ఎవడబ్బ సొమ్ములో చంద్రయ్యలూ!

ఎవడబ్బ సొమ్ములో చంద్రయ్యలూ!

సాధారణ ప్రజల భాషలో మాట్లాడాలనే యావలో పడి, తెలుగు నేతలు రాజకీయ ప్రసంగాల స్థాయి దిగజారుస్తున్నారు. పనిపాటలు చేసుకు బ్రతికే కూలి జనం సైతం వీధి పంపుల వద్ద నీళ్లకోసం జరిగే గొడవల్లో కూడా ‘మా జిల్లాల్లో మర్యాదకు లోటు రాకుండా తిట్టుకుంటారు గాని లేకిగా నువ్వు అని ఏకవచన సంబోధన చేయరండి’ అని గోదావరి జిల్లాలకు చెందిన మాజీ సైనికుడైన ఓ ప్రభుత్వోద్యోగి చేసిన విమర్శ ఎన్నదగినది, తెలుగు ప్రజలు స్వాగతించదగినది. ఈ కొలమానంతో చూస్తే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలుగు నేతలు వాడుతున్న భాష సంస్కార హీనమైనదని అల్పుల స్థాయికి సైతం తగనిదని తోస్తున్నది.

గణతంత్ర ప్రజాస్వామిక వ్యవస్థలో పాలనాధికారం దైవదత్తంగానో, వారసత్వ హక్కుగానో సంక్రమించేది కాదు. ఓటు ద్వారా ప్రజలు తమ ప్రతినిధులకు ఇచ్చిన బాధ్యత అది. గాంధీజీ దృష్టిలో ప్రజాస్వామ్యంలో పాలకులు ధర్మకర్తలు మాత్రమే. శాసనబద్ధ పాలన సాగించడం ప్రజాపాలకుల ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి, ఐఎయస్‌, ఐపియస్‌ అధికారులతో సహా గ్రామ పంచాయతీ కార్యాలయ బంట్రోతు దాకా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ శాసన బద్ధ పాలన అందించడంలో ప్రజా ప్రతినిధులకు తోడ్పడడానికి ఏర్పడిన వేతనజీవులే. అందుకే వారిని కూడా యంయల్‌ఎ, యంపి, మంత్రి తదితరులతో పాటు ప్రజా సేవకులుగా రాజ్యాంగ చట్టాలు గుర్తిస్తున్నవి. కానీ ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పోటాపోటీగా శాసన బద్ధ పాలనను చట్టుబండలు చేస్తూ ప్రజాస్వామిక వ్యవస్థను నవ్వుల పాల్జేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉన్నతాధికారిగా పనిచేస్తున్న ఓ ప్రభుత్వోద్యోగి హైదరాబాదులో మున్సిపల్‌ చట్టాలకు విరుద్ధంగా ఆక్రమణలకు పాల్పడి తన గృహనిర్మాణం కావించడం, ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియాను అడ్డుకోబోయిన ఓ మహిళా యంఆర్‌ఓ పట్ల అధికారపార్టీ శాసన సభ్యుడు దురుసుగా ప్రవర్తించడం తెలుగు నేలకు చెందిన తాజా ఉదాహరణలు మాత్రమే. శాసన బద్ధ పాలన అందించడంలో విఫలమైన రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల మీద పెత్తనం చేస్తూ మహరాజుల్లా దొరతనం వెలగబెడుతున్నారు.

ప్రకృతి వనరులను, పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాలో పోగుపడిన ప్రజాధనాన్ని ధర్మకర్తృత్వ భావనతో వినియోగించి ప్రజల సంక్షేమము, దేశ సౌభాగ్యముల సాధనకు కృషిచేయడం కూడా పాలకుల కర్తవ్యంలో భాగమే. ఆ క్రమంలో ప్రజాధనానికి జవాబుదారులైన పాలకులు వినియోగ లెక్కలను ప్రజలకు తెలపాలి. కేంద్ర ప్రభుత్వం నురడి మీకు అందిన నిధులకు లెక్కలు చెప్పమని తెలుగు పాలకులను ప్రధాని అడిగితే వీరి స్పందన వింతగా ఉరది. ‘ఎవడబ్బసొమ్ము మాకిచ్చావు!’ అని ప్రధాన మంత్రిని ప్రశ్నిస్తున్నారు. కానీ ‘ఆడపడుచులకు అన్నగా నేను పసుపుకుంకుమ ఇస్తున్నా, వృద్ధులకు పెద్దకొడుకుగా నెలవారీ పెన్షను ఇస్తున్నా, అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, రైతుబిడ్డగా రైతు బంధుతో వ్యవసాయదారులకు సాయం చేస్తున్నా అని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పుకోవడము, తమసొంత సొమ్మేదో ప్రజలకు పంచుతున్నట్లుగా బిల్డప్‌ ఇవ్వడంలో ఫ్యూడల్‌ భావజాలం తొరగి చూస్తోంది! విధుల, బాధ్యతల పంపిణీలో భాగంగా కొన్నింటిని స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్నింటిని కేంద్ర ప్రభుత్వం నిర్వహించినా అందుకు అవసరమైన నిధులన్నీ ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా పోగుపడినవే అని తెలుగు పాలకులెరుగరా!

తమ విధి నిర్వహణలో భాగంగా వివిధ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేయడం ప్రజాపాలనలో భాగమే గాని అవి పాలకుల దయా దాక్షిణ్యాలపై అధారపడినవి కావు. కనుకనే మౌలిక సదుపాయాలను సమకూర్చే విద్యుత్‌ ప్రాజెక్టులు, రహదారులు, సాగు, తాగు నీరు, బలహీన వర్గాల గృహనిర్మాణం వంటి పథకాలను ఒక ప్రభుత్వం ప్రారంభించినా తదుపరి ప్రభుత్వం కొనసాగిస్తోంది. తెలుగు నేతల తీరు తెన్నులు, వాడుతున్న భాష ప్రజాస్వామ్య ప్రియులైన ప్రజలు గమనించి ఫ్యూడల్‌ అవశేషాలుగా రాజకీయ క్షేత్రంలో కొనసాగుతున్న నేతలను ఇంటికి సాగనంపాలి. ఎవడబ్బసొమ్మూ తమకు ఇవ్వడం లేదని తెలుగు చంద్రులకు తెలియజెప్పాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *