సమైక్యతా స్పూర్తికి పట్టర కట్టాలి !

సమైక్యతా స్పూర్తికి పట్టర కట్టాలి !

తెలంగాణ ఎన్నికల్లో వేర్వేరు ప్రణాళికలతో వివిధ పార్టీలు తలపడుతున్నట్లు కనిపిస్తున్నా ప్రజల మదిలో రెండు ప్రధాన అంశాలే మెదులుతున్నాయి. ఓటర్లకు వ్యక్తిగతంగా లబ్ది చేకూర్చే పెన్షను, భృతి తదితర జనాకర్షక పథకాల వాగ్దానాలు కురిపించడంలో రాజకీయ పార్టీలు పోటీ పడడాన్ని ప్రజలు వినోదాత్మకంగా వీక్షిస్తున్నారు. వనరుల పరిమితులు, మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రగతి సాధన వ్యూహాలు, పథకాల వివరణ పట్ల రాజకీయ పార్టీలు శ్రద్ధ చూపకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అవినీతికి గేట్లు తెరచి, ఓటు బ్యాంకు రాజకీయాలతో జాతీయ సమైక్యతను బలిపెట్టి అయినాసరే అధికార పీఠాలను సొంతం చేసుకోవాలనుకునే పన్నాగాలను ఓ కంట కనిపెడుతున్నారు. మొత్తంగా పటేల్‌ సాధించిన జాతీయ సమైక్యతా స్ఫూర్తికి తూట్లు పొడిచే కుట్రలు, అనువంశిక పాలనకు వత్తాసు పలికే వారసత్వ రాజకీయాలు ఈ రెండే నేటి ఎన్నికల ప్రధానాంశాలని ప్రజలు భావిస్తున్నారు. జెండాలు, ఎజెండాలు, ఎన్నికల ప్రణాళికలు, ప్రసంగాలు వేరయినా అన్నింటికీ ప్రధాని మోదీ కేంద్ర బిందువు కావడం విశేషం. 2019 ఎన్నికల్లో మోదీ మరలా అధికారంలోకి వస్తే తమ అవినీతి గుట్టు రట్టయి జైలుకు పోవాల్సి వస్తుందని కొందరి భయమైతే, తమ వారసులకు అధికారం కట్టబెట్టడం కుదరదని మరి కొందరి దిగులు.

తెలంగాణ ఎన్నికల్లో బిజెపి గెలిచినా, ఓడినా ప్రధాని మోదీ అధికారంలో వీసమెత్తు మార్పుండదు. అయినా సరే రాజకీయ పక్షాలన్నీ మోదీ పేరునో, విధానాలనో ఏదో ఒక రకంగా స్మరిస్తున్నాయి. మోదీని బిజెపి ప్రశంశలతోను, మిగిలిన రాజకీయ పక్షాలు విమర్శలతోను ప్రస్తావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడానికి మహాకూటమి కట్టినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఫెడరల్‌ స్ఫూర్తిని నిలపడానికే మూడో ఫ్రంటు ప్రయత్నాలు అన్నవి కెసిఆర్‌ కబుర్లు. ఇరువురి అసలు లక్ష్యం తమ వారసులకు అధికారం కట్టబెట్టడం, తమ అవినీతిని పాతరేయడమే అని ప్రజలు గ్రహించారు. తమ ప్రయత్నాలకు ప్రధాని మోదీ అడ్డు పడతాడని తెరాస, తెదేపాల భయం. అందుకే తెలంగాణలో బిజెపిని ఓడించి జాతీయ రాజకీయాల్లో మోదీని నిలువరించాలని వారి ఆశ. ఈ ఆశే పరస్పం విరుద్ధ శక్తులుగా కనిపించే రాజకీయ పక్షాలను సైతం ఒక చోటికి చేర్చింది. అవినీతి, అనువంశిక పాలన బంధాలు పెనవేసుకున్నాయి.

తనలో 30 శాతం కాంగ్రెస్‌ రక్తం ఉందని చంద్రబాబే స్వయంగా చెప్పుకుంటారు. తెలుగునాట విభజన ఉద్యమాలు అరంభించి, విరమించి, తమ రాజకీయ ప్రయోజనాలకోసం వందలాది అమాయకుల ప్రాణాలు బలిగొన్న చరిత్ర కాంగ్రెస్‌ నేతలది. కాంగ్రెస్‌ జన్మ విరోధిగా యన్టీఆర్‌ స్థాపించిన తెదేపాకు చంద్రబాబే ఇవాళ నాయకుడు. ఆయన కాంగ్రెస్‌తో జతకట్టారు. అలా కలుషితమైన తెదేపా, మహాత్మాగాంధీతో ఏమాత్రం రక్త సంబంధం లేని, నెహ్రూ వంశీకులైన నకిలీ  గాంధీల నేతృత్వంలోని కాంగ్రెస్‌ల కూటమి తెలంగాణ ప్రజలకు ఏవగింపు కలిగిస్తోంది.

బైబిలు పాలన, క్రీస్తు రాజ్యం వంటి కపట వాగ్దానాలతో మతం పేరిట జాతిని చీల్చే కాంగ్రెస్‌ కుట్రలను ప్రజలు గ్రహిస్తున్నారు. భరతమాత సంతానమైన తెలంగాణ ప్రజలను మతం పేరిట వేరు చేయాలని  రజాకార్ల మద్దతుతో నిరంకుశ నిజార పన్నిన కుట్రలు, సాగించిన అరాచకాలు తెలంగాణ ప్రజల స్మృతి పథం నుండి నేటికీ చెరిగిపోలేదు. నిజార కబంధ హస్తాల నుండి తెలంగాణను విముక్తం చేసిన సర్దార్‌ వల్లభాయి పటేల్‌ స్పూర్తి తెలంగాణ ప్రజల్లో నేటికీ సజీవంగా ఉంది. రజాకార్ల వారసులకు వెరచి, సెప్టెరబరు 17న తెలంగాణ విముక్తి దినం జరపడానికి భయపడే తెదేపా, తెరాస, కాంగ్రెస్‌ తదితర పార్టీల వైఖరిని ప్రజలు ఛీకొడుతున్నారు. ‘ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు గులాములు కావల్సిందే’ అన్న మజ్లిస్‌ నేత సవాలుకు బిజెపి మినహా మరేపార్టీ నేతలూ స్పందించక పోవడం విషాదం.

యన్టీఆర్‌ ప్రవచించిన తెలుగోడి ఆత్మ గౌరవం, తెరాస ప్రబోధించిన తెలంగాణ స్వాభిమానం రెంటినీ మంట గలిపే రాజకీయ పార్టీల పిరికితనం పోరు తెలంగాణ, వీర తెలంగాణ ప్రతిష్ఠకు మచ్చ అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కల్లబొల్లి కబుర్లకు, కపట వాగ్దానాలకు తెలంగాణ ప్రజలు మోసపోరాదు. నిజార కబంధ హస్తాల నుండి తెలంగాణను విముక్తం చేసిన సర్దార్‌ వల్లభాయి పటేల్‌ సమైక్యతా స్పూర్తికి తెలంగాణ ప్రజలు పట్టం కట్టాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *