శాంతిప్రియులే తెలివైనవారు

మది సుఖము గోరి, దుఃఖం

బొదవం గల కార్యములకు నుత్సాహము సే

యుదు రొప్పని తృష్ణంబడి

చదురేమియు లేని యట్టి జనులాతురులై||     5-1-306

ద్రుపదుని పురోహితుడు హస్తినాపురం వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, భీష్ముడు ద్రోణుడు మొదలైన పెద్దలందరిని దర్శించాడు. వారి గుణగణాలు ప్రశంసించి వారిని సుముఖులను చేసుకొన్నాడు. నిండు సభలో మాట్లాడుతూ, పాండవులు సమర్థులైనప్పటికి యుద్ధాన్ని కోరటం లేదని, శాంతినే కోరుతున్నారనీ, వారి పాలు రాజ్యం వారికి ఇవ్వవలసినదిగా కోరుతున్నారనీ స్పష్టంగా చెప్పాడు. పురోహితుని మాటలలో స్పష్టత ఉన్నప్పటికీ రాజకీయ వ్యవహారాలలో ఉండవలసిన మెలకువలు లేవు. ఈ పరిష్కారం ధృతరాష్ట్రునికి నచ్చలేదు. పాండవులకు రాజ్యం పంచి ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు. తియ్యని మాటలు చెప్పి వట్టిచేతులతో సాగనంపటం ఆయన పన్నాగం. అందుకోసం ధర్మరాజు మనసులో కౌరవుల పట్ల నెయ్యం తప్ప కయ్యమనే తలంపు కలగకుండేటట్లు చేయవలసిందని పాండవుల వద్దకు సంజయుని రాయబారిగా పంపాడు. సంజయుడు అన్నీ తెలిసినవాడు. మాటకారి. కార్యసాధకుడు. ధృతరాష్ట్రునికి సన్నిహితుడు.

సంజయుడు ఉపప్లావ్యమునకు పోయి శ్రీకృష్ణుని, పాండవులను, విరాటుని, ద్రుపదుని కలుసుకొని వారి గొప్పగుణాలను కొనియాడి, వారినందరిని తాను చెప్పబోవు సందేశం వినటానికి సుముఖం చేసుకున్నాడు. ముఖ్యంగా ధర్మరాజు ఎంత శాంతిప్రియుడో, అరణ్యవాస అజ్ఞాతవాసాలు పదమూడు సంవత్సరాలపాటు ఎన్నో కష్టాలు ఎదురైనా, ఎంత ఓర్పుతో గడిపాడో, దానికి కారకులైన దుర్యోధనాదుల పట్ల సోదరప్రేమ, తమ పెదతండ్రి పట్ల గౌరవం, కించిత్తు కూడా ఏ విధంగా తరిగి పోనీయలేదో, ఎట్లా ధర్మమార్గంలో, అహింసావ్రత ధారియై నడుస్తున్నాడో పలు విధాలుగా ప్రశంసిం చాడు. ధర్మరాజుగాని, ఆయన సోదరులు భీమార్జున నకులసహదేవులు గాని శాంతిని కోరేవారేగాని, నెత్తురు చిందించకతప్పని పోరాటాలకు మొగ్గు చూపేవారు కారు అన్నాడు. ఈ విధంగా అందరూ శాంతిప్రియులే, యుద్ధానికి విముఖులే అని పొగడటం తాను చెప్పబోయే చలిపిడుగులాంటి మాటకు రంగం సిద్ధం చేసుకోవటమన్నమాట. వారందరి మనసులలో ‘శాంతిప్రియత్వం’ అనే బీజాన్ని నాటడమన్నమాట. తాను పలికిన పలుకులు పాండవుల నోటినుండి రాబట్టుకోవాలని ఆశించడమన్నమాట.

‘ధర్మరాజా, లోకంలో తెలివితక్కువ వారు మాత్రమే సంపదలను, సుఖాలను తనివి తీర అనుభవించాలనే దురాశతో, తొందరపడి దుఃఖాన్ని నెత్తికెత్తుకునే పనులకు పూనుకుంటారు. తెలివిగలవారు తొందరపడరు. వారు అలాంటి దురాశకు దాసులు కారు. అటువంటి చర్యలకు పూనుకోరు’ అన్నాడు. సంజయుడు సూచనగా చెప్పిన విషయం ‘ధర్మరాజా నీవు తెలివైన వాడివి. శాంతి కోరేవాడివి. దురాశాపరుడవు కాదు. కౌరవుల వద్దనుండి రాజ్యభాగం తీసుకొని సుఖాలలో ఓలలాడాలనే తొందరపడే స్వభావం నీదికాదు. దానికోసం యుద్ధరంగంలో నెత్తురు పారించటం నీకు సుతరామూ ఇష్టం కాదు’ అని. అంటే దుర్యోధనుడు విూకు రాజ్యమిచ్చినా, ఇయ్యకపోయినా విూరు వారితో యుద్ధానికి దిగవద్దు. విూరు మరెక్కడికైనా వెళ్ళి బ్రతకండి అని.

– వ్యాఖ్యాత : అగస్త్యరాజు ఏకాంత పురుషోత్తమరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *