సంపాదకీయం

‌శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌  ‌శ్రావణ బహుళ  ఏకాదశి – 22 ఆగస్ట్ 2022, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‌ప్రేరణదాయమైన మార్గదర్శకత్వం లోపిస్తే ఏ దేశానికైనా భవిష్యత్తు అంధకారబంధురమే. మన ఘన చరిత్ర, గొప్ప నేత, గొప్ప ఆశయం, భవిష్యత్తు మీద అచంచల విశ్వాసం ఏదైనా ఆ ప్రేరణకు కేంద్ర బిందువులే. కానీ కొన్నేళ్లుగా వితండవాదాలూ, విధ్వంసక ఆలోచనలూ పుట్టుకొచ్చి సమాజాన్ని పెడతోవ పట్టించేందుకే పనిచేస్తున్నాయి. మన చరిత్రతో మనకేమీ బంధం అక్కరలేదనే వారు కొందరు. దేశ ఐక్యత, దేశభక్తి వంటి జాతిని నడపగలిగే లక్షణాలు ఉన్న నేత, జాతీయ నాయకుడు అవతరించడం ఇష్టంలేని దుష్టబుద్ధులూ చాలామందే కనిపిస్తున్నారు. భవిష్యత్తుకు చెప్పే నిర్వచనాలను నిరాశతో తడుపుతున్నదీ వీళ్లే. ఇలాంటి వాతావరణంతో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పెద్ద పోరాటమే చేస్తున్నది. అందుకు ఆ ప్రభుత్వానికి ఉన్న ఆయుధం సిద్ధాంతమే. అది ఆ ప్రభుత్వం వెనుక ఉన్న పార్టీదే. పేరుకు భారతీయులైనవారే కాదు, విదేశీయులు సహా ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా ఈ దేశం పరమ వైభవస్థితిని దర్శించడం తథ్యమని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ద్వంద్వంగా చెప్పారు. 75వ స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా, ఆజాదీ కా అమృత మహోత్సవాల స్ఫూర్తితో తొమ్మిదోసారి ఎర్రకోట మీద నుంచి ప్రధాని ఇచ్చిన మహోపన్యాసం సారం ఇదే.

ఈ ఆగస్ట్ 15 ‌మరొక చరిత్రాత్మక కోణాన్ని సంతరించుకుంది. ఆగస్ట్ 13, 14 ‌తేదీలలో హర్‌ ‌ఘర్‌ ‌తిరంగా పేరుతో ప్రతి ఇంటి మీద మువ్వన్నెల పతాకం ఎగరాలని ప్రధాని ఆకాంక్షించారు. దేశవాసులు సానుకూలంగా స్పందించారు కూడా. సిద్ధాంతాలు వేరు కావచ్చు. ఆలోచనలు వేరు కావచ్చు. ఆచారాలూ, మతాలూ వేరు కావచ్చు. కానీ మన స్వాతంత్య్ర సమరంలోని ముఖ్య ఘట్టాలు ఏ జెండా స్ఫూర్తితో జరిగాయో, ఆ జెండా కిందనయినా నేటి భారతీయులంతా నిలబడదాం, ఐక్యతను చాటుదాం అన్నదే ప్రధాని ఆశయంలా కనిపిస్తుంది. ముమ్మాటికీ ఇదొక అద్భుత ఆలోచన. దేశ ఐక్యత జీవన విధానంతో సాధ్యమవుతుంది. ఆ జీవన విధానానికి ప్రతీక జాతీయ జెండా. స్వతంత్ర దేశం కోసం పోరాడిన భారతీయులంతా భుజాన వేసుకున్నది ఈ జెండానే.

దాదాపు 80 నిమిషాల ఆ ప్రేరణాత్మక ఉపన్యాసంలో ప్రధాని ఐదు ప్రతిజ్ఞలు తీసుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తంచేశారు. అవే పంచ ప్రాణాలు. మరొక పాతిక సంవత్సరాలకు వందేళ్ల మైలురాయిని చేరుకుంటున్న స్వతంత్ర భారతావని ప్రపంచ పటంలో ఎంతటి సమున్నత స్థానంలో నిలబడాలో, దేశవాసులు నిలపాలో ఆయన ఒక కల్పన చేశారు. అందులో ఒకటో ప్రాణం వికసిత భారత్‌. అం‌టే పరిపూర్ణంగా అభివృద్ధి చెందిన భారత్‌ ‌కోసం స్వప్నించడం. సమున్నత ఆశయాలతో నిశ్చయాలతో సాగిపోవడం, భారత అభివృద్ధికి కట్టుబడడం. రెండు- ఏ రూపంలోని బానిసత్వమైనా దాని నుంచి విముక్తం కావడం. మూడు మన ఘన గతం పట్ల గర్వించడం. నాలుగు ఐక్యత, సంఘీభావం, ఒకే భారతదేశం అత్యుత్తమ భారతదేశం కోసం పాటు పడడం. ఐదో ప్రతిజ్ఞ – పౌరులు బాధ్యతలను గుర్తెరగడం. పీఎం, సీఎంలు ఎవరైనా మొదట పౌరులుగా తమ విధులను సత్యనిష్టతో పాటించడం. వచ్చే పాతిక సంవత్సరాలలో దేశం అగ్రరాజ్యంగా ఎదగాలన్న ఆకాంక్షకు ఐదో ప్రతిజ్ఞ పెద్ద ప్రాణశక్తి. ప్రధాని తనదైన శైలిలో గాంధీజీ మొదలు అల్లూరి వరకు సమరయోధులను స్మరించుకోవడం శ్లాఘనీయం.

ఈ దేశానికి పట్టిన కుటుంబ పాలన జాడ్యం వదిలిపోవాలని మోదీ కోరుకోవడంలో ప్రజాస్వామ్య సంక్షేమమే ఉంది. దీనికి కొన్ని పార్టీలు ఎందుకు భుజాలు తడుముకున్నాయో అర్ధం కాదు. అవినీతి పంకిలం నుంచి బయట పడాలని, ఆ బురదలో దొర్లి వచ్చిన వారిని వెనకేసుకొచ్చే జబ్బును తగ్గించుకోవాలని కోరినా కూడా కొందరు ఎందుకు రుసరుస లాడారో అంతుపట్టదు. ఎర్రకోట దగ్గర చేసే సైనిక వందనంలో ఈసారి అన్నీ దేశంలో తయారైన తుపాకులనే ఉపయోగించారని ప్రధాని చెప్పడం స్వాగతించదగిన అంశమే. కానీ అందుకు ఏడున్నర దశాబ్దాలు ఎందుకు పట్టిందో దేశాన్ని అర్ధశతాబ్దం పాలించిన కుటుంబ పార్టీ, పంచకూళ్ల కషాయాల వంటి కూటములు ఆలోచిస్తే మంచిది.

నా దేశం పురోగమన దిశలో ఉండాలని కోరుకోవడం ఏ పౌరునికైనా ప్రథమ కర్తవ్యమే అవుతుంది. ఇలాంటి సమున్నత ఆలోచన అంకురించి, దానిని ఆచరణలోకి తీసుకురావాలంటే మొదటిగా జరగవలసింది- వలసవాదం మిగిల్చిన బానిస బుద్ధి నుంచి బయటపడడం. ఏడున్నర దశాబ్దాలు గడచిపోయినా ఇప్పటికీ వలసవాదం నీలినీడలు చాలామంది భారతీయుల మెదళ్లతో క్రీడిస్తూనే ఉన్నాయి. మనదైన చింతనతో దేశం ముందుకు వెళ్లడానికి ఆ బుద్ధులు సహకరించవు. జాతినంతా కలిపి ఉంచే జాతీయవాదాన్ని ఇవి పరిహాసం చేస్తుంటాయి. దానికి వక్రభాష్యాలు వెలగబెడుతూ ఉంటాయి. చరిత్రను అవమానపరుస్తాయి. సంస్కృతిని విచ్ఛిన్నం చేయడమే ధ్యేయంగా ఉంటాయి. వలసవాదం నుంచే కాదు, దేశ ఐక్యతకూ, ఎదుగుదలకూ అంతకు మించి ప్రతిబంధకాలుగా తయారైన విదేశీ సిద్ధాంతాలు, విషతుల్యమైన వాటి ప్రభావాల నుంచి విముక్తి కావడం కూడా తక్షణ కర్తవ్యమే. భారతీయులు భారతీయులుగా ఆలోచించే సంస్కృతిని అంకురింప చేయడానికి ప్రధాని చేసిన ప్రయత్నం అభినందించదగినది. ఈ సమయంలో ఒక హిందీ న్యూస్‌ ‌చానల్‌ ఇటీవల చేసిన సర్వే గురించి ఇక్కడ ప్రస్తావించడం అప్రస్తుతం కాదు. ఈ ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రధానిగా ఖ్యాతి గడించిన వారు నరేంద్ర మోదీయేనని ఆ సర్వే తేల్చింది. తరువాతి స్థానంలో అటల్‌ ‌బిహారీ వాజపేయి నిలిచారు. ఈ ఇద్దరూ బీజేపీ దేశానికి ఇచ్చిన ప్రధానులే.

About Author

By editor

Twitter
Instagram