మరో మోతాదు

మరో మోతాదు

ఇది ప్రతీకారం కాదు. మత ఛాందసం నెత్తికెక్కిన ఉగ్రవాద మూకలకు భారత్‌ చెప్పిన మరో గుణపాఠం. ఫిబ్రవరి 26 వేకువన భారత వైమానిక దళ విమానాలు అధీన రేఖను దాటి జైష్‌ ఎ మహమ్మద్‌ కీలక శిబిరం మీద దాడి చేశాయి. అందిన సమాచారాన్ని బట్టి ఇది చావుదెబ్బ. ఈ మాట మన అధికారులు చెప్పలేదు. ఇలాంటి భీకర దాడి ఒకటి జరిగినట్టు పాకిస్తాన్‌ అధికారులు ఆగమేఘాల మీద చేసిన ట్వీట్‌తో లోకానికి తెలిసింది. చాలా నష్టం జరిగినట్టు కూడా ఆ ట్వీట్‌లో వాపోవడం గమనించాలి.

ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్‌ ఈ తాజా సర్జికల్‌ స్ట్రయిక్‌ చేసిందని ఎవరైనా అంటే దానిని ఖండించవలసిన అవసరమైతే లేదు. పట్టించుకోవలసిన అగత్యమూ లేదు. తనకు తానై దాడికి పాల్పడదు. కవ్విస్తే మౌనం వహించరాదన్నదే భారత్‌ విధానం. ఇప్పుడు కవ్వించినదెవరో అందరికీ తెలుసు. ఆ కవ్వింపు ఎన్నోసారో మన జాతికి తెలుసు. బాధిత దేశం ఏదో ప్రపంచానికి తెలుసు. ఆ బాధిత దేశం ఎంత సహనశీలో తెలుసు. కానీ ఆ సహనానికీ హద్దు ఉంటుందని జైష్‌కే తెలియనట్టుంది. పుల్వామాలో నలభై నిండు ప్రాణాలను బలిగొన్న తరువాత భారతీయుల గుండెలు మండిపోతున్నాయి. పైగా ఆ దానవత్వం మా సొంతం అంటూ జైష్‌ మరింత కవ్విస్తూ, తెంపరితనంతో వెల్లడించింది. అది చాలదన్నట్టు మళ్లీ దాడులకు తెగబడాలని చూస్తోంది. కాబట్టి ఈ స్ట్రయిక్‌ కూడా జైష్‌కు సరిపోయేటంత మోతాదు అనిపించదు. ఇంతకీ 2016 నాటి ‘స్ట్రయిక్‌’ పాక్‌కి అప్పుడే పరగడుపయిందా!

అధీన రేఖ అవతల బాలాకోట్‌ దగ్గరున్న జైష్‌ ఎ మహమ్మద్‌ కీలక శిబిరాన్నే మన వైమానిక దళం లక్ష్యంగా చేసుకుంది. జైష్‌ అధిపతి మసూద్‌ అజర్‌ సమీప బంధువు దీని నిర్వాహకుడు. అంటే అజర్‌ అనే ఆ మత ఛాందస రోగపీడితుడికి ఉగ్రవాదం కుటీర పరిశ్రమ కాబోలు! ‘భారత్‌లో మరోసారి విధ్వంసం సృష్టించాలన్న విషపుటాలోచనలో జైష్‌ రాక్షసమూక ఉన్నట్టు నిఘా వర్గాల కచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారం ఉండడం వల్లనే ముందు జాగ్రత్తగా ఈ చర్య అనివార్యమైందని మన విదేశ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖలే చెప్పారు. ఇది సైనిక ప్రమేయానికి అతీతమైనది. కాబట్టే సాధారణ పౌరులకు ఎలాంటి హానీ జరగలేదని కూడా గోఖలే వెల్లడించారు.

సరిహద్దులలో రెండు దేశాలు అలెర్టులు ప్రకటించాయి. పాక్‌ ప్రధానిలో కలకలం బయలుదేరిన సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఆయన సైన్యం చేతిలో మనిషి. ఆయన నోటి నుంచి వినిపించే పాక్‌ సైన్యం ప్రకటన ఎలాంటిదైనా అంతే దీటుగా స్పందించడానికి ఇక్కడ జాతీయతా శక్తుల ప్రభుత్వం ఉంది. నిష్కళంక దేశభక్తుడు, దేశ ప్రయోజనాలు తన ప్రాణం వేర్వేరు కాదని చెప్పగల, దానిని ఆచరించి చూపగల నరేంద్ర మోదీ ఆ ప్రభుత్వానికి నాయకుడు. అది కూడా పాకిస్తాన్‌ గమనించాలి. నిప్పులో కాలిన ఇనుముకు కూడా సమ్మెట దెబ్బలు తప్పవు. ఉగ్రవాదమనే నిప్పుతో చెలగాటం ఆడుతున్నంత కాలం పాకిస్తాన్‌ పని కూడా అంతే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *