రైలు మార్గాలు విద్యుదీకరించారు. దేశీయ ఆటోమోబైల్‌ పరిశ్రమలు కూడా విద్యుత్‌తో నడిచే మోటారు కార్లు, బైక్‌లను ఉత్పత్తి చేస్తున్నాయి. సోలార్‌ ప్యానళ్ళ ధరలు తగ్గడంతో ప్రజలు తమ ఇళ్ల పై కప్పులనే విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పరిశోధనలతో సౌర విద్యుత్‌ చాలా చౌకగా లభించే అవకాశం ఉంది.

దీనదయాళ్‌ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన

గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించే ఉద్దేశ్యంతో 2015 జూన్‌లో ప్రధాని నరేంద్రమోదీ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో ఈ పథకం అమలు జరుగుతున్నది. ఈ పథకానికి ప్రభుత్వం 75 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. 2018 మే10 నాటికి దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం అందించే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినా గడువు కంటే ముందే 2018 ఏప్రిల్‌ 28 నాటికే దేశంలోని ఆరు లక్షల గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించి ప్రభుత్వం తన చిత్త శుద్ధిని నిరూపించు కుంది.

దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకు విద్యుత్‌ను అందించగలిగినా, ఇంకా ఎంతో మంది పేదలు విద్యుత్‌ వెలుగులకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న 2018 డిసెంబరు నాటికి దేశంలోని అన్ని కుటుంబాలకు విద్యుత్‌ అందుతుందని ఆశిద్దాం.

– ఆర్‌.సి.రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *