జనజాగృతి

బాబుకు మోదీ ఫోబియా!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మోదీ ఫోబియా పట్టుకుంది. తనని ఎవరు విమర్శించినా, ఆయనకు వ్యతిరేకంగా ఏం జరిగినా దాని వెనక మోదీ ఉన్నారని, తనను గద్దె దించేందుకు ఎన్డీయే కుట్ర పన్నుతోందని అనుమానించే స్థాయికి ఆ ఫోబియా పెరిగిపోయింది.

ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంత ముస్లింలను ప్రభావితం చేసే విధంగా వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలకు, మోదీకి ఏదో సంబంధం ఉందని బాబు అనుమానిస్తున్నారు. ఇది ఎంత వరకు సబబు?

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంతకైనా తెగించడం బాబుకు సాధ్యమైనంతగా ఎవరికీ సాధ్యం కాదు. చివరకు ఎన్టీఆర్‌ ఏ ఉద్దేశంతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో, ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా బాబు కాంగ్రెస్‌ పార్టీతో జత కట్టినప్పుడే పచ్చి రాజకీయ అవకాశ వాదిగా పేరు తెచ్చుకున్నారు. అందరూ తనలాగే అవసరం అయితే ఎవరి కాళ్లు అయినా పట్టుకుంటారని తన భావన అనుకుంటా!

– సుధీర్‌, శ్రీనగర్‌

‘ముక్కోటి ఏకాదశి’ సెలవు ప్రకటించాలి!

దక్షిణాయనంలో ప్రసిద్ధిగాంచిన ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి)కి ఎంతో ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. ఈ రోజున దైవ దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు కూడా చెబుతున్నాయి. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత తెలుగు ప్రభుత్వాల మీద ఎంతైనా ఉంది. కావున ఇంతటి గొప్ప పర్వదినానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవు ఇవ్వాలి.

– కె.వి. ప్రసాదరావు, కందుకూరు

ఫ్రెండ్లీ పోలీసింగ్‌!

ఏపీ పోలీసులు ప్రజలకు మరింత చేరువ కానున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థకు ప్రశంసలు వస్తున్నాయి. ఇకనుంచి కంప్లైంట్‌ ఇచ్చిన వ్యక్తి స్టేషన్‌లో తన ఫిర్యాదు ఏ దశలో ఉంది? కేసు ఎంత వరకు వచ్చింది? లాంటి విషయాలు స్టేషన్‌కు వెళ్లకుండానే తెలుసుకోవచ్చు. దీనికై ‘చేరువ’ పేరుతో కియోస్కోలను ఏర్పాటు చేస్తుండగా.. కంప్లైంట్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ముందుగా విజయవాడలో, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏర్పాట్లు చేయనున్నారు.

– ఎం. రామచెన్నారెడ్డి, కడప

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *