‘ఇవాళ బెంగాల్‌ ఏమి ఆలోచిస్తుందో, రేపు భారతదేశం అదే ఆలోచిస్తుంది’… ఇలాంటి ఉల్లేఖనకు సంతోషించాలో, సిగ్గుతో కుంగిపోవాలో తెలియని పరిస్థితిలో నేడు భారతీయులు ఉన్నారు. గత కాలపు బెంగాల్‌ ‌దేశానికి ‘వందేమాతరం’ నేర్పింది. జనగణమన అంటూ జాతీయగీతం పాడించింది. మాతృభూమికి విధేయంగా ఉండడం నేర్పింది. బంకింబాబునీ, రవీంద్రుడినీ, వివేకానందుడినీ, అరవిందుడినీ, సురేంద్రనాథ్‌ ‌బెనర్జీనీ, బోస్‌నీ.. ఇంకా ఎందరినో ఇచ్చింది. ఇందుకు భారతీయులంతా సంతోషిస్తున్నారు. కానీ ఇవాళ (పశ్చిమ) బెంగాల్‌ ఆలోచిస్తున్న తీరులో రేపు కాదు, ఎప్పటికీ ఈ దేశం ఆలోచించదని కచ్చితంగా చెప్పవచ్చు. ఇలా ఆలోచించిన దాలాలు చరిత్రలోనూ లేవు. ఇందుకు కచ్చితంగా సంతోషించవలసిందే. కానీ, మొన్నటి ఎన్నికల తదనంతర హింస, అక్కడి అధికార టీఎంసీ వైఖరి, జాతీయ మానవహక్కుల కమిషన్‌ ‌మీద దాడి, పాలకుల నోటి దురుసు గమనిస్తే అంత గొప్ప బెంగాల్‌ ఎం‌తటి నీచుల చేతికి చిక్కిందో గమనిస్తే, ఆ నీచత్వం సాగిస్తున్న రాజకీయం చూస్తే సిగ్గుతో కుంగిపోక తప్పదు.

మా మీద లైంగిక అత్యాచారం జరిగిందంటూ ఇద్దరు మహిళలు సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానంలో భోరున విలపిస్తే, అదంతా కట్టుకథేనంటూ అడ్డగోలు వాదనకు దిగిన మహిళా ముఖ్యమంత్రి అక్కడి గద్దె మీద అఘోరించడం ఈ దేశ నేటి దౌర్భాగ్యం. 7000 మంది మహిళల మీద లైంగిక అత్యాచారాలు జరిగాయని ఒక నిజ నిర్ధారణ సంఘం ఆరోపించినా కాస్త కూడా చలనం లేని ముఖ్యమంత్రిని చూడవలసిరావడం రాజ్యాంగకర్తల ఆత్మలను వేధించే పరిణామమే. ఎన్నికల సమయంలో, తదనంతరం 15,000 హింసాత్మక ఘటనలు జరిగాయని నిజ నిర్ధారణ సంఘం చెబుతోంది. ఇందుకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని కలకత్తా హైకోర్టు కూడా చెప్పింది. అయినా… అయినా.. ఏమీ జరగలేదని వాదిస్తూ దున్నపోతు మీద వర్షం కురిసినట్టు అన్న సామెత కూడా సిగ్గుతో చచ్చిపోయే విధంగా వ్యవహరిస్తున్న పాలకులు ఆ రాష్ట్రానికి దాపురించడం ఎంత విషాదం! స్వతంత్ర భారతం ఎన్నో ఎన్నికలు చూసింది. వాటిలో అఘాయిత్యాలనూ చూసింది. కానీ నేటి రికార్డుకు అవేమీ దరిదాపులకు రాలేవు. దీనికి తలదించుకోవలసింది పోయి, ఇప్పటికి అదే అరాచకత్వం, అదే రాక్షసత్వం, అదే గూండాగిరీ కొనసాగ•డానికి వీలైన తీరులోనే ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

ఎన్నికలు, ఫలితాల నేపథ్యంలో చెలరేగిన హింస, అందులో పోలీసుల ఉదాసీన తల మీద దర్యాప్తు కోసం వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) బృందానికి ఎదురైన ఘోర అవమానం ఎలాంటిది? ఎలాంటిదో హైకోర్టు రాష్ట్ర అధికారులకు వేసిన మొట్టికాయలే చెబుతాయి. ఆ బృందానికి రక్షణ కల్పించడంలో విఫలమైనందుకు ఎందుకు చర్యలు తీసుకొనకూడదో సంజాయిషీ ఇవ్వవలసిందని డిప్యూటీ పోలీస్‌ ‌సూపరింటెండెంట్‌ (‌దక్షిణ కోల్‌కతా) రషీద్‌ ‌మునీర్‌ఖాన్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు జూలై 2న తాఖీదు ఇచ్చింది. నిజానికి ఇది కోర్టు ధిక్కార తాఖీదు. జాతీయ మైనారిటీ కమిషన్‌ ఉపాధ్యక్షుడు, ఎన్‌హెచ్‌ఆర్‌సి ఏడుగురు సభ్యుల బృందంలో ఒకరు ఆతిఫ్‌ ‌రషీద్‌ ‌మీద జూన్‌ 29‌న జాదవ్‌పూర్‌ ‌దగ్గర దొంపారాలో జరిగిన దాడికి సంబంధించి హైకోర్టు ఈ నోటీసు ఇచ్చింది.కోర్టు ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ ‌బ్యూరో మాజీ అధిపతి రాజీవ్‌ ‌జైన్‌ ‌నాయకత్వంలో దర్యాప్తు బృందం ఏర్పాటయింది. చిత్రం ఏమిటంటే, జాదవ్‌పూర్‌లో జరిగినదాని గురించి నివేదిక అందిందని, కొంతమంది ఆతిఫ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారనీ, కొందరు మద్యం మత్తులో ఉన్నారనీ మునీర్‌ఖాన్‌ ‌తేల్చిపడేశారు. రాజ్యాంగ బాధ్యత నిర్వర్తిస్తున్న ఒక బృందం మీద జరిగిన అంతపెద్ద దాడిని చెదురుమదురు ఘటనగా చూపాలన్న ప్రయత్నమే ఇందులో కనిపిస్తుంది.ఇలాంటి ధిక్కార నోటీసులు కొందరు కలెక్టర్లకు, పోలీసు ఉన్నతాధి కారులకు కూడా వెళ్లాయి. ఎన్నికల అనంతర హింస గురించి దర్యాప్తు చేయడానికి పర్యటిస్తున్నట్టు ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయలేదని ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం కోర్టుకు తెలియచేసింది. ప్రధాన న్యాయమూర్తి రాజేశ్‌ ‌బిందల్‌ ‌నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందానికి రక్షణ కల్పించాలని జూన్‌ 18‌న ఆదేశాలు ఇచ్చినా, అవి గాలికి కొట్టుకుపోయాయి. కానీ ఎన్‌హెచ్‌ఆర్‌సీ వారికి పోలీసు బందోబస్తు ఏర్పాట యిందని అడ్డంగా అబద్ధం ఆడాడు మునీర్‌ఖాన్‌. ఇక ముఖ్యమంత్రి మమత వైఖరి ఈ పోలీసు అధికారి వైఖరి కంటే నీచం. జాదవ్‌పూర్‌లో ఏం జరిగింది? ఏమీ జరగలేదు. లాఠీచార్జి జరిగిన తరువాత ప్రజలు ఆందోళన చేశారు. ప్రజలనెందుకు కొట్టాలి? ఇదీ జూలై 1న ఆమె అన్నమాట. ఆ మరునాడే హైకోర్టు ఎన్‌హెచ్‌ఆర్‌సి ఇచ్చిన తాత్కాలిక నివేదిక మేరకు, ‘హింసాకాండ నిజమని చెప్పే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ఈ వాస్తవాన్ని మొదటి నుంచి నిరాకరిస్తూ అవాంఛనీయ పరిస్థితిని నివారించడంలో ప్రభుత్వం విఫలమైంది.ఈ హింసలో చాలామంది చనిపోయారు, లైంగిక హింసకు గురయ్యారు. క్షతగాత్రులయ్యారు. మైనర్‌ ‌బాలికలను కూడా వదిలిపెట్ట లేదు’ అని కోర్టు నిర్ధారించింది. ఇవన్నీ మే 2 తరువాత బీజేపీ వెల్లడించిన వాస్తవాలు కావా?

టీఎంసీ గూండాల నాయకత్వంలో బంగ్లా వలసదారులు, రోహింగ్యాలు, ముస్లిం మతోన్మాదులు యథేచ్ఛగా సాగిస్తున్న ఈ రక్తపాతానికి మమత అంగీకారం నిజం. బీజేపీ జాతీయ అధ్యక్షుడి మీద దాడి మొదలు ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం మీద దాష్టికం వరకు ఇదే రుజువు చేస్తున్నాయి. కాబట్టి తీవ్ర చర్యల గురించి కేంద్రం ఆలోచించాలి. ఎందుకంటే ఆమె ఈ హింసాకాండను నివారించలేరు. అంత పోటీలోనూ గెలిపించినందుకు ఆ నెత్తుటి మూకలు ఆమె నుంచి ఆశించిన కృతజ్ఞత, ప్రత్యుపకారం ఇవే మరి!

About Author

By editor

Twitter
Instagram