నవంబర్‌ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగనున్నది. రాజకీయ పార్టీలు/వాటి అభ్యర్థులు ప్రచారంలో తీవ్రంగా పోటీ పడుతున్నారు. అమలుకు నోచుకోని హామీలు, ఉచితాలు, ఆర్థిక ప్రలోభాలు ప్రకటిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. హామీల హోరుకు, పాటలకు ఓటర్లు ప్రభావితం కాకుండా ఉత్తమ అభ్యర్ధిని ఎన్నుకోవడంలో విజ్ఞత ప్రదర్శించి, తమ ఓటు హక్కును  సద్వినియోగపరుచుకోవాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలి.

ఎన్నికలంటే నాయకులకే పరిమితమైనవను కుంటూ, సాధారణ పౌరులు వాటి పట్ల బాధ్యతగా ఉండకపోవడం వల్ల, అవినీతిపరులు చట్టసభలకు ఎన్నికవుతున్నారు. సంపాదనకు రాజకీయాలు మార్గమైనాయి. దోచుకో దాచుకో అన్న తీరులో పాలన మారింది. మధ్య తరగతి, బీసీ, బడుగు బలహీనర్గాలను చట్టసభల్లో ప్రవేశించకుండా అడ్డుకునే వికృత రాజకీయం కొనసాగడం శోచనీయం. బ్రిటిష్‌ పాలన విముక్తి కోసం పోరాడిన భారతీయులు  స్వాతంత్య్రానంతరం చట్టసభలకు జరిగే ఎన్నికల్లో ఉదాసీన వైఖరి అవలంభించడం వల్ల అవి నేరపూరిత మవుతున్నాయి. ఒక వ్యవస్థ భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపుతాయి.

ఎన్నికలలో కొన్ని పార్టీలు గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఫలితంగా పార్టీ కోసం పనిచేసినవారు, ప్రజా ఉద్యమాలు చేసిన త్యాగశీలురు, సిద్ధాంత నిబద్ధత కలిగిన నేతలకు టికెట్లు దక్కడం లేదు. దీనితో రాజకీయాలంటే ధనబలం, కండబలం కలిగినవారికే అన్న అభిప్రాయం స్థిరపడుతోంది.ఇటీవలి కాలంలో  అసెంబ్లీలకు ఎన్నికైన కొందరి వ్యక్తులలో విపరీత పోకడలను చూడవలసి వస్తున్నది. వారు ప్రజల గురించి మాట్లాడుతున్న సందర్భాలు తక్కువ. తమ నేతను వారు పొగుడుతున్న తీరు జుగుప్సాకరంగా ఉంది.ముఖ్య నాయకుడినీ, వారి కుటుంబీకులనీ ఆకాశానికెత్తివేయడమే లక్ష్యంగా ఈ పొగడ్తలు సాగుతున్నాయి. దీనికి అసెంబ్లీ వేదిక కావడం అత్యంత హేయం. కనీసం ఈ ధోరణి నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం. ప్రాంతీయతను రెచ్చగొట్టేందుకు సదా సిద్ధంగా ఉంటున్నవారిని గుర్తించడం అవసరం. జాతీయ పార్టీల నేతలు వేరే ప్రాంతాల నుంచి వస్తారు. తమ పార్టీల అభ్యర్థులకు ప్రచారం చేస్తారు. అది రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కు. ఈ సంగతి మరచి ఈ రాష్ట్రం తమ సొంతం అన్నట్టు బయటివారు రాకూడదని మాట్లాడడం అసలు ప్రజాస్వామిక స్ఫూర్తికే విరుద్ధం.

మన తల రాతను మార్చేది ఎన్నికలే

వ్యవస్థకు సంబంధించిన అన్ని రంగాలను శాసిస్తూ మన జీవితాలను, భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును మార్చగలిగే సత్తా ఎన్నికలకు ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఎన్నికలంటే సమాజంలోని అన్ని వర్గాలకు సంబంధించినవి.  వాటిలో ఓటర్లు సంపూర్ణ భాగస్వాములై తమ స్థితగతులను మార్చుకునేందుకు అనువుగా మలుచుకోవాలి. నిజమైన సార్వభౌమాధికారం ఓటరు చేతిలోనే ఉంది. ఐదేళ్లకు ఒకసారి మన సేవకులను చట్టసభలకు పంపుతాం.పాలనాదక్షుడిని,  రాజ్యాంగ చట్టాల పట్ల అవగాహన, పరిజ్ఞానం, ప్రజాసంక్షేమం పట్ల నిబద్ధత ఉన్న అభ్యర్థిని ఎన్నుకొని సుపరిపాలనకు దిశ దశ నిర్ణయించాలి. అందుకే ఓటును అమ్ముకోరాదు.

ఏ పార్టీ, మన దేశాన్ని, మన ధర్మాన్ని రక్షించ డానికి కట్టుబడి ఉంది? ఏ పార్టీ లంచగొండితనంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నది? అభివృధ్ది సంక్షేమం పేరిట అమలవుతున్న పథకాల ప్రయోజనాలు అధికారంలో ఉన్న వారి కుటుంబానికి లబ్ధి చేకూరుస్తున్నాయా? అట్టడుగు వర్గాల వారి వరకు వెళుతున్నాయా? వంటి  అంశాల మీద ఓటర్లు అవగాహన కలిగి ఉండాలి. సహజవనరులు మానవవనరుల అభి వృద్ధికి ఉపయోగపడే దీర్ఘకాలిక ప్రయోజనాలకు పెద్దపీట వేసి, పేదరికం, నిరుద్యోగం తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే పార్టీకి ఓటు వేయాలి. ప్రగతి శీల సమాజ స్థాపనకు చేయూత నివ్వాలి. మన ఓటుతోనే ప్రభుత్వాలు ఏర్పడతాయి! మనం ఓటు వేసేది ఎవరికో అధికారం ఇవ్వటానికి కాదు. మన జాతి తల రాతను మార్చే ఉజ్జ్వల భవిష్యత్తు కోసం.

ఓటు వేసే ముందు గత ఎన్నికల్లో పార్టీలు ఇచ్చిన వాగ్దానాల అమలును పరిశీలించి, ఎన్నికల తాజా మేనిఫెస్టో గురించి ఆలోచించాలి. పార్టీల మేనిఫెస్టో అంశాలు నిర్ణీత పదవీ కాలంలో అమలు అవుతాయా? లేదా? తెలుసుకోవాలి. అవి మొత్తం ఆర్థిక వ్యవస్థను ముంచేవిగా ఉంటే మనను మనం ప్రశ్నించుకోవాలి. రాజకీయాల పట్ల, ఎన్నికల పట్ల,  ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు ఆసక్తి, అవగాహన కలిగి ఉండాలి. మనం క్రియాశీలక రాజకీయాలలో లేకపోయినా రాజకీయాల తీరుతెన్నులు  తెలుసు కోవటం అందరికి అవసరం.

ఓటు నిశ్శబ్ద విప్లవం

వెగటు పుట్టిస్తున్న ధన రౌడీ రాజకీయాల వల్ల పరువు కోల్పోతున్న ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయడానికి తమ ఓటు హక్కు వినియోగించాలి. అవినీతి అక్రమాల చెరలోంచి జనస్వామ్యానికి స్వేచ్ఛ ప్రసాదించే ప్రజా ఉద్యమానికి విజ్ఞత గల ఓటర్లు నేతృత్వం వహించాలి. ఓటు బుల్లెట్‌ కంటే బలమైంది. ఓటు ఒక నిశ్శబ్ధ విప్లవం. ఓటే మన ఆయుధం! దానితోనే మనం పోరాడాలి. మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి! మన బతుకులు మనం చక్కపరచుకోవాలి!

ఎన్నికల్లో ప్రతి ఓటరు క్రియాశీలక భాగస్వామి కావాలి. ఓటింగులో తప్పని సరిగా పాల్గొనాలి. ఇతర ఓటర్లను, యువతను తమ ఓటు హక్కు వినియోగించుకో వలసిందిగా ప్రోత్సహించాలి. పోటీ చేసే అభ్యర్థుల గుణ గణాలు వారి సామాజిక సేవా అంశాల మీద విరివిగా చర్చించాలి. మన కులం వాడని, మన జిల్లా వాడని, మన ప్రాంతం వాడని భావించకుండా వాటికి అతీతంగా దేశ, రాష్ట్ర  ప్రయోజనాల పట్ల గౌరవం ఉన్నవారిని వారిని ఎన్నుకోవాలి.

ఓటర్లు నిర్లక్ష్యాన్ని, నిర్లిప్తతను సోమరితనాన్ని విడనాడి ఓటింగులో చురుకుగా పాల్గొనాలి. తమ ఓటు ద్వారా ప్రభుత్వ నిర్మాణం జరుగుతుందనే వాస్తవాన్ని మరువద్దు. ప్రజాస్వామ్య రక్షణ ప్రతి ఓటరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి. ప్రజాస్వామ్యాన్ని జనస్వామ్యంగా మార్చే ప్రక్రియలో ఓటర్లదే తుది తీర్పు. ఓటు పదునైన ఆయుధం. దీన్ని ఏవిధంగా సంధిస్తే మన జీవితాలు మారుతాయనేది ఆలోచించాలి. ఏమైనా మనం వేసే ‘ఓటు కోహినూర్‌’ వజ్రం కంటే అత్యంత విలువైనది. ఓటు ఓ గొప్ప మార్పునకు సంకేతం. ఓటు ప్రగతికి మేలుకొలుపులా ఉండాలి. మనం తవ్వుకున్న గోతిలో మనం పడకూడదు. ఓటు ఖరీదు వేలల్లో పలుకుతున్నది. అంటే ఓటుకు ఆ డబ్బు ఇచ్చినవాడు రేపు చట్టసభలోకి వెళ్లి కోట్లు గడిరచకుండా ఉంటాడని అనుకోలేం. అదే వాస్తవాన్ని చూస్తున్నాం. అక్రమ సంపాదనతో ఓటు కొనుక్కుని, ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేసేవారి పట్ల తస్మాత్‌ జాగ్రత్త.

నేదునూరి కనకయ్య

అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్‌ ఫోరం, కరీంనగర్‌

About Author

By editor

Twitter
Instagram