ఆలోచనామృతం

ఆలోచనామృతం

ఒక జాతి తనని తాను మరచిపొయేటట్టు చేయడం ఎలాగో తెలిసినవారు ఆంగ్లేయులు. ఆ జాతి ఆత్మ మీద దొంగదాడి అందులో తొలి ఎత్తుగడ అవుతుంది. అంటే జీవన విధానాన్నీ, ప్రజల భాషలనీ బలహీన పరచాలి. ఆంగ్లేయుల పాలన విజయవంతం కావడం వెనుక ఉన్న రహస్యాలలో ఇది కీలకమైనది. ఈ సంగతిని దేశవాసులు గ్రహించలేరా? ఆ గ్రహింపు అంత సులభం కాదనే చరిత్ర చెబుతోంది. భారత స్వాతంత్య్రోద్యమంలోని భావ సంఘర్షణ అంతా నిజానికి దీని గురించే. ఈ అంశాన్నే ఎంతో తాత్వికంగా చెప్పింది ‘సదాశివ జాగృతి (మన వారసత్వం-2)’ వ్యాస సంకలనం. శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి సహస్ర చంద్రదర్శన మహోత్సవం సందర్భంగా వెలువరించిన ఈ ప్రత్యేక సంకలనంలోని వ్యాసాలు రాసినవారు కీ.శే. భండారు సదాశివరావు. సదాశివరావుకు చరిత్ర మీదే కాదు, దాని గమనం మీద, దాని తాత్వికత మీద కూడా భారతీయమైన చింతన ఆధారంగా ఏర్పరుచుకున్న నిర్మాణాత్మక దృక్పథం ఉంది. వ్యాసకర్త ‘జాగృతి’ పత్రిక కోసం రాసిన వ్యాసాలే ఇవన్నీ. స్వతంత్ర భారతంలో కూడా 1947 నుంచి బీజేపీ ఆవిర్భావం వరకు భారతీయ శక్తులు చేసిన అలుపెరుగని పోరాటం గురించి ఇందులో వివరించారు రచయిత.

‘సనాతన దేశీయ ఆత్మ తన స్థానాన్ని పునరుద్ధరించుకొంటుంది’ అనే వ్యాసం ఈ మొత్తం సంకలనానికి గుండెకాయ వంటిదనిపిస్తుంది. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తరువాత నేరుగా బ్రిటిష్‌ ఏలుబడిలోకి భారతదేశం వెళ్లిపోయింది. అక్కడ నుంచి దేశీయ చింతన పతనం వేగవంతమైంది. ఇందులో భారతీయులు కూడా భాగస్థులు కావడం పెద్ద విషాదం. ‘హిందుత్వ జీవన మూలాలు’ అంటే ఈ దేశంలో అత్యధికులుగా సమూహపు జీవన మూలాలకు వ్యూహాత్మకంగా చెదలు పట్టించారు. భారతీయత ఆధారంగా ఆలోచించనవారికి భారత జాతీయ కాంగ్రెస్‌లో ఏనాడూ చోటు దక్కలేదు. ఆ విధంగా ఆలోచించదలిచిన వారిని, ఆ చింతన ప్రాతిపదికగా స్వాతంత్య్రోద్యమాన్ని నిర్మించదలిచిన వారికి మాండలే జైలు చిరునామా అయింది. లేదా పుదుచ్చేరి ప్రవాసంగా మారింది. స్వాతంత్య్రం వచ్చింది, సరే. కానీ అదెలాంటిది? భారతీయత జాడ ఉన్నదా? లేదంటే బ్రిటిష్‌ పాలనకి కొనసాగింపా? రెండో మాటే నిజం. ఆంగ్ల విద్యకే పెద్ద పీట. ఆంగ్ల సంస్కృతికే విలువ. ఇంతకీ భారతీయ భాషలలో విద్య అందుతున్నప్పుడు ఈ దేశంలో అక్షరాస్యులు 75 శాతం. ఆంగ్లం చొరబడిన తరువాత ఈ దేశంలో నిరక్షరాస్యుల సంఖ్య 75 శాతం. ‘ఇది మన వారసత్వం’ అనే మూడు చిన్న చిన్న వ్యాసాలతో చిన్న పాయలా మొదలై చివరికి వెళ్లే సరికి ఒక గోదావరిలా పాఠకుని మేధస్సును ఈ వ్యాసావళిలోని చింతన తాకుతుంది. ఇంకా ‘తాత్త్విక చింతనలో విద్య- అవిద్య’, ‘పతిత పావనులు’, ‘ఏకాత్మత- సంధి షరతులెరుగని వాస్తవం’, ‘వేద విజ్ఞానమే భారతీయ తత్త్వచింతనకు ఆధారం,’ మతం-ఆరాధన- సంస్కృతి’, ‘మనోసాగర మథనం’, ‘సంపూర్ణ భారతీయత విలసిల్లాలి’ వంటి వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ పాఠకుల మెదళ్లను సానుకూల దృక్పథంతో కదిలించగలవని నిస్సంశయంగా చెప్పవచ్చు.

ఈ వ్యాసాలు భావ గాంభీర్యంతో పాటు, భాషా సౌందర్యంతో కూడా ఉన్నాయి. పైగా ఇది సరైన సమయంలో వెలువడిన వ్యాస సంకలన మనిపిస్తుంది.

సదాశివ జాగృతి

(మన వారసత్వం-2)

రచన : భండారు సదాశివరావు

పుటలు : 160,

వెల : రూ.200/-

ప్రతులకు : సాహిత్యనికేతన్‌

కేశవ నిలయం, బర్కత్‌పురా,

హైదరాబాద్‌ – 500 027

ఫోన్‌ : 040-27563236

సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌, గవర్నర్‌పేట, విజయవాడ – 500 020

సెల్‌ : 9440643348

–   శ్రీరాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *