పుణ్యవర్తనులే పూజనీయులు

విమల వంశంబునను బుణ్యవృత్తమునను

వరలు నీతని రక్తంబు వసుమతీశ

ధరణిపై నెన్ని బిందువుల్‌ దొరగె నన్ని

వర్షములు గల్గు నిందనావర్ష భయము||

విరాటుడు జూదమాడుతున్నా, తనకుమారుని విక్రమాన్ని మనస్సులో చిత్రించుకొంటున్నాడు. ఉత్తరుడు బృహన్నలను వెంట దీసుకుపోయాడు కదా, తప్పక విజయం సాధిస్తాడు అని కంకభట్టు అనటం, ఆడ, మగ కాని పేదవానిని గొప్పజేసి మాట్లాడటం, విరాటుడికి ఎబ్బెట్టుగా తోచింది. ‘కురువీరులపై ఉత్తరకుమారుని విజయాన్ని నగర ప్రజలకు తెలియపరచండి. నగరాన్ని అలంకరించండి. ప్రజలంతా విజేత ఉత్తరకుమారునికి ఘనంగా స్వాగత సత్కారాలు అందించేటట్లు నగరంలో చాటించ వలసింద’ని విరాటరాజు చెప్పగా, ”కురువీరులను జయించినది బృహన్నల గాని ఉత్తరుడు కాదు. ఆ వార్తను పట్టణంలో చాటించండి” అని కంకభట్టు విరాటరాజుతో అన్నాడు. తన కుమారున్ని లోకువ చేస్తూ, బృహన్నలను గొప్ప చేస్తూ, కంకభట్టు పొగడటం అప్పటికే సహించలేని స్థితిలో ఉన్న విరాటరాజు పట్టరాని కోపంతో చేతిలో ఉన్న సారెతో కంకభట్టును నుదురుపై కొడతాడు. ఆయన ముఖంపై గాయమై నెత్తురు కారుతుండగా, అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న మాలిని (ద్రౌపది) తన ఉత్తరీయంతో ఒత్తి, తడిచేతితో తుడిచి నెత్తురుబొట్టు నేలవిూద పడకుండా చేసింది. కంకభట్టుతో ఎటువంటి సంబంధం లేకుండా మసలుకొనే మాలిని ఆ విధంగా చేయటం విరాటరాజుకు ఆశ్చర్యం కలిగి ‘నీవెందుకు ఇట్లా చేసావు?’ అని మాలినిని అడిగాడు.

ఆమె సమాధానం, ”ఓ రాజా, ఈ కంకభట్టు మచ్చలేని నిర్మలమైన వంశంలో జన్మించాడు. అంతేగాక తన నడవడి పవిత్రంగా, ధర్మబద్ధంగా ఉండేటట్లు మెలగుతున్నాడు. అతనిది పుణ్యవర్తనం. అటువంటి సత్పురుషుని రక్తం నేలమీద చిందటం పాపహేతువు. ఆ పుణ్యాత్ముని రక్తం ఎన్నిబొట్లు నేలవిూద పడతాయో అన్ని సంవత్సరాలు ఆ దేశంలో వానలు కురవవు. ప్రజలు కాటకానికి గురి అవుతారు. అందుచేత, నేను దగ్గరలో ఉన్నాను కనుక వెంటనే వచ్చి నా ఉత్తరీయంతో నెత్తురు అద్ది తుడిచి వేసాను”.

విరాటునికి కంకభట్టు పట్ల గౌరవభావం లేకపోలేదు. కాని, ఘనవిజయం సాధించిన తనకుమారుని పొగడక పోవటమే గాక, రాణివాసంలో తనకుమార్తెకు నాట్యం నేర్పే ఒక నపుంసకుని గొప్పజేసి పొగడటం ఆయన సహించలేకపోయాడు. అందుచేత ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. యుక్తాయుక్తాలు విచారించకుండా, చేతిలో ఉన్న సారెతో కంకభట్టు ముఖం విూద కొట్టాడు. ఆ తర్వాత కోపం చల్లారి తన సహజ స్థితికి వచ్చాడు. మాలిని మాటలను ఆమోదించి, తన తొందరపాటుకు విచారిస్తున్నట్లు కంకభట్టుతో చెప్పాడు.

ధర్మమార్గాన్ని వీడకుండా అనుక్షణం జీవితాన్ని గడిపే పుణ్యవర్తనులు ఏనాడైనా అందరికి పూజనీయులే. ఎలాంటి పరిస్థితులలో కూడా వారిని అవమానించకూడదు. వారిని హింసకు గురి చేయటం పాపాన్ని మూటగట్టుకొనటమే. రాజు చేసిన పాపం రాజ్యాన్ని, రాజ్యంలోని ప్రజలను, ఇక్కట్లకు గురిచేస్తుంది. అటువంటి స్థితి విరాటుని రాజ్యంలో రాకుండా మాలిని కాపాడింది.

– వ్యాఖ్యాత : అగస్త్యరాజు ఏకాంత పురుషోత్తమరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *