ఇల వైకుంఠంలా యాదాద్రి క్షేత్రం…

ఇల వైకుంఠంలా యాదాద్రి క్షేత్రం…

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి మహర్దశ పట్టనుంది. స్వయంభువులతో వెలసిల్లుతోన్న ఈ క్షేత్రానికి తెలంగాణ ముఖ్యమంతి కె. చంద్రశేఖరరావు గతంలో ప్రకటించినట్లుగానే ఈసారి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించ నున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్‌ యాదాద్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి దేవస్థానం వలె యాదాద్రిని తీర్చిదిద్దుతామని ఆయన గతంలో చాలాసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కి అతిదగ్గరలో ఉన్న ఈ ఆలయానికి భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు!

రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్‌ ఇటీవల యాదాద్రిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పర్యవేక్షించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అద్భుత శిల్పకళా నైపుణ్యంతో, ఆలయ ప్రాశస్థ్యం, వైభవం ప్రస్ఫుట మయ్యేలా నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తి అయిన తర్వాత పరిపూర్ణ ఉపాసకులతో అతిపెద్ద యాగం నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా సీఎం తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్య మంత్రులు, గవర్నర్లను ఆహ్వానిస్తామని చెప్పారు. దీనికి ఐదు లక్షల నుంచి 15 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశముందని తెలిపారు.

ఆధ్యాత్మిక సర్క్యూట్‌ ఏర్పాటు!

యాదాద్రి క్షేత్ర రింగురోడ్డుకి కావాల్సిన నిధుల్ని మంజూరు చేశామని, ఈ క్షేత్రంతో పాటు సమీపంలోని భువనగిరి ఖిల్లా, కొలనుపాక జైన మందిరంతో కలిపి ఆధ్యాత్మిక సర్క్యూట్‌గా ఏర్పాటు చేయనున్నట్లుగా చెప్పారు. ఇక్కడ 260 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న బస్వాపూర్‌ జలాశయం పక్కన మరో 250 ఎకరాలు తీసుకొని భక్తుల సౌకర్యార్థం పెద్ద పెద్ద హాళ్లు ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఉన్నతస్థాయి సమావేశం

ఈ మేరకు యాదాద్రి పునరుద్ధరణ పనులపై సోమవారం (4వ తేదీ) ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాన ఆలయమున్న గుట్టపై భాగంలో ఎలాంటి నిర్మాణాలు రావాలి? గుట్ట కింది భాగంలో ఎలాంటి నిర్మాణాలు ఉండాలి? టెంపుల్‌ సిటీపై ఎలాంటి నిర్మాణాలు జరపాలి? వంటి విషయాలు ఇందులో చర్చించినట్లు సమాచారం.

వందల ఏళ్ల పాటు నిలిచిపోయే దేవాలయం కాబట్టి నిర్మాణ పనుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని, వైభవోపేతంగా నిర్మాణాలుండాలని ఈ సందర్భంగా అధికారులను కేసీఆర్‌ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. వెల్లూరు, తంజావూరు, అక్షర్‌ధామ్‌లాంటి ప్రసిద్ధ దేవాలయాను సందర్శించి నిర్మాణాలను అధ్యయనం చేయాలని, దేశంలోని ప్రతిఒక్కరూ ఒక్కసారైనా యాదాద్రిని సందర్శించాలనే ఉత్సుకత కలిగేలా దేవాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంతి అధికారులకు సూచించారు.

మాడ వీధులు, ప్రాకారాలు కలుపుకొని 4.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన దేవాలయం నిర్మించాలని చెప్పారు. మొత్తం 302 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయ ప్రాంగణం ఉంటుందని స్పష్టం చేశారు. స్వామివారు కొలువై ఉండే గుట్టపై భాగంలో ప్రధాన దేవాలయంతో పాటు గోపురాలు, ప్రాకారాలు, మాడ వీధులు, శివాలయం, ఆంజనేయస్వామి విగ్రహం, ఈవో కార్యలయం, వీవీఐపీ గెస్ట్‌హౌజ్‌, అర్చక నిలయం, నైవేద్యం వంటశాల, ప్రసాద మంటపం, స్వామివారి పుష్కరిణి, క్యూ కాంప్లెక్స్‌, మెట్లదారి, బస్‌ స్టేషన్‌, పోలీస్‌ ఔట్‌పోస్ట్‌, హెల్త్‌ సెంటర్లు ఉండాలని నిర్ణయించారు. దీని ప్రకారం నిర్మాణాలు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు.

అద్భుతంగా టెంపుల్‌ సిటీ

శివరాత్రి ఉత్సవాలు, తెప్పోత్సవం నిర్వహించ డానికి, నిరంతరం వ్రతాలు చేసుకోవడానికి, తల నీలాల సమర్పణకు, మండలదీక్ష భక్తులు ప్రత్యేక పూజలు చేసుకోవడానికి ఏర్పాట్లు శాశ్వత ప్రాతి పాదికన చేయాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ ఆదేశించారు. గుట్ట కిందిభాగంలో గండిచెరువును తెప్పోత్సవం నిర్వహించేందుకు అనువుగా తీర్చి దిద్దాలని సూచించినట్లుగా సమాచారం. గుట్టపైకి వెళ్లడానికి, కిందికి రావడానికి వేర్వేరు దారులుండా లని, ఆలయం చుట్టూ రింగ్‌ రోడ్డు నిర్మించాలని, దానికి అనుబంధంగా రేడియల్‌ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. యాదాద్రి నుంచి తుర్కపల్లి వరకు నాలుగు లైన్ల రోడ్డు వేయాలని ఆదేశించారు. నిర్మాణ పనులన్నీ అత్యంత పటిష్టంగా జరగాలని.. నిధుల కొరత లేనందున నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించినట్లుగా సమాచారం. భక్తులు బస చేయడానికి వీలుగా 340 క్వార్టర్ల నిర్మాణ పనులు వేగంగా జరగాలని ఆదేశిం చారు. టెంపుల్‌ సిటీలో రోడ్డు, మంచినీరు, విద్యుత్‌, డ్రైనేజీ లాంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు. ప్రకృతి రమణీయత గోచరించేలా, ఆహ్లాదం వెల్లివిరిసేలా టెంపుల్‌ సిటీలో ఉద్యాన వనాలు, ఫౌంటెయిన్లు నిర్మించాలని ఆదేశించారు.

అయితే.. ఇటువంటి బృహత్కార్యం పూర్తి కావడానికి కాస్త సమయం పడుతుందని, యాదాద్రి పునఃప్రతిష్ట మహోత్సవం ఎప్పడన్నది తానే స్వయంగా చెబుతానని సీఎం కేసీఆర్‌ అన్నారు.

– హరీష్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *