మాల్యా ఆటకట్టు

మాల్యా ఆటకట్టు

ఇంకా కొంత సమయం పడితే పట్టవచ్చు. కానీ విజయ్‌ విఠల్‌ మాల్యా అనే పెద్ద ‘ఆర్థిక నేరగాడు’ త్వరలో భారతదేశానికి రావడం ఖాయమని నాలుగో తేదీ తేలిపోయింది. ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌కు సమీపంలో తన ఎస్టేట్‌లో దర్జాగా గడుపుతున్న ఈ మద్యం వ్యాపార దిగ్గజం ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని ఇంగ్లండ్‌ కోర్టులు కూడా విశ్వసించక తప్పలేదు. కానీ చివరిసారిగా ఇంగ్లండ్‌ కోర్టులో వాదన వినిపించుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ తతంగం అంతా పూర్తయ్యి, మాల్యా భారతదేశ జైళ్లకు రావడానికి కొన్ని నెలలు పట్టవచ్చు. అందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.

భారతదేశ కారాగారాలలో బొత్తిగా షడ్రసోపేతమైన భోజనం కూడా పెట్టరనీ, ఏసీ, స్విమ్మింగ్‌ పూల్స్‌ ఉండవని మాల్యా ఆ మధ్య పేచీ పెట్టారు కూడా. అయినా బ్రిటిష్‌ ప్రభుత్వం కరుణించలేదు. శశికళ అనే నేరస్తురాలికి కర్ణాటక కారాగారంలో జరిగిన రాజభోగాలు తెలిసి ఉంటే ఈ మాట అనేవారు కాదేమో !

యునైటెడ్‌ బ్రూవరీస్‌ గ్రూప్‌, ఎరువులు, రియల్‌ ఎస్టేట్‌తో పాటు ఇంకా చిన్నా చితకా వ్యాపారాలు అనేకం చేస్తూ ఉంటారు మాల్యా. కింగ్‌ ఫిషర్‌ విమాన సర్వీసులు ఆయనవే. దీంతోనే బండారం వినువీధికెక్కింది. నిజానికి 2012 నుంచే మాల్యా వ్యాపార సంస్థలు వివాదాల ఊబిలో చిక్కుకోవడం మొదలయింది. 2013 నాటికి ఈ సంస్థ ఉద్యోగులకు 15 మాసాల జీతం బకాయి పడి ఉంది. దీనితో లైసెన్సు రద్దయింది. అమెరికా కరెన్సీ ప్రకారం 2015 నాటికి ఆయన బ్యాంకులకు బకాయి పడిన మొత్తం 1.35 బిలియన్‌ డాలర్లలకు పెరిగింది. కింగ్‌ఫిషర్‌ వ్యవహారంలో ఆయన ‘ఉద్దేశ పూర్వక రుణ ఎగవేతదారు’ అని తేల్చారు. ఇవేకాదు, 17 భారతీయ బ్యాంకులకు రూ. 9,000 కోట్లు చెల్లించాలన్న సంగతి కూడా అవి తేల్చాయి. ఈ మొత్తాన్ని మాల్యా ప్రపంచంలోని నలభై సంస్థలకు బదలీ చేశాడని ఆరోపణ. దీని మీద దర్యాప్తు జరిగింది. మాల్యాను దేశం విడిచి వెళ్లకుండా ఆదేశించవలసిందని కోరుతూ భారతీయ బ్యాంకులు 2016, మార్చిలో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కానీ అప్పటికి కొద్ది ముందే మాల్యా సరిహద్దులు దాటేశారు. హైదరాబాద్‌, ముంబైలకు చెందిన రెండు న్యాయస్థానాలు ఆయన మీద బెయిల్‌కు అవకాశం లేని వారెంట్లు జారిచేశాయి. ఫలితం లేదు. తన ముందు హాజరు కావలసిందిగా భారత సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా మాల్యా బేఖాతరు చేశారు. అందుకు సంబంధించిన కోర్టు ధిక్కార నేరం కూడా ఆయన నెత్తి మీద ఉంది.

ఎట్టకేలకు భారత్‌ విన్నపాల మేరకు 2017 ఏప్రిల్‌లో ఇంగ్లండ్‌ మెట్రోపాలిటన్‌లో ఆర్థిక నేరగాళ్ల అప్పగింత విభాగం పోలీసులు మాల్యాను అరెస్టు చేశారు. అక్కడ కూడా కోర్టులను ఉపయోగించుకోచూశారాయనే. పప్పులు ఉడకలేదు.

మాల్యాను భారతదేశం తీసుకువస్తున్న ఘనత ముమ్మాటికీ ప్రధాని నరేంద్ర మోదీకే చెందుతుంది. ఈ విషయంలో విపక్షాలు, మోదీ వ్యతిరేకులు ఎన్ని అవాకులు చెవాకులు పేలినా ఆ ఘనత ఆయనదే. మాల్యానే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారంటూ మాజీ ప్రధాని దేవెగౌడ తీవ్ర పక్షపాతం చూపించడం ముక్కు మీద వేలువేసుకోవలసిన పరిణామం. ఇక కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరీ పరిణతి లేకుండా నాలిక ఎటు తిరిగితే అటు అన్నట్టు మాల్యా విషయంలో మోదీ మీద అడ్డగోలుగా నిందలు మోపారు. 1984 నాటి భోపాల్‌ గ్యాస్‌ దారుణోదంతంలో ఆ దురంతానికి మూలమైన సంస్థకు అధిపతి ఆండర్‌సన్‌ను మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండగానే విదేశాలకు పారిపోవడానికి రాచబాటలు వేసిందన్న సంగతి, అప్పట్లో ఆ అంశం మీద రేగిన వివాదాన్ని రాహుల్‌ మరచిపోయారు. ఇంగ్లండ్‌ కోర్టులలో వ్యవహారం నలుగుతున్న సమయంలో కూడా మాల్యాను భారత్‌కు రప్పించడంలో మోదీ విఫలమవుతున్నారనీ, భారత్‌కు ఆ ఆర్థిక నేరగాడిని తెచ్చి తీరతామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విపక్షాలు నానా యాగీ చేశాయి. ఇది వాటి విజ్ఞత. మాల్యా గొడవ తరువాత చోక్సీ, నీరవ్‌ మోదీ వంటి వారు కూడా వస్తారని, ఇక్కడి కారాగారాలలో ఉండక తప్పదని అనుకోవాలి. అదే ఆశించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *