ఇమ్రాన్‌ పులి స్వారీ

ఇమ్రాన్‌ పులి స్వారీ

పాకిస్తాన్‌ కొత్త ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణం చేయడానికి ముహూర్తం దాదాపు ఖరారయింది. అది భారత్‌, పాకిస్తాన్‌ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకోవడానికి రెండు మూడు రోజుల ముందు. అంటే దాయాది దేశాల తలపులలో స్వాతంత్య్ర పోరాట జ్ఞాపకాలు రెపరెపలాడడానికి సిద్ధమవుతున్న తరుణం. ఆగస్టు 11న ఆయన ప్రమాణ స్వీకారం చేయవచ్చునని అంచనా.

జూలై మధ్యలో జరిగిన పాకిస్తాన్‌ ఎన్నికల మీద ప్రపంచానికే సదభిప్రాయం లేదు. ఇలాంటి ఎన్నికల ఫలితాలు ఇమ్రాన్‌కు అనుకూలంగా వచ్చాయి. వీటిని గుర్తించబోవడం లేదని పాక్‌ విపక్షాలు ఇప్పటికే చెప్పేశాయి. ఇక, ఆ ఎన్నికలు సైన్యం నీడన జరిగాయని కొన్ని ప్రపంచ దేశాలు లెక్క వేస్తున్నాయి. పాకిస్తాన్‌ సైన్యాధ్యక్షుడు కమర్‌ జావెద్‌ బాజ్వానిని ఇమ్రాన్‌ ఒక దశలో బాహాటంగానే శ్లాఘించారు. ఉగ్రవాదులకు ప్రవేశం కల్పించిన ఎన్నికలని ఇంకొన్ని ప్రపంచ దేశాలు ముద్ర వేశాయి. ఒక కలవరంతోనే పాశ్చాత్య దేశాలు ఇలాంటి అభిప్రాయానికి వచ్చాయి. ఎన్నికలకు ముందు హర్కత్‌ ఉల్‌ ముజాహుదీన్‌ సంస్థ నాయకుడు ఫజులుర్‌ రహమాన్‌ ఖలీల్‌ను సహచరులతో సహా పార్టీలోకి రావలసిందని ఇమ్రాన్‌ ఆహ్వానించారు. భారత్‌ జైలులో ఉన్న ఒకనాటి తన సహచరుడు మసూద్‌ అజర్‌ను విడుదల చేయించడానికి జరిగిన 1సి.814 విమానాన్ని కాబూల్‌కు దారి మళ్లింపు దుందుడుకు చర్యలో ఖలీల్‌దే కీలక పాత్ర. అయినా అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఇమ్రాన్‌కు ఉన్న ఖ్యాతితోను, చదువుకున్న ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఇచ్చిన మేధస్సుతోను పాకిస్తాన్‌కు ఆయన కొత్త రూపు ఇస్తారని యూరోపియన్‌ యూనియన్‌ అభిప్రాయపడుతోంది.

అమెరికాతో పాటు, మిగిలిన పాశ్చాత్య దేశాలతో కూడా పాక్‌ సంబంధాలు ఇప్పుడు మెరుగ్గా లేవు. అయినా ఆ దేశాలు పాకిస్తాన్‌ ఎన్నికల మీద, రాబోయే ప్రభుత్వం మీద ఆసక్తి కలిగి ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది పాకిస్తాన్‌ అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశమంటూ ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో చెప్పే నిజం. కాబట్టి ఆ దేశంలో విధాన పరమైన అంశాల మీద మార్పు రావాలని అంతా ఆశిస్తారు. అందుకు కొత్త ప్రభుత్వం ఏం చేయగలదోనని ఎదురు చూస్తారు. అందుకు ఇమ్రాన్‌ ద్వారా బీజం పడుతుందని కొందరి నమ్మకం కావచ్చు.

ఈసారి ఎన్నికల ప్రచారంలో గతంలో మాదరిగా పాక్‌ నేతలు, పార్టీలు భారత్‌ మీద పెద్దగా విషం కక్కిన దాఖలాలు కనిపించడం లేదు. అయినా ఫలితాలను, రేపటి ప్రభుత్వ రూపరేఖలను భారత్‌ పట్టించుకోక తప్పదు. ఇందుకు లక్ష కారణాలు. కాబోయే ప్రధాని, పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ నాయకుడు ఇమ్రాన్‌ చేసిన ప్రకటనలు వింటే భవిష్యత్తులో ఆయన వేసే అడుగులు ఎటో సూచనప్రాయంగా తెలుస్తూనే ఉంది. ఒక పక్క భారత్‌తో స్నేహం కోరుతున్నట్టు చెబుతూనే, ఇంకో పక్క పదవీ స్వీకారానికి ముందే షరతులు పెడుతున్నారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకే ప్రయత్నిస్తారట. కానీ చర్చలలో కశ్మీరే ముఖ్యాంశమట. ప్రవక్త పాలన తీసుకురావడమే తన ధ్యేయమని ఇమ్రాన్‌ ప్రకటించారు. ఇది కొంచెం సంచలనమే. మొత్తంగా చూస్తే ఎన్నికలలో ఏమీ చెప్పకపోయినా కశ్మీర్‌ గురించి ఏదో ఒక సంచలన ప్రకటన చేస్తూ ఉంటే తప్ప పాక్‌ నేతల మనుగడ కష్టమని ఇమ్రాన్‌ కూడా నిరూపించేశారు. ప్రస్తుతం కశ్మీర్‌లో ఉన్న పరిస్థితులను బట్టి మాత్రమే కాదు, ఎన్నో చారిత్రక కారణాలను బట్టి పాక్‌లో ఏర్పడే ఏ ప్రభుత్వం రూపురేఖలనైనా భారత్‌ పట్టించుకోక తప్పదు. రేపన్న రోజున శ్రీనగర్‌లో రాళ్లు విసిరే మూకలు పెరుగుతాయా, తగ్గుతాయా అన్న అంశం, లోయలో జీహాద్‌ నినాదాలు, దేశంలో పేలుళ్లు ఇంకా పెరుగుతాయా, పలచబడతాయా అన్న అంశం కొత్త ప్రభుత్వ వైఖరిని బట్టే ఉంటుంది. పాక్‌ సైన్యం చెప్పుచేతలలో కనుక ఇమ్రాన్‌ నడిస్తే కశ్మీర్‌లో ప్రస్తుతం భారత్‌ అనుసరిస్తున్న విధానం కూడా మారే అవకాశం ఉండదు. పాక్‌ సైన్యాధ్యక్షుడిని పొగడ్తలతో మంచెత్తడం, చైనా నుంచి తామెంతో నేర్చుకుంటున్నామని చెప్పడం నోరు జారి చేసిన ప్రకటనలే అయినా అందులో చాలా సంకేతాలు వినిపిస్తాయి. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా పాక్‌తో ద్వైపాక్షిక సంబంధాలలో ఎలాంటి మార్పు ఉండదనే అనుకుంటున్నామని చైనా కూడా చెప్పుకుంది. ఇది గమనించదగిన ప్రకటన.

జిన్నా కలలు కన్న రాజ్యంగా పాకిస్తాన్‌ను రూపొందిస్తానని కూడా ఇమ్రాన్‌ సందేశించారు. కొత్త దేశంలో ఏ మతం వారైనా తమకు నచ్చిన మతాన్ని ఆచరించవచ్చునని జిన్నా 1947 ఆగస్టు 14న రేడియో ప్రసంగంలో హామీ ఇచ్చారు. ఆ కల భగ్నమైంది. పాకిస్తాన్‌ను ఏర్పాటు చేయడానికి జిన్నా అనుసరించిన పంథా అంతకంటే భిన్నమైన ఫలితాలను ఇవ్వదు మరి! ఇక ఇమ్రాన్‌ అయితే ప్రవక్త పాలన తీసుకువస్తానని ప్రతిన పూనారు. జిన్నా ఆశయానికీ, ఆచరణకీ ఉన్న వైరుధ్యమే ఇమ్రాన్‌ ఈ రెండు దశాబ్దాలలో అనుసరించిన రాజకీయ పంథాలోనూ, ఇప్పుడు చెబుతున్న మాటలలోను కచ్చితంగా కనిపిస్తుంది. ఆయన ఉగ్రవాదులను, సైన్యాన్ని నమ్ముకున్నారు. సొంత ప్రజల సంక్షేమానికే కాదు, ఇరుగు పొరుగుతో సయోధ్యకు, ప్రపంచ దేశాలలో పరువు ప్రతిష్టలను కాపాడుకోవడానికి కూడా ఆ విధానం ఉపకరించేది కాదు. కాలం మారింది. చరిత్ర నుంచి ఇమ్రాన్‌ నేర్చుకోవాలి. జిన్నా ఎక్కడ విఫలమయ్యారో, అక్కడ తాను విజయం సాధించడానికి అవకాశం కల్పించు కోవాలి. దేశాన్ని శాంతి కాముక దేశంగా మలిస్తే సొంత ప్రజలకే కాదు, మొత్తం ఆసియాకే మంచిది. ఎన్ని చెప్పినా ఒకటి వాస్తవం. ఇప్పుడు ఇమ్రాన్‌ చేస్తున్నది మాత్రం పులి స్వారీయే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *