‘నన్ను నెఱఁగరో! యీ తెల్గునాట మీరు

విశ్వనాథ కులాంబోధి విధుని బహు వి

చిత్ర చిత్ర ధ్వని బహు విచ్ఛిత్తి మన్మ

హాకృతి ప్రణీత సత్యనారాయణ కవి’

అని విశ్వనాథ వారే  ‘త్రిశూలము’ అనే తన నాటకంలో రాసుకున్నారు. తెలుగు సాహిత్యచరిత్రలో ఆయనదో స్వర్ణపుట. సాహిత్యంలో సర్వతోముఖ సమర్థత కలిగినవారు అరుదు. గద్యం, పద్యం, నాటకం, నాటిక, వ్యాసం, నవల, నవలిక, కథ, కథానిక, విమర్శ- ఇన్ని రంగాలలో అందె వేసిన చేయి వారిది.  ఆధునికతను ఆస్వాదించరని విమర్శ ఉంది. ఇది నిజం కాదు. ఆయనకు పాశ్చాత్య సాహిత్యం పట్ల గౌరవం ఉంది. పక్రియలపై ఆసక్తి ఉంది. షేక్‌స్పియర్‌, ‌షెల్లీ, మిల్టన్‌ ‌వంటి వారి కవిత్వాన్ని ఆసాంతం పరిశీలించినవారు. శిల్పం, సాహిత్యం జాతీయమై ఉండాలి కానీ విజాతీయమై ఉండరాదనేది ఆయన భావన. సముద్రంపై పక్షి ఎంత ఎగిరినా రాత్రికి గూటికెలా చేరుతుందో అలాగే  మన జాతీయత, సంప్రదాయాలను కాపాడుకోవాలనుకోనేవారాయన. కనుకనే ‘విశ్వనాథకృతిలో వారిదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుందని’ జి.వి. సుబ్రహ్మణ్యం అంటారు. ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాథ ఓ విరాణ్మూర్తి.

కవిసమ్రాట్‌ ‌విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబర్‌ 10, 1895-అక్టోబర్‌ 18,1976) ‌కృష్ణా జిల్లా నందమూరులో జన్మించారు. విజయవాడలో విద్యాభ్యాసం. కరీంనగర్‌ ‌కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఆంధప్రదేశ్‌ ఆస్థానకవి పదవిని అలంకరించారు.తెలుగులో తొలి ‘జ్ఞానపీఠ్‌’ ‌గ్రహీత (రామాయణ కల్పవృక్షం). కళాప్రపూర్ణ, పద్మభూషణ్‌ ‌వంటి అవార్డుల గ్రహీత. వివిధ విద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. తల్లి పారమ్మ, తండ్రి శోభనాద్రి. భార్య వరలక్ష్మమ్మ.

20వ శతాబ్ద తెలుగు సాహిత్యానికి, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యానికి విశ్వనాథ పెద్ద దిక్కు. ‘నేను వ్రాసిన పద్యముల సంఖ్య, ప్రకటింపబడిన సంఖ్య సుమారు ఇరువది వేలుండవచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును.’ అని ఆయనే చెప్పుకున్నారు. కానీ…‘ఆయన వ్రాసినది లక్ష పేజీలు ఉండవచ్చు’నని శ్రీశ్రీ లాంటివారు చెబుతారు. ఆయన భాషణంలో, భూషణంలో ఓ వైలక్షణ్యం వెల్లివిరుస్తుంది.

2

విశ్వనాథ వారి సాహిత్య విరాట్‌ ‌స్వరూపం ఎంత వర్ణించినా తక్కువే. ప్రతి రచనలోనూ ఆయన కనిపిస్తారు. కవిత్వంలో ప్రకృతి రామణీయకతలో ఆయన మమైకత్వం ‘కడిమి పూచినదో లేక చిగిర్చినదో యంచు/తొంగి చూచినది విద్యుల్లతాంగి…’ అనే కవితా పంక్తులలో కనిపిస్తుంది. బాహ్య ప్రకృతి మబ్బు తెరల్లోని విద్యుత్‌ ‌మెరుపుతీగ తొంగి చూసేసరికి దేదీప్యమానంగా వెలిగిన రూపాన్ని ఆయన పై పంక్తిలో అక్షరాలతో ‘వెలిగిస్తారు.. నా కవితనే విశాల జఘనా! ఒక యౌచితలేద భాషలే/దాకృతివేద, యూరుకరసాత్మతనే స్రవియించిపోదు…’ అని విశ్వనాథవారే చెప్పుకున్నా ఆయన సృష్టిలో ఔచితి, భాష, ఆకృతి అన్నీ తమంతటతామే సన్నివేశంలో ఇమిడిపోతాయి.

విశ్వనాథ వారిని ఎక్కువమంది సంప్రదాయవాది గానే చూస్తారు కానీ… ఇది తప్పు. ఆయన గొప్ప మానవతావాది. సంప్రదాయంలో మానవతను గుర్తించిన మహోన్నత సాహితీమూర్తిమత్వం ఆయనది. ‘వేయిపడగలు’లో ధర్మారావు పాత్ర ఒక్కటి చాలు ఇందుకు ఉదాహరణ. ఆయన లక్ష్యం మానవులందరికి తిండి, బట్ట, గూడుకు లోటు లేకుండటమే! ఆయన రచనల్లో ‘లోచూపు’ను గమనించిన వారికి ఇది అవగతమవుతుంది. ‘కల్పవృక్షం’లో కూడా ఆయన ఈ దృష్టి కోణాన్ని దాటిపోలేదు. సాంస్కృతిక పునాది మీద రాజకీయ, సామాజిక, ఆర్ధిక వ్యవస్థలు పునర్నిర్మించుకోవాలని తన ప్రతి రచనలోనూ చాటి చెప్పారు. అందుకు అనుగుణమైన వ్యవస్థల నిర్మాణం అవసరమన్నారు. వాటి నమూనాలను రచనల్లో చూపించారు. బ్రిటిష్‌ ‌వారి రాక వలన స్వయంపోషక శక్తి కలిగిన గ్రామీణ వ్యవస్థ క్రమంగా క్షీణించసాగింది. దాని స్ధానంలో కృత్రిమ దోపిడీ• వ్యవస్థ ప్రారంభమయింది. ఇదీ విశ్వనాథ వారు కలం పట్టిన నాటి• సామాజిక చిత్రం. సాహితీవేత్తగా తన గమ్యం తానే నిర్దేశించుకున్నారు. కవిత, కథ, నవల, నాటిక ఏది రాసినా ఈ పరిధిని అతిక్రమించలేదు. ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టం కాని వేళ దేశ ప్రగతి సాధ్యం కాదు. తెరచిరాజు, వీరవల్లడు, వీరపూజ, వేయిపడగలు, సముద్రపు దిబ్బ, కోకిలమ్మ పెళ్లి, వల్లభమంత్రి, దమయంతీ స్వయంవరం వంటి రచనలు ఇందుకు నిదర్శనాలు. నాటి ఆంగ్లేయుల పాలనలో క్షీణించిన గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు జవసత్యాలు కలిగించాలన్న ఆయన ఆశలు, ఆశయాలు పై రచనల్లో కనిపిస్తాయి. విశ్వనాథ అభ్యుదయవాదా? సంప్రదాయవాదా అనేది ఆయన రచనలను సంపూర్ణంగా చదివి, ఆవాహన చేసుకొని నిర్ణయించుకోవాలి. ‘కుమారాభ్యుదయం’లో కులవృత్తులకు, కుటీర పరిశ్రమలకు జవసత్వాలు కలిగించాలంటారు.

3

విద్యను గూర్చి కూడా విశ్వనాథ ఒక స్పష్టమైన అవగాహనను కలిగి ఉండేవారు. ‘వేయిపడగలు’ నవలలో, ‘విద్య ప్రధానంగా రెండు విధములు. ఒకటి వృత్తి విద్య, రెండవది జ్ఞానము కొఱకు చదువు విద్య…. వృత్తి విద్య జీవనాధారమైనది. జ్ఞానము కొఱకు విద్య మానసి హృదయమునకు సంస్కారము ఇచ్చుటకేర్పడినది’ అని వివరిస్తారు. కానీ… వర్తమానంలో విద్య మార్కులకు, ర్యాంకులకు పరిమితమయింది. ఇంగ్లిష్‌ను చిన్నతనం నుంచే రుద్దుతున్న నేటి కాలం వారికి ‘మాతృభాష తెలుగు చక్కగా వచ్చిన తరువాత నా భాష చెప్పింపుము…. బుద్ధి వికసించిన తరువాతనే భాషయైనను తొందరగా వచ్చును’ అని హితవాక్యం చెబుతారు. పాఠ్య గ్రంథాలలోని అవకతవకలు, ఉపాధ్యాయులు, విద్యార్థ్ధులలోని అకారాలు, వికారాలు, పరీక్షల విధానంలో లోపాలు వంటి వాటితో పాటు ఏ భాషా స్వభావాన్ని ఆ భాషలోనే బోధించాలనే అంశాలను ‘విష్ణుశర్మ ఇంగిలీషు చదువు’, ‘హాహాహుహు’ అనే హస్య నవలల్లో వివరించారు. విశ్వనాథ వారు ‘నర్తనశాల’ ‘వేనరాజు’ ‘త్రిశూలం’ ‘అనార్కలి’ వంటి విషాదాంత నాటకాలను కూడా రాశారు. ‘షేక్‌స్పియర్‌ ‌నాటకాల్లో నాలుగు రకాల ట్రాజెడీస్‌ ఉన్నాయి’. విశ్వనాథ వారివి నాలుగు ట్రాజెడీస్‌ ఉన్నాయి అంటారు జి.వి.సుబ్రహ్మణ్యం.

తెలుగులో తొలి జ్ఞానపీఠ్‌ ‌పురస్కార గ్రహీత కవిసమ్రాట్‌ ‌విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘రామాయణ కల్పవృక్షం’ తెలుగు సాహితీలోకంలో నిత్య సువాసనలు వెదజల్లె పారిజాతం. ఈ కావ్యం విశ్వనాథ వారి ‘మానసపుత్రి’గా చెప్పవచ్చు. అనువాదమనే అవివేకులున్నారు. కానీ… ఇది కవిసమ్రాట్‌ ‌సాహితీ ‘స్వేచ్ఛా ప్రియపుత్రి’… కావ్యంలో ప్రతీ సందర్భంలోనూ కవి తనదైన తాత్త్వికతను నిండుగా ప్రదర్శించిన విధానం గమనించవచ్చు. దశరథుని ముగ్గురు భార్యలను పరిచయం చేస్తూ

‘కౌసల్య ముక్తికాంతీ సమానాకార

నలి సుమిత్రయుపాసనా స్వరూప

విజయ రమాకార వినయాంబుధి సమిత్ర

కైకేయి మధుసామగానమూర్తి

కౌసల్య నవశరత్కాల మందాకిని

సితపుండరీకంబుశ్రీసుమిత్ర

మందార పుష్పంబు మహిళామణి సుమిత్ర

కైకేయి నునునల్ల కల్పపూవు…’ అని ఒకరితోనొకరిని పరిచయం చేస్తూ, పోలుస్తూ, వారి గుణగణాలను రూపు రేఖావిలాసాలను వర్ణించిన విధం ఒక్కటి చాలు విశ్వనాథ వారి పాండిత్యానికి జోహార్లు అర్పించటానికి. రాముని గురించి కైకకు బాగా తెలుసునంటారాయన. రాముడు భవిష్యత్తులో ‘దైత్య సంహారగాథా పాండిత్య సముద్రమూర్తి’ కాగలడని ఆమె విశ్వాసం. కనుకనే అతనికి చాప విద్య నేర్పింది.

4

ఆ విశ్వాసంతో అతనిని అడవికి పంపింది. ఆమెకు కావలసినది భరతుడు రాజు కావడం కాదు. రాముడు అడవికి వెళ్లడం. రామునికి కావలసినది కూడా అదే! రామాయణ కల్పవృక్షం చదివిన తరువాత పఠిత మరొక ప్రపంచంలోనికి వెళ్లడం ఖాయం. అందులోని మెరుపులు, చమత్కారములు, మలుపులు, ఆశ్చర్యపూరిత వర్ణనలు, రాక్షసులు సహితం రాముని రాక కోసం చూసే ఎదురుచూపులు వీటిని విశ్వనాథ వారు వర్ణించిన తీరు, భాషా విరుపులు ఓ మధురానుభూతిని కలిగిస్తాయి. తెలుగుభాష పట్ల మమకారం పెంచుతాయి. ‘‘నేను ఏమి వ్రాస్తానో నేను తెలుసుకొని వ్రాస్తాను. అనాది నుండి ఈ దేశంలో ఒకటి జ్ఞానం అనిపించుకుంటూ వస్తున్నది. ఆ జ్ఞానం నా పాఠకులకు కల్పించి, నేను సఫలుణ్ణయి, వాళ్లను జ్ఞానవంతులను చేస్తున్నాను అనే భావం నాకు ఉన్నది. ఈ భావం ఉన్న వాళ్లు చాలామంది ఉన్నారని నాకు తెలుసు…’ అని చెప్పుకొన్న విశ్వనాథ వారు ప్రాచీనాంధ్ర కవుల ప్రమాణాలను గౌరవిస్తూనే తనదైన మహా కావ్య రచన చేసిన నవ్య సంప్రదాయ యుగచైతన్యమూర్తి.

– భమిడిపాటి గౌరీశంకర్‌, 949858395

About Author

By editor

Twitter
Instagram