భారతదేశంలో రైతుల బలవన్మరణాలు చూడవలసి రావడం పెద్ద విషాదం. బ్రిటిష్‌ ఇం‌డియా రైతులను పట్టించుకోలేదు. బెంగాల్‌ ‌కరవు వంటి ప్రపంచ చరిత్రలోనే పెద్ద విషాదంలో రైతులోకం కుంగిపోయింది. స్వతంత్ర భారతదేశంలో ఆధునిక సేద్య విధానాలు, రసాయనాలు, ఎరువులు రైతును బలవన్మరణాల పాల్జేస్తున్నాయన్నదీ వాస్తవమే. రసాయనాలు, ఎరువులతో వ్యయం పెరిగిపోతోంది. ఆశించిన మేర దిగుబడి లేదు. అప్పులే మిగులుతున్నాయి. దీనికి తగ్గట్టు చాలా ప్రభుత్వాలు రైతును పట్టించుకోలేదంటే అతిశయోక్తి కాదు. ఇది చాలదన్నట్టు రసాయనాలు, కృత్రిమ ఎరువులతో రైతులు చితికిపోతున్నారు. ఆ దిగుబడి తింటున్నవాళ్లు ప్రాణాంతక వ్యాధుల పాలబడుతున్నారు. అన్నింటికి మించి పర్యావరణానికి, పుడమికి అపారమైన చేటు జరుగుతున్నది. ఈ పరిస్థితి మార్చడానికి కంకణం కట్టుకున్న స్వచ్ఛంద సంస్థ ఏకలవ్య ఫౌండేషన్‌. ‌పదిహేనేళ్లుగా వ్యవసాయం, జీవనోపాధులు, సేంద్రియ వ్యవసాయం అన్న అంశాల కోసం పాటుపడుతున్నది. పైగా సేద్యమంటే రైతుకే సంబంధించినది కాదు. అతడి కుటుంబం మొత్తానికి ఆ శ్రమలో భాగం ఉంటుంది. ఈ అవగాహన కూడా ఫౌండేషన్‌కు ఉంది. సేంద్రియ ఉద్యమంతో, ఆ వాస్తవాల అవగాహనతోనే ఫౌండేషన్‌ ‌సేంద్రియ వ్యవసాయ కుటుంబాల సమ్మేళనం ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 26న ఆదిలాబాద్‌ ‌జిల్లా లింగాపూర్‌ ‌గ్రామంలో ఈ సమ్మేళనం ఎంతో విజయవంతంగా జరిగింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

‘ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రసాయనిక ఎరువులతో కూడిన వ్యవసాయ ఉత్పత్తులు మనిషిని కేన్సర్‌ ‌వంటి వ్యాధుల బారిన పడేస్తున్నాయనీ, రసాయన రహిత ఆహారధాన్యాలు తినే రోజులు మళ్లీ రావాలనీ, అందుకు సేంద్రియ వ్యవసాయ విధానమే ఉత్తమమని’ మోహన్‌ ‌భాగవత్‌ ‌తన ఆలోచనాత్మకమైన సందేశంలో చెప్పారు. సేంద్రియ వ్యవసాయమే దేశానికి హితకరమని కూడా చెప్పారాయన. ఈ దేశాన్ని కాపాడేది ఎప్పటికీ రైతేనన్న సందేశాన్నీ, అతడి స్థానాన్ని ఎవరూ మార్చలేరన్న విశ్వాసాన్నీ ఈ సమ్మేళనంలో అతిథులుగా హాజరైన నారాయణ మహరాజ్‌ (ఆధ్యాత్మికవేత్త), పి.వేణుగోపాలరెడ్డి (ఫౌండేషన్‌ ‌చైర్మన్‌) ‌వ్యక్తం చేయడం స్వాగతించ వలసిన అంశం. నారాయణ మహరాజ్‌ ‌కర్మక్షేత్రంలో పని చేసే ప్రతిరైతూ బలరామస్వరూపుడన్నారు. నేనిక్కడ మిమ్మల్ని ఉత్సాహపరచడానికి రాలేదు. మీ అందరిని చూసి నేను ఉత్సాహ భరితుణ్ణయ్యానని డాక్టర్‌ ‌భాగవత్‌ అన్నారు.

సేద్యంతో ప్రత్యక్షంగా పరోక్షంగా తనకు ఉన్న అనుభవాలను డాక్టర్‌ ‌భాగవత్‌ ‌సమ్మేళనంలో చెప్పారు. సేంద్రియ సేద్యమనే ప్రకృతి సహజమైన, పర్యావరణ హితమైన విధానంలోని శాస్త్రీయతను మరొకసారి అక్కడకొచ్చిన రైతులకు ఆయన గుర్తు చేశారు. ఇంగ్లండ్‌లో ప్రతి మూడేళ్లకోసారి రెండేళ్ల పాటు తప్పనిసరిగా వ్యవసాయ భూమికి విరామం ఇవ్వాలని చట్టం ఉంది. రసాయనిక ఎరువులు అధికంగా ఉపయోగించటం మూలాన భూమికి రెండేళ్లపాటు విశ్రాంతి తప్పనిసరిగా తమ చట్టం నిర్దేశించిందని ఆ దేశ పర్యటన వేళ అక్కడి రైతు డాక్టర్‌ ‌భాగవత్‌కు చెప్పారు. ఆఫ్రికా అనుభవం మరొకటి. కేవలం నాలుగు వందల ఏళ్ల నుండి అక్కడ వ్యవసాయం జరుగుతోంది. పంటలు పుష్కలంగా, వ్యవసాయ ఉత్పత్తులు పెద్దగా, తాజాగా కనబడతాయి. కానీ వాటిల్లో రుచి, పచి అనేవి ఉండవు. కారణం-విపరీత రసాయనిక ఎరువుల వినియోగం. రసాయనిక ఎరువులు వాడినప్పుడు భూమికి భారీగా నీటి అవసరం వస్తుంది. దాంతో ఉత్పత్తిలో రుచి పలుచబడుతుంది.

మన కాలం నాటి ఆహారధాన్యాల్లోని రుచిని నేటి పిల్లలు ఆస్వాదించగలుగుతున్నారా అని డాక్టర్‌ ‌భాగవత్‌ ‌ప్రశ్నించారు. లేదు. ఎవరు కాదనగలరు? ఆధునిక వ్యవసాయ పద్ధతులు వచ్చాక, రసాయనిక ఎరువుల ఉపయోగం పెరిగాక భూసారమంతా దెబ్బతింటోంది. పంజాబ్‌లో ప్రత్యేకంగా కేన్సర్‌ ‌రైలు నడుస్తున్నదంటే, రసాయనిక ఎరువుల కారణంగా ఆహారం, జలం ఎంత విషపూరితమయ్యాయో అర్ధం చేసుకోవడం కష్టం కాదు. నిరోధించటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కేన్సర్‌ ‌లాంటి జబ్బులు పెరిగిపోతూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇలాంటి సేద్యం చేపట్టక తప్పని పరిస్థితి నేడున్నది. దీని నుంచి బయటపడలేమా?

ఎలా బయటపడవచ్చునో కూడా తన అనుభవాలు చెప్పారు డాక్టర్‌ ‌భాగవత్‌. ‌నాగ్‌పూర్‌ ‌వద్ద దేవలాపార్‌ అనే చోట గోశాల ఉంది. అక్కడ గో- ఆధారిత వస్తువుల ద్వారా మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి ప్రయోగాలు జరుగుతున్నాయి. గోమూత్రంతో జరుగుతున్న ప్రయోగాలు అద్భుతం. నిర్వాహకులు డాక్టర్‌ ‌భాగవత్‌ను ఆహ్వానించారు. అన్నీ వివరిస్తూ ఆయన్ను ఓ మామిడిచెట్టు వద్దకు తీసుకుపోయారు. సీజన్‌ ‌కాదు కాబట్టి కాయలు లేవు. ఒక ఆకు తెంచి రుచి చూడమన్నారు. చూస్తే నోరంతా మామిడిపళ్ల రుచితో నిండిపోయింది. అక్కడి భోజనంలో వడ్డించిన పప్పు ఎంతో రుచికరంగా ఉంది. అంత రుచి ఎలా వచ్చిందంటే అక్కడంతా గో-ఆధారిత వ్యవసాయం.

అగ్రికల్చర్‌ ‌యూనివర్సిటీలో చదివి వచ్చిన విద్యార్థి జ్ఞానం కన్నా, పొలంలో దిగి పంట పండించే రైతుకున్న జ్ఞానమే గొప్పదని తాను భావిస్తానని డాక్టర్‌ ‌భాగవత్‌ ‌సహేతుకంగా చెప్పారని అనిపిస్తుంది. వ్యవసాయానికి సంబంధించినంత వరకు మన రైతులే మన శాస్త్రవేత్తలు, వారి పొలాలే ప్రయోగశాలలు. వేల ఏళ్లుగా సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయాన్ని కొనసాగిస్తూ పుష్కలంగా పంటలు పండించారు. పదివేల సంవత్సరాలు సాగించిన సేంద్రియ సాగుతో భూమి ఎన్నడూ బీడు పడలేదు. కనుక ఇప్పుడయినా మన ప్రాచీన సేంద్రియ సాగు విధానం వైపు మరలాల్సిన అవసరం ఎంతయినా ఉందని డాక్టర్‌ ‌భాగవత్‌ ‌పిలుపునిచ్చారు. సేంద్రియ సాగు విధానం రైతులని రుణ పంజరం నుంచి విముక్తుల్ని గావిస్తుంది. ఇవాళ రైతుకు ఇది అత్యవసరం. పైగా వారే విత్తనాలను తయారు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. సేంద్రియ సాగును విస్మరించటం వల్లే బీటీ విత్తనాలు, ఆ విత్తనాలు- ఈ విత్తనాలనీ చెప్పుకుంటూ, వాటిని కోరుకుంటూ రైతులు విత్తనాల కంపెనీలకు బానిసలవుతున్నారు. సేంద్రియ సాగు పద్ధతుల్లో రైతు తనకు తానే యజమాని.

సంప్రదాయానుసారంగా వ్యవసాయాన్ని కొనసాగించినప్పుడే మనుగడ అనేది ఉంటుంది. మన దేశపు ఆత్మనిర్భరతకు వ్యవసాయమే మూలం. దేశంలోని సారవంతమైన భూములలో సేంద్రియ విధానంతో సాగు చేసి బయటి దేశాలకు దీటుగా వ్యవసాయ ఆధారిత, వ్యాపార పరిశ్రమలను నెలకొల్పవచ్చు. ఆ సత్తా మన రైతులకుంది. అలాంటి ఆత్మవిశ్వాసం ఇక్కడి రైతుల్లో చూశాననీ, ఏకలవ్య ఫౌండేషన్‌ ఇస్తున్న ప్రోత్సాహాన్ని కూడా చూశానని భాగవత్‌ ‌చెప్పారు.

ఏ భూమి పైనయితే మనం ఆధారపడుతున్నామో ఆ భూమిని మనం రక్షించుకోవాలి. భూమి, ఆహార ధాన్యాలు విషతుల్యం కాకుండా పంట పండించే దిశగా రైతులు నడుం బిగించాలి. వేదాలని మనం మార్గదర్శకాలుగా భావిస్తాం. వ్యవసాయం చేయండి కానీ జూదమాడొద్దనే అవి చెబుతున్నాయి. ప్రతి రైతుని తాను కోరేదొకటేనని, మీ గ్రామాల్లో మీరంతా సంఘటితమవ్వాలని, ఆ ఐక్యత ఆందోళనలు చేసేందుకు కాదని స్పష్టంగానే చెప్పారు భాగవత్‌. ‌వారంతా ఐకమత్యంగా సేంద్రియ సాగు వికాసం కోసం పాటు పడాలి. ఏకలవ్య ఫౌండేషన్‌ ‌త్వరలో ఈ పద్ధతిని ఈ ప్రాంతంలో అమలు పరిచేందుకు సమాయత్తం కానుంది.

రసాయనిక ఎరువులు, పురుగు మందులు తాము వ్యవసాయంలో ఎంతమాత్రం ఉపయోగించటం లేదనీ, వ్యవసాయ భూముల్ని రసాయనిక ఎరువులతో, పురుగుమందులతో విషపూరితం చేసే ఆలోచన తమకు ఏ మాత్రం లేదని, యువ రైతు సాయినాథ్‌ ‌షిందే సమ్మేళనంలో చెప్పారు. గోమూత్రం, జీవామృతం వంటి వాటినే ఉపయోగిస్తూ సేంద్రియ సాగు చేస్తున్నామని ఆయన అన్నారు. తమకున్న పదెకరాల భూమిలో సేంద్రియ పద్ధతిలోనే పంటలు పండిస్తున్నామని, 25 రకాలయిన విత్తనాలను తాము సేంద్రియ పద్ధతిలో తయారు చేసుకున్నామని షిందే పేర్కొన్నారు. సేంద్రియ సాగుని ప్రోత్సహించేందుకు, ప్రచారం చేసేందుకు చిన్న చిన్న రైతు దళాలను తయారు చేసి గ్రామగ్రామాన పంపిన ఏకలవ్య ఫౌండేషన్‌ ‌వేణుగోపాలరెడ్డి గారికి శతకోటి నమస్కారాలు తెలుపుకుంటున్నానని ఆయన చెప్పారు కూడా. పలువురు రైతుల అనుభవాలు ఆలోచ నాత్మకంగా ఉన్నాయి.

అమృతతుల్యమయిన ఆహార ధాన్యాలను పండించి దేశానికి అందిస్తున్న రైతు సోదరులందరికి సాష్టాంగ నమస్కారాలు అంటూ నారాయణ మహరాజ్‌ ‌తన ఉపన్యాసాన్ని ప్రారంభించడం అందరినీ పులకింపచేసింది. ‘ఆహార శుద్ధో, సత్వ శుద్ధిః’ అని లోకోక్తి. ఈ సాగు ఉద్దేశం అదే అన్నారాయన. జైవిక వ్యవసాయం లేదా సేంద్రియ వ్యవసాయం ఏదన్నా ఒకటే. సేంద్రియ సాగు వల్ల పండే పంటలు సాత్వికతని కలిగి ఉంటాయి. భగవద్గీతలో ఓ శ్లోకం ఉంది. సాత్విక ఆహారాన్ని భుజించిన మనిషిలో ఆలోచనలు సాత్వికంగా ఉంటాయి. ఆహరంతో స్వభావం వ్యక్తమౌతోంది. స్వభావంతో వ్యవహారం సఫలమౌతుంది. దేశాన్ని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లాలన్నా, విశ్వ గురు స్థానానికి తీసుకెళ్లాలన్నా తొలుత ఆహార ప్రస్తావన వస్తుంది. సాత్విక ఆహారం మంచి ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం వ్యవహారాన్ని సఫలం చేస్తుంది. అంతేకాదు – సమాజానికి, దేశానికి హితాన్ని చేకూర్చుతుంది.

ఈ సమ్మేళనం నిజంగా ఇటీవలి అద్భుతం. 282 గ్రామాలకు చెందిన పురుష, మహిళా రైతులు వచ్చారు. ఇందులో 3650, స్త్రీలు 1877 మంది ఉన్నారు. అంటే మొత్తం పాల్గొన్న రైతుల సంఖ్య 5527. 450 స్వచ్ఛంద సేవకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఏకలవ్య సిబ్బంది 42 మంది, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వివిధ విభాగాలకు చెందిన ప్రముఖులు 490 మంది, డ్రైవర్లు 450 మంది, పోలీసు సిబ్బంది 350 మంది కూడా ఉన్నారు. సేంద్రియ సాగు ఉద్యమానికి సంబంధించి ఇదొక మంచి మలుపు. అసలైన రైతాంగ సంఘటిత శక్తి అంటే ఇదే.

About Author

By editor

Twitter
Instagram