కరోనాను కట్టడి చేయడంలో మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం విఫలమైందంటూ వాషింగ్టన్‌ ‌పోస్ట్, ‌ది గార్డియన్‌, ‌గ్లోబల్‌ ‌టైమ్స్‌తో పాటు మరికొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు వరుస కథనాలు వెలువరించడంతో ఇక్కడి విపక్షాలు ఎన్డీయే ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే ఇదంతా చూస్తే వాస్తవాలను గాలికి వదిలేసి అంతర్జాతీయంగా మనదేశ ప్రధానిని దోషిగా నిలిపేందుకు కొన్ని వర్గాలు పడరాని పాట్లు పడుతున్నట్లుగా స్పష్టం అవుతోంది. ప్రపంచ దేశాలను తీవ్రంగా కుదిపేస్తున్న కరోనా మహమ్మారి భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతోందన్నది కాదనలేని నిజం. కానీ కరోనాను అడ్డం పెట్టుకొని దేశ ప్రతిష్టను, నాయకత్వాన్ని అప్రతిష్ట పాల్జేయాలనే కుట్రలు మాత్రం దారుణంగా ఉన్నాయి. సమస్యను మసిపూసి మారెడు కాయగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి కరోనా కట్టడిలో భారత్‌ ఇతర దేశాల కన్నా సమర్థవంతంగా పనిచేస్తోంది. మొదటి దశ నుంచి ఇప్పటివరకూ ప్రధాని మోదీ ప్రతిరోజూ పరిస్థితిని సమీక్షిస్తూ, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని, రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్నారు. జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ‌వంటివి నిర్ణయాలు కూడా అందులో భాగమే. అంతేకాదు, అగ్రదేశాలకు దీటుగా దేశీయంగా వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీ, ఉత్పత్తిని ప్రోత్సహించారు. కొవాగ్జిన్‌, ‌కొవిషీల్డ్ ‌టీకాలను మనదేశ ప్రజలకే పరిమితం చేయకుండా వ్యాక్సిన్‌ ‌మైత్రి కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాలకు అందించారు.

ప్రపంచంలో జనాభా రీత్యా రెండో పెద్దదేశం మనది. ఇంత పెద్ద దేశంలో కరోనా ముప్పును ఎదుర్కోవడం సాహసోపేతమైన చర్యగానే చెప్పాలి. అమెరికా, బ్రెజిల్‌, ‌బ్రిటన్‌, ‌ఫ్రాన్స్, ‌జర్మనీ, ఇటలీ, రష్యా తదితర దేశాలు కరోనా ధాటికి విలవిల్లాడి పోయాయి. అభివృద్ధి చెందినవిగా చెప్పే ఈ దేశాల్లో ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలడం ప్రపంచమంతా చూసింది. ఇటాంటి పరిస్థితుల్లో భారత్‌ ‌కొవిడ్‌ను దీటుగా ఎదుర్కొని దాని ముప్పును చాలావరకూ తగ్గించగలిగింది. ఒకదశలో అమెరికాకు కూడా అత్యవసర మందులు అందించి ఆదుకుంది. బ్రెజిల్‌కు కూడా ఇదేవిధమైన సాయం అందించి ప్రశంసలందుకుంది భారత్‌.

‌మొదటి దశ కరోనా సమయంలో కేంద్రం నేరుగా నిర్ణయాలు తీసుకొని దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ‌వంటి ఆంక్షలు విధించి రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారి చేసి అమలు చేయించింది. పెద్ద ఎత్తు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి తేవడంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. అయితే రాష్ట్రాల పరిధిలోని వైద్యం విషయంలో కేంద్రం పెత్తనం ఎందుకనే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో థియేటర్లు, మద్యం షాపులు, బార్లు, రెస్టారెంటులు, మాల్స్ ఇతర వ్యాపార సంస్థల మూత కారణంగా ఆదాయాలు పడిపోయి ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా కొవిడ్‌ ‌మార్గదర్శకాల అమలు నిర్ణ్ణయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రం స్వేచ్ఛనిచ్చింది. కొన్ని రాష్ట్రాల నిర్లక్ష్యం కారణంగా సెకండ్‌ ‌వేవ్‌ ‌వేగంగా విస్తరించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా లాక్‌డౌన్‌ ‌లేదా కర్ఫ్యూ విధించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంది. కానీ పరిస్థితి ముదిరే వరకూ పట్టించుకోకుండా కేంద్రాన్నే నిందించడం హాస్యాస్పదం.

వైరస్‌ ‌వ్యాప్తి కారణాలేమిటి?

కరోనా మొదటిదశ సమయంలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం వంటి ఆంక్షలు చాలా వరకూ పాటించడంతో మన దేశంపై వైరస్‌ ‌ప్రభావం పెద్దగ పడలేదు. వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజల్లో క్రమంగా నిర్లక్ష్యం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆంక్షలను చాలా వరకూ సడలించాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు, సభలు, సమావేశాల్లాంటి సామాజిక కార్యక్రమాలు తిరిగి మొదలయ్యాయి. దీంతో వైరస్‌ ‌వ్యాప్తి మరింత ఎక్కువైంది. మరోవైపు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు తప్పనిసరి. కొవిడ్‌ ‌తీవ్రత అధికంగా ఉన్న అమెరికా లాంటి దేశాల్లో కూడా ఎన్నికలు జరిగాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఎన్నికలు, ఉపఎన్నికలు జరిగాయి. ఎన్నికల సంఘాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రచార సమయంలో ఎంతో కొంత నిర్లక్ష్యం సహజం. ఎంతోమంది నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు వైరస్‌ ‌బారినపడినా ఎన్నికలే ఇందుకు కారణం అనే వాదనను పూర్తిగా సమర్థించలేం.

వ్యాక్సిన్‌ ‌వేయించుకునే విషయంలో విముఖత కూడా వైరస్‌ ‌వ్యాప్తికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. దేశ వ్యాప్తంగా దశలవారీగా వ్యాక్సినేషన్‌ ‌జరుగుతుంటే అర్హులైనవారిలో ఇప్పటికి చాలామంది టీకాలు తీసుకోలేదు. ఇందుకు కారణం అనవసరమైన ఆందోళనలు, అపోహలు. వ్యాక్సిన్‌ ‌సమర్థత విషయంలో ప్రతిపక్షాల బాధ్యతా రహిత ప్రకటనలు కొంత గందరగోళానికి దారితీశాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ వ్యాక్సిన్‌ ‌కేంద్రాలపై పడటంతో టీకాలకు కొరత ఏర్పడింది.

కరోనా రెండోదశ కేసులు ఒక్కసారిగా పెరగడంతో వైద్యరంగంపై భారం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ముందుగా హెచ్చరించి, మౌలిక సదుపాయాలకు నిధులు ఇచ్చినా పలు రాష్ట్రాలు సకాలంలో చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఒక్కసారిగా ఆక్సిజన్‌కు, రెమ్‌డెసివిర్‌లాంటి అత్యవసర ఔషధాలకు డిమాండ్‌ ‌పెరిగింది. కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్‌ ‌నిలిపివేసి మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచింది. నిరంతరాయంగా రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. సకాలంలో చేరేందుకు రైళ్లు, విమానాల సాయం తీసుకోవడంతో పాటు విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. రెమ్‌డెసివిర్‌ ఎగుమతులపై ఆంక్షలు విధించి కేవలం దేశీయ అవసరాలకే సరఫరా చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపులేదని విమర్శించేవారు కొన్ని ప్రాథమిక సత్యాలను మరచిపోతున్నారు. ఆక్సిజన్‌ ‌కోసం పూర్తిగా కేంద్రం మీద ఆధార పడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు కేంద్రం తెలంగాణ, ఆంధప్రదేశ్‌లకు చెరో అయిదు చొప్పున ప్లాంట్లను కేటాయిస్తే ఒక్కోటి మాత్రమే ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు కేంద్రం ఆక్సిజన్‌ ఇవ్వడం లేదని నిందిస్తున్నాయి. అక్సిజన్‌, ఔషధాలు పెద్దమొత్తంలో ఉత్పత్తిచేసి నిల్వ చేయలేం. వాటికి కూడా నిర్ణీత వినియోగ గడువు తేదీ ఉంటుంది. డిమాండ్‌ ‌మేరకే ఉత్పత్తి, సరఫరా చేయాల్సి ఉంటుంది.

వాస్తవాల్ని పట్టించుకోకుండా కరోనా సెకండ్‌ ‌వేవ్‌ను ఎదుర్కోవడంలో భారత్‌ ‌విఫలమయిందని అంతర్జాతీయ మీడియా దుమ్మెత్తి పోసింది. స్మశానాల్లో కాలుతున్న శవాలు, అంబులెన్స్‌లలో శవాల దృశ్యాలను అతిగా చూపడం ద్వారా అమానవీయాన్ని ప్రదర్శించింది. ఈ వార్త్తా కథనాలు భారత్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేస్తూ సుద్దులు చెబుతున్నట్లుగా కనిపిస్తున్నా అంతర్లీనంగా దుష్ప్రచారమే ఎక్కువ కనిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీని దోషిగా చూపేందుకు చేస్తున్న ప్రయత్నాలని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కథనాలను మన దేశీయ మీడియా కూడా ప్రస్తావిస్తూ ‘ప్రపంచ మీడియా బోనులో మోదీ!’ అంటూ శీర్షికలు పెట్టి వార్తలను రాశాయి. కానీ కేంద్ర ప్రభుత్వం తీసు కుంటున్న చర్యలను మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.

అయితే అంతర్జాతీయ మీడియా సంస్థలు భారత్‌తో పాటుగా తమ దేశంలోని పరిస్థితులను కూడా బేరీజు వేసుకుంటే ఎవరు సమర్థవంతంగా పని చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. భారత్‌తోపాటు కరోనా తీవ్రత అధికంగా ఉన్న కొన్ని దేశాలు పోల్చి చూద్దాం. అవన్నీ అభివృద్ది చెందిన దేశాలే. దేశాల జనాభా, కరోనా కేసులు, మరణాలను గమనించండి.

అమెరికా జనాభా 32.82 కోట్లు కాగా అక్కడ 33.22 లక్షల కొవిడ్‌ ‌కేసులు వెలుగు చూశాయి. అంటే 10.12 % మంది కరోనా బారిన పడ్డారు. 5,91,514 మంది మరణించారు. మొత్తం మరణాల శాతం 1.7%. బ్రిటన్‌ ‌జనాభా 6.66 కోట్లు కాగా 44,21,850 కేసులు (6.63%). మరణాలు 1,27,539 (2.88%) నమోదయ్యాయి. బ్రెజిల్‌ ‌జనాభా 21.10 కోట్లు. కేసులు 14,791,434 (7.01%). మరణాలు 4,08,829 (2.7%). ఫ్రాన్స్ ‌జనాభా 6.71 కోట్లు. కేసులు 56,56,007 (8.42%). మరణాలు 1,05,130 (1.85%). ఇప్పుడు భారత్‌ ‌విషయానికి వద్దాం. మనదేశ జనాభా 136.64 కోట్లు. నమోదైన మొత్తం కేసులు (మే 3 నాటికి) 2,02,75,543 (1.4%). మరణించిన వారి సంఖ్య 2,22,383 (1.09%). ఈ గణాంకా లన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తే ఇతర దేశాలతో పోలిస్తే మనదేశ పరిస్థితి చాలా వరకూ మెరుగనే చెప్పక తప్పదు. విదేశీ మీడియా విమర్శించాలంటే ముందు తమ దేశాలను, భారతదేశ పరిస్థితులను కలిపి చూడాలి. ఎక్కడ భారతదేశం విఫలమైనట్లు? ఎక్కడ వారి దేశాలు మెరుగ్గా ఉన్నట్లు? కుప్పకూలింది వారి దేశాల ఆరోగ్య వ్యవస్థలా? భారతదేశ ఆరోగ్య వ్యవస్థా?

ఇంకా లోతుగా చూస్తే మనదేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో చేపడుతున్న చర్యలు అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గానే ఉన్నాయి. ఉదాహరణకు కర్ణాటక జనాభా 6.41 కోట్లు. ఇంచుమించు ఫ్రాన్స్ ‌జనాభా 6.71 కోట్లు) ఇంతే. కర్ణాటకలో కొవిడ్‌ ‌కేసులు 4,21,456 (మే 3) కాగా ఫ్రాన్స్‌లో 56, 56,007 కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌ ‌జనాభా 6.27 కోట్లు. బ్రిటన్‌ ‌జనాభా 6.66 కోట్లు. గుజరాత్‌లో 1,46,818 కేసులు నమోదైతే బ్రిటన్‌లో 44,21,850 యాక్టివ్‌ ‌కేసులున్నాయి. భారత్‌లో ఆరోగ్య వ్యవస్థ దెబ్బతిన్నదని చెబుతున్న బీబీసీ తమ దేశంలో పరిస్థితికి ఏం సమాధానం చెబుతుంది?  టైమ్స్, ‌ది గార్డియన్‌ ఏం ‌చెబుతాయి? అత్యధిక కొవిడ్‌ ‌కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర (6,70,459 కేసులు) కన్నా అమెరికాలోని కాలిఫోర్నియా (37,47,850), టెక్సస్‌ (29,06,174), ‌ఫోర్లిడా (22,45,853), న్యూయార్క్ (21,04,544) ‌రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? న్యూయార్క్ ‌టైమ్స్, ‌వాషింగ్టన్‌ ‌పోస్ట్ ‌పత్రికలకు ఈ విషయం తెలియదా? జనాభా ఎక్కువగా ఉన్న భారతదేశం అగ్రదేశాల కన్నా సమర్థవంతంగా పని చేస్తోందని, అక్కడికన్నా మెరుగైన ఆరోగ్య వ్యవస్థలు మనకు ఉన్నాయని చెప్పేందుకు ఈ గణాంకాలే చక్కని ఉదాహరణలు.

ఇక భారతదేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, హరిద్వార్‌ ‌కుంభమేళాకు కొవిడ్‌ ‌విజృంభణకు లింక్‌ ‌పెట్టడం మరో దారుణం. దేశంలో సెకండ్‌ ‌వేవ్‌ ‌విజృంభించడానికి ముందే ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదలైంది. ఆ సమయంలో కొవిడ్‌ ‌కేసులు తగ్గుముఖం పట్టాయి. దురదృష్టవశాత్తు పోలింగ్‌ ‌నాటికి సెకండ్‌ ‌వేవ్‌ ‌తీవ్రత పెరిగింది. ప్రధానమంత్రి కరోనా విషయంలో జాగ్రత్తలను వదిలేసి ఎన్నికల ప్రచారం మీద దృష్టిపెట్టారని విపక్షాలు, మీడియాలోని ఒక వర్గం దుష్ప్రచారం మొదలు పెట్టింది. విచిత్రం ఏమంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోనే కొవిడ్‌ ‌తీవ్రత తక్కువ ఉంది. మహారాష్ట్ర, గుజరాత్‌, ‌ఢిల్లీ, కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు లేకున్నా అక్కడే కేసులు ఎందుకు ఎక్కువ ఉన్నాయి? కుంభమేళాకు వచ్చే ప్రతి భక్తుడికీ కొవిడ్‌ ‌పరీక్షలు జరిగాయి. పాజిటివ్‌ ఉన్నవారిని తిప్పి పంపారు. అయిన్పటికీ కుంభమేళా కారణంగా కొవిడ్‌ ‌విజృంభిస్తోందనే ప్రచారం సాగించారు. కుంభమేళాలో పాల్గొన్న భక్తులు, సాధువులకు ఎంత మందికి కొవిడ్‌ ‌సోకింది అనే గణాంకాలను మాత్రం ఈ వ్యతిరేకశక్తులు ఎక్కడా చెప్పవు! అయినా కొవిడ్‌ ‌తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి విజ్ఞప్తి మేరకు సాధుసంతులు ముందుగానే కుంభమేళాను ముగించారు. కష్టకాలంలో దేశంలోని రాజకీయ పార్టీలు, సంస్థలు ఏకతాటిపై నిలవాలి. అంతేకానీ కేంద్ర ప్రభుత్వంపై ఉన్న ద్వేషాన్ని ప్రదర్శించేందుకు ఇది సరైన సందర్భం కాదని గుర్తుంచుకోవాలి.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram