72వ గణతంత్ర దిన వేడుక అరాచకశక్తుల, సంఘ విద్రోహుల బీభత్సానికి వేదిక కావడం ఆధునిక భారతచరిత్రలోనే విషాదం. మువ్వన్నెల జెండాను అడ్డం పెట్టుకుని మూకస్వామ్యాన్ని బలోపేతం చేసే దుశ్చర్యలకు ఢిల్లీని అడ్డాగా చేసుకునే దుర్నీతి మరొకసారి జాతి జనులు చూడవలసి వచ్చింది. పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాల ప్రారంభ సమావేశంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ఆవేదన వ్యక్తం చేసినా, మన్‌ ‌కి బాత్‌ ‌కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కలత పడినా – గణతంత్ర దినోత్సవ వేళ జాతీయ పతాకానికి జరిగిన ఘోర అవమానం గురించే. దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేస్తున్నట్టు సంఘ విద్రోహశక్తులు చెలరేగిపోవడం గురించే. ఇవన్నీ అన్నదాతల ముసుగులో ఉన్న అరాచకశక్తుల అకృత్యాలేనన్నది దాచేస్తే దాగని సత్యం. ఈ మట్టిని నమ్మే కర్షకుడు జాతీయపతాకాన్ని విసిరివేస్తాడా? దేశ గౌరవాన్ని వేర్పాటువాద శక్తులకీ, ఉగ్రవాద భక్తులకీ తాకట్టు పెడతాడా? ఇప్పుడు దేశ ప్రజలందరి ప్రశ్న ఇదే. ఆవేదన కూడా ఇదే. జనవరి 26న అన్ని షరతులకు లోబడి రైతులు సాగించినది ట్రాక్టర్‌/‌ట్రాలీ ప్రదర్శనా? లేక యుద్ధ టాంకుల ప్రదర్శనా?

కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ/ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా మొదట్లో ఎవరో కొందరు రైతులు నిరసన ఆరంభించి ఉండవచ్చు. ఆ హక్కు వారికి ఉంది. ఆ నిరసనను సార్వభౌమాధికారాన్ని సవాలు చేసే విధంగా వక్రమార్గానికి మరలించినవారు వేర్పాటువాదులు, ఖలిస్తాన్‌వాదులు, టుకడే టుకడే మూకలే. వీరైనా కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు, ఎన్‌సీపీ, ఆప్‌, ‌టీఎంసీ, ఆర్‌జేడీ, సమాజ్‌వాదీ వంటి పార్టీల అండతోనే అలా చెలరేగిపోయారు. ఇది రైతు ఉద్యమం, రాజకీయాలకు అతీతం అన్నారు. కానీ చైనా తైనాతీ వామపక్షాలు ఇందులో పాల్గొన్నాయి. వాటి విద్యార్థి సంఘాల జెండాలు కూడా కనిపించాయి. ఎప్పుడూ రైతుల సమస్య గురించి, వారి బలవన్మరణాల గురించి ఒక్కమాట కూడా మాట్లాడని ముస్లిం సంఘాలు ఈ ఉద్యమానికి అన్ని వసతులు కల్పించాయి. బీజేపీ మీద గుడ్డి వ్యతిరేకతే ఈ శక్తులన్నింటినీ కలుపుతోంది.

రైతుల పేరుతో కొందరు చేస్తున్న ఈ అరాచకానికి మొదటి నుంచి కొందరు మేధావులు, ఒక వర్గం మీడియా శాంతియుత ఉద్యమంగా ప్రచారం చేసింది. కానీ అలాంటి లక్షణాలు ఇందులో కనిపించవు. పంజాబ్‌లో ఉద్యమం ఆరంభమైనపుడు ఖలిస్తాన్‌వాదుల ప్రమేయం ప్రత్యక్షంగానే కనిపించింది. హరియాణాలో ముఖ్యమంత్రి మనోహర్‌ ‌లాల్‌ ‌ఖట్టర్‌ ఏర్పాటు చేసిన రైతు సదస్సును రైతుల పేరుతో ఆందోళనకు దిగినవారు హింసాయుతంగా భగ్నం చేశారు. వందలాది సెల్‌ ‌టవర్లను ఉద్యమ కారులు ధ్వంసం చేశారు. తరువాత కిసాన్‌ ‌పరేడ్‌ ‌లేదా ట్రాక్టర్‌/‌ట్రాలీ ప్రదర్శనలో జరిగిన హింసాత్మక ఘటనలు, అంతిమంగా ఎర్రకోట మీద సిక్కుల మత పతాకం నిషాన్‌ ‌సాహిబ్‌ ఎగురవేయడం రాజ్యాంగా నికి లోబడి ఉండడానికి ఇష్టపడే శక్తులు చేసే పనులు కానేకావు. 395 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. స్వల్పంగానే లాఠీచార్జి జరిగింది.

72వ గణతంత్ర దిన వేడుకులు ఒకవైపు జరుగుతుండగా, ఢిల్లీలోనే రెండో వైపు రైతుల పేరిట విధ్వంసం జరిగిపోయింది. ఇది నిజంగానే అంతర్జాతీయంగా భారత్‌ ‌ప్రతిష్టకు మచ్చ తెచ్చింది. సంయుక్త కిసాన్‌ ‌మోర్చా పేరుతో కొన్ని రైతు సంఘాలు ఈ ట్రాక్టర్లు/ ట్రాలీల ఊరేగింపునకు పిలుపునిచ్చాయి. ఇక్కడ ట్రాలీలు అంటే పైన ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా, ఎండనకా వాననకా ఉండే ట్రాక్టర్‌ ‌వెనుక తొట్టి అని అనుకోవద్దు. ఇవి పంజాబ్‌, ‌కొంతవరకు హరియాణా రాష్ట్రాలలోని గ్రామాలలో సిక్కులు ప్రయాణించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రధానంగా పర్వదినాలలో వీటి మీదనే సిక్కులు ప్రార్ధనా మందిరాలకు వెళతారు. ఇప్పుడు ఇవే ఢిల్లీలో రైతు పోరాటానికి రథాలుగా మారాయి. కానీ గడచిన కొన్నేళ్లుగా ఈ ట్రాలీల వ్యవహారం చాలా విమర్శలకు తావిస్తున్నది. ట్రాలీలను ఆధునీకరించడానికీ, సర్వహంగులూ కల్పించడానికీ పంజాబ్‌ ‌యువత విపరీతంగా ఖర్చు చేస్తున్నది. ఉద్యమం కోసం ఢిల్లీ చేరుకున్న ట్రాలీలు చాలా వరకు ఇలాంటివే. లగ్జరీ ట్రాలీలు అంటారు. ఇందులో ఎయిర్‌ ‌కండిషనర్‌, ‌వైఫై, ఖరీదైన పరుపులు, టీవీ, మ్యూజిక్‌ ‌సిస్టమ్‌ ఉం‌టాయి. వీటిలో ఉంటే సొంతింట్లో ఉన్నట్టే అంటున్నారు కిసాన్‌ ‌మజ్దూర్‌ ‌సంఘర్ష్ ‌కమిటీ (పంజాబ్‌) ‌నాయకుడు హర్పాల్‌ ‌సింగ్‌. ఇలాంటి ట్రాలీలు వేలలో కనిపించాయి. తుది హెచ్చరిక అన్న రీతిలో తమ నిరసనను పతాక స్థాయికి తీసుకువెళ్ల డానికి జనవరి 26నే రైతు సంఘాలు ఎందుకు ఎంచుకున్నాయన్న ప్రశ్న ఒకటి ఉంది. ఆరోజు రైతు ఉద్యమానికి అరవై రోజులు పూర్తయిన సందర్భం కాబట్టి అన్నారు సంయుక్త కిసాన్‌ ‌మోర్చా నాయకులు. కానీ అదే రోజు భారత్‌ ‌తన సైనిక పాటవాన్ని ప్రదర్శిస్తూ జరిపే ప్రదర్శన, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే శకటాలు, వాటి సాంస్కృతిక వైభవం అన్నీ జాతీయ, అంతర్జాతీయ మీడియాలో దర్శనమిస్తాయి. ఆరోజే రైతుల ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ ఊరేగింపును పెడితే మరింత ప్రచారం వస్తుందనే చాలామంది రైతు నాయకుల ఆశ అని ఎక్కువ మంది చెబుతున్నారు. అదే రోజు జిల్లాల పాలనా కేంద్రాలలో కూడా నిరసనలూ, ఊరేగింపులూ నిర్వహిస్తామని రైతు నాయకత్వం చెప్పినా అవేమీ కనపించలేదు. ఈ ఆందోళనకారుల దృష్టంతా ఢిల్లీలో ప్రదర్శన మీదే. దానితో మోదీ ప్రభుత్వానికి ఎంత అపకీర్తి తేగలమన్న లెక్కల మీదే ఉంది. జనవరి ఆరంభం నుంచి 26వ తేదీ వరకు జరిగిన పరిణామాలను గమనించినా ఇది అర్థమవుతుంది.

జనవరి 2న సంయుక్త కిసాన్‌ ‌మోర్చా ట్రాక్టర్ల ఊరేగింపు గురించి ప్రకటన ఇచ్చింది. మూడు సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌ను, కనీస గిట్టుబాటు ధరకు చట్టం చేయాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం సరిగా స్పందించనందుకే ట్రాక్టర్ల ఊరేగింపు నిర్ణయం తీసుకున్నట్టు ఆరోజు మోర్చా వెల్లడించింది. తమది కిసాన్‌ ‌గణతంత్ర దినోత్సవ మని కూడా రైతు నేతలు బీరాలు పలికారు. యోగేంద్ర యాదవ్‌ అనే రైతు ముసుగులోని టుకడే టుకడే మూకలోని సభ్యుడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులంతా రావాలని పిలుపునిచ్చాడు. ఇతడు జైకిసాన్‌ ఆం‌దోళన్‌ ‌సంస్థకు చెందినవాడు. జనవరి 6 నుంచి 20 వరకు ట్రాక్టర్‌ ఊరేగింపు గురించి దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని కూడా పిలుపు నిచ్చారు. అందులో ధర్ణాలు, గోష్టులతో పాటు రాజ్‌భవన్‌ల వద్ద పికెటింగ్‌ ‌కూడా ఉంది. జనవరి 23వ తేదీ నేతాజీ బోస్‌ ‌జయంతిని ఆజాద్‌ ‌హింద్‌ ‌కిసాన్‌ ‌దివస్‌ ‌పేరుతో జరపాలని కూడా నిర్ణయించారు. అంబానీ సంస్థకు చెందిన వస్తువులను బహిష్కరించడం కూడా ఇందులో ఉంది. అంటే జాతీయ భావాలను, జాతీయ పతాకాన్నీ, జాతీయ వీరులను తమ విధ్వంసక ఉద్యమానికి కపట కర్షకులు ఉపయోగించుకోవాలనుకుంటున్న సంగతి తెలుస్తూనే ఉంది. రైతు నేత పేరుతో ఈ విధ్వంసం మొత్తానికి వెనుక ఉన్న రాకేశ్‌ ‌తికాయత్‌ ‌గురించి కాంగ్రెస్‌ ‌నాయకుడు (పంజాబ్‌) ఎంఎస్‌ ‌బిట్టా ఎంతటి తీవ్ర విమర్శలు చేశాడో, 2013 నాటి ముజఫరాబాద్‌ అల్లర్లలో అతడి ప్రమేయం ఎంతో ఈ సందర్భంగా అయినా ఈ దేశం పరిశీలించాలి.

జనవరి 26 నాటి రగడ కేంద్ర వైఫల్యమేనని విమర్శలు గుప్పిస్తున్న విపక్ష సభ్యులు ట్రాక్టర్‌ ఊరేగింపు శాంతిభద్రతలకు విఘాతమని సుప్రీం కోర్టుకు తెలియచెప్పిన వాస్తవాన్ని కావాలని మరుగుపరుస్తున్నారు. రైతులను ముందుకు నెట్టి సాగుతున్న ఈ రగడలో ఖలిస్తాన్‌వాదులు చొరబడ్డా రనీ, సిఖ్స్ ‌ఫర్‌ ‌జస్టిస్‌ ‌వంటి నిషేధిత వేర్పాటువాదులు ఉన్నారని, కాబట్టి ఆ ఊరేగింపు మీద అభ్యంతరాలు ఉన్నాయని కేంద్రం నివేదించింది. ఇందులో సిఖ్స్ ‌ఫర్‌ ‌జస్టిస్‌ ఈ ఉద్యమం కోసం నిధులు పంపు తున్నదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నది. అలాగే ఎర్రకోట మీద సిక్కుల పతాకం ఎగురవేస్తే రెండున్నర కోట్లు ఇస్తామని ప్రకటించిన సంస్థ అన్న విమర్శ కూడా ఉంది. ప్రభుత్వంతో పాటు ఒక వర్గం మీడియా కూడా రైతుల పేరుతో ఢిల్లీలో తిష్ట వేసినవారు పాకిస్తాన్‌, ‌చైనాల ప్రోద్బలంతోనే సాగుతున్నారనీ, అందులో అర్బన్‌ ‌నక్సల్స్, ‌టుకడే టుకడే మూకలతో సంబంధాలు ఉన్నవారేనని కూడా ఘోషించడం వాస్తవం. కానీ ట్రాక్టర్ల ఊరేగింపు పై తుది నిర్ణయాన్ని ఢిల్లీ పోలీసు యంత్రాంగానికే సుప్రీంకోర్టు వదిలిపెట్టింది. జనవరి 7న సంయుక్త కిసాన్‌ ‌మోర్చా డ్రెస్‌ ‌రిహార్సల్స్ ‌కూడా నిర్వహించింది. ఐదు వందల ట్రాక్టర్లతో, ఢిల్లీ పరిసరాలలో 270 కిలోమీటర్ల మేర ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం 11 గంటలకు మొదలుపెట్టి, సాయంత్రం నాలుగు గంటలకు పూర్తి చేశారు. జనవరి 11వ తేదీన కేంద్ర హోం శాఖ కూడా రైతుల ట్రాక్టర్‌ ఊరేగింపునకు అనుమతి ఇవ్వరాదని సుప్రీంకోర్టును కోరింది. దాదాపు 36 షరతులతో ట్రాక్టర్‌ ‌ర్యాలీకి ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అనుమతి ఇచ్చారు. తమ రాష్ట్రం నుంచి కనీసం లక్ష ట్రాక్టర్లు వస్తాయని జనవరి 25న హరియాణా రైతు నాయకులు బాహాటంగానే చెప్పారు. ఇక పంజాబ్‌ ‌నుంచి 80,000 వస్తాయని చెప్పారు. నిజానికి సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీ మేరకు ఎన్ని పాల్గొనాలి? ఇవన్నీ ప్రశ్నలే. కాబట్టి అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్‌ ఇచ్చిన రెండు లక్షల ట్రాక్టర్ల సంఖ్య నిజమే కావచ్చు.

కానీ జనవరి 26వ తేదీన వాటిలో ఒక్క షరతును కూడా రైతులుగా చెప్పుకుంటున్నవారు గౌరవించలేదు. సింఘు, టిక్రి, ఘాజీపూర్‌ల నుంచి ట్రాక్టర్లు బయలు దేరాయి. కానీ షరతులకు లోబడి మధ్యాహ్నం 12 గంటలకు కాదు, ఉదయం ఏడు నుంచే అలజడి ఆరంభమైంది. ఉదయానికే సింఘు సరిహద్దులలో అవాంఛనీయ సంఘటనలు ఆరంభమై పోయాయి. అంటే, ఒకవైపు అద్భుతమైన క్రమశిక్షణతో గణతంత్ర దినోత్సవం కోసం మన బలగాలు కదులుతుంటే, ఇటు విధ్వంసమే ధ్యేయంగా రైతుల ముసుగులో ఉన్న అరాచకవాదులు వీరంగం ఆరంభించారు. టిక్రి, ఘాజీపూర్‌ ‌మార్గాలలోనే ఊరేగింపునకు అనుమతి ఉంది. రిపబ్లిక్‌ ‌డే ఉత్సవాలు జరుగుతున్న ఢిల్లీ నడిబొడ్డు ప్రాంతానికి రావడానికి వారికి అనుమతి లేదు. సింఘు సరిహద్దులలోనే మొదట ఊరేగింపు పేరిట అరాచకం మొదలయింది. పోలీసుల సమాచారం ప్రకారం సింఘు సరిహద్దులోనే ఏడు వేల ట్రాక్టర్లు జమకూడాయి. అనుమతించిన మార్గం వదిలి రైతులు ఐటీవో మెట్రోస్టేషన్‌ ‌బాట పట్టారు. అక్కడ నుంచి పోలీసుల బ్యారికేడ్స్ ‌ఛిన్నాభిన్నం చేస్తూ ఎర్రకోట వరకు వెళ్లారు. ఈ సమయంలో కొన్నిచోట్ల పోలీసులు టియర్‌ ‌గ్యాస్‌, ‌లాఠీచార్జి చేశారు. ఎర్రకోట మీద ఆగస్ట్ 15‌న ఏటా ప్రధాని జాతీయ పతాకం ఎగురవేసే చోట సిక్కుల జెండా నిషాన్‌ ‌సాహిబ్‌ ఎగుర వేశారు. వైరల్‌ అయిన కొన్ని వీడియోల ప్రకారం జాతీయ జెండా ఇచ్చినా పక్కకు విసిరి సిక్కు మత పతాకాన్ని ఎగురవేశారు. దీనితోనే రైతు ఉద్యమం అసలు రంగు బయటపడింది. ఇదే అంతిమంగా రైతు ఉద్యమం మీద ఏ కొందరికో ఉన్న భ్రమలను కూడా పటాపంచలు చేసింది.

దీనితో రైతు నాయకులందరిపైనా రాకేశ్‌ ‌తికాయత్‌, ‌యోగేంద్ర యాదవ్‌, ‌మేధా పాట్కర్‌, ‌దర్శన్‌పాల్‌ ‌వంటివారి మీద 22 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. 200 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని అన్నట్టు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ కేంద్రం ఇప్పటికీ రైతులతో చర్చించడానికి సిద్ధంగానే ఉందని ఆయన ప్రకటించారు. ట్రాక్టర్లతో కొందరు చేసిన వీర విహారం, ముందే సిద్ధం చేసుకున్న ఇనప కడ్డీలు, కర్రలు వంటి ఆయుధాలు వారి ఉద్దేశాన్ని స్పష్టం చేస్తూనే ఉన్నాయి. అసంతృప్తితో ఉన్న రైతులు కర్రలు పట్టక తప్పదని రాకేశ్‌ ‌తికాయత్‌ ‌ముందే సంకేతం ఇచ్చారు. మా ట్రాక్టర్లు పోలీసుల బ్యారికేడ్లను కకావికలు చేస్తాయని మరొక నాయకుడు దర్శన్‌పాల్‌ ‌కూడా ముందే చెప్పారు. ఆ రోజు చూసిన ఆ అరాచకాన్ని ఎవరూ హర్షించలేదు. కాంగ్రెస్‌ ‌తదితర పార్టీలు హింసను వ్యతిరేకిస్తూ హింసావాదులను సమర్ధించాయి. ఉద్యమం కొనసాగుతుందన్న వారి మాటకు వత్తాసు పలకడం, కేంద్రమే వెనక్కి తగ్గి చట్టాలను ఉపసంహ రించుకోవాలని చెప్పడం హింసావాదులను సమర్ధిం చేందుకే. నిజానికి ఉద్యమం అదుపు తప్పిన సంగతిని అంగీకరించక తప్పని పరిస్థితులలో ఫిబ్రవరి 1వ తేదీన తలపెట్టిన చలో పార్లమెంట్‌ ‌పాదయాత్రను విరమించుకుంటున్నట్టు రైతు నాయకులు ప్రకటించారు. అది జనాగ్రహానికి భయపడి తీసుకున్న నిర్ణయమని వేరే చెప్పక్కరలేదు. కానీ విపక్షాల అడ్డగోలు మద్దతుతో మళ్లీ మొండికేశారు.

ఏ విధంగా చూసినా ఒక వర్గం మీడియా ఇచ్చిన ఆత్మహత్యా సదృశమైన ఊతం వల్ల కూడా అరాచక వాదులు పోయిన శక్తిని క్షణాలలో తిరిగి పుంజు కున్నారు. ఎర్రకోట మీద రైతు పతాకమని ఎక్కువ పత్రికలు శీర్షికలు పెట్టాయి. అది రైతు పతాకమని చెప్పడమంటే నీతిమాలిన చర్య. రైతులు ఎర్రకోట ముట్టడి అని కొన్ని పత్రికలు ఊదరగొట్టాయి. అదేమైనా విదేశీయుల అధీనంలో ఉందా? కొందరు జర్నలిస్టులు మోకాలికీ బోడి తలకీ ముడిపెట్టినట్టు అయోధ్య ఉద్యమ ఘట్టాలకీ, జనవరి 26 నాటి ఎర్రకోట దాడికి పోలిక పెట్టాలని చూశారు.

జనవరి 26 నాటి అలజడి, అందులో రైతుల పేరుతో అరాచకవాదులు చెలరేగి జాతీయ పతాకానికి చేసిన అవమానం దేశమంతా చర్చనీయాంశమైంది. ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మోదీ మీద, బీజేపీ మీద కడుపుమంటతో కళ్లు మూసుకుపోయి ఉన్న కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టు పార్టీలకు ఈ ఆగ్రహావేశాలు పట్టలేదు. కానీ జనవరి 29న సింఘు సరిహద్దు మరొకసారి భగ్గుమంది. చుట్టుపక్కల నుంచి వచ్చిన గ్రామీణులు రైతుల మీద తిరుగుబాటు చేశారు. పెద్ద ఘర్షణే జరిగింది. దీనికి ప్రధాన కారణం అరాచక వాదులు జాతీయ పతాకానికి చేసిన అవమానాన్ని జీర్ణించుకోలేని గ్రామీణులే ఇలా రైతుల మీద తిరుగుబాటు చేశారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని స్థానికులే టీవీల వారికి చెప్పారు కూడా. రెండుమాసాలుగా తమను ఇక్కట్లకు గురిచేస్తూ సరిహద్దును దిగ్బంధించిన రైతులు అక్కడ నుంచి ఖాళీ చేయాలని స్థానికులు గట్టిగా హెచ్చరించారు. కానీ మూకబలంతో, ముందే ఏర్పాటు చేసుకున్న ఆయుధాలతో ఉన్న అరాచవాదులు గ్రామీణుల మీదే దాడులకు పాల్పడ్డారు. టిక్రీ సరిహద్దులలో కూడా ఇవే దృశ్యాలు కనిపించాయి. ఢిల్లీ-మీరట్‌ ‌రహదారి మొన్న నవంబర్‌ ‌నుంచి కూడా రాకేశ్‌ ‌తికాయత్‌ ‌నాయకత్వంలో భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ఆధీనంలోనే ఉంది. సరిహద్దులలో తిష్ట వేసిన రైతు వేషధారుల శిబిరాలకు విద్యుత్‌, ‌నీరు వంటివి అందుతున్నాయి. దీనికి తగ్గట్టు ర్యాపిడ్‌ ‌యాక్షన్‌ ‌ఫోర్సు వంటి బలగాలు కూడా అక్కడ వందలలో మోహరించి ఉన్నాయి.

రైతు అలజడిలో జనవరి 26 నాటి దృశ్యాలు, జాతీయ పతాకానికి అవమానంతో పాటు ఈ దేశవాసులను మరొక అంశం కూడా తీవ్ర అశాంతికి గురిచేసింది. అది- బీజేపీ అధికారంలో ఉండగా, మోదీ, అమిత్‌షా వంటివారు ప్రభుత్వంలో ఉండగా జాతి విద్రోహకశక్తులు ఇంతగా ఎలా చెలరేగ గలిగాయి? పోలీసులు అంత సంయమనం పాటించవలసిన అవసరం ఏమిటి? కత్తులతో, డాళ్లతో వచ్చిన మతోన్మాదులు పోలీసులు మీద విరుచుకు పడడం కూడా జాతి అంతా టీవీల ద్వారా చూసింది. ఇదంతా జరుగుతున్నా రాకేశ్‌ ‌తికాయత్‌ ‌వారిది శాంతియుత ఉద్యమమనే నమ్మించడానికి చూశారు. నిజంగా రైతులే ఆందోళన చేస్తుంటే దానిని అర్ధం చేసుకోవలసిందే. ఏ పార్టీనీ సమర్ధించని కొన్ని టీవీ చానళ్లు సైతం జనవరి 26 నాటి అలజడి ముందస్తు పథకం ప్రకారం జరిగినదేనని నిర్మొహ మాటంగా చెప్పాయి. సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తిన విమర్శలకు లెక్క లేదు. ఒక లెక్క ప్రకారం దేశ రాజధాని మూడు సరిహద్దుల నుంచి దాదాపు 15,000 ట్రాక్టర్లు బయలుదేరాయి. ఇవన్నీ హరియాణా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ‌రాజస్తాన్‌ల నుంచి వచ్చాయి. ఇందుకు అయ్యే ఖర్చును ఎవరు భరించారు? ఎర్రకోట మీద జెండా ఎగరవేయడం డబ్బుకోసమేనా? ఎందుకంటే, అక్కడ జెండా ఎగురవేస్తే (నిజానికి ఖలిస్తాన్‌ ‌జెండా) రెండున్నర కోట్లు ఇస్తామని సిఖ్స్ ‌ఫర్‌ ‌జస్టిస్‌ ‌సంస్థ ప్రకటించిందని వార్తలు వచ్చాయి. మోదీయే లక్ష్యంగా నిర్లజ్జగా వ్యవ హరిస్తున్న మీడియా మద్దతు, విపక్షాల చేయూతతో తిరిగి రెచ్చిపోయిన రాకేశ్‌ ‌తికాయత్‌ ఆ ‌పరిస్థితిని బాగా ఉపయోగించుకున్నారు. అతడు వేసిన ఎత్తుతో అప్పటిదాకా సిక్కుల చేతిలో ఉన్న ఉద్యమం కాస్తా ఉత్తరప్రదేశ్‌ ‌జాట్‌ల పరమైంది. వారి నాయకుడు రాకేశ్‌ ‌కన్నీరు పెట్టుకుని చేసిన విన్నపానికి కరిగిపోయిన జాట్‌ ‌రైతాంగం మళ్లీ ఢిల్లీ సరిహద్దులకు చేరుకుందని వార్తలు వచ్చాయి. ఉద్యమం ఆగదని తికాయత్‌ ‌వెంటనే ప్రకటించారు. అయినా నాలుగు రైతు సంఘాలు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వలేమని చెప్పి నిష్క్రమించాయి. అవి- రాష్ట్రీయ కిసాన్‌ ‌మజ్దూర్‌ ‌సంఘటన్‌, ‌భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ (‌భాను), కిసాన్‌ ‌మహా పంచాయత్‌, ‌బీకేయు (లోక్‌శక్తి).

ఈ ఉద్యమం ఆపాలని రైతు నాయకులుగా చలామణి అవుతున్నవారు ఇప్పటికీ భావించడం లేదు. ఒక్క పంజాబ్‌, ‌హరియాణా రైతులు తప్ప దేశంలో మరెక్కడా రైతులు చట్టాలను వ్యతిరేకించడం లేదన్న మాట వారి తలకు ఎక్కడం లేదు. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చూపుతున్న సంయమనాన్ని వారు అలుసుగా తీసుకుంటున్నట్టు తెలుస్తూనే ఉంది. మళ్లీ ఫిబ్రవరి ఆరోతేదీన మూడు గంటల పాటు ఒక నిరసన కార్యక్రమం నిర్వహించాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈసారి పోలీసు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. జనవరి 26న రైతు వేషధారులు సుప్రీంకోర్టును, పోలీసు యంత్రాంగాన్ని వంచించారు. మరొకసారి పోలీసు శాఖ మోసపోవడానికి సిద్ధంగా లేకపోవచ్చు. ఎర్రకోట మీద దాడిని కేంద్రం తీవ్రంగానే పరిగణించింది. లోపలికి చొరబడి అరాచకవాదులు చేసిన విధ్వంసం తక్కువేమీ కాదు. ఇదంతా రైతులు చేయగలరా?

ఏ విధంగా చూసినా ఢిల్లీ రైతు ఉద్యమం షాహీన్‌బాగ్‌ అడుగుజాడలలోనే సాగుతోంది. అవే వ్యూహాలు. అవే అవే కపట వేషాలు. మువ్వన్నెల పతాకం పట్టుకుని రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడడం, సుప్రీంకోర్టును ధిక్కరించడం ఇప్పుడు ఒక సంస్కృతిగా తయారవుతోంది. అహింస పేరుతో, గాంధీ పంథా పేరుతో చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను పని చేయకుండా నిరోధించడం నేటి సరికొత్త విద్రోహం. నయా సాంఘిక వ్యతిరేక చర్య. ఇలాంటివి ఇంకా కొనసాగకుండా చూడవలసిన అవసరం ఉంది.

అర్బన్‌ ‌నక్సల్స్ ‌దుష్ప్రచారం

జర్నలిస్ట్ ‌ముసుగులో ఉన్న అర్బన్‌ ‌నక్సల్‌, ‌తప్పుడు వార్తల నిపుణుడు రాజ్‌దీప్‌ ‌సర్దేశాయ్‌ ‌ఢిల్లీలో జనవరి 26న జరిగిన అరాచకానికి తనదైన శైలిలో రంగులు అద్దబోయి బోల్తా పడ్డారు. ఒక జర్నలిస్ట్‌గా ఆ వృత్తిని ఎంత అధఃపాతాళానికి దిగజార్చారో ఆయన స్వీయ స్పృహలో లేకున్నా సగటు భారతీయుడు మాత్రం అది గుర్తిస్తున్నాడు. అన్నదాతల పేరుతో అరాచకవాదులు చేసిన ట్రాక్టర్‌ ఊరేగింపులో జరిగిన ఒక మరణాన్ని పోలీసు దుశ్చర్యగా చిత్రించి పబ్బం గడుపుకోవాలని రాజ్‌దీప్‌ ‌తన వంతు దుష్టపాత్ర పోషించారు. వేగంగా వచ్చిన ఒక ట్రాక్టర్‌ అదుపు తప్పి పడిపోవడం, దానిని నడుపుతున్న నవనీత్‌ ‌సింగ్‌ ‌చనిపోయాడు. కానీ అతడు పోలీసు కాల్పులకు చనిపోయాడని రాజ్‌దీప్‌ ‌ట్వీట్‌ ‌చేయడం విశేషం. అదే తన విద్రోహక అడ్డా ఇండియా టుడే చానల్‌లో కూడా ప్రసారం చేశారు. దీనితో ఆ చానల్‌ ‌యాజమాన్యం అతడిని రెండు వారాల పాటు తెర మీద కనిపించకుండా సస్పెండ్‌ ‌చేసింది. ఒక నెల వేతనం కూడా తగ్గించింది. రాజ్‌దీప్‌ ఆ ‌చానల్‌కు కన్సల్టింగ్‌ ఎడిటర్‌. ‌చిత్రం ఏమిటంటే, ఆ నీలిరంగు ట్రాక్టర్‌ అదుపు తప్పి, పడిపోవడం, దూరంగా ఉన్న పోలీసులు కూడా రక్షించడానికి ఉరకడం వంటి క్రమాన్ని దేశం యావత్తు చూసింది. అయినా రాజ్‌దీప్‌ ఇలాంటి విద్రోహ చర్యకు పాల్పడ్డారు. ఇంతకీ నవనీత్‌ ‌సింగ్‌ ‌పోలీసు కాల్పులకు మరణించాడని ప్రభుత్వం మీద కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్న ‘రైతు’ సంఘాల నాయకులు కూడా ఇంత వరకు ఆరోపించలేదు. మీరు సస్పెండయ్యారట కదా అని అడిగి, అందుకు ఆయన అమూల్య స్పందన ఏమిటో జాతికి తెలియచేయడానికి ఇంకొందరు జర్నలిస్టులు ప్రయత్నిస్తే రాజ్‌దీప్‌ ‘అం‌దుబాటులో’ లేరు. ఈయనే మరొక తప్పుడు వార్తను ప్రసారం చేసి రాష్ట్రపతి భవన్‌ ‌చేత అభిశంసనకు గురయ్యారు. నేతాజీ బోస్‌ ‌జయంతికి రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ఆవిష్కరించిన చిత్రపటం ఆయనది కాదని పచ్చి అబద్ధపు వార్తను దేశం మీదకు వదిలారు. కానీ ఆ చిత్రపటం నేతాజీదేనని కుటుంబ సభ్యులు కూడా చెప్పడంతో ఇతడి బండారం బయటపడింది. రాజ్‌దీప్‌ అం‌టే సామాజిక మాధ్యమాలు అసహ్యించుకుంటూ ఉంటాయి. ఇతడి అతికి దివంగత రాష్ట్రపతి ప్రణబ్‌ ‌మొదలు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా, సౌరవ్‌ ‌గంగూలీ, అమితాబ్‌ ‌వంటి వారంతా హెచ్చరించిన తీరు ఎలా ఉందో వీడియోలు కనిపిస్తాయి. నేతాజీ చిత్రపటం ఒక నటుడి ఫొటోను చూసి చిత్రించినదనీ, అసలు కాదనీ రాజ్‌దీప్‌ ‌చేసిన వాదనకే రాష్ట్రపతి భవన్‌ ఇం‌డియా టుడే యాజమాన్యానికి అభిశంసన లేఖ పంపింది. ఇవన్నీ కలిపి రెండు వారాలు సస్పెన్షన్‌కి కారణమయ్యాయి. కానీ జాతికి క్షమాపణ చెప్పలేదన్న సంగతి గుర్తించాలి.

ఈ ట్రాక్టర్‌ ‌దుర్ఘటన గురించే రాజ్‌దీప్‌కు పోటీ పడిన మేధావులు కూడా ఈ దేశంలో ఉన్నారు. కాంగ్రెస్‌ ఎం‌పి శశి థరూర్‌, ‌నేషనల్‌ ‌హెరాల్డ్‌కు చెందిన మృణాల్‌ ‌పాండే, కవామీ అవాజ్‌కు చెందిన జఫార్‌ ఆగా, కార్వాన్‌కు చెందిన అనంత్‌ ‌నాథ్‌, ‌వినోద్‌ ‌జోస్‌ల మీద కూడా ఉత్తర ప్రదేశ్‌ ‌పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ‌దాఖలు చేశారు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram